రాష్ట్రీయం

కల్వర్టును ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, జనవరి 18: కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బస్‌స్టేషన్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో కేరళ టెక్నో స్కూల్ నిర్వహిస్తున్న పిడి రాబిన్, తన భార్య బిసిమోల్, కుమారుడు యువన్ ఫ్రాన్సిస్, తల్లిదండ్రులు థెరిస్య, దేవస్యతో కలిసి స్వస్థలం కేరళలోని కాసర్‌గోడ్‌కు వెళ్లాడు. అక్కడ తన కుమారుడు యువన్ బాప్టిజమ్ స్వీకరణ కార్యక్రమం బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తిరిగి మక్తల్‌కు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి బస్టాప్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులోని రాబిన్ (36), అతని భార్య బిసిమోల్ (30), కుమారుడు యువన్ ఫ్రాన్సిస్ (5 నెలలు), తండ్రి దేవస్య (65), తల్లి థెరిస్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. మక్తల్‌కు చెందిన కారు డ్రైవర్ పవన్ (23) సైతం ప్రమాదంలో మృతి చెందాడు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించి బంధువుల సహాయంతో స్వస్థలాలకు తరలించారు.

చిత్రం.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి వద్ద కల్వర్టును ఢీకొన్న కారు