సెంటర్ స్పెషల్

రణక్షేత్రం -15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-పుట్టగంటి గోపీకృష్ణ (94901 58002)
-----------------------------
నిట్టూర్చాడు వసంతరావ్. ‘సరే!... నువు అంత పట్టుబడితే, ఏదో ఒక ఏర్పాటు నేను చేస్తాలే! ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో. నేను మాత్రం నీ సినిమాలో అఫీషియల్‌గా ఇన్‌వాల్వ్ కాలేను. ఇంత చిన్న సినిమా నేను చేస్తున్నానని తెలిస్తే.. ఇండస్ట్రీలో నా ఇమేజ్ దెబ్బతింటుంది’
‘నువు కాకపోతే నీ మనుషులు ఎవరో ఒకరు ఉంటారుగా, వాళ్లలో ఒకరిని ఈ పనికి కుదిర్చిపెట్టు...’ పట్టు విడవకుండా అన్నాడు సుబ్బరాజు.
‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు ప్రఖ్యాతులు రాక ముందు రాసుకున్న ఒక కథ ఉంది. ఆ కథతో సినిమా తీస్తే నీకు డబ్బులు వెనక్కి వస్తాయో, లేదో చెప్పలేను. కానీ, పేరు మాత్రం వస్తుంది. గొప్ప సినిమా అని పొగడ్తలు మిగులుతాయి. అవార్డులయితే లెక్కలేనన్ని వస్తాయి. నీకు ఇష్టమేనా?..’
‘డబ్బులెవడికి కావాలయ్యా? పోయినా ఫరవాలేదని ముందే చెప్పాగా? నాకు కావలసింది నువ్వు చెప్పినటువంటి సినిమానే. అదే తీయించి పెట్టు’ ఆత్రుతగా అన్నాడు సుబ్బరాజు.
వసంతరావ్ దగ్గర ఎప్పటి నుండో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు సంతోష్. అతని సామర్థ్యం మీద వసంతరావ్‌కి పూర్తి నమ్మకం ఉంది. అతనికి ఇండివిడ్యుల్‌గా ఒక సినిమా ఇప్పించే బాధ్యత కూడా వసంతరావ్ తన భుజస్కంధాల మీద వేసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ సంతోష్‌కి ఈ సుబ్బరాజు సినిమా తీసే బాధ్యత అప్పజెప్పి తను తన బాధ్యత నుండి బయటపడ్డాడు వసంతరావ్.
సంతోష్ ఇలాంటి అవకాశం కోసం దాదాపు పదేళ్ల నుండి ఎదురుచూస్తున్నాడు. తనకు ఛాన్సు వస్తే తీయటానికి నాలుగయిదు సబ్జెక్టులు రెడీ చేసి పెట్టుకున్నాడు. అవన్నీ కమర్షియల్ సబ్జెక్టులు. ఇప్పుడు వసంతరావ్ చెప్పిన సబ్జెక్ట్ పూర్తి క్లాసిక్. ఇంత గొప్ప కథని డీల్ చేసే సామర్థ్యం తనకు ఉందా.. అని కాస్త అనుమానపడ్డాడు సంతోష్. ఆలోచించిన మీదట, గురువుగారు పిలిచి అవకాశం ఇస్తుంటే, కాదనటం అవివేకం అని తీర్మానించుకుని తన సమ్మతి తెలియజేశాడు.
అయితే సంతోష్‌కి తన కెపాసిటీ మీద కంటే, సుబ్బరాజు ఫైనాన్షియల్ కేపబిలిటీ మీదే ఎక్కువ అపనమ్మకం. ఇలా కొత్తగా వచ్చే నిర్మాతలు ఏదో కొంత డబ్బు జేబులో వేసుకు వచ్చి అట్టహాసంగా సినిమా మొదలుపెట్టి, తరువాత దాన్ని పూర్తి చేయలేక పోవటమన్నది ఇండస్ట్రీలో సాధారణం. అఫ్‌కోర్స్ అందులో ఎక్కువ భాగం బాధ్యత ఆ నిర్మాతని మిస్‌లీడ్ చేసే డైరెక్టర్‌దే ఉంటుంది. కానీ.. ఇపుడు సినిమా సగంలో ఆగిపోతే నిర్మాత కంటే మొదటి సినిమా డైరెక్టర్‌గా తన కెరీర్‌కు నష్టం ఎక్కువ.
