రాష్ట్రీయం

ఎటు చూసినా దా‘రుణాలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 16: కాల్‌మనీ వ్యవహారం విజయవాడలో వెలుగుచూసిన నేపధ్యంలో జిల్లాలోనూ ఆప్రభావం గట్టిగానే కన్పిస్తోంది. ఇంతవరకు తమలోతాము మదనపడుతూ వస్తున్న బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి మరీ తమ స్వరాన్ని విన్పిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో వడ్డీరాకాసుల సంఖ్య దారుణంగానే కన్పిస్తోంది. ఆ వూరు, ఈ వూరు అని లేకుండా సర్వాంతర్యామి తరహాలో ఈ వడ్డీరాకాసులు వెలుగుచూస్తున్నారు. కాల్‌మనీ నేపధ్యంలో జిల్లాకు చెందిన కొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావటం తెల్సిందే. ఆ పరిస్థితుల్లోనే జిల్లా పోలీసులు బుధవారం తెల్లవారుఝామునుంచి జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా వడ్డీరాకాసులపై తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నిడదవోలు, పాలకొల్లు, ఆచంట, భీమవరం, కొవ్వూరు తదితర పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయా ప్రాంతాల్లో పేరుమోసిన వడ్డీవ్యాపారుల ఇళ్లల్లో పరిశీలన చేయగా పోలీసులే విస్తుపోయే సంఖ్యలో దస్తావేజులు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు వెలుగుచూశాయి. ఈ సందర్భంగా 30మంది వరకు వడ్డీరాకాసులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాధితులు బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకునే పరిస్థితి కూడా వచ్చింది. బుధవారం ఉదయం నుంచి ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఈ రుణాల బాధ నుంచి గట్టేక్కించాలని, వడ్డీరాకాసుల బారినుంచి రక్షించాలని 15మందికి పైగా ఫిర్యాదులు చేశారు. మరోవైపు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎన్నోసంవత్సరాలుగా వడ్డీరాకాసులుగా మారి ఆస్తులు భోంచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరికొంతమంది బాధితులు నేరుగా విలేఖరుల సమావేశాలు నిర్వహించి మరీ వాపోయారు. ఈ సందర్భంగా వారు చెప్పిన వివరాలు చూస్తే కళ్లు తిరిగే రేంజ్‌లోనే అక్రమాలు ఉన్నాయి. ఆ కొంతమంది వడ్డీరాకాసులు బాధితుల నుంచి సొంతం చేసుకున్న ఆస్తుల విలువ చూసినా పదుల కోట్ల రూపాయల దాటే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇవి బయటపడి చెపుతున్నవారివేనని, చెప్పుకోలేని వారి సంఖ్య మూడు,నాలుగు రెట్ల పైనే ఉంటుందని పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తికి చెందిన కొంతమంది గత కొనే్నళ్లుగా జిల్లాను కేంద్రంగా చేసుకుని వడ్డీ వ్యాపారం చేస్తూ వస్తున్నారు. వీరు వారంలో రోజుకొక ప్రాంతం చొప్పున కలియదిరుగుతూ అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ పేదలను పీల్చిపిప్పి చేస్తున్నారు. వీరి విషయంలో కూడా జోక్యం చేసుకున్న పోలీసులు ఏలూరులో వారు మకాం ఉంటున్న ఒక ప్లాట్‌పై కూడా బుధవారం దాడి చేసి పరిశీలన జరిపారు. చింతలపూడి పోలీసుస్టేషన్‌లో నలుగురు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో బుధవారం తెల్లవారుఝాము నుంచి ఎలుకులపేటలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. జగన్నాధం రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖాళీ ప్రామిసరీ, వంద రూపాయల బాండ్ పేపర్లు, పద్దుల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన కలగర శివరామకృష్ణ ప్రసాద్, ఆయన భార్య మృణాళిని బుధవారం ఏలూరు డిఎస్పీ సరితకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగానే ఎంతోమంది కుటుంబాలకు చెందిన ఆస్తులను సొంతం చేసుకుని నగరంలోనే భారీ ఆస్తులున్న కుటుంబాలుగా మారిపోయారని ఆరోపించారు. ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంనకు చెందిన మహిళలు కూడా జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బొప్పనవారిగూడెంనకు చెందిన ఒక వడ్డీ వ్యాపారి అప్పు తీర్చినా ఖాళీ నోట్లు, చెక్కులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.