సబ్ ఫీచర్

అద్వితీయ ప్రతిభతో అద్భుత విజయాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మల్లయోధులకు పుట్టినిల్లు’గా ఆ గ్రామానికి ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఆ ఊరి యువతకు మల్లయుద్ధం, క్రికెట్ తప్ప మరే ఇతర క్రీడల గురించి తెలియదు. అలాంటి పల్లె నుంచి వచ్చిన ఓ కుర్రాడు తన అద్భుత నైపుణ్యంతో గోల్ఫ్ క్రీడాకారుడిగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. ప్రపంచ స్థాయి జూనియర్ గోల్ఫ్ పోటీల్లో గ్రాండ్‌స్లామ్ సాధించి, అంతర్జాతీయ వేదికపై మనదేశానికి గుర్తింపు తీసుకువచ్చాడు ఈ బుడతడు. తన వయసు పిల్లలందరూ టీవీ చూడటం, కంప్యూటర్, స్మార్ట్ఫోన్‌లో గేమ్స్ ఆడటం, క్రికెట్ ఆడటంతో కాలక్షేపం చేస్తుంటే శుభమ్ జగ్లాన్ (11) మాత్రం గోల్ఫ్‌కు సంబంధించి సీడీలను చూస్తూ ఆ క్రీడలో మెళకువలను తెలుసుకుంటున్నాడు. హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా ఇస్రానా గ్రామానికి చెందిన శుభమ్ మిగతా పిల్లలకు భిన్నంగా గోల్ఫ్‌పై దృష్టి సారించాడు.
అమెరికాలో ఓ విద్యా సంస్థను నిర్వహిస్తూన్న కపూర్ సింగ్ అనే మాజీ అథ్లెట్ తన స్వగ్రామమైన ఇస్రానాలో గోల్ఫ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాడు. తొలుత పలువురు చిన్నారులు ఈ శిక్షణ సంస్థలో చేరారు. శిక్షణ సందర్భంగా ఓసారి బంతి తగలడంతో శుభమ్ తలకు గాయమైంది. అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్ళగా వైద్యులు కుట్లు వేసి ఇంటికి పంపించారు. మరుసటి రోజు గోల్ఫ్ మైదానానికి వెళ్ళవద్దని తల్లిదండ్రులు వారిస్తున్నా శుభమ్ వెళ్ళాడు. ఆ తర్వాత పిల్లలంతా శిక్షణ సంస్థ నుంచి క్రమంగా తప్పుకున్నారు. దీంతో చేసేదేమీ లేక శిక్షణ సంస్థను మూసివేసిన కపూర్ సింగ్ గోల్ఫ్‌కు సంబంధించిన క్రీడాపరికరాలను శుభమ్ ఇచ్చాడు. గోల్ఫ్ పట్ల తన కుమారుడు శుభమ్ చూపుతున్న ఆసక్తిని గమనించి అతని తండ్రి ఎంతగానో ప్రోత్సహించాడు. సెలవురోజుల్లో తమ గ్రామానికి 45 కిలోమీటర్ల దూరంలో వున్న కర్నల్ పట్టణానికి ఆయన తన కుమారుడిని తీసుకువెళ్ళి అక్కడ గోల్ఫ్ ప్రాక్టీసు చేయించేవాడు. ఓ టోర్నమెంట్‌లో శుభమ్ ఆట తీరు చూసిన ప్రముఖ గోల్ఫ్ మహిళా కోచ్ నొనిటలాల్ ఖురేషీ ఆశ్చర్యపోయారు. తగిన శిక్షణ ఇస్తే ఆ కుర్రాడు మంచి క్రీడాకారుడిగా పేరుతెస్తాడని ఆమె భావించారు. గోల్ఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో ఖురేషీ సభ్యురాలు. తగిన శిక్షణ ఇచ్చేందుకు శుభమ్‌ను ఆమె ఢిల్లీ తీసుకువెళ్ళారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా స్పాన్సర్లను కూడా ఆమె ఏర్పాటు చేశారు. 2012లో యుఎస్ కిడ్స్ గోల్ఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొని 22వ స్థానంలో శుభమ్ నిలిచాడు. 2013లో, 2014లో అదే టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిలిచాడు. 2014లో ‘వరల్డ్ మాస్టర్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్’లో 5వ స్థానం పొందాడు. ఈ ఏడాది వరల్డ్ మాస్టర్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్, వరల్డ్ స్టార్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్, జూనియర్ వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లను వరుసగా గెలుచుకుని గ్రాండ్ స్లామ్ ఘనతను సాధించాడు.
శుభమ్ ఆటతీరును గమనించి ఢిల్లీలోని లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషారామ్ అతనికి తమ విద్యా సంస్థలో ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. విదేశీ పర్యటనల సందర్భంగా భాషాపరంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రత్యేకంగా ఓ ఆంగ్ల ఉపాధ్యాయుడిని శుభమ్ కోసం నియమించారు. ప్రస్తుతం లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్‌లో ఈ కుర్రాడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఎప్పటికప్పుడు మెళకువలు తెలియజేస్తూ శుభమ్ విజయపథంలో దూసుకుపోయేందుకు ఖురేషీ కృషి చేస్తున్నారు.

-పి.హైమావతి