ప్రార్థన

అలుగుట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు - యోహాను 15:5
అలగటం ఒక ఆటలా ఉంది చాలామందికి. మనుషుల మీద పనుల మీద చివరకు దేవుని మీద కూడ అలుగుచున్నారు. దేవుని మీద అలుగుట వలన లాభమేమి ఉండదు. పైగా అదే అదనుగా సాతానుడు లేనిపోని మాటలతో అలిగిన వారిని సులువుగా వశపరచుకుంటాడు.
బహు చెడ్డ గుణాలలో అలుగుడు ఒకటి. అలగటం గొణగటం పోట్లాడటం వౌనంగా ఉండటం దిగులు పడటం ఇల్లు వదలి వెళ్లిపోవడం పనులను వదలటం అసూయ ద్వేషం భేదములు క్రోధం పగ.. ఇలాంటివన్నీ ఒక తల్లి పిల్లలే. గమనించాలి. తల్లులం మనమే. పైన చెప్పబడిన గుణాలలో ఏది నీలో కనపడినా అది నీ ‘ప్రొడక్ట్’ అని గుర్తించాలి. నీ నుండే ఉద్భవించింది గనుక నీ సంతానమే. తండ్రి ఎవరో అర్థమైందా? ఇంకెవరు సాతానుడు. సాతానుడు మనలను ప్రేరేపించుట ద్వారా జరిగేటు వంటి కార్యాలన్నింటికి తల్లులం మనము. తండ్రి సాతానుడు. అందుకే దేవుడు అనేకసార్లు ఇశ్రాయేలీయులను వ్యభిచారులతో పోల్చాడు. అంతేకాదు బాప్తీస్మమిచ్చు యోహాను తన దగ్గరకు వచ్చిన పరిసయ్యులను సద్దూకయ్యులను చూచి - సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని ప్రశ్నిస్తున్నాడు - మత్తయి 3:7.
‘(అపవాది) వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు’ - యోహాను 8:44
వాడికి హృదయములో చోటిచ్చి, వాడి మాటల ప్రకారము ఆలోచనల ప్రకారము నడవటానే్న దేవుడు వ్యభిచారముతో పోలుస్తున్నాడు. దానిని ప్రభువు వివరముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 27,28వ వచనాలలో తెలియజేశాడు.
‘వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా’ నేను మీతో చెప్పునదేమనగా - ఒక స్ర్తిని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును’ అని.
దీనిని బట్టి చూస్తే సాతానుని మాటలకు ఆలోచనలకు చనువిచ్చి హృదయములోనికి చేర్చుకోవటమే. హీనమైన కార్యముల వలె హీనమైన తలంపులు కూడా పాపమే. క్రియలను హద్దులో ఉంచునట్లు తలంపులను అదుపులో నుంచుకొనవలెను. తలంపు కార్యానికి విత్తనము లాంటిది.
ఆ విత్తనాలు వేసేది సాతానుడు, వాడు విత్తనాలను వెదజల్లుచున్నాడు. జాగ్రత్త!
అలానే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వీకము ఆశానిగ్రహము.. ఇవి కూడా ఒక తల్లి బిడ్డలే. ఆ తల్లులం మనమే. తండ్రి పరిశుద్ధాత్ముడు. దైవ వాక్యానుసారమైన ఆలోచనలు క్రియలు అన్నింటికి కర్త దేవుడే.
మీరు క్షయ బీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై యుండి యొకరి నొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి - 1 పేతురు 1:22-23.
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు - యోహాను 1:12-13.
దేవుని యందు విశ్వాసముంచి ఆయన జీవపు మాటలను పాటిస్తే నిత్యజీవానికి వారసులౌతాము. సాతాను ప్రలోభాలకు ప్రేరేపణలకు లొంగిపోతే దేవునితో సంబంధాలుండవు. దేవుని ఆశీర్వాదాలు కూడా ఉండవు. అయినా ఎందుకో ఆశీర్వాదాలిచ్చే దేవుని కన్న నాశనానికి నడిపే సాతాను వైపే ఎక్కువ మొగ్గు చూపుచున్నారు.
