సబ్ ఫీచర్

సారస్వత సరస్వతీ వజ్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

75సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితంలో వృద్ధాప్యానికి మలుపు. 75 సంవత్సరాలు ఈ విద్యాలయానికి యువ నవోత్సాహానికి మలుపు. ఎప్పటికీ వార్థక్యం సోకని, ఏళ్లు గడుస్తున్నకొద్దీ మరింత నూతనత్వాన్ని సంతరించుకునే సంస్థలు చాలా అరుదు. శత వసంతాల ఉస్మానియా తర్వాత అంతకుముందు ధీటైన సారస్వతానికి పెద్దపీట వేసిన కళామతల్లి తెలంగాణ సారస్వత పరిషత్తు వజ్రోత్సవాల వేడుకలను జరుపుకుంటున్న సాహితీ వజ్రం.
దేశంపైన జరిగిన ఎన్నో రకాల దాడులలో మన మాతృభాషలపైన జరిగిన దాడి కూడా ఒకటి. నిరంకుశ పాలకుల భాషాసాంస్కృతిక దౌర్జన్యాలు పెచ్చుమీరిన కాలంలో చాటుగా అమ్మభాషను నేర్చుకున్నా నేరమయ్యేది. మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తెలిపే, నిలిపే భాషా, సంస్కృతులను అణగదొక్కి మనదికాని పరాయి వాటిని మనమీద బలవంతంగా రుద్దినపుడు తలెత్తి ఎదిరించిన భాషోద్యమానికి నిలువెత్తురూపమే తెలంగాణ సారస్వత పరిషత్తు. అణచివేతనుండే అంకురం మొలకెత్తుతుంది. తెలంగాణ గడ్డమీద పుట్టిన ఆ స్వాభిమాన అంకురం ఇంతై ఇంతింతై వటవృక్షంగామారి నేడు వజ్రోత్సవాలను జరుపుకుంటున్నదీ చదువుల కోవెల.
సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మగారి వంటి అనేకమంది ప్రముఖ భాషావేత్తల ఆధ్వర్యంలో 1943 మే 26న రెడ్డి హాస్టల్ వేదికగా లోకనంద శంకర్‌గారి అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి సమావేశంలో ఈ సాహితీ సంస్థ ఏర్పాటుకు రూపకల్పన జరిగింది. తొలుత ఈ సంస్థ ట్రూప్‌బజార్‌లోని గోల్కొండ పత్రికాఫీసునుండి పని ప్రారంభించింది. తరువాత హనుమాన్ టెక్‌డీలో కొంతకాలం, అటుతర్వాత ప్రస్తుతమున్న ఆబిడ్స్‌లోని బొగ్గులకుంటలో 1951లో శాశ్వత భవనాన్ని ఏర్పరచుకుంది. మన ఘన సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నట్లుగా ఉండే సారస్వత పరిషత్ నిర్మాణం మన ప్రాచీన కళావైభవాన్ని తలపిస్తూ అబ్బురపరుస్తుంది. వేలాది అమూల్య గ్రంథ భాండాగారంలో విలసిల్లే గ్రంథాలయం, పుస్తక విక్రయ కేంద్రం, సాంస్కృతిక వేదిక దేవులపల్లి రామానుజరావు కళామందిరం, కళాశాలలతో సారస్వత పరిషత్తు సాహితీ బృందావనంగా విరాజిల్లుతోంది. సారస్వత పరిషత్తుకు మూలస్తంభాలుగా పేర్కొనదగిన ఇద్దరు మహనీయులు దేవులపల్లి రామానుజరావుగారు, సి.నారాయణరెడ్డిగారి చేతుల్లో పరిషత్తు పటిష్టతను, సుస్థిరత్వాన్ని సంపాదించుకుంది. సాహితీ సభలు, కవి సమ్మేళనాలతో అవిరళ భాషాకృషిని జరిపిన ఈ సంస్థకు ప్రజలు, సాహితీకారులనుండి చక్కని స్పందన, తోడ్పాటు లభించింది. సంస్థ ఏర్పరచుకున్న ప్రణాళికల అనుసరణ ద్వారా రాష్ట్రంలో మెట్రిక్‌వరకు తెలుగు బోధన అమలు ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్సిటీలో ద్వితీయ భాషగా తెలుగు ఉండే విధంగా కృషిచేసిందీ సంస్థ. కానీ అలాంటి సమయంలో తెలుగును బోధించడానికి సుశిక్షితులైన ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. తక్షణ కర్తవ్యంగా భావించిన సారస్వత పరిషత్తు వెనువెంటనే కార్యరంగంలోకి దిగి ఆయా పరీక్షల నిర్వహణ, శిక్షణ ద్వారా తెలుగు ఉపాధ్యాయులను పాఠశాలలు, కళాశాలలకు అందించింది. 