రాష్ట్రీయం

కాలు దువ్విన పందెం కోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అమలాపురం, జనవరి 14: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఉభయ గోదావరి జిల్లాల్లో గురువారం నుండి కోడి పందాలకు తెరలేచింది. అలా, ఇలాకాదు... గ్రామ గ్రామాన కోడి పందాలతోపాటు పేకాట, గుండాట విచ్చలవిడిగా నిర్వహించారు. ‘మూడు రోజుల పాటు మీ జోలికి ఎవరూ రారు’ అంటూ నేతలిచ్చిన అభయహస్తం మాటున ఈ వ్యవహారం సాగిపోతోంది. ఉదయం 10 గంటల వరకు పోలీసులు హడావుడిచేసినా, ఆ తర్వాత పైనుండి వచ్చిన ఆదేశాలతో చేతులెత్తేశారు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు సైతం ఏర్పాటుచేసి జూదాలు కొనసాగిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్న పందాల్లో తొలి రోజే కోట్ల రూపాయలు చేతులు మారాయి. వేల సంఖ్యలో మూగజీవాలు నేలకొరిగాయి. మద్యం కూడా పరవళ్లు తొక్కింది. దీంతోపాటు భోజన ఏర్పాట్లు కూడా ఘనంగానే సాగిపోయాయి. మందు తాగితే బిర్యానీ ఫ్రీ అన్న ఆఫర్లు కూడా ఈసారి చాలాచోట్ల కన్పించాయి. తూర్పు గోదావరితో పోల్చితే పశ్చిమ గోదావరిలోనే ఎక్కువగా పందాలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టా, మెట్ట, ఏజెన్సీ అనే తేడా లేకుండా నిర్వాహకులు మీసం మెలేసి పందాలను విచ్చలవిడిగా సాగించారు. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే పందాల జోరు ఈసారి మరింత పెరిగింది. పెద్దపందాలు జరిగిన ఏప్రాంతంలో చూసినా బారులు తీరిన కార్లు, వందల సంఖ్యలో మోటారుసైకిళ్లు దర్శనమిచ్చాయి. ఆకివీడు, కాళ్ల, ఉండి, భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, పాలకొల్లు, యలమంచిలి, మొగల్తూరు, పెనుగొండ, పెరవలి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం, తాళ్లపూడి, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, నల్లజర్ల, కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తదితర పలు మండలాల్లో భారీస్థాయి కోడి పందాలు సాగాయి. తొలి రోజు సినీ నటుడు భానుచందర్, సంగీత దర్శకుడు కోటి పందాలను తిలకించారు.
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో పందెగాళ్లు రెండు జట్లుగా విడిపోయి పందాలు నిర్వహించారు. కనీస పందెం లక్ష రూపాయలు కాగా, పై పందాలుగా మరికొన్ని లక్షలు కాస్తూ ఇక్కడ పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో విజేత జట్టుకు బహుమతిగా ఇవ్వడానికి ఒక స్కూటర్ సైతం ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇతర జూదాలు నిర్వహించడానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను రప్పించటం విశేషం. అధికారపార్టీ నేతల అనుమతి లేదనే కారణంగా తాళ్లపూడి మండలంలో ఈ ఏడాది కొత్తగా పెద్దేవం, వేగేశ్వరపురంలో ఏర్పాటుచేసిన బరుల వద్ద పందాలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పందాలు జరిగి తీరాలని, లేకపోతే మిగిలినచోట్ల కూడా జరగనీయబోమని స్ధానికులు ఆందోళనచేయటంతో సాయంత్రం 4 గంటలకు ఈ రెండు చోట్ల పందాలకు అనుమతించారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ, మెట్ట ప్రాంతాల్లో భారీగా కోడిపందాలు నిర్వహించారు. అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, అల్లవరం, సఖినేటిపల్లి, అయిపోలవరం, కొత్తపేట, ఆత్రేయపురం, జగ్గంపేట తదితర మండలాల్లో భారీగా కోడిపందాలు జరిగాయి. ఇక శుక్ర, శనివారాల్లో ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చే ప్రముఖులతో పందాలు మరింత జోరుగా సాగనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

చిత్రం... పందెంలో తలపడుతున్న కోళ్లు