అందుకే సంతోష్ తన అనుమానాలను సుబ్బరాజు ముందు ఉంచాడు.
తన సినిమా బడ్జెట్‌కి సరిపడా డబ్బు ఆయన దగ్గర ఉందని తనకు రుజువు చూపిస్తేనే సినిమా మొదలు పెడతానన్నాడు.
ఆ డబ్బు ఏర్పాట్లు చూడటానికి సుబ్బరాజు ఊరు వెళ్ళాడు. ‘మీరు మాత్రం ఇదే పని మీద ఉండండబ్బాయా! డబ్బుతో ఎంటనే వస్తా!...’ అని చెప్పి వెళ్లిన సుబ్బరాజు రావటానికి ఎలా అయినా ఒక వారం పడుతుంది. ఈలోపు ఏం చేయాలో సంతోష్‌కి అర్థం కాలేదు.
సంతోష్ పని చేతులు కట్టేసి యుద్ధం చేయమన్నట్లయింది. అయినా వచ్చిన అవకాశం వదులుకోలేడు కాబట్టి, తన పని మొదలు పెట్టాడు. వీలయినంత తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేయటానికి ప్లాన్ వేశాడు.
సంతోష్ వసంతరావ్ సార్‌ని అడిగిన సాయం ఒకటే! - నన్ను ఇవ్వమని అడిగాడు.
వసంతరావ్ మరో మాట మాట్లాడకుండా నన్ను సంతోష్ టీమ్‌లోకి పంపాడు.
వారం గడిచిపోయింది. సుబ్బరాజు జాడ లేదు. ఫోన్ చేస్తే దొరకటం లేదు. అసలు ప్రాజెక్ట్ ఉన్నట్లా, లేనట్లా అని అందరి మనసుల్లో టెన్షన్‌గా ఉంది.
కథని డెవలప్ చేయటానికి కూర్చున్న అందరం మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అవుదామని బయటకు వచ్చాం. ఇంతలో నాకు కళ్లల్లో నీళ్లతో, చేతిలో ఫొటో ఆల్బమ్‌తో విసవిసా నడుచుకుంటూ వెళ్తున్న ఒకామె కనిపించింది. ఆమెని చూస్తేనే సినిమా ఛాన్స్ కోసం తిరిగే అమ్మాయని అర్థమై పోతోంది.
ఎందుకో అలా వెళ్తున్న అమ్మాయిని చూస్తే జాలి వేసింది నాకు. ఒకసారి పలుకరించాలని అనిపించింది.
‘హలో!.. ఏమండీ!.. మిమ్మల్నే!’ అంటూ గట్టిగా పిలిచిన నా పిలుపునకు ఆగి వెనుతిరిగి చూసింది.
‘రెండు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా?’
సహజంగా ఆ మాట అడిగిన వ్యక్తిని మీరెవరని ఎదురు అడగడం సహజం. ఆ అమ్మాయి మాత్రం నేనెవరో తెలిసినట్లు వౌనంగా నిలబడి, ‘ఏమిటో చెప్పండి...’ అన్నట్లు చూసింది.
‘నా పేరు చంద్రం. వసంతరావ్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను...’ చెప్పాను.
ఏదో మాట్లాడబోయి ఆగిపోయింది ఆమె.
ఎండగా ఉండటంతో ఇద్దరం నడుచుకుంటూ చెట్ల నీడలోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నాం.
‘మీ చేతిలోవి ఏమిటి? ఫొటోలా?’ ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లు అన్నాను.
‘అవును’ ఆల్బమ్ నాకు అందిస్తూ అంది ఆ అమ్మాయి.
ఓపెన్ చేసి చూశాను. అందులోని ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి. అదే చెప్పాను ఆమెతో...
‘బయట కనిపించే మీకూ, ఫొటోలోని మీ బొమ్మకీ ఏ మాత్రం పోలిక లేదు. మీది మంచి ఫొటోజెనిక్ ఫేస్...’
