సెంటర్ స్పెషల్

భారత జీవన వైవిధ్యం సమకాలీన ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**భారతదేశంలో మతవాదం పెచ్చరిల్లడమనేది, మన చరిత్రను ముఖ్యంగా, మధ్యయుగాల చరిత్రను వక్రీకరించడంతో ప్రత్యక్షంగా ముడిపడివుంది. ఈవిధంగా పక్షపాత బుద్ధితో చరిత్రను వక్రీకరించి ప్రదర్శించడం ఘోరమైన నేరం! అది మతపరమయిన అసహనాన్ని పెంచి పోషిస్తుంది. ఇలాంటి అసహన కథనాలు, కల్పనలు, కట్టుకథలు ఇతరుల పట్ల మతపరమైన ద్వేషానికి ప్రాతిపదికలుగా మారతాయి, అది హింసకు దారితీస్తుంది. చరిత్రను ఇలా మిథ్యాకల్పనగా మార్చడమనేది మతవాదుల చేతుల్లో మారణాయుధంగా పరిణమిస్తుంది. అంతేకాదు.. భారత సమాజానికి సహజమైన బహుళత్వ వైవిధ్య స్వభావాన్ని, ఈ గడ్డమీద పుట్టిపెరిగిన సాంస్కృతిక సమ్మేళన సంప్రదాయాలనూ ఈ మిథ్యాకల్పన పక్కదోవ పట్టిస్తుంది కూడా. సామాన్య ప్రజల మనస్సుల్లో వాస్తవాలు మరుగునపడిపోయేలా చేస్తుందీ వక్రీకరణ.**
=======================================

చరిత్ర ఏం చెబుతోంది?
ఇంతకీ మన చరిత్రకి సంబంధించిన వాస్తవమేమిటి? మన మధ్యయుగాల చరిత్ర అంతా ముస్లిం రాజుల దురాక్రమణ యుద్ధాలతోనూ, దేవాలయాల విధ్వంసాలతోనూ, బలవంతపు మతమార్పిడులతోనూ నిండి ఉందనే ప్రచారంలో నిజమేమైనా వుందా? ఈ దశ మన సామాజిక జీవన చరిత్రలో అంధయుగంగా ఉండిందా? ఎంత మాత్రం లేదు వాస్తవం ఈ దుష్ప్రచారానికి యోజనాల దూరంలో ఉంది! ఆ దశలో వ్యక్తమైన సామాజిక వైవిధ్యం మన జాతిని మరింత బలోపేతంగానూ, శక్తిమంతంగానూ మార్చింది. సరిహద్దులను మరింతగా విస్తరించుకోవడం కోసం, మరిన్ని విశాల భూభాగాలపై పెత్తనం సాధించడం కోసం రాజులు యుద్ధాలకు తెగబడిన మాట నిజమే. మతాధికారులూ, మఠాధిపతులూ.. ఉలేమాలూ, బ్రాహ్మణులూ.. ఒకరి పూజా పద్ధతులను ఒకరు చిన్నచూపు చూసుకున్న మాటా నిజమే.. కానీ భిన్న మతాలకు చెందిన సామాన్యులు.. మధ్యయుగాల్లో నానా బాధలూ అనుభవించిన పీడితులు, అట్టడుగు వర్గా ప్రజలు.. మాత్రం పరస్పరం సహజీవనం చెయ్యడంలోని మాధుర్యాన్ని తనివిదీరా ఆస్వాదించారు. మతాల చట్రాలను అధిగమించి రాజులు సైతం పరస్పర సంబంధాలను విస్తరించుకున్నారు. భౌతిక ప్రయోజనాల కోసం తమ తమ రాజ్యాలను కాపాడుకోవడం పైనా, మరింతగా విస్తరించుకోవడం పైనా ఆయా రాజుల కేంద్రీకరించిన మాట వాస్తవమే.. దానివల్ల సమాజంలోని అత్యధిక సంఖ్యాకులు నానాపాట్లూ పడినప్పటికీ, సామాజికధార్మిక జీవనాల నుంచి ఆనందాన్నీ, మాధుర్యాన్నీ పొందారు. విభిన్న వర్గాలకి చెందిన కులీనులు తమతమ సామాజిక పెత్తనాలను స్థిరపరచుకోవడం పైనా, పరస్పరం చిన్నబుచ్చుకోవడం పైనా ఎక్కువ ఆసక్తి చూపించిన మాట నిజమే. కానీ అదే సమయంలో సృజనాత్మకత రంగాలకి చెందిన దర్బారీ కవులూ, కళాకారులూ, శిల్పులూ, వాస్తుశిల్పులూ, నటులూ, గాయకులూ, జానపద కళాకారులూ, చిత్రకారులూ ఇతర స్రవంతులకి చెందిన సంప్రదాయాలని కూడా తమ కళల్లో మేళవించి సమగ్ర కళారూపాలను ఆవిష్కరించారు. ఆ క్రమంలో మొత్తంగానే కళారంగం సుసంపన్నం కాగలిగింది!

