సబ్ ఫీచర్

కవిత్వం విస్తరిస్తేనే సమగ్రత.. సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం అంటే సాహిత్యంలో ఒక భాగమేనని, అది కవి ఆలోచనా, ఆందోళనా, ఆవేశమూ, ఆచరణా అన్నీ కూడా నిర్దిష్ట స్థల కాలాలకూ, భౌతిక పరిస్థితులకు లోబడే వుంటాయని మళ్లీమళ్లీ చెప్పుకోనక్కర్లేదేమో.. సమాజ సంబంధాలకు అతీతంగా ఎక్కడైనా వుంటే- అది ఎక్కువ కాలం ప్రజల మనస్సుల్లో మనజాలదేమో?!
కవిత్వానికీ ప్రజలకీ పరస్పర సంబంధం లేనప్పుడు ఆ కవిత్వం ఎన్నో సుళ్లు తిరిగినప్పటికీ, ఎంత శబ్ద ప్రపంచాన్ని నిర్మించినప్పటికీ, భావుకత్వంతో భ్రమలు కల్పించినా, ప్రజల సామాజిక భావనలతో మమేకం కాకపోతే వారి కవిత్వం అకవిత్వంగానే నిలిచిపోతుంది.
కవిత్వం ఒక అగ్ని జలపాతం లాంటిది. కుళ్లిపోతున్న వ్యవస్థను చూస్తూ, దాన్ని సరిచేయడానికి, శస్తచ్రికిత్స చేయడానికి పూనుకోవడం లాంటిది కవిత్వ రచన. ఆధునిక జన జీవనంలోని సంక్లిష్టత, సందిగ్ధత- నిరాశ- నిస్పృహ, నిస్సహాయత- ఆశ, అయోమయత, అలజడి అన్నింటిని వెలిగ్రక్కే గొప్ప వాహికే కవిత్వం.
స్పష్టమైన కవిత్వ అవగాహన, సహజమైన సృజనాత్మక ప్రతిభ, ఇతివృత్తానుకూలమైన ప్రగాఢ అనుభవ వైశాల్యం ఈ మూడు అరుదైన లక్షణాలు. సుకవిలో అపూర్వంగా సంగమించి వుంటాయి. అందువల్లనే ఆ కవి కవిత్వం అసాధారణమైన, ఆర్ధ్రమైన జీవితానుభవాలను తవ్విపోస్తూ, ప్రకాశవంతమే కాకుండా, ఫలవంతమై సమకాలీనవౌతుంది.
కవిత్వాన్ని తనకన్నా ఎక్కువగా ప్రేమించే కవి వస్తుస్వీకారంలో నిర్వహణలో కళాహద్దులు అతిక్రమించడు. కొన్ని సామాజిక సిద్ధాంతాలు ఆవశ్యకమనిపించినా, దాన్నికూడా కవిత్వీకరించడానికి ప్రయత్నిస్తాడే కానీ, కవిత్వాన్ని వొదిలివేసి సిద్ధాంతానికి హత్తుకుపోడు. మానవ జీవనవేదనకు తన కవిత్వాన్ని ప్రతినిధిగాచేసి, తన పరిసరాల్లోని జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు.
ఆలోచనా ధోరణిలో కొత్తదనం ఉన్నప్పుడు కొత్త కవితా ప్రక్రియలకోసం, కొత్త వ్యక్తీకరణలకోసం, కొందరు కవులు, సాహితీవేత్తలూ తహతహలాడుతుంటారు. అన్నం ముఖ్యంగానీ- ఏ పాత్రలో వండారన్నది కానట్టు- వండిన పాత్రనుబట్టి అన్నానికి పేరుమారనట్టు, భావాల్ని, భావుకతను ఏ ప్రక్రియ ద్వారా బహిర్గతం చేసినా పర్వాలేదు. అందులో ఆహారం కాగల జీవ శక్తినిచ్చే కవిత్వం వుండాలన్నది గ్రహించవలసిన విషయం.
కవిత్వంలోని అనుభూతుల్ని ఆస్వాదిస్తూ- అస్తిత్వాన్ని కోల్పోకుండా భావ చిత్రాలలో స్పందిస్తూ, నిష్కలత్వాన్ని, నిష్కపటాన్ని, నిస్వార్థాన్ని ప్రతీకలతో ఆస్వాదిస్తేనే ఆ కవి అర్థవౌతాడు.