‘నా చిన్నపుడు స్కూల్లో మేకప్ వేసిన వ్యక్తి దగ్గర నుండి అదే చెప్తారు. వేషం మాత్రం ఎవరూ ఇవ్వరు’
‘టాలెంట్ ఉండటానికీ, సక్సెస్ కావటానికీ సంబంధం ఉండదు. మంచి కాలం వస్తుందని ఎదురుచూస్తూ, మన ప్రయత్నాలు మనం చెయ్యటమే మనం చెయ్యగలిగింది..’ చెప్పాను నేను.
నవ్వింది ఆమె. ఆ నవ్వులో విరక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఇప్పుడే ఒక డైరెక్టర్ ఆ ఫొటోలు చూశాడు’ అంది.
‘మరి ఏమన్నారు? వేషం ఇస్తానన్నారా?’ అడిగాను. వేషం ఇస్తే ఏడుస్తూ ఎందుకు వెళ్తుందని తెలిసినా అలా కాక ఎలా అడగాలో తెలియక అలా అడిగాను.
‘అవన్నీ ఎందుకులెండి. వేషం మాత్రం దొరకలేదు...’
‘మాకు మా గురువుగారు ఒక ప్రాజెక్ట్ అప్పజెప్పవచ్చు. అది కనుక పట్టాలకెక్కితే మీ గురించి నేను చెప్తాను..’ అన్నాను.
‘్థంక్స్...’ అంది ముక్తసరిగా.
‘మీ ఫొటో, ఫోన్ నెంబర్ ఇవ్వండి. మా ప్రొడ్యూసర్ ప్రస్తుతం ఊళ్లో లేరు. ఆయన వచ్చాక మిమ్మల్ని కలిపే ఏర్పాటు చేస్తాను...’ అన్నాను నేను.
ఆమె తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆల్బమ్ నుండి ఒక మంచి ఫొటో తీసుకున్నాను. తరువాత వౌనంగా లేచి వెళ్లిపోబోయింది.
మరో మాటకి ఆస్కారం లేకుండా వెళ్లిపోతున్న ఆమెను చూసి, ‘మీకు మనుషుల మీద నమ్మకం పోయినట్లుందే!’ అన్నాను.
‘మనుషుల మీద పోలేదు. సినిమా మనుషుల మీద పోయింది...’ అంది.
‘మీ పేరన్నా చెప్పలేదు?’ అన్నాను.
‘మీరు సినిమా అవకాశం ఇప్పిచ్చిన రోజు చెప్తాను’ అని వెళ్లిపోయింది.
నిట్టూర్చి ఆ ఫొటో జాగ్రత్తగా దాచుకున్నాను.
ఎట్టకేలకు మరో వారం తరువాత దిగాడు సుబ్బరాజు.
‘ఏంటండీ! ఇంత లేటు.. ఒక కబురు లేదు. ఫోన్ లేదు..’ విసుక్కోబోయాడు సతీష్.
‘నా బాధ ఏం చెప్పమంటావ్ అబ్బాయి... డబ్బులు తీసుకురాబోయేటప్పటికి మా ఆడది పంచాయతీ పెట్టిందయ్యా! డబ్బులు తీసుకుపోయి సినిమాల్లో తగలేస్తన్నానని అందరికీ చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి యవ్వారం తీసుకుపోయింది’
‘అయితే ఇప్పుడు డబ్బులు తేలేదా?’ గాభరాగా అడిగాడు సంతోష్.
‘మీ కోసం పెళ్లానే్న వదులుకున్నానయ్యా! దాంతో తెగతెంపులు చేసుకుని ఇదిగో ఈ డబ్బులు పట్టుకొచ్చా!...’ బ్యాంక్ పాస్‌బుక్ స్టైల్‌గా విసిరేస్తూ అన్నాడు.
దాంట్లో ఉన్న మొత్తం చూసిన సంతోష్ మూర్ఛ వచ్చి పడిపోబోయాడు. ఆ మొత్తం సుబ్బరాజు ముందు చెప్పిన దానికంటే చాలా తక్కువ. దానితో సినిమా తియ్యటం కుదరదు.
‘ఈ డబ్బుతో సినిమా తియ్యటం కుదరదండీ!’ విసుగ్గా చెప్పాడు సంతోష్.
‘కాస్త ఖర్చు తగ్గించండయ్యా...’ అన్నాడు సుబ్బరాజు.
