సబ్ ఫీచర్

అక్షర జ్వాలాతోరణం ‘అగ్నిశిఖ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను అనుభవించిన, తాను విభేదించిన, తాను మార్చాలనుకున్న వాటిని ఇతివృత్తంగా మలిచి అగ్నిశిఖలో కాల్చి.. కొత్త భావనాభరణలను.. కవి కటుకోఝ్వల రమేష్ ‘అగ్నిశిఖ’ కవితా సంపుటి ద్వారా పాఠకులకు అందించారు. సమాజంలోని వికృత ధోరణులపై కవి తమ కలాన్ని సంధిస్తూ... ఉద్విగ్నంగా రాసిన ఇందలి కవితలు చాలావరకు అక్షర జ్వాలా తోరణాలుగా కొలువుదీరాయి! వివిధ వైరుధ్యాలమధ్య, అంతర్ సంఘర్షణలమధ్య భావ పరిణామాలు రమేష్‌గారి కవిత్వంలో అడుగడుగునా కానవస్తాయి. ఆయన హృదయ శ్వాసలతో రూపుదిద్దుకున్న ఇందలి కవిత్వంలో ఆయన యొక్క భావావేశం, సాంఘిక నిబద్ధత, మానవీయ ఆర్ద్రత ముప్పేట అల్లుకుపోయాయి. చాలా సంవత్సరాలుగా కవిత్వ సృజన చేస్తున్న ఆయన.. తన జీవితానుభవంలోని అనుభూతులను.. అక్షరసెగలతో.. ‘అగ్నిశిఖ’ పేరుతో తన తొలి గ్రంథాన్ని వెలువరించారు.
ఈ గ్రంథంలో నూటొక్క కవితలున్నాయి! ఆయా కవితలకు కవి ఎంపిక చేసుకున్న కవితా వస్తువులు వైవిధ్యంగా ఉన్నాయి! అభివ్యక్తిలో ప్రజాపక్షాన్ని వహిస్తూ అందమైన పద చిత్రాలను అక్షరాల్లో బంధించారు. సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత్వం కవిత్వం ద్వారానే సాధ్యమని భావించే ఆయన.. సమాజ హితం కోరుతూ.. ఆయన తన భావాలను.. నిర్మొహమాటంగా అక్షరీకరించారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి పుస్తకాలే నేస్తాలైనాయని సవినయంగా ప్రకటించుకున్న కవి రమేష్‌గారు. అనేక గ్రంథాలను అధ్యయనం చేసి.. వాటిలోని సారాన్ని ఒంట పట్టించుకుని.. తన కవిత్వ సృజనతో.. తన ఇతర రచనలతో.. సామాజిక చైతన్యం కోసం పాటుపడాలన్న సంకల్పానికి రావడం అభినందనీయం! కవి తాను అనుభవించిన.. అనుభూతుల ఒరవడి నుండి ఎగిసే భావ తరంగాలను నిప్పు కణికలుగా మార్చి.. కవిత్వంగా తీర్చిదిద్ది.. ‘అగ్నిశిఖ’ గ్రంథం ద్వారా మనకందించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రమేష్‌గారు.. అంచెలంచెలుగా పాఠ్యపుస్తకాల్లో ఆయన రచనలు చోటుచేసుకునే స్థాయికి ఎదిగే విధంగా తన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలుచుకోవడం ప్రశంసనీయం! కొంతకాలం పాత్రికేయుడిగా పనిచేసిన అనుభవం.. ఆయనకు భాషాజ్ఞానం పట్ల, సాహిత్యంపట్ల మక్కువను పెంచాయని స్వయంగా ప్రకటించుకున్న రమేష్‌గారు.. తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని చాలావరకు గిరిజన గ్రామాల్లోనే కొనసాగించడం విశేషం! చిన్ననాట ఎక్కువగా నిప్పుల కుంపటితో దోస్తీ చేసిన ఆయన బంగారంకన్నా.. దాన్ని కరిగించే శక్తి ఉన్న నిప్పురవ్వలు, అగ్నిశిఖలు ఆయనను ఆకట్టుకున్నట్లు ఇందలి కవిత్వం ద్వారా ఇట్టే కనిపెట్టవచ్చు!
ఉజ్జ్వల జ్వాలాగ్నితో సాగే ఇందలి కవితలు.. పాఠకులను ఉత్తేజపరుస్తాయి.
కవి యొక్క మనోకర్మాగారంలో నిరంతరం సవ్వడి చేసే భావాలను.. ‘అగ్నిశిఖ’పై పేరుతో రాసిన ఇందలి మొట్టమొదటి కవితలో వీక్షించగలం! ‘‘చెమట చుక్కల్ని ముద్దాడుతున్న.. నా శ్రమ జీవన గాంభీర్యం.. అగ్నిలిపితో సాగిపోవడం చూస్తున్నా..’’ అన్న పంక్తులు మొదటి కవితకు నిండుదనాన్నిచ్చాయి! అహర్నిశలు రగులుతున్న తన భావోద్వేగాలను అక్షరాల్లోకి ఒంపి డమరుకనాదాలు వినిపించారు.
