సబ్ ఫీచర్

అమృతం కురిపించిన తిలక్ కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావుకత్వం కించిత్ ప్రేరణకు కూడా
చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత
భావుకత్వంగల కవి బహుశా మనకు లేడేమో. ఈ భావుకత్వానికి తోడు
తన హృదయంలోని అనుభూతిని వ్యక్తంచేయగల శబ్దశక్తి, అలంకార పుష్టీ
కలిసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగాడు.’’
- రాచమల్లు రామచంద్రారెడ్డి
*
కవిత్వంలో అత్యంత కారుణ్య భావ పూరితాలూ, ప్రజాశక్తిని పరిదీప్యం చేసే చైతన్య శిఖలూ, రసార్ద్ర భావనోద్దీప్తి కలిగిన సుందర సుమధుర రసగుళికల సమాహారమే తెలుగు కవిత్వ ప్రియులకు తిలక్ అందించిన ‘అమృతం కురిసిన రాత్రి’. గురజాడ, కృష్ణశాస్ర్తీ, విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి నాటి కాలపు కవుల రచనలతోపాటు ఎందరో ప్రాచ్య, పాశ్చాత్య కవుల కవిత్వాల్ని, వారి కవిత్వ సిద్ధాంతాలనూ కూలంకషంగా అధ్యయనం చేసినట్లు తిలక్ రచనలు చదివితే స్పష్టంగా తెలుస్తుంది. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పథం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. పరిశీలించే కొద్దీ, ఆయన ‘అమృతం కురిసిన రాత్రి’ ఆధునిక భావాల సమాహారంగా, సహృదయుల హృదయాల్లో నినదించే గుండె చప్పుళ్ళకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
ఆధునికాంధ్ర సాహిత్యంలో తిలక్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తన కవితా విన్యాసాలతో స్థాపించుకొన్నాడు. అంతేకాకుండా భావకవిత్వంలో చివరి దశలో ఉత్తమమైన భావకవిత్వం రాసిన వారిలో తిలక్ మొదటివాడు గానూ, అభ్యుదయ కవిత్వంలో శ్రీశ్రీ తర్వాత తన విశేష ప్రతిభచే వెలుగొందిన వాడుగానూ కన్పిస్తాడు. అన్ని రసాల్ని వచన కవిత్వంలో చెప్పి ఒప్పించిన మొనగాడు తిలక్. ఆధునికాంధ్ర కవిత్వంలో అనుభూతి వాదానికి బీజం వేసి, తర్వాతి యువకవులకు మార్గదర్శకుడయ్యాడు. ఇతని కవితా ఒరవడి కూడా ఆధునిక యువకవులకు మార్గదర్శకమైంది.
భావ అభ్యుదయ కవిత్వాల విడదీయలేనటువంటి బంధంచేసిన ‘తిలక్’ మహనీయుని కలం అమృతం తాగింది. ఇది నిజంకాకుంటే నిన్న చదివిన కవితకి నినే్న కాలం చెల్లిపోయే నేటి రోజుల్లో నాలుగు దశాబ్దాల క్రితం రాయబడిన కవితల గూర్చి నేటికీ చర్చించుకుంటున్నాం అంటే మరి ఆ కలం అమృతం తాగి ఉంటుందంటే అతిశయోక్తి ఏమి ఉంది చెప్పండి? తిలక్ లాంటి మహానీయుని కవితల్లోని ఆ భాషా సౌందర్యం, ఆ భావుకతా రమణీయత, ఆ గేయాల్లోని ఆర్తిని పరిచయం చేసి నేటి యువతలో భాష పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తిని కలుగజేసే ప్రయత్నమిది.
తిలక్ మొట్టమొదటి కవిత ‘నా కవిత్వం’లో తన కవిత్వమేమిటో, కవిత్వం ఎలా వుండాలో తెలియచేస్తూ చివరి కవితలో ‘నా కవిత్వంలో నేను దొరుకుతాను’ అంటూ తన తత్త్వాన్ని తెలియచేస్తూ మనిషితత్వం, మానవత్వం ఎలా వుండాలో చెపుతారు తిలక్.
