రాష్ట్రీయం

చురుగ్గా దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: విజయవాడలో ఐదుగురిని బలి తీసుకున్న కల్తీ మద్యం కేసులో దర్యాప్తు చురుగ్గా కొనసాగుతున్నది. ఇప్పటికే స్థానిక ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను అందించినప్పటికీ ఈ సంఘటన జరిగిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సంబంధించినది కావటంతో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకై సీనియర్ ఐపిఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా నేతృత్వంలో తొమ్మిది మంది పోలీస్ అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఉత్తర్వులు వెలువడిన మరుక్షణంలోనే ఈ బృందం రంగంలోకి దిగింది. ముందుగా స్వర్ణ బార్‌ను పరిశీలించి పరిసరాల్లో ప్రజల నుంచి కొన్ని వివరాలు సేకరించింది. మృతుల కుటుంబ సభ్యులను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను విచారించారు. ఈ సంఘటనపై ఐపిసి 328, 309, ఎక్సైజ్ చట్టం సెక్షన్ 37ఎ 1,2 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి గత రాత్రివరకు బార్ క్యాషియర్‌లు, సప్లయర్లు, క్లీనర్, స్నాక్స్ వెండర్ మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేయడం జరిగింది. సెక్షన్ 45 ప్రకారం విచారణ కోసం తమ వద్దకు హాజరు కావాలంటూ లైసెన్సుదారులు నలుగురికి కూడా నోటీసులు జారీ చేశారు.
మల్లాది విష్ణును 10వ నిందితునిగా చేర్చుతూ మరో కేసు నమోదైంది. విష్ణు ఆదేశం మేరకే మద్యాన్ని కల్తీ చేశారంటూ ఓ ఆటోడ్రైవర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఇదిలా ఉండగా విష్ణుతోపాటు కుటుంబ సభ్యులందరు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ బార్‌తో తన కెలాంటి ప్రమేయం లేదంటున్న విష్ణు ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో తన నామినేషన్‌తోపాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ బార్‌లో తనకు 34,722 రూపాయల వాటా ఉన్నట్లుగా పేర్కొనటాన్ని టిడిపి నేతలు తరపైకి తెచ్చారు. మరోవైపు శాఖాపరమైన దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు డిజిపి జెవి రాముడు తెలిపారు.
సెల్లార్‌లో బార్ కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి చర్య తీసుకోనందుకు సిఐ ఎన్‌వి రమణారావును సస్పెండ్ చేశారు. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్‌వి రమణను కూడా సస్పెండ్ చేసేందుకు ప్రొసీడింగ్స్ సిద్ధమయ్యాయి. బార్‌లోని సిబ్బంది డబ్బుకు కక్తుర్తి పడి మద్యంలో ప్రమాదకరమైన మిథనాల్‌ను మోతాదుకు మించి కలిపారనేది ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులు సేకరించిన శ్యాంపిల్స్‌ను పరీక్షిస్తున్న గుంటూరులోని ప్రాంతీయ లాబ్ అధికారులు గురువారం తమ నివేదికను అందించనున్నారని తెల్సింది.

కల్తీ మద్యంపై సిట్

ఎనిమిదిమంది ఐపిఎస్‌లతో దర్యాప్తు
విజయవాడ పోలీసు కమిషనర్ సారథ్యం

హైదరాబాద్, డిసెంబర్ 9: విజయవాడ బార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తుల మరణించిన సంఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా సారధ్యంలో ఎనిమిది మంది ఐపిఎస్‌లు దర్యాప్తు చేస్తారు. గ్రేహౌండ్స్ ఎస్పీ ఎస్ సెంథిల్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు టి కనకరాజు, తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, గుంటూరు రేంజి సిఐ కె శ్రీనివాసరావు, గుంటూరు రేంజి సిఐ ఎస్‌కె అబ్దుల్ కరీం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సిఐ వైవి నాయుడు, గుంటూరు అర్బన్ కొత్తపేట ఎస్సై సిహెచ్ రాంబాబు, గుంటూరు అర్బన్ లాలాపేట ఎస్సై మీరా సాహెబ్‌ను సిట్ సభ్యులుగా నియమించినట్లు డిజిపి జెవి రాముడు తెలిపారు.
విజయవాడ స్వర్ణబార్‌లో కల్తీమద్యం సరఫరా చేసినట్లు వచ్చిన అభియోగాలు, మరణాలపై కూలంకషంగా దర్యాప్తు చేస్తుంది. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలోనే సిట్ ఆఫీసును ఏర్పాటు చేస్తారు. ఈ కేసును విజయవాడ కృష్ణ లంక పోలీసు స్టేషన్‌లో నమోదు చేశారు. కల్తీమద్యం కేసులన్నింటిని సిట్ దర్యాప్తుచేసి బాధ్యులైన వారిని అరెస్టు చేస్తుందని డిజిపి జె.వి.రాముడు ప్రకటించారు.