మతాతీత రాజకీయ సంబంధాలు
మధ్యయుగాల్లో హిందువులూ, ముస్లింలూ నిరంతర ఘర్షణ పడుతూనే ఉన్నారనే అసత్య ప్రచారం ఓ వైపు జరుగుతూండగా, అందుకు భిన్నమైన, విరుద్ధమైన వాస్తవాన్ని వెల్లడిస్తోంది చరిత్ర. రాజకీయ అవసరాలకోసం రాజపుత్రులూ, నవాబులూ మతాలకి అతీతమైన సంబంధాలు పెట్టుకున్నారని చరిత్ర చెప్తోంది. రాజ్యాధికారం కేంద్రంగా రాజులు పరస్పరం సంబంధాలను పెంచుకున్నారన్నది కాదనలేని వాస్తవం. ఉదాహరణకి రాజస్థాన్‌కి చెందిన రాజపుత్ర పాలకుడు రాణాసంగ, స్వయంగా బాబర్‌ను భారతదేశంలోకి ఆహ్వానించాడు. భరత ఖండంపై బాబర్ తొలిసారి తలపడింది ఎవరితోనో తెలుసా? ఇబ్రాహిం లోఢీతో! మతాలకి అతీతమైన రాజకీయ సంబంధాలు పెట్టుకోవడమంటే అదే మరి!
ఎందరో ముస్లిం రాజుల ఆస్థానాల్లో హిందువులు ఉన్నత పదవుల్లో ఉండేవారు. హిందూ రాజులు కూడా మరెందరో ముస్లింలని తమ ఆస్థానాల్లో కీలకమైన పదవుల్లో నియమించుకున్నారు. అక్బర్ దర్బారులోని నవరత్నాల్లో బీర్‌బల్, తోడర్‌మల్ కూడా ఉండేవారు. ముఖ్యంగా తోడర్‌మల్ అక్బర్ సామ్రాజ్యంలో అత్యంత కీలకమైన రెవిన్యూ విభాగానికి అధిపతిగా ఉండేవాడు! కాగా అక్బర్‌కీ, రాణాప్రతాప్‌కీ జరిగిన యుద్ధంలో అక్బర్ సేవలకు నాయకత్వం వహించిన వాడు రాజామాన్‌సింగ్. అవతల రాణా ప్రతాప్ తరఫున సేనాధిపతిగా ఉన్నవాడు హకీం ఖాన్‌సుర్. ఔరంగజేబ్ కొలువుకూటంలోని అధికారుల్లో హిందువుల సంఖ్య 34 శాతం అని అత్థర్ అలీ రాసిన పాఠ్యపుస్తకం చెప్తోంది. కాగా ఔరంగజేబ్‌కి, శివాజీకి జరిగిన ఓ యుద్ధంలో మొగల్ చక్రవర్తి తరఫున సేనలకు నాయకత్వం వహించినవాడు రాజాజయ్‌సింగ్.
