సెంటర్ స్పెషల్

పుస్తక ముఖమా? ముఖ పుస్తకమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ తెలుగు మహాసభల సంరంభం ముగిసింది. ఇప్పుడు అక్షర సంరంభం మొదలైంది. పుస్తక ప్రియులు వేచిచూసే మహోత్సవం రానేవచ్చింది. 1985 నుంచి సంప్రదాయంగా మొదలైన పుస్తక ప్రదర్శన హైదరాబాద్‌కు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత పుస్తక ప్రదర్శనలు జిల్లాల వారీగా కూడా జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన అట్టహాసంగా మొదలైంది. దాదాపు పదిహేను లక్షలమంది పుస్తక ప్రియులు పది రోజులపాటు తెలంగాణ కళాభారతిలో అడుపెట్టి అక్షరవిందును ఆరగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈనెల మొదటివారంలో ఈ వేడుక విజయవంతం అయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో
అక్షరవేడుక అలరిస్తోంది.

పుస్తకం ఉనికి పురాతనం - ఎన్ని కాలాలు మారినా, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వస్తువులు మానవుని జీవితం ముంగిట్లోకి ప్రవేశించి, ఎంతగా ఇంద్రజాలాలు చేసినప్పటికినీ - పుస్తకం ఎప్పటికీ వినూతనమే. సత్య సనాతనమే! అంటే నిత్య నూతనమన్నమాట. ‘తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ - నీవు నా/ యుల్లంబందున నిల్చి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శో/్భల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్, జగన్మోహినీ!/ ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!’
ఈ పద్యాన్ని ఎవరు వ్రాశారో తెలియదు గానీ - నా చిన్నప్పటి నుండీ వింటున్నాను. ఇందులో స్తుతింపబడిన చదువుల తల్లి ఎంత పవిత్రమైనదో, ఆ పద్యంలోని అక్షరం ఎంత పవిత్రమైనదో - పుస్తకం అంత పవిత్రమయినది. ఇది భారతీయుల దృక్పథం. మా చిన్నప్పుడు పొరపాటున పుస్తకం కాలికి తగిలితే - వెంటనే చేతులలోనికి తీసుకుని కళ్లకు అద్దుకునే వాళ్లం. అంటే పుస్తకం వాణీ స్వరూపమని నా చిన్నప్పుడే నా భారతీయ సంస్కృతి నాకు నేర్పింది. పుస్తకం అంటే చదివి అనేక విషయాలను తెలుసుకోవడానికీ, ఉత్తమ సంస్కారాన్ని పొందడానికీ, ఇతరులకు అందించడానికీ ఉపయోగపడే ఒక పవిత్ర వస్తువు అనే భావన చిన్నప్పుడే భారతీయులందరికీ అలవాటైన ఓ విశిష్ట లక్షణం.
పుస్తకం ఇప్పుడు కాగితాల సమూహ రూపంలో కనిపిస్తోంది కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేశంలో తాళపత్రాల (తాటియాకుల) రూపంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. తాళపత్రాల రూపమయినా, దాన్నీ పుస్తకమనే పలికేవాళ్లు. ఎందుకంటే - సంస్కృతంలో ‘పుస్’ అనే ధాతువుంది. ఆ ధాతువులోంచి ‘పుస్తకం’ అనే రూపం ఏర్పడింది. సన్నని త్రాళ్లతోనో, గట్టి దారంతోనో ఒకచోట బొత్తిగా చేర్చి, కలిపి బంధించి ఉంచబడిన తాటియాకుల సముదాయం అని పుస్తక శబ్దానికి అర్థం. కాబట్టి - నాటి తాళపత్రాలే కాక - నేడు వ్రాయబడి అచ్చులో కూర్చబడిన కాగితాల సమూహం కూడా పుస్తకమే అవుతుంది.
‘పుస్తకం హస్త్భూషణం’ అన్నది ఆణిముత్యం లాంటి మాట. చదువు రాని వాడు పుస్తకాన్ని కేవలం అలంకార ప్రాయంగా ధరిస్తాడు - అన్న అర్థంలో ఆ మాట లోకంలో వ్యాప్తిలో ఉన్నప్పటికినీ, అసలు గాజులూ, గడియారాలూ, ఉంగరాలూ - ఇవి చదువుకున్న మనిషి చేతికి అలంకారాలు కావు. మంచి పుస్తకమే మనిషి చేతికి నిజమైన భూషణం. ఆ దృష్టితో ‘పుస్తకం హస్త్భూషణం’ అన్న మాటను ఆణిముత్యంగా (సం)్భవించాలి. సాహిత్య పరంగా, ఇతర కళల పరంగా, వైజ్ఞానిక శాస్తప్రరంగా పుస్తకాలనేకంగా, నేడు అందంగా ముద్రితమై వస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కనీసం సుమారుగా పది పుస్తకాలైనా ఆవిష్కరణ సభా ప్రభలతో లోకంలో వెలుగు చూస్తున్నాయి.