‘ఆఖరికి మీరు కూడా బడ్జెట్ గురించి మాట్లాడి మా పరువు తియ్యకండి..’ ధాటిగా అన్నాడు సంతోష్. ‘మీకు చేతనయితే చెప్పండి ఎక్కడ ఖర్చు తగ్గించమంటారో...’ అని కూడా అన్నాడు.
అప్పటికే సంతోష్ యువ హీరో అభిమన్యుని లీడ్ రోల్ చేయమని అడిగాడు. అతను ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. అభిమన్యు చాలా డబ్బుగల కుటుంబం నుండి వచ్చాడు. అతను నటించి డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు. అందుకే ఛాన్స్ ఇస్తే చాలు ఫ్రీగా నటించటానికి కూడా రెడీ అవుతాడు. మనిషి బాగుంటాడు. నటన కూడా ఓకే. అందుకే అతను అనతికాలంలోనే పది సినిమాలు చూశాడు. వాటిలో ఎక్కువ భాగం ఫ్లాపులే! వసంతరావ్ యూనిట్ నుండి అవకాశం అంటే అతను మారు మాట్లాడలేదు. కథలో హీరో తరువాత మరో పాత్ర ఉంది. మరీ పెద్దది కాకపోయినా ముఖ్యమైన పాత్రే! దాని కోసం ఏ హీరోని సెలెక్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ పిడుగు నెత్తిన వేశాడు సుబ్బరాజు.
‘ఎవడికో డబ్బులు ఇచ్చేదేందయ్యా! ఈ బుడ్డోడికి ఆ ఏసం ఇస్తే చెయ్యడూ...’ అన్నాడు నా వైపు చూపిస్తూ.
కాసేపు ఎవరికీ ఆయన ఏమి చెప్పాడో అర్థం కాలేదు.
అర్థమయిన తరువాత కూడా ఎవరూ కాసేపు మాట్లాడలేదు.
‘ఏందయ్యా! ఏదో కూనీ చెయ్యమన్నట్టు ఏందట్టా చూస్తన్నారు?’ అని సుబ్బరాజు మళ్లీ అడిగే వరకు ఎవరూ మాట్లాడలేదు.
‘అదేం కాదు సార్! మాకెవరికీ ఈ ఆలోచన ఎందుకు రాలేదా? అని..’ అన్నాడు సంతోష్. తరువాత నా వైపు తిరిగి, ‘నిజమే కదా! మనకెందుకు రాలేదు ఈ ఊహ?’ అన్నాడు.
నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
‘మరింకేం లేదు. నీ మీద నమ్మకంతో కాదు, కనీసం ఒక నటుడి పారితోషికం మిగుల్చుకోవచ్చు కదా అని...’ నిర్మొహమాటంగా చెప్పాడు సంతోష్.
‘ఆ కాస్త డబ్బు మిగుల్చుకున్నంత మాత్రాన మన బడ్జెట్ కష్టాలు తీరవు..’ అన్నాను నేను.
తిరిగి అందరూ ఆలోచనలో పడ్డారు.
ఎవరి ఆలోచనలో వారు ఉండగా మా ఆఫీసులోకి వచ్చాడు కే.కే. ద గ్రేట్ డైరెక్టర్.
ఆయన మీద గౌరవంతో అందరం లేచి నిలబడ్డాం.
‘ఏంటయ్యా? అం దరూ సీరియస్‌గా డిస్కషన్ చేస్తున్నారు?’ అంటూ వచ్చాడాయన.
సుబ్బరాజుగారి డబ్బు కష్టాలు అందరం కలిసి చెప్పాం.
‘నాకు తెలిసిన ఒక నిర్మాత ఉన్నాడు. కావాలంటే మీ డెఫిషిట్ డబ్బు సర్దుతాడు..’ అన్నాడాయన.
‘ఎవరు సార్?’ ఆత్రుతగా అడిగాను.
‘పేరు చెప్పటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన తరఫున నేను ఉన్నాను కదా..!’ అన్నాడు కే.కే. ఒకనాటి మహా దర్శకుడు ఇప్పుడు ఎవరో పేరు చెప్పుకోవటం ఇష్టంలేని నిర్మాతకి ఏజెంటుగా వ్యవహరించబోవటం చూస్తే కడుపు తరుక్కుపోయింది. కానీ, అదే కాల మహిమ.
‘ఆయన ఊరికినే మాకు ఎందుకు సహాయం చేస్తాడు?’ అనుమానంగా అడిగాను.