టిప్పూ సుల్తాన్‌పై హిందూ వ్యతిరేకిగా ముద్రకొట్టడం మన ప్రచారకులకి అలవాటయిన అత్యాచారం. అతని ప్రధాన సలహాదారు పూర్ణయ్య అనే బ్రాహ్మణుడనే వాస్తవం ఈ పెద్దలు దాచిపెడతారు. కంచి కామకోటి పీఠాధిపతి అయిన శంకరాచార్యను టిప్పూ నెత్తినపెట్టుకుని గౌరవించి, ఎన్నో నిధులూ నిక్షేపాలూ కుమ్మరించాడు. శంకరాచార్యను టిప్పూ జగద్గురువుగా భావించి అలాగే పిలిచేవాడు. మరాఠా సేనలు నాశనం చేసిన శ్రీరంగపట్నం దేవాలయానికి టిప్పూ మరమ్మత్తులు చేయించాడు. అలాగే కాశీలోని విశ్వనాథ దేవాలయాన్ని కూల్చిన ఔరంగజేబ్, అసోంలోని కామాఖ్య దేవాలయానికీ, ఉజ్జయినీలోని మహాకాలుడి దేవాలయానికీ, బృందావనంలోని శ్రీకృష్ణ దేవాలయానికీ.. మరెన్నో హిందూ దేవాలయాలకు సైతం నిధులను సమకూర్చాడని చరిత్ర చెప్తోంది.

ధార్మిక రంగం
మధ్య యుగాలనాటి ప్రధాన మతాల్లో, మొత్తంగా ధార్మిక రంగంలో, ఎన్నో సమన్వయపూర్వక వైఖరులు దర్శనమిచ్చాయి. హిందూమతంలో భక్తి, ఇస్లాంలో సూఫీ ధోరణులు మధ్యయుగాల్లో ప్రధాన మతధోరణులుగా ఆవిర్భవించాయి. కబీర్, నానక్, తులసీదాసు సమస్వయపూర్వక దృక్పథం వహించి, తమ రచనల్లోనూ జీవనంలోనూ రెండు మతాల ప్రభావాన్నీ ప్రదర్శించారు. కబీర్‌దాసు ఉన్నత కులస్థులయిన బ్రాహ్మణులు మాట్లాడే సంస్కృతం వాడడానికి నిరాకరించాడు. సరళమైన హిందీ భాషలోనే కబీర్ సామాన్య ప్రజలకు సందేశమిచ్చేవాడు. హిందూ ముస్లిం మతాల మధ్య నిర్మితమైన సమన్వయ వారధులను కబీర్ తన జీవిత సాహిత్యాల్లో ప్రతిఫలించాడు. ఆయన ఒక శబ్దంలో ఇలా అన్నాడు.. ‘‘బంగారమనే ఒకే మూలపదార్థం, వేర్వేరు నగల రూపంలో ఎలా దర్శనమిస్తుందో అదేవిధంగా ఒకే భగవంతుడు అల్లాహ్, హరి, రామ్, రహీమ్‌లుగా కనిపిస్తాడు. అవన్నీ ఒకే దైవానికి పెట్టుకున్న వేర్వేరు పేర్లు’’ అన్నాడు కబీర్. హిందువుల పూజాపునస్కారాలు, ముస్లింల నమాజ్ పఠనాలూ ఒకే దైవం పట్ల ప్రదర్శించే భిన్న ఆరాధనా రూపాలు అన్నాడు కబీర్. వ్యవస్థీకృత మతాలనూ, ప్రజలను చీల్చే మత సంప్రదాయాలనూ కబీర్ నిశితంగా విమర్శించాడు. అంతేకాదు.. ముల్లాలనూ, పూజారులనూ సమానంగానే విమర్శించాడు కబీర్. కులవ్యవస్థ, అంటరానితనం లాంటి సామాజిక దురాచారాలను ఆయన ఖండించాడు. మధ్యయుగాల కాలంలో తలెత్తిన అన్ని రకాల మతధార్మిక ధోరణుల్లోనూ కబీర్‌దాసు బోధనలు విస్తరించడం గమనార్హం.