అలుగుడికి అంత పెద్ద మాటా అనుకోవచ్చు. కొంతమంది అలిగి సాధించుకోటానికి, ప్రేమను పొందుకోటానికి ప్రయత్నాలు చేస్తారు. అలగటం తప్పేమీ కాదనుకుంటారు. అయితే ఒక్క అలుగుట నుండి ఎన్ని నష్టాలో చూడండి. పిల్లలు అలిగితే తల్లిదండ్రుల హృదయాలు కృంగిపోతాయి. నలిగిపోతాయి. ఆలోచనలు మూతబడతాయి. అలుగుడనేది ఇతరుల మీద మంత్రంలా పని చేస్తుంది. పట్టించుకోనట్టు ఉంటారు కాని లోపల నలిగిపోతూనే ఉంటారు. కారణం దేవుడు పెట్టే బంధం అటువంటిది. పిల్లల మీద ఉండే ప్రేమను బట్టి అలా అవుతుంది. ఒక ముఖ్యమైన సంగతి - పిల్లలు అలిగినప్పుడల్లా తల్లిదండ్రుల ఆలోచనలు బాధ హృదయ వేదనను బట్టి వారి ఆయుష్షు తగ్గుతోందని గ్రహించాలి.
దాని పర్యవసానం నీవు ఒక ప్రయోజకునిగా అయ్యే సమయానికి వారు లేకపోవచ్చు లేదా దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి ఉండొచ్చు. చూడండి. ఎంతో నియమ నిష్టలతో ఉద్యోగం చేస్తూ ఎటువంటి లంచాలకు పాలుపడక, వక్రమార్గాల ననుసరించక ఉన్నవారు కూడా, ఇంటిలో పిల్లలో భార్యాభర్తలో అలిగిన కారణంగా, అప్పటి వరకు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నా చివరకు బలహీనమై ఉన్నప్పుడు, లంచాలిస్తామని వెనుకబడిన వారు గుర్తుకొస్తారు. అబ్బాయికి బైక్ కొనాలి గదా లంచమిస్తానన్న వాళ్లు ఇప్పుడు వస్తే బాగుండుననుకొని ఈసారి వారు కనిపించగానే, ఎన్నడూ ఎరుగనటువంటి ఆ నీచపు పనికి పాల్పడతారు. లంచాలు అలా మొదలై అలా అలా అలవాటై చివరకు లంచగొండిగా మార్చుతోంది. చివరకు సమాజములో తలెత్తుకొని తిరుగలేక అవమానాలు భరించలేక చనిపోయిన పెద్దపెద్ద అధికారులు, వాళ్లతో కలిసిన చిన్నచిన్న ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగదు. వీళ్లకు లంచమిచ్చిన వాడు లక్షల్లో లంచాలు తీసుకొంటాడు. వేరే వాళ్లు కోట్లల్లో చేస్తారు. ఇలా లోకమంతా పాకుతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు. చిన్న బైక్ కోసం చిన్న వస్తువు కోసం ఇంత కథా అని. కానీ చిన్నగానే మొదలై నదులులాగ మారి సముద్రాలలాగ తయారౌతాయి. ఒక్కసారి మొదలైతే ఆగేది కాదిది. నీళ్లలో రాయి వేస్తే ఎలా అక్కడ మొదలైన అలలు చివరి వరకు వెళ్తాయో, ఇదీ అంతే! మంచి మొదలైనా చెడు మొదలైనా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇది కూడా వైరస్ లాంటిదే. చాలా చురుకుగా అంటుకుంటుంది. ఒకరిని చూసి ఇంకొకరు అలా లంచాల ప్రపంచం ఏర్పడుతుంది. ఉద్యోగానికి లంచాలు, లంచాలిచ్చి ఉద్యోగాలలో చేరినవారు తిరిగి సంపాదించుకోటానికి లంచాలు తీసుకోడానికి వెనుకాడరు. వారి ధ్యాస అంతా ఎక్కడ ఎలా సంపాదిద్దామా అన్నట్టు వెంపర్లాడుతుంటారు. జాగ్రత్త! అలగటం కూడా తప్పేనా అంటే? ఈ ‘చెయిన్ రియాక్షన్’ చూస్తే ఎంత పెద్ద తప్పో అర్థవౌతుంది.
ఇక పెళ్లిళ్లు అయ్యాక అలుగుళ్ల వ్యాపారం వచ్చి పోయి అన్ని ఇళ్లల్లో చిన్న దుకాణం లేక పెద్ద దుకాణమో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. లేకపోతే మంచిది. అలుగుళ్ల వ్యాపారం మంచిది కాదనే, ఉండకూడదనే ఈ ప్రయాస. భార్య మీద భర్త భర్త మీద భార్య కోడలి మీద అత్త అత్త మీద కోడలు తల్లిదండ్రుల మీద పిల్లలు పిల్లల మీద తల్లిదండ్రులు ఇలా ఈ వ్యాపారం మూడు పువ్వులు వంద కాయలు అన్నట్టు ఉంది. వెనుకటి రోజుల్లో అయితే మూడు పువ్వులు ఆరు కాయలు కాని రానురాను ఇది 100 నుండి 1000 అవ్వొచ్చు.
