సబ్ ఫీచర్

‘ఆలయాల్లో వివక్ష’పై అనవసర రాద్ధాంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శబరిమలలో అయ్యప్ప దర్శనానికి స్ర్తిలను ఎందుకు అనుమతించరు..?’ అని సుప్రీంకోర్టు ఈమధ్యనే ప్రశ్నించింది. మత పరమైన ఆంక్షలుండవచ్చును కానీ లింగవివక్ష పనికి రాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదివరలో ఒక నటీమణి తాను అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని ప్రకటించినపుడు వాదోపవాదాలయ్యాయి. వాస్తవానికి అయ్యప్ప దర్శనం స్ర్తిలకు నిషిద్ధం కానే కాదు. దీక్ష తీసుకుని పద్ధెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోడానికి పది సంవత్సరాలలోపు బాలికలకూ, యాభై ఏళ్లు దాటిన మహిళలకూ అర్హత ఉంది. ఇతర స్ర్తిలు ‘పదునెట్టాంబడి’ ఎక్కకుండా పక్కనుంచి స్వామి దయకు పాత్రులు కావచ్చును. శబరిమల విషయంలో వలే మహారాష్టల్రోని అహ్మద్‌నగర్ శని ఆలయంలోకి స్ర్తిలకు అనుమతి లేదు. ఇటీవల కొందరు ఆడవాళ్ళు లోపలకు వెళ్ళడం, ఆలయ సంప్రోక్షణ వంటి విషయాలు వార్తలయ్యాయి. శని సింగణాపూర్‌లోనూ ఇదే చర్చనీయాంశం అయింది.
అర్హత, హక్కు అన్న పదాలను సమానార్థకాలుగా వాడడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నలభై రోజులు దీక్ష వహించి కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి, అటవీ మార్గంలో ప్రయాణం చేస్తూ అయ్యప్పను దర్శించుకునే సామర్థ్యం వున్నవారికి అర్హత ఉంటుంది. అర్హత అంటే శక్తి సామర్థ్యాలున్నవారికి వర్తించేమాట. యవ్వనంలో వున్న స్ర్తిలకు నెలసరి కారణంగా దీక్ష వహించడం సాధ్యం కాదు. (ప్రస్తుతం నెలసరిని వాయిదా వెయ్యడానికి మందులున్నాయి కదా..! అన్న వాదాన్ని లేవదీయవద్దు). ఆ కారణంగా పది నుంచి యాభై ఏళ్ళ వరకూ ఉన్న స్ర్తిలు పద్ధెనిమిది మెట్లు ఎక్కే అర్హతను పొందలేరు. ‘పదునెట్టాంబడి’ ఎక్కి దర్శించుకోవడం కష్టపడి సాధించుకోవలసిన అర్హత మాత్రమే. పోరాడి సాధించుకునే హక్కు కాదు. లింగవివక్ష లేకుండా స్ర్తి, పురుషులందరినీ సమంగా అనుమతించినంతలో ఎందరు స్ర్తిలు కఠోర దీక్ష వహించగలరు? ఏకభుక్తం, అధశ్శయనం, అసితాహార్యం (ఒక్కపూట మాత్రమే తినడం, నేలమీద పడుకోవడం, నల్ల బట్టలు కట్టుకోవడం) వగైరా ఎందరు చెయ్యగలరు? మగవాళ్ళు నల్ల బట్టలు కట్టుకుని ఆఫీసులకి వస్తున్నారు. కానీ ఆడవాళ్లు నల్లచీరా, జాకెట్టు రోజూ వేసుకుందుకు ఇష్టపడతారా? ఏకభుక్తం చేస్తూ ఇంటిపనీ, పిల్లల పనీ, వంట పనీ, ఉద్యోగినులైతే ఆఫీసు పనీ చెయ్యగలుగుతారా? ఈ కష్టసుఖాలనూ, సాక్ష్యాధారాలనూ ఆలోచించిన తరువాతే నియమాలు పెట్టబడ్డాయేమో? మగవాళ్ళందరూ నియమనిష్ఠలు పాటించే దర్శనం చేసుకుంటున్నారా? అన్న ప్రశ్ననూ లేవదీయవచ్చు. ఒక రోజు దీక్ష మాత్రమే తీసుకుని శబరిమల వెళ్లిన అరవై ఏళ్ళ మహిళలూ ఉన్నారు. అపవాదం అన్నది వాదం కాదు.