కవి తన నాన్నను ఉన్నతంగా చిత్రిస్తూ.. ‘‘నీ జ్ఞాపకాల నీడల్లో’’ అనే కవితను తీర్చిదిద్దారు. ‘‘ఉడుకు నెత్తుర్ని మూటగట్టుకుని.. నేను పరుగులు తీసినప్పుడల్లా.. నీ చూపుల్లో ఎర్రటి చారల ఆదేశం నేటికీ రక్షిస్తున్నాయ్ నాయనా’’ అంటూ నాన్న పట్ల తమకు వున్న గౌరవభావాన్ని చాటుకున్నారు.
‘‘నువ్వు / సేదతీరిందెప్పుడమ్మా..!? /
స్వేచ్ఛాగాలుల్ని పీల్చిందెప్పుడమ్మా..!? / అంతా /
భ్రమల సాధికారతలోనే / ఒదిగిపోయావు! / ఒలికిపోయావు!’’ అంటూ అమ్మను ‘త్యాగల పల్లవి’గా కవితలో ఆవిష్కరించిన తీరు బాగుంది.
‘నాలోని ఆమెకు ప్రేమతో’ అంటూ ‘నాలో ఆమె’ కవితను ఓ ప్రేమ గీతంగా మలచడంలో.. కవి యొక్క ప్రతిభను ప్రశంసించకండా ఉండలేము తన మనసులోని ఆమెను విభిన్న కోణాల్లో ప్రకటించారు.
మాటల గారడీలు.. మభ్యపెట్టడాలు. పెదాలపై నుంచే మురిపాలను చిలకరించటాలు నాకస్సలే ఒంటపట్టని పని అంటూ.. తన పిల్లలను ఉద్దేశిస్తూ.. ‘నేక ఇన్‌సైడర్‌ని..!’ కవితను రాశారు! తన పిల్లల్ని తన ప్రతిబింబాలుగా తలుచుకుంటూ రాసిన ఈ కవితలో కవి బాధ్యతగల ఓ తండ్రిగా మనకు కానవస్తారు.
‘మేరా భారత్ మహాన్’ అంటూ సదా జాతిని రక్షించే వీర జవానులకు ఓ కవిత ద్వారా అక్షరహారతి పట్టారు. సలాం.. జవాన్.. సలాం అంటూ సైనికుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.
‘తెలుగు వెలుగు’ కవితలో... తెలుగు బాష పట్ల ఆయనకున్న అనురక్తిని, మక్కువను ప్రదర్శించారు. ‘‘ఓ అభ్యుదయం.. ఓ అరుణోదయం’’ కవితలో.. చైతన్యం అణువణువు నిండి.. మస్తకాన్ని మో ప్రపంచం వైపు నడిపిస్తున్నాక.. ఆలోచనా పొరల మధ్య.. ఏ అగాధం మనసును ఆపదని తేల్చి చెప్పారు. కవితకు కాదేదీ అనర్హం అని శ్రీశ్రీ నుడివినట్లు.. కవి రమేష్‌గారు ‘బొట్టుపెట్టె’పై ఓ కవితను రాశారు. చెక్కతో చేసిన ఆ పెట్టెను అమ్మ ఎంత అపురూపంగా చూసేదో అంటూ బాల్య జ్ఞాపకాలను కవి మనతో కవితాత్మకంగా పంచుకున్నారు. ‘‘పలకమీద గీసిన పదం లెక్క.. / పలుకుల మీద వాలిన పాలపిట్ట లెక్క / ఎంత సక్కగుంటవే / బా బాసమ్మ; ఓ యాసమ్మ’’ అంటూ ఓ కవిత ద్వారా బాసకు దండాలు సమర్పించుకున్నారు. ‘ఓ హరిత ఛత్రమై ఆకాశంపై నిలుద్దాం పదండీ’ అంటూ పిలుపునిస్తూ.. ఓ ఆకుపచ్చ వసంతంలో అహ్లాదమైన నవ్వుల్ని పువ్వుల్ని ఆస్వాదిస్తూ మనిషి నిండు నూరేళ్లు బ్రతకాలని ఆకాంక్షిస్తూ.. ఓ కవిత రాసి.. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు.. ‘కలగన్న తెలంగాణ కోసం.. కళ్ళల్లో ఒత్తులేసుకుంటూనే వుంటం’’ అంటూ ‘సీకట్ని చీల్చుకుని’ కవితను తీర్చిదిద్దారు. పుట్టగొడుగుల్లా.. పుట్టుకొచ్చే వికృతాలన్నీ.. ప్రజాస్వామ్యంపై పంజా విసిరితే.. అక్షరం సలాం కొట్టి గులాంగిరి చేయదనే.. అగ్నికణమై మండుతుందని.. ‘అక్షరం క్షమించదు’ కవితలో అక్షరం యొక్క స్వాభిమానాన్ని చాటారు. ఏలికతనం నియంత పోకడై చీకటి దాడికి పూనుకుంటే అక్షరం అగ్నిస్నానం చేయిస్తుందని హెచ్చరించారు.