ఎన్ని అవమానాలను, దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్నా మానవీయ విలువల్ని కాపాడుకుంటూ కొంతమంది కవులు సమాజంలో కనిపిస్తూనే వుంటారు. ‘‘జీవితం ఒక నిరంతర పోరాటం అయినప్పుడు కవిత్వాస్త్రంలో పోరాడుతూనే ఉండు’’ అనే మంత్రం వాళ్లది.
ప్రక్రియల మీదనే కాకుండా- శైలి మీద, శిల్పం మీద భావం మీద- భావ చిత్రాల మీద, నవ్యత మీద నాణ్యత మీద, సంఖ్య మీద కాకుండా స్థాయి మీద దృష్టిపెడితే మంచి కవులుగా మనగలుగుతూ, కొనసాగుతారన్నది అక్షర సత్యం.
కేవలం శిల్పాన్ని దృష్టిలో పెట్టుకొని, శ్రమపడి రాసిన కవితలు పాఠకులను ఇబ్బందిపెడతాయి. వస్తుశిల్పాల అన్యోన్యతవల్లనే మంచి కవిత్వం సాధ్యవౌతుంది. కవి ఎవరైనాసరే- తను కవిత్వం చదివితే శ్రోతగా పరవశించి పోవాలనీ, పాఠకుడిగా ప్రశ్న వెయ్యకుండా ప్రశంసించాలనీ అనుకొంటారు. కవి మాత్రమేకాదు రచయితా అంతే. తన రచనను ఎటువంటి ఆక్షేపణా లేకుండా ఆమోదించాలనే అనుకొంటారు.
ఉత్తమ కవులందరూ ఉన్నతమైన ఉదాత్త భావుకులే. మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి కవిత్వమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అత్యంత మనోజ్ఞంగా కవిత్వీకరించిన గ్రంథాలనేకం ఉంటాయి కూడా. కవి కొత్త పేర్ల మీద, తక్కువ స్థాయి ప్రచారాల మీద, పైరవీల మీద, నైతికత వదిలేసుకోవడం మీద దృష్టిపెడితే- అంతకుముందు కవిగా సంపాదించుకొన్న కొద్దిపాటి గౌరవం, విలువ కూడా అడుగంటి పోతుందేమో.
కవిత్వం ఒక కళ. కళాత్మకత లోపించిన కవిత రిపోర్టులా వుంటుంది. వస్తు గాంభీర్యంవల్ల ఆ కవిత అప్పటికి మంచి కవిత అనిపించవచ్చునేమో తర్వాత దానికి వార్తాకథనానికి ఉన్న విలువ వుంటుంది.
కవిత్వ దృక్పధానికి- జీవన తాత్త్వికత్వం అన్వయించుకోవాలి. మరింత విశే్లషణాత్మకంగా మెరుగ్గా రాస్తుండాలి. విస్తృతంగా చదవడంతో వివిధ ప్రాంత కవుల భావజాలంతో ఇంటరాక్షన్ వలన ఆవేశంతో ఒక్క విషయం మీదనే దృష్టి కేంద్రీకరించడంపోయి, ఆలోచన, ఆకళింపు వస్తాయి. మానవ జీవన క్లిష్టతను అర్థంచేసుకునే ప్రయత్నం అనుకోకుండానే జరిగిపోతుంది.
కవి చూపు విస్తరించాలి. సమ సమాజ భావనతో ఎక్కడెక్కడ స్పృశించాల్సిన అంశాలున్నాయో, ఎక్కడెక్కడ చీకటి పేరుకుపోయి వుందో కళ్లుచెదిరే భావచిత్రాల దిశానిర్దేశం చేయగలమో, ఆ దిశగా కవిత్వం విస్తరించినపుడే మనమనుకునే సమగ్రత, సంస్కారం పెరుగుతుంది. సమాజంలోని సంస్కారం కవిత్వంలో ప్రతిఫలిస్తుంది.
కొంతమంది కవులు- తమ రచనల ద్వారా తమ వర్ణీయులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని కాంక్షిస్తూ- భావ సెగలతో కాకలు చూపిస్తూ, మనసుకు దూరంగా జరుగుతూ, తమ వర్ణంపై రాసినంత కవిత్వం, మిగిలిన శ్రమ కులాలు, వృత్తిపనులు ఒత్తిళ్లమయ జీవితాలు గురించి ఎందుకు రాయరో అర్థంకాదు. మిగతా కులాల్లో, వర్గాల్లో జాతుల్లో పేదరికం, అజ్ఞానం, నిరుద్యోగం వంటి వీడని సమస్యలు వీరి కవితా కళ్ళను ఎందుకు తడిచేయవో ఎప్పటికీ అవగతం కాదు.

- ఎస్.ఆర్ భల్లం