1964లో తెలుగు పండిత శిక్షణ కళాశాల, 1968లో ఉస్మానియాకు అనుబంధంగా ఎయిడెడ్ కాలేజీగా ప్రాచ్య కళాశాలలను ప్రారంభించారు. క్రమంగా పరిషత్ కార్యకలాపాలు సేలం, హోసూరు, బీదర్, గుల్బర్గా, ముంబయ, మారిషస్ వంటి ప్రాంతాలకు సుమారు 200 పరిషత్ శాఖలతో విస్తరించాయి. మొదట భారతదేశంలో నిజాం రాష్ట్రం విలీనమవగానే పరిషత్ పేరులోని నిజాం పోయి ఆంధ్ర సారస్వత పరిషత్‌గా, తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత తెలంగాణ సారస్వత పరిషత్తుగా తనదైన సొంత సొబగును సంతరించుకుంది. ఇక సినారెగారు రూపొందించిన ట్రస్టు గురించిన విశేషాలు ప్రత్యేకమైనవి. సినారెగారు రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు ఎం.పి.లాడ్స్‌నుండి పైకాన్ని పరిషత్ శాశ్వత భవనాల ఏర్పాటుకై మంజూరు చేయించారు. మంజూరైన ఆ నిధులు దారిమళ్ళకుండా 1971లో పరిషత్‌కు అనుబంధంగా ట్రస్టును ఏర్పాటుచేశారు. పకడ్బందీగాఉన్న ఈ వ్యవస్థ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. మరొక విశేషమైన కార్యక్రమం సినారె ద్వారా ప్రారంభింపబడిన పరిణతవాణి, సాధారణంగా అన్నిరంగాలలో 20, 25 సంవత్సరాల కొత్తవారిని, యువతరాన్ని ప్రోత్సహించే విధమైన కార్యక్రమాలే ఉంటాయి. అలాంటి సమయంలో అటు నవతరాన్ని విద్యావంతులను చేస్తూ, ఇటు అనుభవ పరిపాకంగల సాహితీ పెద్దలు, ప్రజ్ఞానిధులకు కూడా పెద్దపీట వేస్తూ ప్రారంభించబడింది పరిణతవాణి. కొత్తతరం వారి రచనలకు మార్గదర్శకత్వంకోసం 60 ఏండ్లు దాటిన సాహితీ ప్రముఖుల జీవిత విశేషాలు, అనుభవాలను తెలుపుతూ వారు ఇచ్చిన ప్రసంగాలను లిఖిత రూపంలో వ్యాసాలుగా, పలు పుస్తకాలుగా అచ్చువేయించింది పరిషత్తు. ఆ విధంగా పరిణిత రచనాదురంధరులైన సాహితీ పెద్దలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహాన్నిస్తూ తరువాతి తరానికి వారి అమూల్యమైన సాహితీప్రజ్ఞను పంచడానికి దోహదపడింది పరిషత్ వారి పరిణతవాణి.
కేవలం తెలుగు భాషా, సాహిత్యాలకొరకే ఆవిర్భవించిన పరిషత్తు అందులో సఫలీకృతం అవడమే కాకుండా ఎన్నోరకాల సామాజికోపయోగ కార్యక్రమాలకు అంకురార్పణ, కొనసాగింపు చేసిన తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. పల్లెల్లో అక్షరాస్యతను సాధించడానికి వయోజన విద్యాలయాలు, రాత్రిబడులు ప్రారంభించడం, ప్రజలలో తెలుగుభాష, సాహిత్యం పట్ల అభిలాషను కల్గించే కార్యక్రమాలను రూపొందించడం, తెలుగులోనే పరీక్షల నిర్వహణ, తెలుగు రచనలను ప్రోత్సహిస్తూ ప్రచురణ కార్యక్రమాలను చేపట్టడం వంటి వాటిద్వారా పరిషత్తు ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలుపుతూ సాహిత్య కీర్తిపతాకను ఎగరేసిన సురవరం ప్రతాపరెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రచురించింది సారస్వత పరిషత్తే. ఇలా పరిషత్తు సుమారు 160 పుస్తకాలను ప్రచురించింది.
సారస్వత పరిషత్తు ఒడిలో అక్షరాలు దిద్దిన విద్యావంతులందరూ తమ సారస్వత ప్రస్థానాన్ని నెమరేసుకునే విధంగా పరిషత్ వజ్రోత్సవ వేడుకలను సారస్వత పరిషత్ ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు, కార్యదర్శి గౌరవనీయులు శ్రీ చెన్నయ్యగారు తెలంగాణలోని అన్నిజిల్లాల్లోనూ దిగ్విజయంగా జరిపించారు. బంగారు తెలంగాణను సాధించుకుంటున్న ఈ క్రమంలో తెలంగాణ పునర్నిర్మాణానికై 75 సంవత్సరాల క్రితంనుండే నడుం బిగించి సేవలందిస్తున్న సారస్వత పరిషత్ లక్ష్యాలను, పనితీరును మనం ఆదర్శంగా తీసుకోవాలి. అడుగడుగునా ఎన్నో ఆశ్చర్యమొలికించే అంశాలతో అజరామరంగా వెలుగొందుతున్న గొప్ప సాంస్కృతిక కేంద్రమైన తెలంగాణ సారస్వత పరిషత్‌కు వజ్రోత్సవ శుభాకాంక్షలు.

- డా. సరోజ వింజామర