అలిగి అమ్మాయి పుట్టింటికి వెళితే పూర్వం అయితే వెంటనే వారిని బుజ్జగించి నచ్చజెప్పి భర్త దగ్గర వదిలి వెళ్లేవారు. ఇప్పుడు హై టెక్నాలజీ యుగంలో ప్రిస్టేజ్ పెరిగి, నిన్ను అంత అవమానపరిచాడా? అంత మాట అన్నాడా? వాడి అంతు చూస్తా అంటూ అగ్నికి ఆజ్యం కలిపి గోరంతను కొండంత చేసి, గొడవలు కొట్లాటలు కేసులు.. ఇంకేముంది కోర్టులు కేసులు. ఈ కేసులు సూట్‌కేసులో డబ్బులై పోవచ్చు గానీ కోర్టు కేసులు మాత్రం తెగవు. సమాజం మేలుకోరి ఇలాంటి కేసులు సులువుగా పరిష్కరించే న్యాయవాదులు కూడా లేకపోలేదు. వాస్తవానికి ఇవి ఉత్తుత్తి కేసులే, ఎవరో ఒకరు తగ్గితే ఊరికే పరిష్కరించవచ్చు. ఈ ఉత్తుత్తి కేసులతో కోర్టులు కిటకిటలాడుతూ అసలైన కేసులకు న్యాయం చేకూర్చటానికి సమయముండటం లేదు. ‘వాస్తవానికి గోరంత సమస్యను కొండంత చేసేది సాతాను. అయితే దేవుడు కొండంత సమస్యను గోరంత కంటె తక్కువ చేసి సమాధానపరచి, ఆ సమస్యను కొట్టివేస్తాడు.
ఒకసారి ప్రభు యేసు దగ్గరకు పర్వతం లాంటి సమస్య వచ్చింది. ఒక స్ర్తిని వ్యభిచారము చేసిందని పట్టుకొచ్చి, ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది. మోషే అయితే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. మరి నీవేమంటావ్ అని ప్రభువు ముందు నిలువబెట్టారు. ప్రభువు దీనిని కొట్టి పారవేశాడు గనుక విస్తారమైన ఆమె పాపములు కొట్టివేయబడ్డవి. ఆమె గొప్ప దైవజనురాలిగా పేరు పొందింది. కానీ ఒక్కసారి మన తప్పు క్షమించబడ్డాక ఇక తప్పు చేయకూడదు. ఇది ప్రభువు పెట్టిన షరతు.
రాళ్లు విసరటానికి పట్టుకొచ్చిన వారంతా ప్రభువు నేల మీద వ్రాసిన మాటలను చూసి, చేతులలోని రాళ్లు పడవేసి వెళ్లిపోయారు. తరువాత తల ఎత్తి ప్రభువు ఆమెను చూచి ‘అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును శిక్ష విధించలేదా?’ అని అడిగినప్పుడు ఆమె ‘లేదు ప్రభువా’ అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్లి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
ఇకపోతే తండ్రి మీద అలిగి ఇంటిలోనికి రాకుండా బయటనే ఉన్న.. తప్పిపోయిన కుమారుని అన్న ఎంత నష్టపోయాడో మనం చూద్దాం.
చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో తన భాగాన్నిమ్మని తీసికొని దూర ప్రాంతము వెళ్లి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసి, ఆస్తి హరించుకు పోయాక తాను ఉన్న దేశములో కరువు రాగా, చివరకు పందులను మేపే పనిలో చేరవలసి వచ్చింది. ‘ప్రభువు చెప్పే మాట కూడా అదే. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని’. చాలామంది ఏదో ఒక కారణానికి అలిగి ఇంటిలో నుండి వెళ్లిపోతారు. హాయిగా ఉండొచ్చునన్న అభిప్రాయముతో, కానీ చివరకు అర్థవౌతుంది వారి నిర్ణయాల వల్ల ఎంత నష్టపోయారో? అప్పుడైనా తిరిగి కుటుంబానికి చేరితే ఆశీర్వాదము. తప్పిపోయిన కుమారుడు చేసిన ఒక మంచి పని తిరిగి ఆలోచించుకొని, నా తండ్రి దగ్గర పనివారే చాలా ఆనందంగా ఉన్నారు. నేను కూడా వెళ్లి వారిలో ఒకరిలాగ చేరతాను అనుకుని వచ్చి తండ్రి దగ్గర చేరటం. కొంత మంది ‘ఇగో’లకు వెళ్లి అవమానాలతో తిరిగి రాలేక ఇంకా సతమతవౌతూ ఉంటారు. జీవితాలను నాశనము చేసుకుంటారు. ఏ పరిస్థితులైనా ఎంత కష్టములో ఉన్నా చివరకు మనలను చేర్చుకునేది మనవారే, తల్లిదండ్రులే. వారిలో ఆ ప్రేమ ఉంటుంది. ఒకవేళ వారు చేర్చుకున్నా చేర్చుకోక పోయినా, మన పరమ తండ్రి మాత్రం మనలను చేర్చుకోటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడని గుర్తుంచుకోవాలి. చూడండి. పరమ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ‘వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను.’ అంతేకాదు వెంటనే ప్రశస్త వస్తమ్రులు త్వరగా తెచ్చి కట్టించి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన దూడను తెచ్చి వధించి గొప్ప విందు చేశాడు. తప్పిపోయిన కుమారుడు దొరికాడని ఎంతో సంతోషించారు.
