సెంటర్ స్పెషల్

అడవే.. వారి ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మార్పులూ చేర్పులూ జరుగుతూ ఆధునీకరణ దిశగా అందరూ అడుగేస్తున్నారు. ఇందులో భాగంగానే పాత పద్దతులు, పూర్వపు అలవాట్లు, సాంప్రదాయాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎవరికిష్టమైన రీతిలో వారికి అనుకూలంగా జీవన విధానాన్ని మలుచుకుంటున్న రోజులివి. అయితే అడవే వారికి ప్రపంచం, అడవే వారికి స్వర్గంగా మన రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న చెంచుల జీవన విధానాన్ని పరిశీలిస్తే కేవలం కట్టూ బొట్టులో మార్పులు చోటు చేసుకున్నా మిగిలినవన్నీ వారి పూర్వీకుల విధానాలనే అనుసరిస్తూ జీవనం కొనసాగిస్తూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారనే చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు,ప్రకాశం జిల్లాల పరిధిలో వున్న నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు అత్యధికంగా వున్నారు. నల్లమల అడవుల్లో పెచ్చెరువు, చెరువుగూడెం, మర్రిపాళెం, తుమ్మలబైలు, చిన్నపాలెం, పాలుట్ల, గారపెంట, దద్దనాల, పొన్నల బైలు పేర్లతో నల్లమల అడవిలో సుమారు 60 చెంచుల గ్రామాలున్నాయి. ఇంకా 80 చెంచులుండే గ్రామాలు కర్నూలు నుంచి విజయవాడ, శ్రీశైలం లకు వెళ్ళే ప్రధాన దారికి దగ్గరలో వున్నాయి. అను నిత్యం క్రూర మృగాలు సంచరించే దట్టమైన నల్లమల అడవిలోని 60 చెంచు గూడేలను పరిశీలిస్తే ఈ చెంచుల గూడేలకు చేరుకోనే సమయంలో అడవిలో పులులు, జింకలు లాంటి ఇతర అడవి జంతువులు దారికి అడ్డంగా సంచరిస్తూ వుంటాయి. అనునిత్యం కౄర మృగాలు సంచరించే దట్టమైన అడవుల్లో చెంచుల జీవనం మనకు కొత్తగా, వింతగా, ఆశ్చర్యంగా కనిపించినా వారికి మాత్రం ఆ అడవే అన్నీ... ఆ అడవుల్లోనే తమ పుట్టుక, చావు అని అంటారు చెంచులు..
అడవుల్లో జంతువులను చంపడం, ఇతర వస్తువులను సేకరించి అమ్మడం లాంటివి చేస్తే అటవీ చట్టప్రకారం కఠినమైన చర్యలు అమలులో వుండటంతో నల్లమల అడవిలో నివసిస్తున్న చెంచుల బ్రతుకు భారంగా మారుతోంది. వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం చెంచులతో కూడా ఉపాధి హామీ పనులు చేబడుతున్నారు. ఆ ఉపాధి పనులు చేశాక వచ్చే డబ్బుతో ఆ అడవినుండి బైటి ప్రాంతాలకొచ్చి బియ్యంతో పాటు కాసిన్ని నిత్యావసర సరుకులు తీసుకెళ్ళి బతుకునీడ్చుతున్న దుర్భర పరిస్థితి. వారు తీసుకునే నిత్యావసరాల్లో కేవలం ఉప్పు, మిరపకాయలు మాత్రమే వుంటాయి. పండుమిర్చి, ఉప్పుని బాగా నూరుకుని తినడం వారి సహజ భోజనంగా చెప్పుకోవచ్చు. ఉపాధి పనులు లేనప్పుడు అడవిలోని నన్నారి వేర్లు, బంక, తేనె, ముస్టంగిలు, కానుగవిత్తనాలు, చింతకాయలు సేకరించి అటవీ శాఖ అధికారులకు తెలియకుండా వాటిని బైటి ప్రాంతాల్లో అమ్ముకుని కొంతమంది జీవిస్తున్నారు. అయితే అది నిరంతరంగా కొనసాగని పరిస్థితి. తినడానికి ఏమీ లేని సమయాల్లో ఆకలిని భరించలేక చింతపండుని బూడిదలో దంచుకుని తింటూ ఆకలిని చంపుకుంటుంటారు. నల్లమల అడవిలోని గూడేలలో జీవించే వారిలో 80శాతం మంది రక్తహీనతతో కనిపించడం గమనార్హం. మగవాళ్ళలో క్షయవ్యాధితో బాధపడుతున్న వారు అధికంగా కనిపిస్తారు. వీరికి మానవ జీవితం ఎలా వుంటుంది, మనిషై పుట్టాక ఎలా జీవించాలనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదనే చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా అధిక సంఖ్యలో కనీసం 6నుంచి 10మందికి పైగానే కుటుంబ సభ్యులు కనిపిస్తారు. ఈ చెంచు గూడేల్లలో ఎవరిని గమనించినా అధికంగా లింగన్న, నాగన్న, నాగమ్మ, గుర్రమ్మ, గురవయ్య, వెంకటమ్మ, వెంకటేశు, లింగస్వామి, గజ్జెలు, చిన్నగజ్జెలు, పెద్దగజ్జెలు లాంటి పేర్లున్న వారే వుంటారు. ఒకే కుటుంబంలోని వారు తప్పా ఇతరుల మధ్య సరైన సఖ్యత వుండదనే చెప్పుకోవచ్చు. ఒకరి మధ్య ఒకరికి గొడవలొస్తే బాణాలతో దాడులు చేసుకోవడం, మృగాల్లా చంపుకోవడానికి కూడా వెనకాడని వైనం కనిపిస్తుంది.
