సబ్ ఫీచర్

సవ్యమైన విమర్శకు నోచుకోని సులోచనారాణి నవలా సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వార పత్రికకు నార్ల వేంకటేశ్వర రావుగారు ఎడిటరు. రాబోయే సంచికలో ప్రచురితమయ్యే సీరియల్ కథను కళాశాలలో విద్యార్థినులు చర్చించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఎడిటరుగారి కుమార్తె (అదే కళాశాలలో విద్యార్థిని) తండ్రికి చెప్పారట. ఈ విషయం గురించి ఆరాతీస్తే తేలింది ఏమిటంటే- ఆ సీరియల్‌ను కంపోజ్ చేసే ఉద్యోగి కుమార్తె కూడా అదే కళాశాలలో చదువుతోందనీ, ఉద్యోగంలో భాగంగా ఆయన చదివిన కథను ఇంట్లో కుమార్తెకు చెప్పేవారట. ఆవిడ కళాశాలలో తన మిత్రురాళ్ళతో పంచుకోవడం ఇక్కడ కీలకమైన విశేషం! ఆ సీరియల్ ‘జీవన తరంగాలు’, ఆ రచయిత్రి - యద్దనపూడి సులోచనా రాణి!
ఆమె తన పదిహేనవ ఏట రాసిన ‘చిత్ర నళినీయం’ కథ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చింది. తొలి నవల ‘సెక్రటరి’ జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. ‘మీనా’ నవల ‘యువ’ మాసపత్రికలో వెలువడింది. సుమారు రెండు దశాబ్దాలపాటు ఆమె నవలను సీరియల్‌గా ప్రచురించని తెలుగు పత్రిక లేదేమో!
సుమారు 78 నవలలు మొత్తం కోటి ప్రతులు అచ్చు అయి ఉంటాయని ఒక అంచనా. తొలి తెలుగు దినసరి టెలివిజన్ సీరియల్ ‘ఋతురాగాలు’తోసహా పది టీవీ సీరియల్స్‌కు కథ అందించారు ఆవిడ. ఆమె రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా రూపొందించబడి విశేషంగా ఆదరణ పొందాయి. రచయిత్రుల నవలాయుగం తర్వాత ప్రవేశించిన ఇరువురు రచయితలలో ఒకరు యద్దనపూడి గారి నవలను తన పేరున కన్నడంలోకి అనువదింప చేసుకున్నారట. ఇలాంటి ఘనకార్యమే తమిళంలో ఆయనో, ఆయన అంతేవాసియో చేశారట. ఇలాంటి సంగతులు మే 21న అమెరికాలో కన్నుమూసి, అక్కడే అంత్యక్రియలు జరుపుకున్న యద్దనపూడి సులోచనా రాణి గురించి పలు రకాలుగా వాస్తలుగా, విశేషాలుగా- పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఎంతోమంది రచయిత్రులు వ్యక్తిగతంగా తమ పరిచయాన్నీ, అనుభూతులనూ ఈ సందర్భంగా పంచుకుంటున్నారు. ఈ సరళిని గమనించాక కొన్ని ప్రశ్నలు తారసపడుతున్నాయి.
సులోచనా రాణి గురించి ఫేసుబుక్‌లో కూడా రాసినవాళ్ళలో రచయిత్రులే మహిళలే అధికంగా ఉన్నారు. రచయితలు, విమర్శకులు ఎందుకు సులోచనారాణి రచనల గురించి స్పందించడం లేదు? స్ర్తిలలో అక్షరాస్యతనూ, యువతలో పఠానాసక్తిని గొప్పగా పెంచిన రచయిత్రుల వచనా సాహిత్యాన్ని తొలుతే వంటింటి సాహిత్యంగా రుూసడించి, పిమ్మట వౌనంగా, వ్యాఖ్యానించకుండా ఉండిపోవడం ఎందుకు? 1965-1980 మధ్యకాలంలో దాదాపు ప్రతి ప్రముఖ పత్రికా సంపాదకుడు ఆమె సీరియళ్ళను తన పత్రిక సర్కులేషన్ పెంచుకోవడానికి ప్రచురించాలని ప్రయత్నించాడు. తమాషా ఏమిటంటే అదే పత్రికా ప్రపంచం వంటింటి సాహిత్యం అని విమర్శింపచేసింది. అంతేగాని ఆమెలోని పఠనీయత ఎలా సాధ్యమైంది? దాని లక్షణాలు ఏమిటనే శోధన ఇటు పత్రికల్లో రచనలు చేసి విమర్శకులుగా చలామణి అయ్యేవారు కానీ, అటు విశ్వవిద్యాలయాల్లో పట్టాలు తయారుచేసే అకడమిక్ విమర్శకులు గానీ చేయలేదు.
మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ముగ్గులు, అల్లికలు, వంటల గురించి ఏమిటని బాహాటంగా తక్కువగా ప్రకటించినా - అదే దృష్టి రంగుల ప్రయివేటు టెలివిజన్ ప్రవేశించేదాకా సాగింది. స్ర్తివాద సాహిత్య ధోరణి వాదాలు, రచనలు మొదలైన తర్వాత కొంత సానుభూతి వంటిది ఉంది కానీ సులోచనా రాణి తరహా సాహిత్యంపై దృష్టి పెట్టాలనే ఆలోచన దాదాపు ఎవరికీ రాలేదు. ప్రపంచ సాహిత్యంపై రాశారని మాలతీ చందుర్‌నూ, ‘కాలాతీత వ్యక్తులు’ రాశారని డా. పి.శ్రీదేవినీ, మార్క్సిజం దృష్టితో రచనలు చేశారని రంగనాయకమ్మనూ, గ్రామీణ జీవితం చిత్రించారని వాసిరెడ్డి సీతాదేవినీ కొంత ప్రస్తావించారు. అంతేతప్ప గొప్ప పఠనీయతతో నిరంతరాయంగా రచనలు చేసిన యద్దనపూడిని ఎవరూ పట్టించుకోలేదు - రచయిత్రులతోసహా. కోటి ప్రతులతో అమ్మకాలు పొందిన రచయిత ఇంకెవరూ లేరు. ముందు ముందు కూడా ఉంటారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఈ-పుస్తకాలు, నెట్ పత్రికలు వచ్చాయి కనుక.
సులోచనా రాణి రాసింది కుటుంబపు వ్యక్తులు లేదా భవిష్యత్ కుటుంబపు వ్యక్తులు (ప్రేమికులు) గురించి కదా! కుటుంబం అంటే సుమాజపు శకలమే కదా! మరి అంత నిరాదరణ ఎందుకు జరిగింది? ఇక్కడ ఇంకో అంశం చెప్పాలి. బెంగాల్ రచయిత శరత్‌బాబును తెలుగు రచయిత అనేంతగా ప్రేమించాం, అనువదించుకున్నాం. శరత్ తన నవలల్లో చేసింది ఏమిటి? ఒక్క నవలలో ఒక్కో పాత్రలో స్ర్తిని కేంద్ర స్థానంలో పెట్టి- అంటే ప్రేయసిగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా, భార్యగా- సృజన చేశారు. మరి యద్దనపూడి నవలలు ఆ ధోరణిలో ఎందుకు పరిశీలించబడలేదు?
ఈ పాక్షికమైన దృష్టి ఎందుకు ప్రేవేశించిందో, ఎవరి కారణంగా ప్రవర్థమానమైందో అవసరం లేదు కానీ- కనీసం ఇప్పుడయినా సులోచనా రాణి నవలల్లో వస్తువు, పాత్ర చిత్రణ, తద్వారా ఆమె పరోక్షంగా చెప్పిన వాదం గురించి లోతయిన విశే్లషణ, వివేచన అవసరం. దీనికి రచయిత్రులు పూనుకున్నా, రచయితలు పూనుకున్నా స్వాగతం.

- డా. నాగసూరి వేణుగోపాల్ ఫోన్: 94407 32392