రాష్ట్రీయం

సర్కారుకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రూఅప్ భారం ప్రభుత్వానిదే రూ.1372 కోట్లు భరించాల్సిందే
ప్రజలపై భారాన్ని తిరస్కరించిన ఏపిఇఆర్‌సి వినియోగదారులకు ఊరట

హైదరాబాద్, డిసెంబర్ 6: విద్యుత్ ట్రూప్ అప్ చార్జీల సంగతిని ఏపిఇఆర్‌సి తేల్చేసింది. దాదాపు రూ.7209 కోట్లను ప్రజల నడ్డివిరిచేలా చార్జీల రూపంలో వసూలు చేయాలన్న ప్రభుత్వ ఎత్తుగడ బెడిసికొట్టింది. ట్రూప్ అప్ పేరిట విద్యుత్ చార్జీలను వసూలు చేసేందుకు అంగీకరించే ప్రసక్తిలేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. పైగా రాష్ట్ర ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలోని రెండు డిస్కాంలకు కలిపి రూ.1372.81 కోట్లు చెల్లించాలని ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఆదేశించారు. ట్రూ అప్ చార్జీలపై ఏపిఇఆర్‌సి తీర్పు వెలువరించింది. ఏపిఇఆర్‌సి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి పిడుగుగా పరిణమిస్తే, వినియోగదారులు మాత్రం ఉపశమనం పొందారు. ఏపిఇఆర్‌సి విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సదరన్ పవర్ డిస్కాంకు రూ.1016.68 కోట్లు, ఈస్ట్రన్ పవర్ డిస్కాంకు రూ.356.13 కోట్లు చెల్లించాలి.
కాగా అంతకుముందు డిస్కాంలు 2009-10 నుంచి 2013-14 మధ్య అదనపు విద్యుత్ కొనుగోళ్లకు అయిన ఆర్ధిక భారాన్ని పూడ్చుకునేందుకు ట్రూ అప్ చార్జీల పేరిట వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలను ఏపిఇఆర్‌సి వద్ద దాఖలు చేశాయి. ఈ ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణ చేపట్టి విద్యుత్ నిపుణులు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. తమకు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కింద రూ.866 కోట్లు, రిటైల్ సప్లై కింద రూ.5184.93 కోట్లు ఖర్చయిందని సదరన్ పవర్ డిస్కాం, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కింద రూ. 477.67 కోట్లు, రిటైల్ సప్లై కింద రూ.1016.68 కోట్లు ఖర్చయిందని, చార్జీలు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈస్ట్రన్ డిస్కాం ప్రతిపాదనలు సమర్పించాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వమే అదనపు విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసినందున ఆ భారాన్ని భరించాల్సి ఉంటుందని ఏపిఇఆర్‌సి స్పష్టం చేసింది. కేంద్రం డిస్కాంలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కాం అష్యూరెన్స్ యోజన (ఉదయ్)లో భాగస్వామిగా చేరినందువల్ల ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని ఏపిఇఆర్‌సి పేర్కొంది. ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని ఏపిఇఆర్‌సి స్పష్టం చేసింది.
ఆంధ్ర ఖజనాపై మరింత భారం
ఇప్పటికే రాష్ట్ర విభజనతో 14వేల కోట్ల రూపాయల లోటు ఎదుర్కొంటూ సంక్షోభంలో ఉన్న ఆంధ్రకు ఏపిఇఆర్‌సి తీర్పు శరాఘాతంలా పరిణమించింది. ప్రతి ఏడాది నవంబర్- డిసెంబర్ నెలల్లో డిస్కాంలు వార్షిక రెవెన్యూ నివేదికలను ఏపిఇఆర్‌సికి సమర్పిస్తాయి. కాగా డిసెంబర్ నుంచి మార్చి వరకు విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ వ్యయం ఏఆర్‌ఆర్‌లో చేర్చరు. దీంతో గత ఐదేళ్లుగా రూ.7209 కోట్ల భారం డిస్కాంలపై పడింది. విద్యుత్ చార్జీలను రూ.1277 కోట్ల మేర ఈ ఏడాది వినియోగదారులపై వడ్డించారు. ఇటీవల ఆర్టీసి చార్జీలను కూడా పెంచారు. మళ్లీ ట్రూ అప్ చార్జీలను ప్రజల నెత్తిన రుద్దితే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.1300 కోట్లను డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించే సీను లేదు. దీంతో ఈ నిధుల సేకరణ, కేటాయింపు ఆసక్తిగా మారింది. కాగా ఏపిఇఆర్‌సి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.