చెంచులు - వారి వివాహ వ్యవస్థ...కుటుంబం..
నల్లమల అటవీప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న చెంచుల వివాహ వ్యవస్థను గమనిస్తే చాలా విచిత్రంగా, అనాగరికంగా వుంటుంది. అమ్మాయిలు పుష్పవతి అయిన కేవలం 2నుంచి 4మాసాలలోపే వివాహాలు జరిపేస్తుంటారు. ఎవరైనా యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడి పెద్దలు ఒప్పుకోకపోతే ఒ రెండురోజుల పాటు ఆ జంట అడవిలోకి వెళ్ళిపోయి తిరిగి ఇంటికి చేరుకోగానే వారికి వివాహం జరిపేయడం జరుగుతుంది. వివాహ సమయంలో ఎటువంటి కట్నకానుకలూ వుండవు గానీ పెళ్ళి కూతురి వారి వైపునుంచి కొన్ని బాటిళ్ళ సారా, పెళ్ళి కుమారుడి వైపునుంచి కొన్ని బాటిళ్ళ సారాను పంచుకుని తాగేసి అడవిలోనే ఏదో ఓ చోట ఏర్పాటు చేసుకున్న చెంచుల దేవత అంకాలమ్మ గుడి వద్ద వివాహం జరిపేయడం వారి సాంప్రదాయంగా కొనసాగుతోంది. వాటితో పాటు ఈ గూడేలలో వివాహాలు చేసుకోకుండా సహజీవనం కొనసాగించే జంటలు కూడా వున్నారు. ఇవి పూర్తీగా బాల్య వివాహాలుగానే చెప్పుకోవచ్చు. కేవలం 14, 15 సంవత్సరాల వయసున్న యువతులే గర్భం దాల్చడం, శరీర సౌష్టవానికి అవసరమున్నంత ఆహారం లేకపోవడంతో రక్తహీనతకు గురై చాలా క్లిష్ట పరిస్థితుల నడుమ బిడ్డలకు జన్మనివ్వడం జరుగుతుంది. గర్భం దాల్చిన సమయంలో ఆ గూడేలలో వుండే పూర్వపు మహిళలే ప్రసవం చేసేస్తారు. సహజ ప్రసవం జరగని సమయంలో గూడెం నుండి అసుపత్రులున్న పట్టణాలకు వెళ్ళడానికి దారిలోకి రావడానికి మంచాలపైన, సంచిపట్టలతో తయారు చేసుకున్న జోళి పైన ఆ గర్భవతిని నలుగురు మోసుకెళ్ళడం జరుగుతుంది. ఆసమయంలో ప్రాణాపాయం జరిగినా జరగొచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత వారికి కేవలం తల్లిపాలు మాత్రమే పౌస్టికాహారం. బిడ్డకు జన్మనిచ్చిన బాలింతల పరిస్థితి మరీ దయనీయం. కొన్ని వారాలపాటు కేవలం వెల్లుల్లిపాయల కారం తిని బిడ్డకు పాలివ్వాల్సిందేతప్పా బాలింతలకు ఎటువంటి పౌస్టికారం ఇవ్వకుండా పస్తులు పెడుతుంటారు. కొన్ని నెలల పాటు పాలు తాపాక పెద్దలు తినే గొడ్డు కారంతో ఆహారం తీసుకోవడమే ఆ పిల్లలకూ అలవాటు చేసేస్తారు. ఆ పిల్లల అదృష్టం బాగుండి పెరిగి పెద్దవాళ్ళయ్యాక వారి పెద్దలనే అనుసరిస్తూ జీవనాన్ని కొనసాగించడం జరుగుతోంది.
