Others

కాంతారావు.. కాఫీ బిల్లు’ (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో వలసరవాక్కం గంగమ్మన్ కోయిల్ స్ట్రీట్- ఆ వీధి వీధంతా విఠలాచార్యకు చెందిందే. ఉదయం ఆరు గంటలకు ముందే ధూప దీప నైవేద్యాలతో శివపూజ జరుగుతుంది. వీధి వీధంతా ఓం నమఃశివాయ శబ్దాలు ప్రతిధ్వనిస్తూ వుంటాయి. విఠలాచార్య ఇంటి ముందు పెద్ద సినిమా హాలులాంటి గది. ఏడు గంటలనుండి ఫలహారం, కాఫీలూ ఎంతమంది సందర్శకులు వస్తే అంతమందికీ ఇస్తూంటారు. ఎవరికీ తెలియని విషయమేవిటంటే.. నిత్యం దానధర్మాలు చేసే ఏకైక వ్యక్తి విఠలాచార్య.
సినిమా ఇండస్ట్రీలో సినిమాలు లేక బాధపడుతున్నవాళ్లు ఒకప్రక్క బస్సు చార్జీ చూసుకొని.. విఠలాచార్యను దర్శించి తమ కష్టసుఖాలు చెప్పుకుంటే.. అది విన్న విఠలాచార్య ముఖ్యమైన, ప్రధానమైన అత్యవసరమైన సమస్యలకు పరిష్కారం చూపించి పంపిస్తారు. తొమ్మిది గంటల తరువాత ఎవరువచ్చినా ‘టీ’యిచ్చి పంపిస్తారు. దారి ఖర్చులు లేనివారికి దారి ఖర్చులిచ్చి పంపిస్తారు. కొంతమంది ఆస్థాన కళాకారులుండేవారు. అంజిగాడు (బాలకృష్ణ), కెకె శర్మ, నల్లరామ్మూర్తి, గణేశ్, సత్తిబాబు, మోదుకూరి సత్యం, గుంటూరు వెంకటేశ్ వీళ్లంతా ఎప్పుడూ తారసపడుతునే వుంటారు. వీరిలో కొంతమందికి నెల జీతాలిచ్చి పంపిస్తుంటారు. ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం!
ఇక సినిమా నిర్మాణం జోలికి వెళితే ఎలావుంటారో చూడండి. విఠలాచార్య అంత తక్కువ బడ్జెట్‌లో వేరెవరూ సినిమా తీయలేరంటే అతిశయోక్తి కాదేమో! యన్‌టిఆర్ కూడా ప్రొడక్షను ఎలా చెయ్యాలో విఠలాచార్య వద్దే నేర్చుకోవాలి అంటుండేవారు. నటీనటుల పారితోషికం విషయంలో చాలా ఖరాఖండీగా వుంటారు. అందరూ లక్ష రూపాయలు ఇస్తుంటే ఈయన ఇరవై వేలే ఇస్తానంటారు. పక్కాగా ఎగ్రిమెంటు చేసుకుంటారు. ఇస్తానన్న సొమ్ము ఇంటికి భద్రంగా పంపించేస్తారు. రూపాయి తేడావుండదు.
ఎక్కువ వర్క్ సెకండ్ హాండ్ సెట్టూ... కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్సూ, ప్రాపర్టీస్‌తోనే షూటింగు జరిపించేస్తారు. ‘గురువుని మించిన శిష్యుడు’ చిత్రం సమయంలో కృష్ణకుమారి బిజీగావుంది. విఠలాచార్య సినిమా చెయ్యాలంటే ఒక్క సినిమా వదులుకోవలసిందే. మంచి పాటలు. పైగా విఠలాచార్య డైరెక్షనూ- తన పరిస్థితిని వివరించి చెప్పింది కృష్ణకుమారి. విఠలాచార్య ఆమె పరిస్థితిని గమనించి ముందనుకున్న రెమ్యూనరేషనుకంటే ఎక్కువ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈ విషయం కాంతారావుకి తెలిసింది. ‘సరే-ముందు ఒప్పుకున్న రెమ్యూనరేషన్ కంటే కృష్ణకుమారికి ఎక్కువ ఎవౌంట్ ఇస్తున్నారో అంత ఎవౌంటు నాకూ ఇవ్వాలని పట్టుబట్టాడు. ససేమిరా కుదరదని చెప్పి పంపించేశాడు. కాంతారావుకి ముందునుయ్యి వెనుక గొయ్యిలా అనిపించింది. సినిమా చెయ్యాలా? మానాలా? ఆలోచించుకొని చివరకు చేయడానికి నిర్ణయించుకున్నాడు.
రెగ్యులర్‌గా షూటింగు జరుగుతోంది. కాంతారావు కాంబినేషన్‌లో సీన్సు, సాంగ్స్, ఫైట్సూ సింగిల్ ఫ్రేమ్ కూడా బాలన్సు వర్క్ లేకుండా విఠలాచార్య చేసి పంపించేశారు. డబ్బింగ్ కార్యక్రమం కూడా ముగిసింది. డబ్బింగ్ ముగిశాక నటీనటులతో పనేముంటుంది? కాంతారావుకి ఇవ్వవలసిన బాలన్సు ఎవౌంట్ లెక్కచూసి కవర్లోపెట్టి వుంచారు. అది ఇస్తూ ‘ఇది మీ సెటిల్‌మెంట్ ఎవౌంట్- లెక్కపెట్టుకోండి!’ అని స్ట్రెష్ చేస్తూ చెప్పాడు విఠలాచార్య.
అందులో ఒక అయిదువేలు రూపాయలు తక్కువున్నై. ‘అదేవిటండీ.. కనీసం మీరుచెప్పిన ఎవౌంట్ కూడా ఇవ్వలేదు. ఇందులో అయిదువేలు బొక్క!’ అన్నాడు కాంతారావు కోపంగా.
‘చూడండి కాంతారావుగారూ! మీరు హీరోలు. బొక్కపడినా పూడ్చుకోగలరు. మేం నిర్మాతలం. మీరు షూటింగు సమయంలో మీ ఇష్టమొచ్చినట్టు ఆర్డర్లు జారీచేశారు. అలాగే కారుని మీ ఇష్టం వచ్చినట్టు తిప్పారు. నా లిమిటేషనే్సవో నాకుంటాయి. అంతకుమించి ఖర్చయితే తట్టుకోలేను కదా. మన్నించండి ఈసారి నాతో కలిసి పనిచేస్తే ప్రొడక్షను విషయంలో జాగ్రత్తగా వుండండి!’ అంటూ పంపించేశాడు. సినిమా సూపర్ హిట్ అయ్యాక ఫోన్‌చేసి ఇంత పెద్ద హిట్ అయింది కదా, ఇపుడైనా నాగురించి ఆలోచిస్తారా? అంటూ ఫోన్‌చేశాడు కాంతారావు.
‘ఇంత గొప్ప పేరొచ్చినందుకు మీరే నాగురించి ఆలోచించండి. డబ్బులు ఖర్చయిపోతాయి. పేరు శాశ్వతంగా వుండిపోతుంది’ సమాధానమిచ్చాడు ఆచార్య.

-ఇమంది రామారావు 9010133844