సబ్ ఫీచర్

అల్పాక్షరాల్లో ప్రతిధ్వనించే ‘తుషార’ పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుషారమాలిక
(1300 త్రిపద కవితల
తొలి సంపుటి)
-సిరి వడ్డే
వెల: రూ.150
ప్రతులకు: జ్యోతి వలబోజు
80963 10140

ఆధునిక కవిత్వం కొత్త ప్రక్రియలకు జీవం పోస్తున్న క్రమంలో వైవిధ్యపూరితమైన కవితా నిర్మాణ రీతులు ఊపిరి పోసుకుంటూ వస్తున్నాయి. ఈ కోవకి చెందిన ఆధునిక కవితా ప్రక్రియే ‘త్రిపాద కవిత’. ఇది త్రిపద అంటే మూడు పదాల అక్షర వాక్యాలతో రూపొందించబడింది. త్రిపదం అనే అర్థాన్ని సూచిస్తుంది. గతంలో వచ్చిన హైకూలు, నానీలు, రెక్కలు మున్నగు కవితా రీతుల్ని తలపించేదే ఈ త్రిపాద కవిత. 1300 కవితలు కలిగిన ఈ ‘తుషార మాలిక’ సంపుటి కవయిత్రి సిరి వడ్డే. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్‌లో నివాసముంటున్న కవయిత్రి పదునైన భావసాంద్రతో కవితలకు ప్రాణప్రతిష్ఠ చేసింది. అలతి వాక్యాల్లో అనల్పార్థ భావ రచన చెయ్యడం దీని ప్రత్యేకత. వచన శైలిలో గాఢతను పుణికిపుచ్చకొని ఆస్వాదింపజెయ్యడం వీటిల్లో కనిపిస్తుంది. భావుకత, తాత్త్వికత, సాంప్రదాయకత, మమేకత, గత స్మృతుల నెమరువేత, సున్నిత భావాల కలబోత ఒకచోట కుప్పగా పోసి కవిత్వీకరించిన తీరు దీనిలో వ్యక్తమవుతుంది.
‘హరివిల్లు బడాయి పోతోంది/ ఒయారాలు ఒలకబోతలో/ తాను ఇమిడిపోగానే...’ అని అంటున్నపుడు సహజసిద్ధమైన వాస్తవిక దృశ్యానికి వ్యంగ్యంతో కూడిన చమత్కార గుణాన్ని జోడించి చెప్పడం కవయిత్రి సిరి వడ్డే లోచూపు దృక్పథాన్ని అద్దం పట్టిస్తుంది. మామూలు విషయాన్ని కూడి కవిత్వమయం చేసే నేర్పు లక్షణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వ్రక్రంగా వొదిగిపోయే సుతారమైన అంశాన్ని లౌక్య దృష్టితో మేళవించి చెప్పడం ఈమె ప్రతిభకు గీటురాయిగా నిలుస్తుంది.
‘తానో కాంతిపుంజమే/నా మనోనేత్రాన్ని/ తాకినపుడల్లా’ అంటూ చెబుతున్నపుడు లోలోపటి ఆంతరంగిక ధ్వని లీలా మాత్రంగా బొమ్మ కడుతుంది. అంతర్లీనమైన ఆలోచనలలో మనసుని స్పృశించినపుడు ఉప్పొంగే చైతన్య భావదీప్తిని కళ్లకి కట్టించడంలో కవయిత్రి మెలకువతో నిండిన అనుభూతి స్పర్శని రగిలించారు. విషయం చిన్నదే అయినప్పటికీ వ్యక్తీకరించే వైనం కట్టిపడేస్తుంది. ఈ ఒడుపులోని నేర్పరితనం రహస్యమే కవయిత్రిని పాఠకులకు దగ్గరగా చేరుస్తుంది.
‘ఉరితాడును నేస్తూనే ఉంటుంది/ మనస్సు లేని కొయ్య మగ్గం/ చినిగిన పంచెలతోనో.. కాలే కడుపులతోనో’ అని దిగులు చెందుతున్నపుడు ఆకలి చావులతో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల దుస్థితి ఆవిష్కృతమవుతుంది. సిరిసిల్లను పోలిన కన్నీటి కష్టాలను అతుకుల బతుకులతో ముడిపెట్టి రెక్కాడితేగాని డొక్కాడని జీవన సంఘర్షణ ప్రతిరూపాలను సామాజిక వెతలుగా చిత్రించడం ఇందులో కానవస్తుంది. నేసిన దారపు కండెనే ఉరితాడుగా మలచి అక్షరీకరించడం సజీవ దృశ్యచిత్రణకి పరాకాష్ఠగా భావించవచ్చు.