చెంచుల గూడేలలో చిన్నపిల్లలు...ఎదుగుదల
గూడేలలోని చిన్నపిల్లలకైతే ఎక్కడపడితే అక్కడ ఆడుకోవడం, ఏది దొరికితే అది తినడం మాత్రమే వారికి తెలుసు. పిల్లలు ఎక్కడ వుంటున్నారు, తింటున్నారా, వారు పరిశుభ్రంగా వున్నారా అనే విషయాలను వారి తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోరనే చెప్పుకోవచ్చు. ఉదయం లేవగానే ముళ్ళ చెట్లు, బురదనీరు, దుమ్ము దూళిలో ఆడుకోవడం, గుడిసెల్లో వుండే ఆహారాన్ని తినడం ఇదే వారి దినచర్య. పిల్లల ఒంటిపై వుండాల్సి బట్టలు మురికి పట్టి చినిగిపోయి వున్నా ఇళ్ళల్లో పెద్దలు వారిపని వారిదే అన్నట్టుగా వుంటారు గానీ పిల్లల విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చెప్పుకోవచ్చు. మట్టిలోనే తింటూ మట్టిలోనే ఆడుకుంటూ శుభ్రత, అపరిశుభ్రతకు తేడా తెలియక ఎక్కడ పడితే అక్కడ పొర్లుతూ తమ బతుకిదే అన్న విధంగా అమాయకపు చూపులతో చెంచుల గూడేలలోని పిల్లలు వుండటం చూస్తే ఎటువంటి వారికైనా కళ్ళు చెమర్చక తప్పదు. మన ప్రాంతాల్లో అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఆరోగ్యకరమైన భవిశ్యత్తుకు ఏవో ఒక టీకాలు ఎప్పటికప్పుడు వేయిస్తుంటాము. అయితే చెంచులున్న గూడేలకు ఆరోగ్య సిబ్బంది చేరుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వుంది. దాంతో పిల్లల ఆరోగ్యం కోసం అందాల్సి టీకాలు పూర్తీ స్థాయిలో అందని పరిస్థితి. కారణంగా చెంచులగూడేలలో ఒకరిద్దరు పోలీయోకి గురైన చిన్నారులు కూడా వుండటం గమనించవచ్చు. ఇక్కడి పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి మంచి భవిశ్యత్తునివ్వాలన్న కనీసం జ్ఞానాన్ని కూడా కలిగి వుండరనే తెలుస్తుంది. పుట్టారు, మనలాగే పెరిగి పెద్దవాళ్ళవుతారు అనేదేతప్పా తమబతుకులు అడవిలోనే అంతరించిపోతున్నాయి, మనపిల్లలకైనా మంచి జీవితాన్నిద్దామనే ఆలోచన వారికి లేదనే చెప్పుకోవచ్చు.
చెంచుజాతిలో పురుషులు, ఆరోగ్యం..