హృదయం ఘనీభవిస్తున్న చోట కరచాలనాలు సైతం కనుమరుగవుతూనే వుంటాయని ‘చేతులు’ కవితలో చక్కగా ఆవిష్కరించారు. నిశ్శబ్దాన్ని ఛేదించడానికి చేయి చేయి కలపాల్సిందేనని చెప్పడం బాగుంది. కవి తాను స్వయంగా ఉపాధ్యాయుడు కనుక.. చదువుల తల్లి ఒడిలోకి దేశాన్ని మేల్కొల్పినపుడు.. ప్రతి ఇల్లూ ఓ నందనవనమవుతుందనీ.. ప్రతి ఊరూ ఓ ఆనంద భువనమవుతుందని.. పిల్లల బాల్యం కార్ఖానాల్లో కరగనీయక చదువుల వైపు మళ్లించాలని సూచించారు.
‘వామన పాదమవుతోంది’ కవితలో ప్రయోగించిన పదబంధాలు బాగున్నాయి! ‘దాశరథీ.. శరథీ.. రథీ’ కవిత ద్వరా దాశరథి కృష్ణమాచార్యులుకు అక్షరాంజలి ఘటించారు. నీ జననం తెలంగాణ.. నీ పయనం రుద్రవీణ.. నీ కవనం అగ్నిధార.. నీ మరణం అశ్రుధార’ అంటూ దాశరథి పట్ల తమకున్న గౌరవభావాన్ని చాటుకున్నారు. కన్నీటి తడిలో నానుతున్న దేహం... ఇప్పుడిప్పుడే.. విత్తనమవుతోందని.. మట్టి వాసనల ధైర్యాన్ని పులుముకొని బలంగా మొలకెత్తుతోందని ‘వర్ణచిత్రాలు’ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. ‘మండుతున్న కుంపటిలా’ కవితలో.. కవి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కంసాలి వృత్తిలో తన నాన్న పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు! ‘నేను సైతం’ కవితలో ఉపాధ్యాయుడిగా తన ఆకాంక్షలను అక్షీకరిస్తూ.. నల్లబల్లపై మల్లెపూల వర్ణమాలల్ని అల్లి.. విద్యా పరిమళాలని గుబాళింపజేస్తానని చెప్పడం బాగుంది. ‘సకిలం ముకులం’ కవితలో రైతన్న వ్యథలకు అద్దం పట్టారు.
బతుకమ్మ అంటే.. బతుకును నేర్పిన ఉద్యమమని.. దొరల పెత్తనాన్ని దునిమాడిన జానపదమని.. బతుకమ్మ అంటే.. అస్తిత్వ జీవన పతాక అంటూ ఓ కవితలో బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. ‘వీధిబాలలు’ కవిత ఆర్ద్రంగా మలచబడింది. చావు పుట్టుకల మధ్య.. జీవిత కాల గౌరవాన్ని నేసిన నేతన్న నీ శ్రమ జీవన సౌందర్యం ఏదన్నా! అంటూ ‘ఉరిపడ్డ మగ్గం’ కవితలో నేతన్నల కష్టాలను అక్షరబద్ధం చేశాడు.
‘వున్నోళ్లూ.. లేనోళ్లూ’ కవితలో బరువెక్కుతున్న గుండె గుబులు చప్పుళ్ళను వినిపించారు. ఎరుపెక్కుతున్న మండే కడుపు కళ్లును.. మంచికీ చెడుకీ మధ్య నకళ్లుగా... మనిషి మనుగడను మార్చే లోగిళ్లుగా అభివర్ణించారు.
ఓపికలు మృగ్యమైన చోట బీభత్సాలు పురుడు పోసుకుంటూనే వుంటాయని ‘ఓ విధ్వంస ముఖచిత్రం’ కవితను రాశారు. భగభగ మండే నిజాలు వికృత దృశ్యమవుతున్నపుడల్లా ఓ విధ్వంస ముఖచిత్రం తెరమీద సాక్షాత్కరిస్తూనే వుంటుందని చక్కని ముగింపునిచ్చారు.
ఇలా సరళమైన పద బంధాలతో రమేష్‌గారి కవిత్వం కొనసాగింది. ఆయన ఆలోచనలను.. అనుభవాలను అనుభూతులను మేళవించి.. రాసిన ఇందలి కవితలు కొన్ని అగ్నికణాలుగా సెగలు కక్కుతాయి. మరికొన్ని ఆయన సామాజిక దృక్పథాన్ని అద్దం పడతాయి! కాలాన్ని కవిత్వంలోకి వొంపి.. కవి తన జ్ఞాపకాల దొంతరలతో రాసిన కవితలన్నీ పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.. మున్ముందు మరింత కవిత్వాంశతో కవిత్వాన్ని పండించడానికి.. తమ కలానికి పదునుపెట్టుకుంటారని విశ్వసిద్దాం.. కొత్తదనాన్ని ప్రతిబింబించే.. చక్కని భావ చిత్రాలతో.. తమ కవిత్వాన్ని అందిస్తారని ఆశిద్దాం!

- దాస్యం సేనాధిపతి, 9440525544