రాష్ట్రీయం

బ్రిటిష్ విధానాలకు ఇక స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: బూజు పట్టిన బ్రిటిష్ విధానాలను వదిలిపెట్టి భూమి రికార్డులను నవీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విజయవాడలో మూడు రోజుల పాటు జరిగే జాతీయ భూమి రికార్డుల నవీకరణ శిక్షణ వర్క్‌షాప్ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి)ని బుధవారం ప్రారంభించిన ముఖ్యమంత్రి భూమి రికార్డులను అధునీకరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న భూమి రికార్డులలో అనేక లోపాలున్నాయని, భూమి రికార్డులకు సంబంధించి ప్రజలు వివరాలు కావాలంటే స్పష్టమైన సమాచారం ఇవ్వలేని గందరగోళ పరిస్థితి ఉందన్నారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా ఇకపై సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జీఐఎస్, జీపీఎస్ వంటి టెక్నాలజీని వాడుకోవడం ద్వారా ఖచ్చితమైన భూమి వివరాలను పొందుపరచవచ్చన్నారు. ప్రస్తుతం భూమి విలువ రోజురోజుకు పెరుగుతుందని, కానీ భూమి లభ్యత మాత్రం పెరగదని అందుకే ఈ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పౌరసేవల్లో భాగంగా ఒక్కొక్కరికి 64 సర్ట్ఫికెట్ల వరకు ఇవ్వాల్సి వస్తోందని, ఆధార్ అనుసంధానించి వీటి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. భూమి రికార్డులను శాశ్వత ప్రాతిపదికన వివాదరహితంగా చేయాలంటే ప్రజాభిప్రాయంతో పాటు చర్చలు జరపాల్సి ఉంటుందని, అలాగే వీటిని డిజిటలైజ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చొరవ, సాంకేతికతో భూమి రికార్డుల నమోదుకు సంబంధించి సమస్యలను తగ్గించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. వీటి నమోదు విషయంలో అవినీతి, అవకతవకలు జరగకుండా క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్లు పని చేయాలని సిఎస్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో మన రాష్ట్రం నుంచి 240 మంది అధికారులతో పాటు 14 రాష్ట్రాల నుంచి అధికారులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న భూ రికార్డుల నవీకరణ విధానాలను అధ్యయనం చేసి ఒక అత్యుత్తమ విధానాన్ని రూపొందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డిసి మిశ్రా, నీటి ఆయోగ్ సలహాదారు అమిత్‌కుమార్ భరద్వాజ్, ఎపిహెచ్‌ఆర్‌డి డైరెక్టర్ చక్రపాణి, సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునీఠ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జెసి శర్మ తదితరులు పాల్గొన్నారు.