రాష్ట్రీయం

ముద్రగడ మాటలు నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/కాకినాడ, మే 30: ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఉద్యమం చేపట్టిన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై రాష్టమ్రంత్రులు నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధికోసం ఉద్యమాల పేరుతో ముద్రగడ పద్మనాభం కాపులను మోసగించడం తగదని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సోమవారం నెల్లూరులో విరుచుకుపడ్డారు. రాజకీయంగా పనీపాటు లేక ఖాళీగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాటలు నమ్మి కాపు సామాజికవర్గం మోసపోవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడలో అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలన్ని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని, కాపులను బిసి జాబితాలో చేర్చడానికి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని నారాయణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లపాటు ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం కాపు సంక్షేమం తనతోనే సాధ్యమన్నట్లు మాట్లాడి వారిని ఉద్యమాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలతో తప్పుదోవ పట్టించటం శోచనీయమన్నారు. ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవకపోయినా కనీసం కాపుల కోసం సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌తో సంప్రదించి కాపులను బిసిలలో చేర్చే ఆవశ్యకతపై మాట్లాడి ఉండవలసిందన్నారు. అలాకాకుండా పలువురు నేతల ఇళ్లకు వెళ్లి వారికి కృతఙ్ఞతలు తెలియజేయడం ఏమిటని ప్రశ్నించారు. కాపులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ పేదరికంలో ఉన్నారనే సంగతిని చంద్రబాబు నాయుడు గుర్తించారన్నారు. ఈనేపథ్యంలోనే వారిని బిసి జాబితాలో చేర్చి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికైనా ముద్రగడ ప్రభుత్వానికి సహకరించి కాపుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.
కాగా ముద్రగడ కారణంగా యువత కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ నాశనం అవుతుందని చినరాజప్ప హెచ్చరించారు. కాపులందరికీ ముద్రగడ మాత్రమే నాయకుడు కాదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కున్న పక్షంలో యువతకు ఆ ఫలాలు అందకుండా పోతాయని హెచ్చరించారు. కాపు మంత్రులు ముఖ్యమంత్రికి చెక్క భజన చేస్తున్నారంటూ ముద్రగడ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము చేస్తున్నది చెక్క భజన కాదని, కాపు సామాజికాభివృద్ధికి శక్తివంచనలేని కృషి అన్నారు. కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు, బిసిల్లో చేర్చేందుకు వీలుగా కమిషన్ ఏర్పాటు, రుణాల మంజూరు వంటి ఫలాలు తమ కృషి కారణంగానే లభిస్తున్నాయన్నారు. ముద్రగడ అనుచిత చర్యల కారణంగా అర్హులు ఈ పథకాలకు దూరమయ్యే ప్రమాదం వాటిల్లిందన్నారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కాపు సామాజికవర్గ ఆర్ధిక స్థితిగతులపై మూడు స్థాయిల్లో సమగ్ర సర్వే నిర్వహించనున్నట్టు చినరాజప్ప చెప్పారు. జూన్ 2నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ్ దీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 8వ తేదీ నాటికి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటుందన్నారు. జూన్ 2న ముఖ్యమంత్రి గుంటూరులో నవ నిర్మాణ దీక్షలు ప్రారంభిస్తారన్నారు. 8వ తేదీన ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు.

అంతర్మథనంలో కాపు నేతలు

రాజకీయంగా అన్యాయం జరుగుతోందని అసంతృప్తి.. ప్రత్యామ్నాయంపై ఆలోచన

ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 30 : కడప జిల్లాలో కాపు సామాజక వర్గం నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకూ ప్రధానంగా రెడ్ల, కాపు సామాజిక వర్గాల మధ్యే రాజకీయం నడుస్తోంది. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న కాపులకు టిడిపిలో అన్యాయం జరుగుతోందని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో రెడ్ల సామాజిక వర్గం నేతలదే హవా కొనసాగుతుందని తమ రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కోక తప్పదని కాపు సామాజిక వర్గం నేతలంతా సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడంలో భాగంగా వారిని బిసి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50శాతం సబ్సిడీ రుణాలు సైతం మంజూరు చేస్తున్నారు. అయితే అవేమీ జిల్లాలో కాపు సామాజిక వర్గంపై ప్రభావం చూపించలేదనే చెప్పవచ్చు. కాపు సామాజిక వర్గంలో కడప, రాజంపేట, రాయచోటి నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న నేతలతో పాటు జిల్లాలో బలిజ సామాజికవర్గం నేతలు రాజకీయంగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడపలో గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన ఎస్.దుర్గాప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్, రాయచోటిలో స్వతహాగా రాజకీయల్లో ఒక వెలుగువెలిగి ప్రజాదరణ పొంది రాజీలేని పోరాటం చేసిన మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడు, ఆయన తనయుడు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎస్.బాలసుబ్రమణ్యం, మరో తనయుడు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు), రాజంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పి.బ్రహ్మయ్య, టిడిపి నేతలు అతికారి వెంకటయ్య, ట్రాన్స్‌ఫారం శ్రీనుతో పాటు కాపు సామాజికవర్గంలోని మరికొందరు తాము పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవలు అందిస్తున్నా తమకు అధిష్ఠానం ప్రాముఖ్యత కల్పించలేదని వాపోతున్నారు. కాపు సంఘం సీనియర్ నేతలు నారాయణస్వామి రాయల్, డాక్టర్ వెంకటేశ్వర్లు, కాపు కార్పొరేషన్ సభ్యులు మోదుగుల పెంచలయ్య, ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు తదితరులు తాము పార్టీని నమ్ముకుని ఉండగా వలస వచ్చిన నేతలకే టిడిపి అధిష్ఠానం పెద్ద పీట వేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.