అదే యుగానికి చెందిన మరో భక్తి కవి తులసీదాసు. తనకాలంలో అమల్లో వుండిన ధార్మిక సమన్వయతను తులసీ ఒకానొక ఆత్మకథాత్మక కవితలో ఇలా ప్రకటించారు:
‘‘ఎవరేమన్నా అనుకోనీ ఆ రాముని దాసుడు ఈ తులసీ!
దానధర్మాలు నాకాధారం.. మసీదు వాకిలి నాకు ఆశ్రయం
ఈ లోకంతో నా లావాదేవీ లంతటితోనే అంతమవుతాయి!’’ (తులసీదాసు ‘కవితావళి’ నుంచి)
చరిత్రకు తెలిసిన అతి గొప్ప రామభక్తుడు.. తులసీదాసు.. మసీదులో నివసించడం గురించి చెప్పాడు. అక్కడ ఉంటూనే శ్రీరాముడి గుణగానం చేస్తూ ఎనె్నన్నో రచనలను వెలువరించాడాయన.
సమాజంలో శాంతి సౌఖ్యం వెల్లివిరియాలని కోరుకున్న మహనీయుడు గురునానక్. ఆయనపై కమీర్ రచనల ప్రభావం అపారం. సమన్వయవాదానికి కట్టుబడిన సంస్కర్త నానక్. హిందూమతం నుంచీ, ఇస్లాం నుంచీ ఎనె్నన్నో భావాలను కూర్చుకుని, నానక్ ఆ రెండింటినీ ఒకే విశ్వాసంలో ముడివెయ్యాలని ప్రయత్నించాడు. ఇస్లాం నుంచి దేవుడొక్కడే అనే భావనను స్వీకరించి.. విగ్రహారాధనను నిషేధించాడు నానక్. హిందూమతం నుంచి పునర్జన్మ విశ్వాసాన్నీ, కర్మ అనే భావననూ స్వీకరించాడు. ఈ జన్మలో చేసే పనులే వచ్చే జన్మల్లో వాళ్ల రాతను నిర్ణయిస్తాయని నానక్ బోధించాడు. ఆయన కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. సిక్కు మతానికి పవిత్ర గ్రంథమయిన ‘గురు గ్రంథ్ సాహిబ్’లో కబీర్ రచనలూ, బాబా ఫరీద్ లాంటి సూఫీ సాధువుల బోధనలూ కూడా కనిపిస్తాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి శంకుస్థాపన చెయ్యాల్సిందిగా మరో సూఫీ సాధువు మీర్ మియాఁను నానక్ అభ్యర్థించడం గమనార్హం.

సద్భావన సిద్ధాంతం!