మిగిలిన వాళ్లు కూడా అదే భావం మొహంలో పలికిస్తూ కే.కే. జవాబు కోసం ఎదురుచూస్తున్నారు.
కే.కే. నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ‘హీరోయిన్ ఎవర్నని అనుకుంటున్నారు?’ అన్నాడు.
‘ఇంకా ఫైనాన్స్ వ్యవహారాలు తేలలేదు. అప్పుడే మీరు హీరోయిన్ వరకూ వెళ్లిపోయారు..’ విసుగ్గా అన్నాడు సంతోష్.
‘అన్నట్టు హీరోయిన్ అంటే గుర్తు వచ్చింది. మొన్న ఒకరోజు ఈ అమ్మాయి స్టూడియోలో కనిపించింది. భలే ఫొటోజెనిక్ ఫేసు. ఈ ఫొటో చూడండి...’ అంటూ వారం క్రితం వసుంధర దగ్గర తీసుకున్న ఫొటో చూపించాను.

‘దానికి తొందరేముందిలే..’ కనీసం ఫొటో వైపు చూడకుండా అన్నాడు సంతోష్.
‘ఆ ఫొటో ఏది?’ అన్నాడు కేకే. నా చేతిలోని ఫొటోని పరీక్షగా చూసి, ‘అనుభవం మీద చెప్తున్నాను. ఈ అమ్మాయిని తీసుకోండి. మీ సినిమాకి ప్లస్సవుతుంది’ అన్నాడాయన.
‘ఇంతకీ మీరు మా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీ పేరు చెప్పని నిర్మాత మాకు ఎందుకు సహాయం చేస్తున్నాడు?’ అడిగాను నేను.
‘అవన్నీ మీకనవసరం. ఆ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోండి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి...’ చెప్పాడు కే.కే.
ఇంకా ఏదో వాదించబోతున్న మమ్మల్ని పక్కకి జరిపి, కే.కే. చేతిలోని ఫొటో చూసి, ‘లక్ష్మీకళ ఉట్టి పడతంది గదయ్యా ఈ అమ్మాయిలో... ఈ అమ్మాయే నా సినిమాలో ఈరోయిన్. మీరు డబ్బు ఏర్పాటు చెయ్యండి కే.కే.గారూ...’ అన్నాడు సుబ్బరాజు.
‘మీరు మీ మాట మీదుండండి. నేను నా మాట మీద నిలబడతాను..’ అని కే.కే. వెళ్లిపోయాడు.
ఆ విధంగా నా ప్రమేయం లేకుండానే నేను యాక్టర్‌నయ్యాను. నాతోపాటు వసుంధరకి కూడా ఛాన్స్ వచ్చింది.

ప్రస్తుతం
‘మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఓబులేశూ?’ అడిగాడు అశోక్.
‘దాదాపు పదివేలు...’
‘మనకి మెజారిటీ వచ్చినపుడు రౌండ్‌కి రెండు వేలు మెజారిటీ కూడా రాలేదు. ఇప్పుడు రెండు రౌండ్లలో ఒక్కసారిగా ఇంత ఎలా వెనుకబడిపోయాం?’
‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరయ్యా...’
నవ్వాడు అశోక్. ‘ఎవరు ఎంత ప్రయత్నించినా నా విజయాన్ని ఆపలేరు’ అన్నాడు.
‘ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే! కానీ పరిస్థితులు ఎదురు తిరుగుతున్నపుడు మన పొజిషన్ బేరీజు వేసుకోగలిగితే శక్తి కూడా ఉండాలి’ చెప్పాడు ఓబులేశు.
‘ఇప్పుడేమయిందని అంత నిరుత్సాహ పడుతున్నావ్!’
‘ఇప్పటికే మన మీద ఎదుటి పక్షం మెజారిటీ పది వేలకి పెరిగిందయ్యా! నిరుత్సాహం కాక ఇంకేం మిగిలి ఉంది?’
‘వద్దు! అంత నిరుత్సాహం వద్దు. నిజమే! ఎదుటి పక్షం ప్రస్తుతం ఆధిక్యంలో ఉండవచ్చు. కానీ విజయం మనదే! నయానో, భయానో విజయం సాధించనిదే నేను ఊరుకోను. అందుకే ప్లాన్ బి కూడా అమలు చేసి ఉంచాను. దాని రిజల్ట్ నీకు ఇక ముందు కనిపిస్తుంది’
‘ప్లాన్ బి.. అంటే?’