అభ్యుదయ కవితామూర్తికి అనంత భావుకత్వ సోయగాల సొగసులద్దారు తిలక్.
‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు’
‘నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు’ అనే అభ్యుదయ భావాలకీ-
‘నా అక్షరాలు వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అంటూ భావుక సొగసులద్దారు. వెనె్నలకీ, అందానికీ, ఆడపిల్లలకీ ఎంత అనుబంధం, అన్వయం వుందో వాటన్నిటికీ, ఆయన కవిత్వాక్షరాలకి అంత అన్వయం, అనుబంధం వున్నాయి.
ఆధునికాంధ్ర కవిత్వంలో బలంగా బయలుదేరిన కవిత్వోద్యమం భావకవిత్వోద్యమం. ఈ కవిత్వంపై ఆంగ్ల కాల్పనిక కవితాప్రభావం బహుముఖంగా వుంది. 1940లోపు కలం పట్టి కవితా వ్యవసాయం చేసిన కవులెవ్వరూ భావ కవితాముద్రనుంచి దూరం కాలేకపోయారు. ఆంగ్ల కాల్పనిక కవితాప్రభావంతో కొందరు కవులు ఈ కవితా ప్రక్రియను చేపట్టగా, మరికొందరు దేశీయోద్యమాల కారణాలవల్ల తమ కవితా వాహినిగా స్వీకరించారు. ఈ భావకవితా ప్రభావమే తిలక్ అభ్యుదయ కవిత్వంలో కూడా అంతర్వాహినిగా ప్రవహించి అతని కవిత్వానికి రమణీయతని ప్రసాదించింది. తిలక్ కవిత్వంలో భావకవితా ప్రభావంలో ఆత్మాశ్రయ రీతి. ప్రణయతత్త్వం, ప్రకృతి ప్రీతి, భక్తి కవిత్వం, స్మృతి కవిత చోటుచేసుకొన్నాయి.
తిలక్ రాసిన భావ కవిత్వంలో కొట్టవచ్చేట్టు కన్పించేది ఆత్మాశ్రయ రీతి. ఇతని ఖండికలన్నీ ఆత్మాశ్రయ రీతిలోనే సాగాయని చెప్పవచ్చు. తిలక్ కావ్య ఖండికల్లో సుఖాన్ని చెప్పేటప్పుడు కానీ, దుఃఖాన్ని చెప్పేటప్పుడు కానీ, భక్తిని చెప్పేటప్పుడు కానీ, తిలక్ ఆత్మాశ్రయ రీతిలోనే చెప్పాడు. తాను చెప్పే ప్రతి విషయాన్నీ అంతర్ముఖుడై అంతరాంతర జ్యోతిస్సీమల్ని తరచి చూసి మరీ చెప్పాడు. అందుకే అతని కవిత్వంలో ఆత్మాశ్రయత్వం ముఖ్యంగా చోటుచేసుకొంది.
‘అమృతం కురిసిన రాత్రి’లో ‘నువ్వు లేవు నీ పాట వుంది’ అనే వచన గేయం తిలక్ ఆత్మాశ్రయ కవిత్వానికి మకుటాయమానం. ఈ గేయంలో ఎప్పుడో తన ప్రేయసి పాడిన పాటను వియోగంలో కవి స్మృతికి తెచ్చుకొని తన హృదయంలో వున్నట్టి ఆవేదనను వెల్లడించడంలో ఆత్మాశ్రయ రీతి వుంది.
‘కొంచెంసేపు స్వప్నంలోకి / గోర్వంకల రెక్కలతో / ఎగిరిపోదామన్నీ మరిచి’ అన్నాడు.