చెంచుల గూడేలలోని పురుషుల్లో నూటికి 98శాతం మంది తాగుడుకి బానిసలైనవారే కనిపిస్తారు. చిన్నవయసునుండే నాటు సారా తాగడం అలవాటు చేసుకున్న వారిలో సుమారు 30శాతం మంది క్షయవ్యాధితో బాధపడుతున్న వారే కంటపడుతారు. తమకొక వ్యాధి అనేది వుందని, అందుకోసం ఆరోగ్యపరమైన జాగ్రత్తలవసరమన్న విషయం కూడా వారికి తెలియని స్థితి. ప్రభుత్వం ద్వారా జరిగే ఉపాధి హామీ పనులకు వెళ్ళడం, అవి లేని సమయాల్లో దట్టమైన అడవిలోకి విల్లు, బాణాలతో వెళ్ళడం తినడానికి ఏదో ఒకటి తీసుకురావడం మాత్రమే వారికి తెలిసిన జీవన విధానం. భార్యా పిల్లలనైనా విడిచి వెళ్తారుగానీ వారి వెంట అంబు (బాణం) తీసుకెళ్ళడం మాత్రం మరిచిపోరు. చెంచు గూడెం నుంచి ఏవైనా వస్తువులకోసం ఇతర గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా వెంట అంబుని తీసుకోవడం మరువరు. అడవిలో లభించే చెక్క, ఇతర వస్తువులతో సారా వండుకోవడం అనునిత్యం దాన్ని సేవిస్తూ దాని మత్తులో తూలడం కనిపిస్తుంటుంది. ఇలా అనారోగ్యానికి గురై చాలామంది మగవాళ్ళు మృత్యువాతపడి పదుల సంఖ్యలో కుటుంబ యజమానులను కోల్పోయిన మహిళలు కనిపిస్తారు. 20నుంచి 25 ఏళ్ళ వయసులోనే వైధవ్యంతో జీవితాన్ని గడుపుతున్న మహిళలు చెంచు గూడేలలో దర్శనమిస్తుంటారు. దట్టమైన అడవి ప్రాంతంలో వుండే చెంచులు వారికెప్పుడైనా జ్వరం లాంటివి వస్తే వారి కళ్ళల్లో మోత్కు ఆకు పసరు పిండుకుని 3రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం గంజి మాత్రమే తీసుకుంటే జ్వరం తగ్గిపోతుందని నమ్ముతారు. అనారోగ్య పరిస్థితి తీవ్రమైతే తప్పా అడవినుంచి బైటికెళ్ళి ఆసుపత్రుల్లో ఆరోగ్య చికిత్సలు చేయించుకోరనే చెప్పుకోవచ్చు. పుట్టడం, పుట్టాక చావడం అనేది సహజం అనే ధోరణితో జీవిస్తుంటారు తప్పా ఇంట్లో వ్యక్తులు చనిపోయారన్న బాధ పడుతూ జీవించడం వారిలో కనిపించదు.
చెంచులూ విద్యావ్యవస్థ...ఉద్యోగ అవకాశాలు..
అనునిత్యం వాహనాల రాకపోకలు జరిగే ప్రధాన దారికి దగ్గరలో వుండే చెంచు గూడేలలోని పిల్లల్లో కేవలం ఒకటినుంచి 10శాతం లోపే విద్యావంతులయ్యారిని తెలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వున్న చెంచు గూడేలలో కూడా ప్రభుత్వ బడులను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు అక్కడికి చేరుకోవడం కష్టతరమే. ముఖ్యంగా నల్లమల అడవి మధ్యలో వుండే చెంచు గూడేలకు చేరుకోవాలంటే గంటల వ్యవధి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలకు వచ్చి చదువుచెప్పే ఉపాధ్యాయులు కనిపించడం అరుదే. ఒక వేళ ఎవరైనా ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చినా చెంచుల పిల్లలు బడిలో వుండి చదువుకోవాలన్న ఆలోచన వారికుండే అవకాశం కనిపించదు.అడవికి బైటి ప్రాంతాల్లో వుండే చెంచు గూడేలకు చెందిన పిల్లలు యర్రగొండపాళెం, ఆత్మకూరు, శ్రీశైలం ప్రాంతాల్లో వుండే గురుకుల పాఠశాలల్లో వుంటూ చదువుకుంటున్నారు (చాలాతక్కువ మంది). పాఠశాలల్లో వదిలేశాక కనీసం వారి పిల్లలన్ని చూడటానికి కూడా చెంచులు వెళ్ళరనీ, శెలవురోజుల్లో వారికి ఒకటికి పదిమార్లు ఇతరులచేత సమాచారం చేరవేస్తే వచ్చి వారి పిల్లల్ని తీసుకెళ్తారని చెంచుపిల్లలున్న పాఠశాలల ఉపాధ్యాయులు చెప్తారు. ఇలానే కొనే్నళ్ళుగా చదువును కొనసాగించి పట్టుదలతో పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడిన చెంచుబిడ్డలు కూడా ఉన్నారు. చెంచులను ఎస్టీలుగా గుర్తించడంతో చెంచులలో విద్యపరంగా అభివృద్ధి చెందిన వారు చాలా తక్కువ మంది వుండటంతో వీరికొచ్చే అవకాశాలన్నీ ఆ ప్రాంతపు లంబాడీలకు దక్కుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఉద్యోగాల్లో స్థిరపడిన చెంచు బిడ్డల్లో చెంచుల జీవన విధానంలో మార్పుతీసుకురావడం కోసం చర్యలు తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగించినప్పటికీ అడవుల నుండి బైటికి వచ్చి జీవనం కొనసాగించడానికి ఎవరూ ముందుకు రానిపరిస్థితి.