పూర్వం మన భారతదేశంలో వెలుగొందిన మేధావులెందరో పుస్తకాల పురుగులైనవారే! అంటే నిరంతరమూ పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నవారే! అంతేకానీ - పుస్తకాలను పాడు చేసిన పురుగులని కాదండీ! - ఆ పదానికర్థం. ముందుగా నిరంతరమూ నిరంతరాయంగా మంచి పుస్తకం ముఖం చూసి, తద్వారా ఉత్తమ సంస్కారాన్ని పొంది, తామందుకున్న పరిజ్ఞానాన్ని లోకాని కుపయోగపడే రీతిలో వెదజల్లి, ఆ తర్వాతనే ఆ పుస్తక పఠనాన్ని ఆధారంగా చేసికొనియే విశ్వం ముఖాన్ని చూశారు. అంటే విశ్వాన్ని చదివినవారు. విశ్వం అంటే జన సముదాయ రూపం కాబట్టి - ప్రతి మనిషి ముఖాన్నీ చదవగలిగారు. తద్వారా జీవితాలనూ చదవగలిగారు - మన మేధావులు. అన్నిటికీ పుస్తక పఠనమే మూలం. మన మేధావులు కొందరు పేదరికంలో వున్నా సరే - కొందరు పెద్దల సహాయ సహకారాలతో మంచి పుస్తకాలను చదివారని చరిత్ర చెబుతోంది. తమ కులం వారు కోప్పడతారని పాడుబడ్డ మసీదులలో కూర్చుని, పోతనగారి తెలుగు భాగవత పద్య కావ్యాన్ని చదివే - మహాకవిగా ఎదిగారు గుర్రం జాషువా.
కనిపించిన ప్రతి మంచి పుస్తకాన్నీ స్వయంగా కొని, నిరంతరాయంగా చదివి, అవసరమైతే - ఆ పుస్తకంలోని అంశాలను ఆకళింపుతో - కావలసిన వారికి అందజేసే మహితాత్ములు మన మధ్యనే ఉన్నారు. వారిలో నాకు తెలిసినంత వరకు గుంటూరు వాస్తవ్యులు లంక సూర్యనారాయణగారు, కీ.శే.అరిశెట్టి సాయిప్రసాద్ గారు పేర్కొనదగినవారు. సూర్యనారాయణ గారు ఎక్కడ పుస్తక ప్రదర్శనం జరిగినా సరే - అక్కడికి వెళ్ళేవారు. ఏ భాషా గ్రంథాన్నైనా సరే - ఎంత ఖరీదయినా సరే - కొనేవారు. ఆసక్తిగా చదివేవారు. ఆయన అలా కొన్ని సంవత్సరాలుగా వారి ఇంటినే గ్రంథాలయంగా మార్చి, గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోని శ్రీ అన్నమయ్య గ్రంథాలయానికి తమ ఇంటిలోని గ్రంథాల నన్నిటినీ ఇచ్చి, తాము సంరక్షకులుగా ఉంటున్నారు. సుమారుగా 75 సంవత్సరాలు దాటిన ఆ వయస్సులో కూడా - ఆదర్శప్రాయంగా, పెద్ది సాంబశివరావుగారు, మోదుగుల రవికృష్ణ గారు ఆ గ్రంథాలయాభ్యుదయానికి ఎంతగానో సహకరిస్తున్నారు. అలాగే - శ్రీలక్ష్మీ నృసింహ దేవుని భక్తులైన సాయి ప్రసాద్‌గారు - సామాన్య విద్యావంతులైనప్పటికినీ, తమ ఇంట సంస్కృతాంధ్రాంగ్ల హిందీ భాషా సాహిత్యాలకు చెందిన సుమారు 60 వేల ఉద్గ్రంథాలను సేకరించి, వాటిని పఠించి, కేంద్రీయ విశ్వవిద్యాలయాదులలోని ఆచార్యులకు, పరిశోధక విద్యార్థులకు సమాచారాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడ్డారు. తమ ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికీ ఆతని ఆసక్తికి తగినటువంటి, ఉపయోగపడేటు వంటి చిన్న పుస్తకాన్నైనా ఇచ్చి, పంపిస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవారు సాయిప్రసాద్ గారు.
మచ్చునకు ఉదాహరణగా చెప్పబడిన పై వ్యక్తులు - ఈనాడు ఆధునిక సౌకర్యంగా ప్రశస్తంగా వ్యాప్తిలోనికి వచ్చిన ఫేస్‌బుక్, వాట్సప్, కంప్యూటర్, ఇంటర్‌నెట్ పరిజ్ఞానం పూర్తిగా ఉన్నవారే. ఆ పరిజ్ఞానాన్ని కాదనలేదు. ఎంతవరకు అవసరమో, అంతవరకే దాన్ని వినియోగించుకుంటూ, మంచి పుస్తక పఠనాన్ని ప్రోత్సహించినవారే! కాబట్టి ముఖ్యంగా నేటి యువతరం సాధ్యమైనంత వరకు తమ శక్తికి మించని రీతిలో మంచి పుస్తకాన్ని కొని మరీ చదవాలి.

-డా.రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287