మధ్యయుగాల కాలంలో, అట్టడుగు కులాలూ వర్గాల ప్రజలను సూఫీ ధోరణి అపారంగా ఆకట్టుకుంది. అత్యధిక సంఖ్యాకులయిన అట్టడుగు కులాలూ వర్గాల ప్రజలు ఇస్లాంలోకి మారడానికి సంప్రదాయాలతో సంబంధంలేని సూఫీ జీవన సరళే కారణం. సూఫీల మజార్‌ల పవిత్ర స్థలాల తలుపులు ఎల్లరికీ తెరిచేవుంటాయి. మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా, ప్రతి ఒక్కరూ వాటిని దర్శించుకోవచ్చు. సూఫీలు, వౌలికంగా, ఇస్లాం మతంలోని ఆధ్యాత్మికతకు కట్టుబడి వున్నారు. అత్యున్నత సూఫీ సాధువుల్లో ఒకరయిన ముహియుద్దీన్ ఇబ్న్ ఆరబీ ‘‘వహాదత్ అల్ ఉజూ’’ (ఒకే అస్తిత్వం) అనే సిద్ధాంత భావనను ప్రతిపాదించారు. ఈ ఒకే అస్తిత్వం అనే భావమే ఆధ్యాత్మిక విశ్వజనీన భావానికి తావిచ్చింది. కులమత భేదాలను ఈ భావనే కూలదోసింది. నిజమయిన అస్తిత్వం ఒక్కటేననీ.. మనమందరం, దాని ప్రతిరూపాలం మాత్రమేననీ ఈ సిద్ధాంత భావన బోధిస్తుంది. భిన్న మతాలను అనుసరించే వారి మధ్య సద్భావనను నెలకొల్పిన సిద్ధాంతమిది.
హిందూ, ఇస్లాం మతాచారాల మధ్య పరస్పర ప్రభావాన్ని డాక్టర్ బీ.ఎన్. పాండే తులనాత్మకంగా మదింపు చేశారు. ‘‘హిందూ మతానికీ, ఇస్లాంకీ మధ్య మొదట్లో ఎంతో వైరం ఉన్నట్లు కనిపించినప్పటికీ, చివరికి పరస్పరం సమ్మేళనం చెందాయి. ఒకదాన్ని మరొకటి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్నాయి. ఆయా ధార్మిక భావాల సమన్వయం ఫలితంగానే భక్తి, తసవ్వాఫ్ ధోరణులు అవిర్భవించాయి. ఇవి ప్రేమ, ఆరాధనలకు పెద్దపీట వేసిన మత ధోరణులు. ఆనాటి భారతదేశంలో విభిన్న మతాలను పాటించే కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో పాతుకుపోయిన ధోరణులివి. హిందూ శక్తి భావన, ఇస్లామిక్ సూఫీ భావన పెనవేసుకుని మహాప్రవాహంగా రూపొందాయి. ఆనాటి ధార్మిక మరుభూములను సారవంతంగా మార్చి, దేశం రూపురేఖలనే మార్చేసింది ఈ మహాప్రవాహం. హిందూ శ్రోత్రియ.. సనాతన కర్కశత్వానికీ, భయంకరమైన ఇస్లామిక్ కులీనతావాదానికీ మధ్య అసాధ్యమనిపించే సమన్వయాన్ని, ఈ భారతీయ స్ఫూర్తిమత్వం సాధించగలిగింది. ఈ సమన్వయ ఫలితంగానే అపారమైన పరిపూర్ణతా, అనంతమైన రూపవైవిధ్యమూ, హిందూమతంతో సమ్మిళతమైన ఆంతరంగిక ఐక్యత తాలూకు సహజమైన దృక్పథమూ రూపుదిద్దుకున్నాయి. పర్యవసనంగానే చరిత్రాత్మక కళాఖండాలు ఆవిర్భవించాయి. సాహిత్యం, చిత్రకళ, సంగీతం, ప్రేమభావం చేత ప్రేరణ పొందిన మతం.. ఇవీ మధ్యయుగాలనాటి భారత చరిత్ర మనకి అందించిన మహోన్నత సాంస్కృతిక వారసత్వ సంపద!’’ అన్నారు డాక్టర్ బీ.ఎన్. పాండే.

వైవిధ్య సారం.. స్వాతంత్య్రోద్యమం!
