సబ్ ఫీచర్

చిరస్మరణీయుడు సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిగ్రీ దాకా ఉర్దూలో చదువుకుని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అధ్యక్ష స్థానానికి, తెలుగు భాషాభివృద్ధి కోసం నెలకొల్పిన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష స్థానానికి ఎదిగిన మేధావి ఆయన. సాధారణ వీధి బడిలో చదువుకుని మూడు విశ్వవిద్యాలయాలకు సారథ్యం వహించిన విద్యావేత్త ఆయన. గ్రామీణ వాతావరణంలో పెరిగి, మూడువేల పాటలను రచించిన ధీశాలి ఆయన. రైతు కుటుంబంలో జన్మించి, జ్ఞానపీఠ్‌కు ఎదిగిన నిరంతర కృషీవలుడు. పరిచయం అవసరంలేని విద్యావేత్త, కవి, మహా మనీషి డా. సి.నారాయణరెడ్డి.
నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా- హనుమాజీపేట గ్రామంలో 1931 జూలై 29న మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు నారాయణరెడ్డి జన్మించారు. సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో మాధ్యమిక విద్యాభ్యాసం చేసి, కరీంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1948లో పదవ తరగతి పూర్తిచేసారు. హైదరాబాద్ చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుకున్నారు. 1952లో ఉర్దూ మాధ్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. చదివారు. అక్కడే 1954లో తెలుగు సాహిత్యంలో ఎం.ఏ పట్టా పొందారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయాలు, ప్రయోగాలు’ అనే అంశంపై సాధికారిక పరిశోధన చేసి, 1962లో పిహెచ్‌డి పట్టా పొందారు.
బాల్యంలోనే నారాయణరెడ్డి సాహిత్య ప్రతిభ బయటపడింది. ఆరేడు తరగతుల నుంచే కవిత్వ రచన ప్రారంభించారు. ఏడవ తరగతిలోనే మొదటి ఛందోబద్ధ పద్యం రాసారు. తొమ్మిదో తరగతి చదివేటపుడు ‘మారుటెన్నడో/విషంపు గుండెలీ జగాన/ మారుటెన్నడో’ అనే తన తొలి గేయాన్ని రచించారు. కరీంనగర్‌లో పదవ తరగతి చదివేటపుడు ‘వెన్నవంటి మనసున్నవానికి/ అన్నమేమొ కరువాయె/ ఉన్నవానికింతన్న వీడుదా/మన్న గుండెలేదాయె’ అనే పాట రాశారు.
ఇంటర్ చదివే సమయంలో జువ్వాది గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో నారాయణరెడ్డి కవిత తొలిసారిగా ప్రచురితమైంది. కవిత్వంతోపాటు పలు నాటికలనూ రచించారు. ‘ప్రహ్లాద చరిత్ర’ ‘సీతాపహరణం’ అనే పద్య నాటికలు, ‘్భలే శిష్యులు’ అనే సాంఘిక నాటకాన్ని రాశారు. డిగ్రీ చదివేటప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సాహిత్యపత్రిక ‘శోభ’కు ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆ పత్రికలో ‘రోచిస్’, ‘సింహేంద్ర’ అనే మారుపేర్లతో ఆయన రచనలు చేసారు. ఎం.ఏ చదివేటపుడు ‘సినీకవి’ అనే నాటికను రాసి ప్రదర్శించారు. ఈ నాటికకు దర్శకత్వం వహించడంతోపాటు అందులో నటించారు కూడా. అంతకుముందే ‘్భలే శిష్యులు’ మొదలైన నాటికలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి నటించారు.
గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, గుర్రం జాషువా, శ్రీశ్రీ మొదలైన కవుల రచనలను నారాయణరెడ్డి విస్తృతంగా చదివారు. హైదరాబాద్‌లోని కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో సభ్యులుగా చేరడంవల్ల వివిధ రచనలను అధ్యయనం చేయగలిగారు. ‘శోభ’ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు విద్యార్థి దశలోనే సాహిత్య సంస్థలకు నాయకత్వం వహించారు నారాయణరెడ్డి. ‘ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విద్యార్థి సమితి’, ‘తెలంగాణ రచయితల సంఘం’ మొదలైన సంస్థల్లో ప్రధాన బాధ్యతలు నిర్వర్తించారు. సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1954లో పార్ట్‌టైం లెక్చరర్‌గా నారాయణరెడ్డి ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. 1955లో అక్కడే రెగ్యులర్ ఉపన్యాసకులయ్యారు. 1958లో నిజాం కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసారు. ఉస్మానియా తెలుగు శాఖలో 1963లో రీడర్ అయ్యారు. 1976లో అక్కడే ఆచార్యులుగా పదోన్నతి పొంది 1981 వరకు పనిచేసారు.
తెలుగు భాషాభివృద్ధిలో డా. సి.నారాయణరెడ్డి అవిరళ కృషి ఫలితంగా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి వరించింది. 1981 నుంచి 1985 వరకు ఆ హోదాలో ఆయన పనిచేసారు. అనంతరం 1989 వరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా, 1989 నుంచి 1992 వరకు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా పనిచేసారు. ఆయన పదవీ కాలంలోనే బెంగుళూరులో 1990లో ‘మూడవ అఖిలభారత తెలుగు మహాసభలు’ అదే ఏట మారిషస్‌లో ‘మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు’ జరిగాయి. అదే సమయంలో సుమారు రెండు నెలలపాటు కాకతీయ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు.
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక సలహాదారుగా ఆచార్య సి.నారాయణరెడ్డి 1992లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 1997 నుంచి 2004 వరకు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 1997లో కేంద్రం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. 2003 వరకు ఆ పదవిలో కొనసాగారు. మొరాకోలో 2003లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ మహాసభలో భారత ప్రతినిధి బృంద సభ్యునిగా పాల్గొన్నారు. సారస్వత పరిషత్ అధ్యక్షులుగా కూడా పనిచేసారు.
‘గులేబకావళి కథ’ చిత్రంతో సినారె 1962లో సినీ రంగంలో ప్రవేశించారు. ‘నన్ను దోచుకుందువటే వనె్నల దొరసాని’ పాటతో ఆయన మంచి పేరు సంపాదించారు. పలు చిత్రాలకు పాటలు, కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసి నటించారు. 64 సంవత్సరాల్లో 18 ప్రక్రియల్లో సుమారు 90 గ్రంథాలు రచించారు నారాయణరెడ్డి. 1953లో వెలువరించిన ‘నవ్వని పువ్వు’ ఆయన మొదటి గ్రంథం. ఆ తర్వాత ‘నాగార్జున సాగరం’, ‘కర్పూర వసంతరాయలు’, ‘మట్టి మనిషీ ఆకాశం’, ‘విశ్వంభర’, ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’, ‘రుతుచక్రం’, ‘అలలెత్తే అడుగులు’, ‘నింగికెగిరే చెట్టు’, ‘మంటలూ మానవుడూ’ మొదలైన గ్రంథాలను రచించారు. కవిత్వంతోపాటు నాటకాలు, గజళ్లు, పాటలు, అనువాదాలు ఎన్నో ఆయన కలం నుంచి వెలువడ్డాయి.
‘విశ్వంభర’ కావ్యానికి 1988లో సి.నారాయణరెడ్డి జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతో సన్మానించింది. 1973లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించగా, కేంద్ర ప్రభుత్వం ఆయనను 1977లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1988లో రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు పొందారు. 2014లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు. నవ్య సాహితీ సమితి, భారతీయ భాషా పరిషత్తు మొదలైన సంస్థలు ఆయనకు పురస్కారాలు అందజేసాయి. కుమారన్ ఆసన్ అవార్డును, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డును ఆయన స్వీకరించారు. మీరట్, నాగార్జున, కాకతీయ, అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. విద్యావేత్తగా, కవిగా, రచయితగా, వక్తగా, భాషావేత్తగా, పరిపాలనాదక్షులుగా, పార్లమెంటు సభ్యులుగా సి.నారాయణరెడ్డి సేవలు చిరస్మరణీయం.

- డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు 9441046839