సరైన పౌష్ట్టికాహారం లేకపోవడం, చెంచుల జీవన విధానంలో మార్పు రాకపోవడంతో చెంచుజాతి అంతరించిపోతోందని కొన్ని సంస్థల సర్వేలలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో ఐటిడిఏ ( ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవ్‌లప్‌మెంట్ ఏజెన్సీ ) అనే ప్రత్యే శాఖ ద్వారా వారి అభవృద్ధికి పాటుపడుతోంది. అడవులను వదిలి వస్తే వారికి పట్టణాలకు, ప్రధాన దారులకు దగ్గరలో అన్ని సౌకర్యాలతో ఇళ్లనిర్మాణాలు చేబట్టి బ్రతుకుతెరువుకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పినా వారు అడవులను వదిలి రావడానికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి. దాంతో చెంచు గూడేలలో ఏర్పాటు చేసిన పాఠశాలల ద్వారా అక్కడి పిల్లలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
చెంచుల్లోని అనాగరికతను నిర్మూలించి
బంగారు భవిష్యత్తునివ్వఢానికి ఆర్డీటి నిరంతర కృషి....
ముఖ్యంగా చెంచుల జీవన స్థితిగతులను పరిశీలించి వారిని సామాజికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి పరిచాలన్న సత్సంకల్పంతో అనంతపురంలోని రూరల్ డెవ్‌లప్‌మెంట్ సంస్థ ( ఆర్డీటి) తమదైన శైలిలో చెంచులను చైతన్యవంతులను చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే వనరులను ఎలా సద్వినియోగపరుచుకోవాలి, ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేవలం అడవి సంపదపైనే ఆధారపడకుండా వ్యవసాయం, ఇతర చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, చిన్న వయసులోనే వివాహాలు జరిగితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, గర్భిణీలు, బాలింతలు శారీరకంగా ఆరోగ్యంగా వుండటానికి ఏం చెయ్యాలి, పిల్లలు విద్యపరంగా ఎలా అభివృద్ధి చెందాలి ఇలా పలు అంశాలపై నల్లమల అడవుల్లోని చెంచులకు అవగాహన కల్పిస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే చెంచుల్లో రక్తహీనత తగ్గించడానికి అవసరమయ్యే పౌస్టికాహారాన్ని దట్టమైన అడవుల్లో వుండే చెంచులకు కూడా ప్రతి నెలా చేరవేస్తున్నారు. నిరంతరంగా అవసరమైన చెంచుల గూడేలలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వైద్య చెంచులకు వైద్య చికిత్సలు చేస్తూ వారి ఆరోగ్య జీవనానికి కృషి చేస్తున్నారు. అడవుల్లోని భూములనే వ్యవసాయానికి అనుకూలంగా మార్చి చెంచులకు వ్యవసాయ విధానాలను తెలియజేస్తున్నారు. అటవీశాఖ ముందుకొచ్చి ఇళ్ళ నిర్మాణానికి సరిపడా స్థలాల పట్టాలివ్వగలిగితే వారికి ఇళ్ళను కూడా నిర్మించడానికి తాము సిద్ధమని ఆర్డీటి సంస్థ చెప్తోంది. అదేవిధంగా ఇప్పటికే అటవీ ప్రాంతంలో కాకుండా అడవులకు బైట వుండే చెంచు గ్రామాల్లో వారికి ఇళ్ళనిర్మాణాలను చేసి పాఠశాలలను కూడా నిర్మించారు. అనాగరికంతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న చెంచులను అన్నివిధాలా అభివృద్ధి పరిచి వారు కూడా నాగరికులతో సమానంగా జీవించేవిధంగా మార్పు తీసుకురావడానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తూ నల్లమల అటవీ ప్రాంతం విస్తరించిన జిల్లాల కలెక్టర్‌లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ చెంచుల అభివృద్ధికి ఆర్డీటి చేస్తున్న కృషి అభినందనీయం. అనాగరిక జీవనాన్ని కొనసాగిస్తున్న చెంచులను నాగరికత జీవన విధానాలను అలవర్చి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి మేమూ అందరి మనుష్యుల్లా జీవించగలమనే భరోసాను కల్పించడానికి ఆర్డీటి సంస్థ చేస్తున్న కృషి ఫలించాలని కోరుకుందాం.

-నల్లమాడ బాబ్‌జాన్ 9492722595