రాష్ట్రీయం

కోస్తా, సీమల్లో మళ్లీ వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఐఎండి హెచ్చరికతో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అల్పపీడనానికి సంబంధించి ఐఎండి సైంటిస్ట్ ‘ఇ’ (ఎన్‌డబ్ల్యుఎఫ్‌సి) చరణ్‌సింగ్ ఆదివారం ఐఎండి వెబ్‌సైట్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, శ్రీలంక సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, మరో 24 గంటల్లో ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ప్రకటించారు. దీని ప్రభావం వల్ల సోమవారం తమిళనాడు కోస్తా ప్రాంతంతోపాటు పుదుచ్ఛేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. డిసెంబర్ ఒకటి, రెండు తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన వెంటనే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వాతావరణంలో హఠాత్తుగా మార్పు చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహం వరకూ ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఒకటి రెండుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. గతవారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో అతలాకుతలమైన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రైతులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి భారీ వర్షాలు, వరదల తర్వాత కాస్తో కూస్తో చేతికి వస్తుందనుకుంటున్న వరిపంటకు భారీనష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఐఎండి హెచ్చరికతో జిల్లా యంత్రాంగాలతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదివారం మాట్లాడారు. ఎటువంటి పరిస్థితి తలెత్తినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఆస్తి, ప్రాణనష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను హెచ్చరించారు. వర్షాల తీవ్రత ఎలా ఉంటుందో స్పష్టం కాకపోయినప్పటికీ, భారీ వర్షాలు కురిసి, వరదలొచ్చినా నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖాధికారులు యుద్ధప్రాతిపదికన రైతులకు సలహాలు ఇవ్వాలని, చేతికి వచ్చిన పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేయాలని సూచించారు.