ఇప్పుడు అసలు కథ మొదలు. మంచి కుమారుడు, తండ్రి చెప్పినట్లే చేస్తున్నాడు. పనులన్నీ చక్కబెడుతున్నాడు. పొలం పనికి వెళ్లి చక్కగా పనిచేసి తిరిగి వచ్చిన పెద్దకుమారుడు ఇంటిలో విందు జరుగుటకు కారణము తెలుసుకుని అతడు కోపపడి ఇంటిలోనికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చూడండి. పరమ తండ్రి ప్రేమ కూడా ఇలానే బ్రతిమాలుతోంది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న వారలారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిచ్చెను’ - మత్తయి 11:28. మనకు సేద తీర్చటానికి దేవుని ఇష్టం. మనము సంతోషముగా ఉండాలన్నది దేవుని అభీష్టము.
పెద్ద కుమారుడు తండ్రితో - ఇదిగో ఇన్ని యేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. నీ ఆజ్ఞను ఎన్నడునూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలకు తిని వేసిన రుూ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
అప్పుడు తండ్రి అన్న మాట చూడండి.
‘నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. నావన్నియు నీవి. నాదంతా నీదే గదా అయ్యా రా ఇంటిలోకి అంటే అలిగి వెళ్లిపోయినట్లు’ - లూకా 15:11-32.
అలిగితే ఆస్తిపాస్తులు పోవచ్చు. సహోదరులతో సత్సంబంధాలు ఉండవు. దేవునివన్నీ పొందుకునే గొప్ప అవకాశం పోతుంది. దేవునితో సహవాసము పోతుంది. విశ్వాసం సన్నబడుతుంది. దేవునితో సహవాసము, గైడెన్స్, ఆయన మాటలు వినే భాగ్యాన్ని కోల్పోతాము. జాగ్రత్త! ఈ పెద్ద కుమారుడు మంచివాడే కష్టపడతాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదు. అయినా అలుగుడు గుణాన్నిబట్టి దేవుడిచ్చేవన్నీ పోగొట్టుకున్నాడు. అందుకే చెరువు మీద అలగ వద్దన్నారు మన పెద్దలు. ఒక్కమాటలోనే అంతా అర్థమయ్యే అర్థవంతమైన హెచ్చరికలతో కూడిన సామెతలు మనవి.
ఇలాంటివి ఏదో ఒకటి కల్పించి భేదములు పెట్టి మనుషులను విడగొట్టేది సాతానుడు. అంతేకాదు దేవుని నుండి కూడా దూరపరుస్తాడు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు అలుగుట వలన కలిసి ప్రార్థనలు చేసుకోలేరు. మెల్లమెల్లగా అది పెరిగి పెరిగి దేవునికి కూడా దూరవౌతారు. దేవునికి దూరపరచేవి ఏవైనా దూరంగా ఉంచాలి. ఆత్మ సంబంధమైన విషయాలైతే దేవునికి దగ్గరగా చేస్తాయి.
బైబిల్ గ్రంథంలో యోనా మంచి ప్రవక్తే గానీ దేవుని మంచితనమును బట్టి, క్షమించే గుణాన్ని బట్టి దేవుని మీద అలిగి, దేవుడు వెళ్లమన్న నినెవె పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు వెళ్లే ఓడ ఎక్కి తప్పించుకుందా మనుకుంటాడు. కానీ దేవుని దృష్టి నుండి మనము తప్పించుకోలేము అని బైబిల్ తేటగా చెప్తుంది.