ఇక్కడ తిలక్ ఎస్కేపిజాన్ని ప్రతిపాదించాడు. తిలక్ తన పలాయన తత్త్వాన్ని బలపరచుకొంటూ ‘నన్నూ నిన్నూ బలహీనులనీ ఎస్కేపిస్టునీ నిందిస్తుంది ఊపిరాడక గిజగిజలాడే రుూ లోకం ఎవరెస్ట్‌కన్నా ఎత్తయన నా ఊహా శిఖరాల్ని వీళ్ళెక్కలేరు. సిందూరంకన్నా ఎరుపైన నా హృదయాన్ని వీళ్ళు చదవలేరు’ అన్నాడు. తిలక్ ఇక్కడ ఈ లోకంపై విసుగుతో సుందరపురోద్యాన వన ప్రాంతానికి పారిపోయే తత్త్వం కన్పిస్తుంది. ‘వేసవి’, ‘సంధ్య’, ‘దృశ్యభావాలు’ - ఇతని వచన కవిత్వంలో సాగిన ప్రకృతి గతమైన రచనలు. ‘సంధ్య’లో-
‘‘సంధ్య పెదవుల ఎరుపు కడలి అంచుల విరిగి
సంజె పరికిణి చెరగు ఎదలోతులు మెరసి
ఏటి కొంగల నిదు ఎర్రగా ప్రాకింది.
బాతు రెక్కల నీడ బరువుగా సోలింది’’.
అని సంధ్యాసమయాన్ని వర్ణించాడు. దృశ్యభావాలతో తనకు కన్పించిన దృశ్యాల్ని వరుసబెట్టి చెప్పాడు. ‘వాన కురిసిన రాత్రి’ని మనోహరంగా.
దేశ నాయకుల గురించి రెండు కవితా ఖండికల్లో తిలక్ ప్రస్తావించాడు. ఒకటి ‘శ్రీ వివేకానందస్వామి’. రెండోది ‘నెహ్రూ’. శివైక్యం పొందిన వివేకానందుని ఔన్నత్యాన్ని స్మరించడం మొదటి ఖండికలో వుంది. ‘నెహ్రూ’లో మాత్రం స్మృతి కవితా లక్షణాలున్నాయి.
ఈ ఖండికలో స్మృతి కవితా లక్షణాలు లేవని టి.యల్.కాంతారావుగారు 1969 ఆగస్టు నెల భారతిలో ‘తిలక్ కవితాతత్త్వం’ అనే వ్యాసంలోనూ, రామమోహనరాయ్, భారతి, ఫిబ్రవరి 1969లో ‘తిలక్ అమృతం కురిసిన రాత్రి’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. 1973 జూన్ నెల స్రవంతిలో సోమసుందర్‌గారు దీన్ని ఖండిస్తూ ‘తిలక్ కవితా దర్శనం’ అనే వ్యాసంలో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. కాంతారావుగారు ‘నెహ్రూ’ ఖండికలో ప్రారంభం నుంచి చివరివరకూ ఎక్కడా కవి తీవ్రస్థాయిలో పొందిన ఆవేదన యొక్క అనుభూతి వ్యక్తంకాదు అన్నారు. ఇది సమంజసం అన్పించదు. ఈ ఖండిక ప్రారంభంలో తిలక్, నెహ్రూ మరణంతో ఐదు ఖండాల్లోనూ జడత్వం ఎలా ఆవరించిందో వివరించిన తర్వాత-
‘ఈ హఠాత్పరిణామంలో / ఎంత అర్థవిహీనమై పోయింది సర్వం / ఎంతగా కుంగి ‘కో’ యని విలపించింది నా హృదయం’
అనడంలోనూ ‘ఎవరు చెప్పు ఇంతటి దాకా.... ఇంత గర్వంగా తిరిగి మనిషి’ అని నెహ్రూ వ్యక్తిత్వాన్ని వర్ణించిన తర్వాత-
‘ఎలాగ నీ స్మృతి నుండి పారిపోగలను / ఈ దుఃఖాన్ని మరిచిపోగలను’ - అని చెప్పడంలోనూ కాంతారావు, రామమోహన్‌రాయ్ లేదన్న స్మృతికి కవితా లక్షణం కన్పిస్తుంది. నారాయణరెడ్డిగారు ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అనే సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్న స్మృతి కవితా విభాగంలో దేశ నాయక స్మృతి క్రిందికి ‘నెహ్రూ’ ఖండిక వస్తుంది. ఈ విధంగా తిలక్ కవిత్వంలో భావకవితా ప్రభావం చోటు చేసుకుంది.

- ప్రొ. వెలమల సిమ్మన్న , 9440641617