‘మన బలం మీద మనం గెలవగలగటం ఎప్పుడూ మంచిదే! ఒకవేళ గెలుపు అనుమానాస్పదం అయితే చూస్తూ కూర్చోవటానికి నేను చేతకాని వాడిని కాదు’
‘ఒకప్పుడయితే నువు చెప్పింది నిజమే కావచ్చయ్యా!...’ ఓబులేశు ఒకసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చెప్పాడు. ‘అప్పట్లో ఎవరికి బలం ఉన్నచోట్ల వాళ్లు రిగ్గింగ్ చేసుకోవటం అన్నది చాలా మామూలు. బలం ఉన్న వ్యక్తి ఊర్లో ఉన్న మొత్తం ఓట్లు తన మనుషుల చేత గుంప గుత్తంగా వేయించుకునేవాడు. ప్రాణాల మీద ఆశ ఉన్న పోలింగ్ ఆఫీసర్లు ఎదురుతిరిగేవారు కాదు. ఎదురు తిరిగిన వారిని ఏ రకంగా వంచాలో మాలాంటి వారికి బాగా తెలిసి ఉండేది. ఒకళ్లో, ఇద్దరో కానిస్టేబుళ్లు ఉండేవారు. వారు జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండటం తప్ప ఏం చేయగలరు? అయితే ఎదుటి పక్షం వాళ్లు అంత తేలిగ్గా వదలరుగా! మమ్మల్ని ఆపే బలం లేకపోతే, ఎలాగోలా ఎన్నికలు వాయిదా వేయించటానికి ప్రయత్నించేవారు. దానికిగానూ బాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లటం, బాలెట్ బాక్సుల్లో సిరా పొయ్యటం, నీళ్లు పొయ్యటం లాంటివి చేసేవాళ్లు. ఒకసారి రీ కౌంటింగ్ వరకూ వస్తే అప్పుడు అక్రమాలు చెయ్యటం అంత తేలిక కాదు. రీ పోలింగ్ రోజు విపరీతమైన పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి అక్రమ చర్యలూ సాగేవి కాదు. అందుకే బలం ఉన్న వాళ్లు తమ రిగ్గింగ్ కొనసాగించటం కోసం, బలం లేని వాళ్లు రీ పోలింగ్ తెప్పించటం కోసం చేసే ప్రయత్నాల్లో హింస విపరీతంగా జరిగేది. కాలం అనేక మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వచ్చాక రిగ్గింగ్ చెయ్యటం కష్టంగా మారింది. ఏ ఓటు ఎప్పుడు పడిందో సమయం నమోదు అవుతుంది. ఒక ఓటు నమోదుకీ మరొక ఓటు నమోదుకీ మధ్య నిర్దిష్ట సమయం లేకపోతే ఓటు రిజిస్టర్ కాదు. కాబట్టే, అక్రమాలు తగ్గిపోయాయి. ఇంకో రకంగా ఓటర్లను ప్రభావితం చేయటం మొదలయింది. డబ్బులిచ్చో, ఇంకో విధంగా ప్రలోభపెట్టో వాళ్ల చేతే ఓటు వేయించుకోవాలి తప్ప రిగ్గింగ్ చేయటం కుదరటం లేదు. అలాంటిది నువ్వెంత తెలివిగలవాడివయినా ఈ రోజుల్లో ఓట్ల లెక్క ఎట్లా తారుమారు చేస్తావయ్యా?’
‘ఆ ఏర్పాట్లు ఇప్పుడు చెయ్యటం కాదు. ఎప్పుడో చేశాను. చూడు ముందు ముందు ఏమి జరుగుతుందో...’
‘నీ సంగతి నాకు బాగా తెలుసయ్యా! అయినా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నీ నమ్మకం సడలలేదంటే ఏదో చేసే ఉంటావని నమ్మక తప్పటంలేదు. ఏం చేశావో చెప్పు’
‘సమయం వచ్చినపుడు చెప్తాను. ఇప్పుడు కాదు...’ ఆలోచనల్లో కూరుకుపోతూ అన్నాడు అశోక్.
(మిగతా వచ్చేవారం)