Others

నెల వంక తొంగి చూసింది..(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1971లో విడుదలైన ‘రాజకోట రహస్యం’ చిత్రం కోసం సి నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన హొయలొలికే సొగసు పాట ఇది. ఓ యువ జంట విడదీయలేని అనుబంధాన్ని ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటూ.. పరవశించి పాడుకునే వలపు పాట. అత్యంత హృద్యమైన ఈ గీతాన్ని విజయా కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో అమర గాయకుడు ఘంటసాల, కోకిలమ్మ సుశీల ఆలపించారు. అంతకుమించి -అందాల కథానాయకుడు ఎన్టీ రామారావు, ముద్దుల బొద్దుగుమ్మ దేవిక తెరమీద తమ నటనతో మురిపించారు. నెలవంక తొంగి చూసింది/ చలిగాలి మేను సోకింది/ మనసైన చెలువ కనులందు నిలువ/ తనువెల్ల పొంగి పూచింది -ఇదీ పల్లవి. ఎంత మాధుర్యం కదూ. మనసైన భామ కనులముందు కనబడగానే తదియనాటి చందమామ, చలిగాలి తగిలినట్టుగా అనిపించిందట నాయకుడికి. మరి నాయికకో-చిరునవ్వు లొలికిస్తూ చెలికాడు పలుకరించగానే తనువంతా పులకరించి పోయిందట. ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమోగాని ఈ జన్మలో ఫలించిందని మురిసిపోయిందా ప్రియురాలు.
ఇక ఈ ప్రేమబంధం ఎంత విడదీయరానిదంటే- సుడిగాలులైన- జడివానలైన/ విడిపోని బంధమై వెలసె -అనే గట్టి నమ్మకం ప్రదర్శిస్తారు ఇద్దరూ. ఆనాటి వలపు పాట- ఈనాటి బ్రతుకు పాట/ ఈనాటి బ్రతుకుపాట- ఆనాటి కలువరింత/ ఈనాటి కౌగిలింత/ అని నాయకుడు, ఆనాటి, ఈనాటి బ్రతుకులను అన్వయించి చెబితే- నాయకి- ఏనాటికయిన ఏచోటనైన విడిపోని దోయి మన జంట -అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది.
సంగీత భరితమైన, భావగర్భితమైన ప్రేమ పాటలు చిత్రసీమలో ఎన్నో వేలున్నా.. పదుల్లో మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయే పాటలుగా చెప్పుకుంటాం. అలాంటివాటిలో ఈ పాట అగ్రభాగానే నిలుస్తుందనటంలో సందేహం లేదు. ఏ హృదయాన్నైనా ఇట్టే కదిలించే భావగర్భితమైన పాట -నెలవంక తొంగి చూసింది. నాలాంటి ఎందరికో బాగా నచ్చే పాట.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్