పరమ పవిత్రమూ, అతి రహస్యమూ అయిన గాయత్రీ మంత్రం విషయంలోనూ ఇదే వాదం చాలా కాలం సాగింది. ఒకానొక కాలంలో స్ర్తిలకూ ఉపనయనం జరిగేది. రానురానూ ఇంటిపనీ, వంటపనీ, పిల్లల పనీ వంటి బాధ్యతల కారణంగా స్ర్తిలు త్రికాల సంధ్యావందనం చెయ్యడం కష్టమైంది. ఆ సమయంలో స్ర్తిలు గాయత్రీ జపం చెయ్యనక్కరలేదనీ, భర్త పుణ్యంలో ఆమెకు సగం లభిస్తుందనీ నిర్ణయం జరిగింది. ఆధునిక కాలంలో స్ర్తిలెందుకు గాయత్రీ మంత్రజపం చెయ్యకూడదన్న ప్రశ్న మొదలైంది. ఆ వాదాన్ని వాడుకుని లాభం పొందాలనుకున్న కొందరు స్వామీజీలు, సంస్థల ప్రతినిధులు- ‘స్ర్తిలు కూడా జపం చెయ్యవచ్చును’ అన్నారు. (గాయత్రీ మంత్ర జపం చేసే స్ర్తిల వంట చాలా రుచిగా ఉంటుందని ఒక సంస్థాన్ వారు చెప్పారు. మగవారు మగువలకి అడ్డురాకపోడానికి ఇదో మంచి మార్గమని వారి అభిప్రాయం కాబోలు!). స్ర్తిలేమిటి, పురుషులేమిటి, పసిపిల్లలేమిటి, ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా గాయత్రీ మంత్రం జపించవచ్చునన్న భావం అంతటా వ్యాపించింది. ‘మా మనవరాలు గాయత్రీ మంత్రం బాగా చెప్తుంది’-అని గొప్పలకుపోయేవారికి లోటు లేదు. సెలబ్రిటీల విషయంలో అయితే మూడేళ్ళ పిల్లకు సంబంధించిన ముచ్చట సైతం పత్రికల్లో ప్రముఖ వార్తగా వస్తుంది. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన’ అన్నట్లుగా గాయత్రీ మంత్రాన్ని ఫోన్‌లో రింగ్‌టోన్‌గా, సినిమా పాటల ట్యూన్‌తో వాడే దుస్థితి నేడు వచ్చింది. మనం ఫోన్ చేశాక అవతలివారు ఫోన్ ఎత్తేదాకా మంత్రం వినిపిస్తుంది. ఒకానొక టీవీ సీరియల్‌లో అర్హత లేని అంగన్యాస కరన్యాసాలను స్ర్తి పాత్ర తనకు తోచినట్లుగా (డైరెక్టరు చెప్పినట్లుగా) చేతివేళ్ళను కదుపుతూ ఆచరించడం చూపించారు. దీన్ని అజ్ఞానమనుకోవాలా? అహంకారమనుకోవాలా? అతివలందరికీ ఒక్కటే విజ్ఞప్తి. ఆముష్మిక విషయాలలో ‘ఎందుకు?’ అన్న ప్రశ్నను వెయ్యవద్దు. ‘గాయత్రీ మంత్రజపం మేం చెయ్యవద్దనడానికి మీ అర్హత ఏమిటి?’ వంటి ప్రశ్నలు వద్దు. ఈ మాట అన్నందుకు సాటి స్ర్తిలకే కోపం రావచ్చు. లైంగిక వివక్ష అనేక ఇహలోక విషయాలలో నిరాటంకంగా సాగుతున్నది. వాటిమీద దృష్టి సారించడం అభిలషణీయం. ఆడశిశువుల భ్రూణహత్యలు నేడు ఎక్కువగా ఉన్నాయి. అత్యాచార నేరస్థులలో నూటికి పది శాతానికి కూడా శిక్షపడడం లేదు. పురుషులకన్నా స్ర్తిల ఆయుః పరిమాణం తక్కువ. ఆహార, ఆరోగ్య విషయాలలో కూడా స్ర్తికి అన్యాయమే జరుగుతోంది. విద్యావకాశాలు కూడా వారికి తక్కువే. ఇటువంటి ప్రత్యక్షమైన వివక్షలు ఎన్నో రంగాలలో జరుగుతున్నా అంతగా పట్టించుకోవడం లేదు.
ఆర్థిక, సామాజిక ప్రగతిని వదలివేసి ఆముష్మిక విషయాలలో సంస్కరణలకై పోరాటం సమంజసం కాదు. ఆముష్మిక విషయాలలో పోరాటం అవసరం కూడా లేదు. పరమాత్మకు సంబంధించినంతవరకూ ఆడ,మగ అనే తేడా లేనే లేదు. ధర్మపత్ని పక్కన లేకుండా పురుషుడు అనేక కర్మలు చెయ్యడానికి అనర్హుడు. రామాయణంలోని స్వర్ణసీత గురించి అందరికీ తెలుసు. పురుషుని పుణ్యంలో స్ర్తికి సగపాలు, స్ర్తి పాపంలో పురుషుడికి సగపాలు చెందుతాయంటారు. హిందూ మతం, భారతీయ ధర్మం విశాల దృక్పథం కలిగి వున్నాయి. భగవంతుని చేరడానికి అనేక మార్గాలున్నాయి. కొన్ని మార్గాలు నిషిద్ధాలైనంత మాత్రాన స్ర్తికి మోక్షం లభించదనుకోవడం భ్రమ. భగవంతుడిని భర్తగా భావించిన మీరాబాయి, భర్తను భగవంతునిగా పూజించిన సుమతి, దేవుడిలో తండ్రిని చూసిన ప్రహ్లాదుడు, తండ్రిలో దేవుడిని చూసిన పుండరీకుడు అందరూ హిందూ ధర్మాన్ని ఆచరించినవారే. అంతటి విశాల దృక్పథం కలిగిన సనాతన భారతీయ ధర్మాన్ని సంకుచిత పోరాటాల్లో ఇరికించే ప్రయత్నం వ్యక్తులకూ, సమాజానికీ మంచిది కాదు. అలా ఇరికించడం సాధ్యమూ కాదు.

-పాలంకి సత్య