‘మనసుకెన్ని రాగాలో/ అల్లన మోవిని తాకగానే/ తనువంతా గాయాలను మోసే పిల్లంగ్రోవికి’ అంటున్నపుడు ‘సప్తపది’ చిత్రంలోని గీతం గుర్తుకు రాక మానదు. అంశం ఒకటే అయినా, అభివ్యక్తిలో పోలికలు ఒకేలా కనపడినా, సందేశంలో మాత్రం సారూప్యత ధ్వనిస్తుంది. మనసులోని రాగాలను, దేహ గాయాలను పిల్లంగ్రోవితో ముడిపెట్టి చెప్పడంలో భరించరాని రంపపు కోతని అనుభవిస్తుంది వడ్డే సిరి. ఈ మానసిక సంక్లిష్టతను వేదనామయ సందర్భంలోంచి పలవరించడానికి త్రిపాద కవితను వాహికగా ఎంచుకున్నారు. సంఘర్షణ లేని జీవితం ఆటుపోటుల్లేని సముద్రాన్ని పోలి ఉంటుంది. ఈ ఒడుపును అందిపుచ్చుకున్నది కాబట్టే అనుభవైకవేద్యమైన ఆవేదనను ప్రాణ సంకటంగా మలచగలిగారు. కవిత్వానికి అంతిమ ప్రయోజనం ఈ లక్షణమే. దీనికి ప్రక్రియాపరమైన అంతరం ఎప్పటికీ వెంటాడదు.
‘వౌనమూ పలుకులు నేర్చింది/ ఏకాంత వనంలో/ తనతో విహరిస్తుంటే...’ అంటూ నొక్కి చెప్పడంలోని ఆంతర్యం అంతర్ముఖ సంభాషణలో జీవన పరివేదన తపనలోంచి నిట్టూర్చిన హృదయ పలుకులు ఏకాంత వనంలో పచార్లు చేయడం పరిపాటయ్యింది. బహుశా ఈ దోబూచులాటే పరిమళిస్తూ, ప్రవహిస్తూ మనసుకి సాంత్వన చేకూరుస్తుందేమో! కొన్ని సందర్భాలను వెలకట్టడానికి వీలుచిక్కదు. ఎనె్నన్నో కొత్త విషయాలను సంభాషణలో బహిర్గతం చేస్తుంటుంది. ఆ ఊపు ఇక్కడ కూడా కొనసాగుతోంది.
‘జ్ఞాపకాలలో మాత్రం సజీవమే/ నా బాల్యాన్ని మోసిన ఊరు/ ఇప్పుడు శిథిల సాక్ష్యంగా మిగిలిపోయినా...’ అంటారు ఓ చోట కవయిత్రి. ప్రపంచీకరణ వేగంలో కాలమంత వేగంగా పరిగెత్తుతున్న జీవితాలు అనేక పరిణామాలకు లోనవుతూ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సామాజిక పరిస్థితులను పలుమార్పులకు గురి చేస్తున్నాయి. పల్లెతనం జ్ఞాపకాలతో సహా విదేశాలకు వలసపోతూ పుట్టి పెరిగిన ఊళ్లను అనాధలను చేస్తున్నాయి. కులవృత్తులూ అంతరించిపోతున్నాయి. ప్రేమతో పెంచిన పరిసరాలనూ దూరం చేస్తున్నాయి. ఈ యాంత్రిక భౌతిక ప్రపంచంలో ఎవరికి వారే పరాయివాళ్లుగా రూపాంతరం చెందుతున్నారు. ఈ స్థితికి కారణం వర్తమాన సామాజిక వ్యవస్థలోని స్థితిగతులేనని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాల సంస్కృతుల ప్రభావ ఛాయలు పడి బతుకుతెరువు కోసం దూరపు తీరాలకు ఎగిరిపోతున్నారు. ఇక ఇక్కడ మిగిలిందల్లా, ఒక్క ఏకాకితనం మాత్రమే! శిథిల సాక్ష్యంగా కడసారి చూపు సమాధానంగా మిగిలిపోతోంది. ఇలా బహుముఖ కోణాలను ఎన్నింటినో ఈ త్రిపాద కవితల్లో పొందుపరిచారు సిరి వడ్డే. వీటిలో అక్కడక్కడా ధ్వనించే కవిత్వపు వాక్య పదాలు కూడా కొన్నిచోట్ల మనల్ని అలరిస్తాయి.

-మానాపురం రాజా చంద్రశేఖర్