స్వాతంత్య్రోద్యమం తాలూకు బహుళత్వసారాన్ని గాంధీ, నెహ్రూలు అద్భుతంగా గ్రహించారు. అనేక సందర్భాల్లో, అనేక తరహాల్లో వాళ్లు ఈ వైవిధ్యం గురించి ప్రకటనలు చేశారు. 1909లో హోంరూల్ ఉద్యమం గురించి రాసిన ‘హింద్ స్వరాజ్’ పుస్తకంలో గాంధీ మన గత చరిత్రలోని బహుళత్వాన్నీ, వైవిధ్యాన్నీ రేఖామాత్రంగా చిత్రించారు. ‘‘ముస్లిం చక్రవర్తుల ఏలుబడిలో ఎందరో హిందువులు వృద్ధిలోకి వచ్చారు. హిందూ చక్రవర్తుల పాలనలో ముస్లింలూ బాగుపడ్డారు. పరస్పరం కలహించుకోవడం ఆత్మహత్యాసదృశమని అన్ని సముదాయాలూ గ్రహించాయి. ఆయుధాలతో బెదిరించినంత మాత్రాన ఏ మతంవారూ తమ విశ్వాసాలను వదిలిపెట్టరని వాళ్లు అర్థం చేసుకున్నారు. అంచేత రెండు మతాలకి చెందినవాళ్లూ పరస్పరం శాంతి సౌఖ్యాలతో బతకాలనుకున్నారు. ఎప్పుడైతే ఇంగ్లీష్ వలసవాదులు అడుగుపెట్టారో అప్పట్నుంచే మతకలహాలు తిరిగి పెచ్చరిల్లాయి. మనదేశంలో హిందువులుగా ఉన్నవాళ్లకీ, ముస్లింలుగా బతుకుతున్న వారికీ మూలపురుఫులు ఒక్కరేననే వాస్తవాన్ని మనం గుర్తించాలా అక్కర్లేదా? మన అందరి నరాల్లోనూ ప్రవహించే నెత్తురు ఒక్కటేననే సత్యాన్ని మనం గుర్తించాలా అక్కర్లేదా? మతాలు మార్చుకున్నంత మాత్రాన మనుషులు పరస్పరం శత్రువులుగా మారిపోతారా? ముస్లింల దేవుడు, హిందువుల భగవంతుడికి భిన్నమైనవాడా? మతాలనేవి.. ఒకే గమ్యాన్ని చేరే వేర్వేరు దారులు. ఒకే గమ్యాన్ని చేరడం నిజమైనప్పుడు ఏ దారిలో ప్రయాణిస్తే ఏం? ఇందులో కలహించుకోవలసిన కారణం ఏముందసలు??’’ అని నిలదీశారు
గాంధీజీ.

సారాంశం
అనేక శతాబ్దాలుగా, భారతదేశం బహుళ వైవిధ్యపూర్వక సమాజంగానే కొనసాగుతూ వచ్చింది. విభిన్న సంస్కృతులకి చెందిన ప్రజలు పరస్పరం సత్సంబంధాలు పెంచుకుని జీవితోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారిక్కడ. ఒకే మత సంప్రదాయంతోనూ, సంస్కృతితోనూ దేశాన్ని అంతటినీ ముడిపెట్టే ఒంటెత్తు పోకడ మొదలయి వంద సంవత్సరాలే అయ్యింది. మన సమాజంలో పరస్పర విద్వేషం, అసహనం, హింస పెరగడానికి ఈ ఒంటెత్తు పోకడే కారణం. శాంతి సౌభాగ్యాలను పునఃస్థాపించడానికి మనమందరం బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని బలోపేతం చెయ్యాలి. ప్రజలందరికీ పౌరహక్కులూ, మానవ హక్కులూ ఉండే సమాజాన్ని నిర్మించుకోవడానికి అదొక్కటే మార్గం.

=====================================================
ఆగస్టు 26, ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఐ.ఎం.ఏ హాలులో జరుగనున్న -
కమ్యూనిస్టు మేధావి, కార్మిక నేత ‘‘ఎం.వి.ఎన్.కపర్దీ స్మారకోపన్యాసం..’’ సందర్భంగా..
=====================================================

--డాక్టర్ రామ్ పునియానీ