చెడ్డవారిని దేవుడు క్షమిస్తానంటే మంచివాళ్లు కోపముతో అసూయతో చెడ్డవారవుతున్నారు. మన ఇళ్లల్లో కూడా ఇది సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది. తప్పును క్షమిస్తే ప్రక్కవారికి కోపం వస్తుంది. అలుగుతారు. మాట్లాడరు. పనులు చేయరు. ఇక ఇల్లంతా ఎలా ఉంటుందో తెలుసా. అలానే యోనా కూడా నినెవె పట్టణస్థులు దోషులు గనుక శిక్ష పడితేనే మంచిది అన్నట్టు, ప్రభువు చెప్పిన మాటను వారికి చెప్పకుండా వేరే దేశము వెళ్లటానికి సిద్ధపడ్డాడు. ఏమి జరిగిందో మనకు తెలుసు. దేవుడు పెద్ద తుపాను పుట్టించి తాను వెళ్లే ఓడ బ్రద్దలై పోయే స్థితి వచ్చింది. వెళ్లమన్న స్థలానికి వెళ్లినట్లయితే వారందరు రక్షించబడతారు. వేరే స్థలానికి వెళ్తే మనతోపాటు మన చుట్టూ ఉన్నవారందరు కూడా నష్టపోతారు. కష్టపడతారు. మనం దేవుని చిత్తాన్ని చేస్తేనే మనకు మన చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదం. కీడు వచ్చింది యోనా నుంచేనని తెలుసుకున్న ఓడ నాయకుడు తనను సముద్రములో పడవేయటం చేప వచ్చి మ్రింగటం మూడు రోజులపాటు చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేయటం ఇదంతా మనకు తెలిసిందే. మనుషులను చేపలు మ్రింగుతాయా అంటే అవునని చెప్పవచ్చు. వెయిల్ షార్క్ అను జాతి తిమింగలము 20 మీటర్ల పొడవుండి 7వేల కిలోల బరువుంటుందట. అయితే దీని విశేషమేమిటంటే మనిషిని బాధపెట్టదు. దీని జీర్ణాశయపు అమరికను బట్టి ఇష్టములేని ఆహారమును కడుపులో నుండి బయటకు కక్కేసే ప్రత్యేకమైన అమరిక కలదు. ఇట్టి క్రియ ద్వారానే యోనా తిరిగి బయటపడగలిగాడని చెప్పవచ్చు. వాటిలో ఉన్న క్రొవ్వుతో అమర్చబడి బయటపడేటువంటి వాటికి ఎటువంటి హాని కలుగదట. దేవుడు తలుచుకుంటే సొర చెట్లను అప్పుడే పెంచి నీడ నిచ్చేట్టు చేస్తాడు. యోనా బహు సంతోషపడ్డాడట. ‘అయితే దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను’ - యోనా 4:7.
సొర చెట్టు నీడ లేక బాధపడుతున్న యోనాతో ప్రభువు చెప్పిన మాటలు - ‘నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే నూట ఇరువది వేల కంటే ఎక్కువై, కుడి యెడమలు ఎరుగని జనములు బహు పశువులును గల నినెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను. ఒక్కొక్కసారి మన ఆలోచనలు చాలా చిన్నగా సొరచెట్టు ఎండిపోయిందని బాధపడేట్టు ఉంటాయి. మన మనస్సును చిన్న విషయం మీదనే అంటే ఉపయోగము లేని విషయాల మీదనే ఉంటాయి. ఇటువంటి చిన్న విషయాలు సాకుగా చూయించి ఉంటే 120 వేలకు ఎక్కువైనవారే నశించేవారు. కానీ యోనాను వాడుకొని దేవవుడు నినెవె పట్టణాన్ని రక్షించాడు. ఇప్పుడు నిన్ను వాడుకుని గొప్ప జనాన్ని రక్షించాలని దేవుని ఆశ. దేవుని మంచితనాన్నిబట్టి క్షమాపణా గుణాన్నిబట్టి దేవుని మీద అలుగవద్దు. దేవుడు మనకేగాదు అందరికీ దేవుడు.
అసలు యోనా అలగటానికి కారణం చూడండి.
‘యెహోవా నేను నా దేశమందుండుగా ఇట్లు జరుగునని నేననుకుంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని’ - యోనా 4:2.
జాగ్రత్త! వేరే వాళ్ల మీద జాలి కృప కటాక్షము చూయిస్తున్నారని ఎవరి మీద అలగవద్దు, దేవుని మీద అసలు అలుగవద్దు. చేప మింగటమెందుకు, ముందే చెప్పిన పని చేద్దాం. తమ్ముడు తప్పిపోయి తిరిగొచ్చాడు గనుక తండ్రితోపాటు మనం కూడా సంతోషించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. ఇలా మనము పరలోకమందున్న తండ్రికి కుమారులై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256