రాష్ట్రీయం

అడ్డంకులు ఆపలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 2: ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ప్రజల దీవెనలతో బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన సతీసమేతంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుని సుదర్శన యాగంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం ఆలయం కిందిభాగంలో ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ కాంగ్రెస్, తెదేపాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగు జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో పనిచేస్తుంటే, అసెంబ్లీ వేదికగా సాగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్, తెదేపా బహిష్కరించి ముఖం చాటేశాయన్నారు. ప్రాజెక్టులపై చర్చకు ఆహ్వానిస్తే పలాయనవాదం అవలంబించడానికి గల కారణాలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో, జిహెచ్‌ఎంసి ఎలక్షన్స్‌లో డిపాజిట్లు గల్లంతైనా ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనలో మార్పు రాలేకపోతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టిడిపి నేతలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజల దీవెనలతో తాము ఆకుపచ్చ తెలంగాణ సాధించి చూపుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 25వేల కోట్ల రూపాయలు కేటాయించామని, వచ్చే మూడేళ్లలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు నీటిని అందించి నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం చేకూర్చే బాధ్యత తనదేనన్నారు. కాంగ్రెస్, తెదేపా పాలనా వైఫల్యాల వల్లే తెలంగాణలో కరెంటు కోతలు ఏర్పడ్డాయని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. ఇందులో భాగంగానే సేద్యపు రంగానికి 9గంటల విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018నాటికి 24గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసి తీరుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల కోసం 12వేల కోట్ల రూపాయల నిధులు సమీకరిస్తున్నామన్నారు. అయితే ఈ విషయంలోనూ ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులు పేలుతున్నాయని, అప్పులు చేయకపోతే అభివృద్ధి పనులు ఎలా చేపడతారని కెసిఆర్ ప్రశ్నించారు. అనేక పోరాటాలు, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ గెలిచి నిలువాలన్నదే తమ అభిమతమన్నారు. ఇప్పటికే దేశంలోనే మరెక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్లు, కుటుంబంలోని సభ్యులందరికీ కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే వెంకన్న మొక్కు చెల్లించుకుంటా
కాగా, త్వరలోనే తిరుపతికి వెళ్లి వెంకన్న మొక్కు చెల్లించుకుంటానని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను తిరుమలేశుడిని దర్శించుకున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆభరణాలు సమర్పిస్తానని మొక్కుకున్నానని గుర్తు చేశారు. ఈ మేరకు ఐదు కోట్ల రూపాయలతో తయారు చేయించిన ఆభరణాలు సిద్ధమయ్యాయని, అతి త్వరలోనే తిరుపతిని దర్శించుకుని స్వామివారికి మొక్కు సమర్పిస్తానని తెలిపారు. కాగా, బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లోని 398 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ఆలయానికే కేటాయించి, కల్యాణ మండపం, కాటేజీలు వంటి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కల్యాణ మండపానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని, తన కుటుంబం పక్షాన పది లక్షల 116 రూపాయలను విరాళంగా అందిస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. ఆయనవెంట మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బిబి.పాటిల్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఐజి నవీన్‌చంద్, కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

చిత్రం బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న సిఎం కెసిఆర్