రాష్ట్రీయం

అటువైపే పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర సాధనలో టాగ్ లైన్‌గా ఉన్న నిధులు, నీళ్లు, నియామకాలలో
ఇప్పటికే నిధులు సాధించుకోగలిగాం. నియామకాల ప్రక్రియ
ప్రారంభమైంది. ఇక కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా
ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది
--
హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఆశయాలకు అనుగుణంగా, లక్ష్యాలకు చేరువగా ప్రభుత్వ పయనం సాగిపోతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘రాష్ట్ర సాధనలో టాగ్ లైన్‌గా ఉన్న నిధులు, నీళ్లు, నియామకాలలో ఇప్పటికే నిధులు సాధించుకోగలిగాం. నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది’ అని అన్నారు. శాసనసభలో 2016-17 వార్షిక బడ్జెట్ ఆమోదానికి ముందు విపక్షాలు వెల్లిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ, వారి విమర్శలకు సిఎం ధీటైన సమాధానం చెప్పిన అనంతరం మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటలకు ద్రవ్యవినిమయ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు.
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన జలాల వినియోగానికి తగినట్టుగా ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేశామని సిఎం ప్రకటించారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టుగానే వచ్చే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రాజెక్టుల పూర్తికి ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇదేమీ పెద్దగా తీర్చలేని అప్పేమి కాదని స్పష్టం చేశారు. భారీ ప్రాజెక్టులు పూర్తయతే రాష్ట్రం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పనులు ఏమి ఉండవని, దీంతో అప్పు తీర్చడం సమస్యే కాదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టుతున్నారని, రాష్ట్రం అప్పుల పాలు అయిందని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేయడం సహజమే అయినప్పటికీ, అంతగా భయపడాల్సిన విషయం ఏమి లేదన్నారు. ఆర్థిక వనరులు ఉండికూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబడిందని, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడంతో స్వయం సమృద్ధి సాధించే విధంగా రాష్ట్ర ఆదాయంలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుత ఆదాయ వృద్ధిని, సాధించే ఫలితాలను అంచన వేస్తే 2019 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రాలు ఇష్టానుసారంగా అప్పు చేస్తామంటే అందుకు ఆర్థిక యాజమాన్య నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బియం) అంగీకరించదని, అప్పు తీర్చగల స్థోమత కలిగి ఉన్నంత వరకే కేంద్రం అనుమతి ఇస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం చేసిన అప్పు వాటిన్నింటికంటే తక్కువే ఉందని ముఖ్యమంత్రి వివరించారు. అభివృద్ధి సాధించాలన్నా, లక్ష్యాలను చేరుకోవాలన్నా అప్పు చేయకతప్పదని ముఖ్యమంత్రి అన్నారు. ‘గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గుఠాల్లా పిల్లలు ఉండాలంటే ఎలా’ అది సాధ్యమేనా అని విపక్షాలకు ముఖ్యమంత్రి చురక అంటించారు. ఇక నియామకాల విషయానికి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని అన్నామని, తమ ఎన్నికల ప్రణాళికలో కూడా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో కోటి 3 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యనే 3 లక్షలు ఉంటే ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యం, ఈ పుకారును ఎవరు పుట్టించారో మహానుభావులని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇప్పటికే సింగరేణితో సహా 24,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని, రేపో,మాపో 10 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామని అన్నారు. గ్రూప్-2 పోస్టులకు ముందు జారీ చేసిన దాని కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నట్టు ఉద్యోగుల విభజన తర్వాత తేలడంతో వెయ్యి పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 50 ఏళ్ళలో జనాభా పెరుగుదలను అంచన వేసి ఇంటింటికి మంచినీటిని అందించేందుకు మిషన్ భగీరత పథకాన్ని రూపొందించామన్నారు. కుళాయి ఖర్చును కూడా ప్రభుత్వమే భరించి ఇంటింటిక త్వరలోనే పరిశుద్ధమైన మంచినీటిని అందించబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏప్రిల్ నెలాఖరుకు తొమ్మిది నియోజకవర్గాల్లోని 600 గ్రామాలకు ఈ పథకం ద్వారా మంచినీటిని అందించడంతో పాటు దీనిని వచ్చే ఏడాది చివరికి పూర్తి చేసే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, గత సంవత్సరం ప్రారంభించిన 60 వేల ఇళ్లను ఏడాదిలో కట్టించి తీరుతామన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో నియోజక వర్గాలు పెరుగబోతున్నాయని, ఏప్రిల్‌లోనే పార్లమెంట్‌లో బిల్లు పెడుతున్నట్టు హోంశాఖ మంత్రి నుంచి సమాచారం అందిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా కసరత్తు జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. చైనాలో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు తనకు ఆహ్వానం వస్తే, అధికారులు, మంత్రులతో కలిసి అక్కడికి వెళ్లివచినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆ పర్యటన సత్ఫలితాలను ఇచ్చిందని ఎన్నో పెట్టుబడులు వచ్చాయన్నారు. తమ పారిశ్రామిక విధానం బాగుందని ప్రధాన మంత్రి అభినందించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తన చైనా పర్యటనకు 10 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి ఖండించారు. అక్కడికి వెళ్లి రావడానికి అయిన ఖర్చు రూ. 2.75 కోట్లు మాత్రమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి పోరాటం చేసినట్టుగా సాధించుకున్న రాష్ట్రం ఆశించిన మేరకు అభివృద్ధి సాధించడానికి ప్రతిపక్షాలు తమకు సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.