రాష్ట్రీయం

పారదర్శకంగా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇంటి వద్దే ఇసుక లూఠీ చేశారని, మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని లాగిపడేశారని, గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ మన కళ్ల ఎదుటే జరిగిందని గుర్తు చేశారు. కాల్ మనీ పేరిట మహిళలకు వేధింపులు, థియేటర్ ఓనర్ల నుంచి ఎమ్మెల్యేలు డబ్బుల వసూలు వంటివి చేశారన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే మనం సరైన పాలన చేస్తున్నట్లేనా అని ప్రశ్నించారు. మనం నెంబర్ వన్ పోలీసింగ్ చేస్తున్నట్లేనా అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించాలని కంకణం కట్టుకున్నామన్నారు. మొత్తం వ్యవస్థల్లో పారదర్శకత తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మార్గంలో గత నెల రోజులుగా తమ ప్రభుత్వం అనేక అడుగులు వేసిందన్నారు. దీనికి కలెక్టర్లు, ఎస్పీలు, ఉద్యోగులు మనస్ఫూర్తిగా సహకరించాలని, లేకుంటే లక్ష్యాలను సాధించలేమన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు, ఐఏఎస్ అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. మనం నెంబర్ వన్‌గా ఉండాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష అన్నారు. పోలీస్ శాఖ కూడా దేశంలో నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటోందని తెలిపారు. మీరు, నేను కలసి పని చేస్తే ఇది సాధ్యమన్నారు. నెంబర్ వన్ పోలీసింగ్ అంటే ఏమిటని ప్రశ్నించారు. అమెరికాలో పోలీసులను ప్రజలే ఎన్నుకుంటారని, ఇతర అభివృద్ధి దేశాల్లో కూడా ఈ పద్ధతి ఉందన్నారు. ప్రజస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, లేకపోతే నిలబడదన్నారు. 2 లక్షల మంది ఎమ్మెల్యేను ఎన్నుకుంటారని, ఆ ఎమ్మెల్యే మీద విశ్వాసం ఉంచుతారన్నారు. ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని, కానీ అన్యాయాలకు, లూటీలకు, దోపీడీలకు ఓకే చెప్పమని కాదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చెడ్డపేరు తెచ్చుకోవాలని అనుకోరని, వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయండన్నారు. వారిని సాదరంగా చిరునవ్వుతో ఆహ్వానించి, మాట్లాడాలన్నారు. వివిధ కార్యక్రమాల పర్యవసానం ఎలా ఉంటాయో చర్చించాలని, ఇవి చేయకపోతే సమస్య మన నుంచే వస్తుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నివాసం వద్దే యథేచ్ఛగా ఇసుకను లూఠీ చేశారని, వందల లారీల ఇసుకను తరలించారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని లాగిపడేశారన్నారు. ఇసుక రవాణాను అడ్డుకుందని ఇలా చేయడం సరైన విధానమా అని ప్రశ్నించారు. ఇది నెంబర్ వన్ పోలీసింగా అని ప్రశ్నించారు. మన కళ్ల ఎదుటే జేసీబీ, పొక్లెయిన్లతో లూఠీ చేశారన్నారు. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందని, మనం మంచి విధానాలు అనుసరించినట్లా అని ప్రశ్నించారు. మన అంతరాత్మను పరిశీలించుకోవాలని హితవు పలికారు. భూ సమీకరణ పేరిట భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే, రైతులు ప్రతిఘటించారన్నారు. మానవత్వం చూపించాల్సింది పోయి ఆ రైతులను హింసించామన్నారు. తప్పుడు కేసులు పెట్టామన్నారు. 11 మంది రాజధాని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసిందని, ఆందులో 6 మంది దళిత రైతులన్నారు. మనం సరైన పాలన చేస్తున్నామా? ఇది సరైన పోలీసింగా అని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో మహిళలను కాల్‌మనీ పేరిట వేధించారని, తిరిగి కట్టనందుకు వారిని సెక్స్ రాకెట్‌లోకి దించారన్నారు. దీనిపై ఎన్ని కేసులు వచ్చాయి.. ఎంతమందిని అరెస్టు చేశారంటే సున్నా సమాధానం వస్తుందన్నారు. ఇది సరైన పాలనా అని మరోసారి ప్రశ్నించారు. సమావేశం నిర్వహిస్తున్న ప్రజావేదిక అక్రమ నిర్మాణమని అందరికీ తెలుసునని, అన్ని చట్టాలను ఉల్లంఘించి కట్టారన్నారు. మన కళ్ల ఎదుటే మాజీ సీఎం అక్రమ నిర్మాణంలో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్రమ నిర్మాణంలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. దాని పక్కనే ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేసిందన్నారు. కృష్ణా కరకట్టను ఆనుకుని జరిగిన అక్రమ నిర్మాణాలను చూడాలన్నారు. కళ్ల ముందు ఇలా జరుగుతుంటే ఎవరు పట్టించుకుంటారని తాను నేరుగా అధికారులను ప్రశ్నిస్తున్నానన్నారు. దీనిపై అంతా ఆలోచించాలన్నారు. అధికారంలో ఒకస్థాయిలో ఉన్నప్పుడు మనం ఇతరులకు నమూనాగా ఉండాలన్నారు. ప్రమాణాలు నెలకొల్పాలని, నైతికత లేకపోతే ఎవరినైనా ప్రశ్నించగలమా అని ప్రశ్నించారు. అవినీతికి, లూఠీకి, అక్రమాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలను శుద్ధి చేసి, ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలన్నారు. జరిగిందేదో జరిగిందని, అందరి కంటే మనం విభిన్నంగా చెప్పాలని, మనం మార్పుకు ప్రతీక అని చెప్పాలన్నారు. ఇసుకను లూటీ చేస్తున్నా, అక్రమ మైనింగ్ చేస్తున్నా చూస్తూ ఊరుకోమని చెప్పాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఊరుకోవద్దన్నారు. అవినీతి జరిగితే ఊరుకోవద్దని, అప్పుడే పాలనలో మంచి విధానాలను తీసుకురాగలమన్నారు. నేను మీతోనే ఉన్నానని, మీ పరిధిలో మీరు చేయండని సూచించారు. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వ్యవస్థలో మార్పు తీసుకురావాలని కోరారు.

చిత్రం... కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి