సెంటర్ స్పెషల్

రణక్షేత్రం 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మరి కుట్ర జరిగిందని తెలిసి ఎందుకు ఊరుకుంటున్నావు?’
‘ప్రజాస్వామ్య విలువల మీదే నమ్మకం కోల్పోయే లాంటి కుట్ర జరిగింది చంద్రం. కానీ కొన్ని కారణాల వలన దాన్ని బయట పెట్టలేను కూడా!’
‘అయినా సరే! డోంట్ వర్రీ! అన్నీ సరవుతాయి...’
‘నా మీద నాకే నమ్మకం పోయింది చంద్రం’
‘నాయకురాలికి కావలసింది తన మీద తనకు నమ్మకం ఉండటం కాదు. తన వారికి తన మీద నమ్మకం ఉండేటట్లు చూసుకోవటం. నీ మీద మా నమ్మకం ఇంకా తగ్గలేదు’
‘పట్టువదలని ఆ లక్షణమే నిన్ను నీ రంగంలో నిలబెట్టింది. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? ఇంకా ఎంతసేపు పడుతుంది నువ్వు ఇక్కడకు చేరుకోవటానికి?’ అని అడిగింది వసుంధర.
చంద్రం
నిజం చెప్పాలంటే, కళానిధి చెప్పిన మాటను నేను పూర్తిగా విశ్వసించలేదు.
చాలామంది మనుషులు కష్టంలో ఉన్నపుడు రకరకాల మొక్కులు మొక్కుకుంటారు. ఉదారమయిన నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి కష్టం తీరిపోయేటప్పటికి ఆ విషయాలే గుర్తు పెట్టుకోరు. తిరిగి మరో కష్టం వచ్చినప్పుడు ఇంతకు మునుపు తాము మొక్కుకున్న మొక్కులు తీర్చక పోవటంవల్లనే కొత్త కష్టాలు వచ్చాయని అనుకుంటారు. అంత మహిమాన్వితుడయిన భగవంతుడు తమ మొక్కులను ప్రామిసరీ నోటు దాచుకున్నట్లు దాచుకుని, తీర్చని వారి మీద కేసు వేసినట్లు కష్టాలు తెప్పించి మరీ తన బాకీ తీర్చుకుంటాడన్న భావనే ఎంత విచిత్రంగా ఉంటుందో...
కళానిధి కూడా నాకు ఇచ్చిన ఆఫర్ అలా ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయమనీ ఏ నిమిషమయినా దాన్ని వెనక్కి తీసుకుంటాడనీ అనుకున్నాను. కానీ, అలా జరగలేదు.
మరోసారి గుర్తుచేసి మరీ నన్ను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపాడు.
నేను కూడా ఆలస్యం చేయకుండా ఆయన చెప్పినట్లే ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్‌ని కలిశాను.
అప్పటికే కళానిధి ఆయనకి ఫోన్ చేసి నా గురించి చెప్పినట్లున్నాడు. మరి ఆ ఎఫెక్టేమో ఆయన నన్ను ఆదరంగా రిసీవ్ చేసుకున్నాడు.
ఆ ప్రిన్సిపాల్‌కి ఎన్నో సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన అనుభవం ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహమివ్వటానికి ఈ ఇనిస్టిట్యూట్ పెట్టాడు. మొదట్లో కొనే్నళ్లు సరిగ్గా జరగలేదు. త్వరలోనే సినిమా రంగంలో కొత్త ఆర్టిస్టులు అవసరమయిన ఎవరయినా ఇనిస్టిట్యూట్‌ని సంప్రదించటం మొదలుపెట్టారు. ఒకరిద్దరు లైమ్ లైట్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు ఈ ఇనిస్టిట్యూట్ పేరు చెప్పటంతో అనుకోని పబ్లిసిటీ లభించింది.
తన అనుభవాన్నంతా రంగరించి ఎదురుగా కూర్చున్న నన్ను తన ఎక్స్‌రే కళ్లతో పరీక్షిస్తూ మాట్లాడాడు ఆయన.
అయిదు నిమిషాలు నాతో మాట్లాడిన అనంతరం ఆయన ఒక ప్రశ్న వేశాడు. ‘అబ్బాయ్! నీకు సిగరెట్ తాగే అలవాటు ఎప్పటి నుండి ఉంది?’ అని.
‘చాలా సంవత్సరాల నుండి..’ తలవంచుకుని చెప్పాను.
‘మరి గుట్కా నమిలే అలవాటో?’
‘అది మాత్రం ఈ మధ్యే! ఇక్కడకు వచ్చిన దగ్గర నుండే!’
‘అప్పుడప్పుడూ కాదు. అస్సలు వాడకూడదు. పళ్లు పాడయితే నీ మొహం ఆకారం కోల్పోతుంది’
‘ఇక నుండి మానేస్తాను...’
నవ్వాడు ఆయన. ‘వ్యసనాన్ని చేసుకున్నంత తేలిక కాదు వదిలెయ్యటం. అందుకే నిన్ను చేర్చుకోవటానికి ఒక కండిషన్ పెడుతున్నాను...’
నేను అనుకుంటూనే ఉన్నాను. ఈయన ఏదో పూర్తి కాని కండిషన్లు పెట్టి నన్ను డిస్కరేజ్ చేస్తాడని.
‘కళానిధి చెప్పాడని నిన్ను చేర్చుకుంటున్నాను. కానీ, చేర్చుకునే ముందు నీ నిబద్ధత కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను.’
‘ఏం చెయ్యమంటారు?’
‘ఇరవై ఒక్క రోజుల తరువాత కనిపించు...’
ఆశ్చర్యంగా చూశాను ఆయన వైపు.
‘అది కూడా... ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఒక్కసారి కూడా సిగరెట్ కానీ, గుట్కా కానీ వాడకుండా ఉండగలిగితేనే!’
మొదటిసారి ఆయన మీద గౌరవం కలిగింది. ఏదో మొక్కుబడిగా, కళానిధి చెప్పాడని చేర్చుకోవటం కాకుండా.. మనసా, వాచా చేర్చుకున్న విద్యార్థి కోసం కృషి చేసే పాతకాలపు పంతుల్లా కనిపించాడాయన.
ఆయన చెప్పినట్లు ఇరవై ఒక్క రోజుల తరువాత కాకుండా, దాదాపు రెండు నెలల తరువాత తిరిగి ఆయన దగ్గరకు వెళ్లాను.
‘ఏమిటింత ఆలస్యం?’ అడిగాడు.
నిజం చెప్పాను. ‘మొదటిసారి సిగరెట్, గుట్కా మానిన రెండు రోజుల తరువాత తిరిగి తాగాలనిపించింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ కోరికని ఆపుకోలేక పోయాను. ఒకసారి కోరిక తీరిన తరువాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంత చిన్న కోరికని అదుపులో పెట్టుకోలేనా..? అనుకున్నాను. తిరిగి మానేసే ప్రయత్నం చేశాను. అయితే వారం తరువాత షరా మామూలే! వ్యసనం నుండి బయటపడాలన్న నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ఇరవై ఒక్క రోజులు గడిచిపోయాయి. నేను మానేశానా లేదా అన్న విషయం మీకేం తెలుస్తుందిలే, వచ్చి చేరదాం.. అనుకున్నాను. కానీ, నేను ఎవరిని మోసం చేస్తున్నానో నాకే అర్థంకాలేదు. అందుకే తిరిగి నా ప్రయత్నం మొదలుపెట్టాను. ఇవాళ్టికి ఇరవై ఒక్క రోజులు వరుసగా ఆ వ్యసనం జోలికి వెళ్లకుండా పూర్తి చేయగలిగాను. అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను’
ఆయన చూపులో మెచ్చుకోలు కనిపించింది. ‘చూడు బాబూ! నటుడన్న వాడికి శరీరం మీద కంట్రోల్ ఉండాలి. అది ఉండాలంటే జిహ్వ మీద కంట్రోల్ ఉండాలి. ఎందరో గొప్ప నటుల కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవటానికి కారణం ఈ వ్యసనాలు. ఏ రకమయిన వ్యసనమయినా తన ప్రభావాన్ని శరీరం మీద చూపక మానదు. వేసుకున్న మేకప్ వంటి రంగును మెరుగుపరచగలదే కానీ, లేని కళను వ్యక్తికి తెప్పించలేదు. అందుకే నేను నా దగ్గర చేరే వారికి ఆ కండిషన్ పెట్టేది. అర్థం చేసుకుంటే పైకి వస్తావ్...’ నాకు అర్థమయ్యేటట్లు చెప్పాడాయన.
‘నిజమే సార్!’ ఒప్పుకున్నాను.
‘్ఫల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నీకు కొత్తగా నేర్పేది ఏమీ ఉండదు. ఆల్రెడీ నీకున్న నైపుణ్యానికి మెరుగులు పెడతాం. నీ లోపాలు నీకు తెలిసేటట్లు చేస్తాం. కాకపోతే సినీ రంగానికి చెందిన మనుషులు వచ్చి పోతుంటారు కాబట్టి, ఏ మాత్రం టాలెంట్ ఉన్నా వారి కళ్లలో పడే అవకాశం ఉంటుంది. వచ్చే నెలలో ఫ్రెష్ బ్యాచ్ మొదలవుతుంది. వారితోపాటు చేరు. నీ ఫీజు కళానిధిగారే ఇచ్చారు. దాని గురించి వర్రీకాకు...’
‘అలాగే సార్! ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాను’ అని అక్కడ నుండి బయటకు వచ్చాను.
కళానిధిగారి దగ్గర పని చేస్తున్నపుడు వెనకేసుకున్న డబ్బు ఒక పదివేలు మిగిలి ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఫీజయితే కళానిధిగారు కట్టారు. కానీ, ఇంటి అద్దెకూ, తిండికీ డబ్బు కావాలి కదా! దానికోసం మరొకసారి కళానిధిగారి దగ్గరకు వెళ్లటం నాకు ఇష్టం లేదు. అసలా మాటకొస్తే ఎవరి సహాయమూ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఫ్రెష్ బ్యాచ్ మొదలవటానికి ఇంకా నెల సమయం ఉండటంతో ఆ నెల రోజులూ రోజుకు 18 గంటల చొప్పున ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లాను.
ఆ తరువాత ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను.
ఆరు నెలలు గడిచిపోయాయి.
ఇనిస్టిట్యూట్‌ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాను, మాటలో స్పష్టత పెరిగింది. కెమెరా ముందు నిలబడితే కలిగే బెరకు పోయింది. డాన్సు చేస్తుంటే కాళ్లు ఫ్రీగా కదులుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ నాకు తెలియకుండానే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.
మరో పక్క నా దగ్గర ఉన్న డబ్బు ఖర్చయిపోయాయి. డబ్బు సంపాదించటానికి సమయమే దొరకటం లేదు. 24 గంటల్లో 18 గంటలు ఇనిస్టిట్యూట్ పనికే సరిపోతుంది. ఇక మిగిలింది సెలవు రోజుల్లో పని చేసుకోవటం. అలా వచ్చిన డబ్బు ఏ మూలకీ చాలటం లేదు. చివరకు ఇంటి అద్దె కట్టటానికి డబ్బులు లేని పరిస్థితి ఎదురయింది. ఇంటి ఓనర్ సంగతి బాగా తెలుసు - కారణం ఏమిటో కూడా వినకుండా డబ్బు చేతిలో పడకపోతే పరువు తీస్తాడు. ఏ రోజయినా ఇంటి అద్దె కోసం ఓనర్ వస్తాడు. ఏం చెయ్యాలో అర్థంకాక ఆందోళనలో ఉన్నాను.
ఇనిస్టిట్యూట్‌లో అందరూ నెలకొకసారి రెండవ ఆదివారంనాడు తాము స్వంతంగా తయారుచేసుకున్న ప్రోగ్రాములు చిన్నచిన్న స్కిట్స్‌లా ప్రదర్శిస్తూంటారు. వాటిని మా స్టూడెంట్సే రాసి, డైరెక్ట్ చేసి ప్రదర్శిస్తుంటారు.
ఆ ప్రోగ్రాములు చూడటానికి సినీ రంగంలోని ప్రముఖులు తమతమ తీరికనిబట్టి అప్పుడప్పుడూ వస్తుంటారు.
ఇలాంటి ప్రోగ్రాములు వారికి కూడా ఉపయోగమే! కొత్త ప్రతిభని దొరకబుచ్చుకోవటానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది.
ఇప్పటికే ఇనిస్టిట్యూట్‌లో ఆరు నెలల సీనియారిటీ రావటంతో, ఈ రోజు వేస్తున్న నాటికలో నాకు ఒక చిన్న వేషం ఇచ్చారు.
వేషం చిన్నదయినా దానిలోనే నా ప్రతిభని చూపించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాను నేను.
ప్రముఖ డైరెక్టర్ వసంతరావ్ అక్కడకు వస్తున్నాడన్న వార్త దావానలంలా ఇనిస్టిట్యూట్ అంతా వ్యాపించింది.
నాటకం ప్రదర్శిస్తూన్న అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం పొంగుకు వచ్చింది. వసంతరావ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్. అతను తీసే సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. అతను ఎప్పుడూ పెద్దపెద్ద హీరోలతోనే సినిమా తీస్తాడు. వెరైటీగా పబ్లిసిటీ ఇస్తాడు. సినిమా హిట్టో, ఫట్టో తేలేలోపు డబ్బులు రాబడతాడు. అందుకే అతనంటే హీరోలకూ, ప్రొడ్యూసర్లకూ క్రేజ్. ఈ మధ్య అతను తన సినిమాలను తనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు కూడా!
అలాంటి వసంతరావ్ ముందు వరుసలో కూర్చుని పక్కన ఉన్న వారితో పిచ్చాపాటి మాట్లాడుతూ స్టేజ్ మీద జరుగుతున్న ప్రోగ్రామ్‌లను చూస్తున్నాడు.
నాటకం మొదలయింది. పాత్రధారులందరూ పోటీలు పడి నటిస్తున్నారు.
నేను స్టేజ్ ఎక్కే సమయం ఇంకా రాలేదు.
స్టేజ్ వెనుక నుండి వసంతరావ్‌నే చూస్తున్న నాకు ఆయన ధ్యాస అసలు ప్రదర్శన మీద ఉన్నట్లు అనిపించటం లేదు. ప్రదర్శన చూడటానికంటే, పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడటానికి ఆయన ఇస్తున్న ప్రాముఖ్యత చూసి అతనెంత ముఖ్య వ్యక్తో.. అనుకున్నాను నేను. ‘మా ఉత్సాహమే తప్ప అంత పెద్ద డైరెక్టర్‌కి ఇంత చిన్న ప్రోగ్రాం మీద ఇంటరెస్ట్ ఎందుకు ఉంటుంది?..’ అనుకుంటున్న సమయంలో నేను రంగస్థలం మీదకు వెళ్లవలసిన సమయం వచ్చింది.
ఆ ఘడియ కోసం ఎన్నో రిహార్సల్స్ వేసుకున్న నాకు గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది.
సరిగ్గా నేను రంగస్థలం మీదకి అడుగు పెట్టే సమయానికి అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
రంగస్థలం మీద ఉన్న నటుల్లో ఒకతను పొరపాటున చెప్పవలసిన డైలాగు కంటే రెండు డైలాగులు ముందుకెళ్లి తన సంభాషణ చెప్పాడు. దానికి రెస్పాన్స్ ఇవ్వవలసిన నటుడు ఒరిజినల్‌గా చెప్పవలసిన డైలాగ్ చెప్పాలో, ఇప్పుడు చెప్పిన డైలాగ్‌కి రెస్పాన్స్ ఇవ్వాలో అర్థంకాక ఏదీ చెయ్యకుండా ఆగిపోయాడు.
తెరచాటు నుండి ప్రాంప్టర్ అందిస్తున్న డైలాగులు ఇంకా గాభరాను పెంచుతున్నాయి.
వీరిద్దరి అయోమయం గమనించిన మిగిలిన నటుల్లో ఒకతను ఇక ఆగలేనట్లు తన డైలాగ్ తను చెప్పాడు. దానితో అందరి అయోమయం ఇంకా పెరిగిపోయింది. అనుభవజ్ఞులయిన నటులయితే వెంటనే సిట్యుయేషన్‌ని అదుపులోకి తెచ్చుకో గలిగేవారేమో కానీ.. అందరూ కొత్తవారు కావటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేటట్లు కనిపించింది.
ఇక లాభం లేదన్నట్లు నేను ముందుకు నడిచాను.
‘మీరందరూ ఇంత అయోమయంగాళ్లు కాబట్టే నేను రావలసి వచ్చింది...’ అంటూ స్టేజ్ మధ్యకు నడిచాను. ‘ఏమిటి...?
నువు మాట్లాడే మాటలకు ఏమన్నా అర్థం ఉందా? చెప్పదలచుకుంది ఒకటయితే మరొకటి చెప్తున్నావ్...’ అంటూ సరయిన డైలాగ్ సరయిన పాత్రధారికి అందించి కవర్ చేశాను.
అంతే!... అక్కడ నుండి బండి తిరిగి పట్టాలెక్కింది. మిగిలిన ప్రదర్శన ఏ సమస్యా లేకుండా సాగిపోయిం.
ప్రదర్శన ముగిసినట్లు తెర మూసుకోగానే అందరూ గట్టిగా నిట్టూర్చారు. పూర్తిగా స్టేజ్ దిగక ముందే తప్పు నీదంటే నీదని వాదించుకుంటున్నారు.
అప్పుడు అక్కడకు వచ్చాడు వసంతరావ్. ఏమీ గమనించనట్లు ఉంటూనే అన్నీ అవలోకనం చేసుకున్నాడు అతను. ‘తప్పు జరిగినపుడే ఒకరినొకరు కవర్ చేసుకోవాలి. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటంవల్ల ప్రయోజనం ఉండదు...’ అందరినీ ఉద్దేశించి చెప్పాడు.
అందరూ తలలు వంచుకున్నారు.
వసంతరావ్ నా దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ‘నా దగ్గర పని చేస్తావా?’ అన్నాడు.
‘అంతకంటే అదృష్టమా సార్!’ అన్నాను. నా వైపు మిగిలిన నా సహ నటులందరూ ఈర్ష్యగా చూస్తున్నారు.
‘పని ఏమిటని అడగవా?’
‘మీరే చెప్తారుగా సార్!’
‘నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చెయ్యాలి. ఇష్టమయితే చెప్పు’
‘సార్!.. నేను నటుడ్ని అవుదామని వచ్చాను’
‘దానికింకా సమయం ఉంది. నీ మొహంలో మెచ్యూరిటీ రావాలి. అప్పటివరకు ఈ పని చెయ్యి’
నా మెదడు పాదరసం పనిచేసినట్లు చేసింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ‘మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్!’ అన్నాను.
ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ కూడా నా వైపు అభినందనగా చూశాడు. వస్తుందో రాదో తెలియని హీరో ఛాన్స్ కోసం, కాళ్ల దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదులుకోని నా నిర్ణయం ఆయన కళ్లకు తెలివిగా అనిపించి ఉండవచ్చు. కానీ నేను ఆ నిర్ణయం తీసుకున్నది మాత్రం నా డబ్బు అవసరాలు తీర్చుకోవటానికే! ఇంకా కొన్నాళ్లు ఇనిస్టిట్యూట్‌లో కొనసాగగలిగే ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు.
‘సరే! అయితే మరో పది రోజుల్లో మనం కొత్త సినిమా మొదలు పెడుతున్నాం. వచ్చెయ్!..’ అంటూ ముందుకు నడిచాడు వసంతరావ్.
నాలుగడుగులు వేసి ఇంకా నేను ఆయన వెనుకే వస్తూండటం చూసి, ‘ఏమిటి? ఏమన్నా కావాలా?’ అని అడిగాడు.
‘ఒక ఐదు వేలు అడ్వాన్స్ కావాలి సార్. నాకు ఇచ్చే జీతం నుండి కట్ చేసుకుందురు..’ అన్నాను.
సీరియస్‌గా చూశాడు వసంతరావ్. తరువాత ఫక్కున నవ్వుతూ జేబులో చెయ్యి పెట్టాడు.
* * *
సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల మనుషులు ఉంటారు. జీవితంలో పైకి వచ్చాక కూడా తమ చుట్టూ ఉన్న వారిని మరచిపోకుండా తమతో పైకి తీసుకు రావటానికి ప్రయత్నించేవారు ఒక రకం అయితే... తమ తోటి వారి తలల మీద కాళ్లు పెట్టి తొక్కుకుంటూ పైకి వెళ్లేవారు రెండో రకం.
నా అదృష్టం కొద్దీ వసంతరావ్ మొదటి రకానికి చెందినవాడు.
నన్ను చూసిన మొదటి చూపులోనే ఆయనకి నేను నచ్చానట. ఆ విషయం ఆయన తరువాత చెప్పాడు. నాలో ఏమి నచ్చిందో ఎప్పుడూ చెప్పలేదు. కానీ ‘నిన్ను లాంచ్ చేసే సమయం ఇంకా రాలేదు..’ అనేవాడు. అదీగాక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నిటిలో యాక్టర్లందరూ ముందే బుక్ అయిపోయి ఉన్నారు. ‘తొందరపడకు. నీ సంగతి నేను చూసుకుంటాను..’ అనేవాడు.
నేను కూడా ఊరికే కూర్చోలేదు. ఆయన అసిస్టెంట్‌గా చేరిన మొదటి రోజు నుండి ఒక పని చెప్తే పది పనులు చేస్తూ నా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడిని.
‘చంద్రం ఉంటే కరెంటు ఉన్నట్లే..’ అనేవాడాయన.
అలాంటి రోజుల్లో వసంతరావ్ చిన్ననాటి స్నేహితుడు సుబ్బరాజు అని ఒకాయన వసంతరావుని వెతుక్కుంటూ వచ్చాడు.
సుబ్బరాజుకి ఎప్పటి నుండో సినిమా తీయాలని కోరిక. అతనికి ఈ ఫీల్డులో తెలిసిన వ్యక్తి వసంతరావ్ ఒక్కడే. అందుకే సరాసరి ఆయన దగ్గరకు వచ్చాడు.
‘ఎంత డబ్బు పెట్టగలవేంటి?’ అడిగాడు వసంతరావ్ ఎగతాళిగా.
చెప్పాడు సుబ్బరాజు.
అది పెద్ద మొత్తమే! కానీ వసంతరావ్ స్టాండర్స్‌కి తక్కువ. అందుకే చప్పరించాడాయన. ‘ఆ డబ్బుకు ఏదో చిన్న సినిమా తీయగలం. ఈ రోజూ, రేపూ చిన్న సినిమాలకు మార్కెట్ లేదు. చూస్తూ చూస్తూ ఎందుకు ఉన్న డబ్బు పోగొట్టుకుంటావ్?...’ అన్నాడు.
ఆ మాట వింటూనే అంతెత్తున లేచాడు సుబ్బరాజు. ‘ఇదుగో వసంతరావ్! నన్ను నిరుత్సాహ పరచకు. డబ్బు మొత్తం పోయినా ఫరవాలేదు. కానీ.. సినిమా తియ్యకుండా వెనక్కి వెళ్లేది లేదు. ఏమో? ఎవరు చూడొచ్చారు? ఎన్ని చిన్న సినిమాలు పెద్ద హిట్లు కాలేదు..’
‘ఇక్కడకు వచ్చే వాళ్లందరూ అదే ఉత్సాహంతో వస్తారు. నువు నాకు తెలిసిన వాడివి కాబట్టి చెప్పాను. మళ్లీ చెప్తున్నాను. డబ్బు మొత్తం పోయిందనుకుని రంగంలోకి దిగు. అలా అయితేనే తరువాత బాధ ఉండదు’
‘చెప్పాగా! డబ్బు పోయినా ఫరవాలేదు. కానీ, నిర్మాతగా నా పేరు తెర మీద చూసుకోవాలి...’ తేల్చి చెప్పాడు సుబ్బరాజు.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002