Others

యస్.. కృష్ణంటే కృష్ణే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యస్! కృష్ణంటే కృష్ణే. నటనలో ఆయన బాణీ ఆయనదే. డైలాగ్‌లో ఆయన స్టయిల్ ఆయనదే. డ్యాన్స్‌ల్లోనూ ఆయన ధోరణి ఆయనదే. ఫైట్స్‌లోనూ ఎప్పటికీ మార్పు కనిపించని ఆయన మూవ్‌మెంట్స్ ఆయనవే. అందుకే -పరిశ్రమలో ఆయనకు ఎవరూ పోటీ కాదు, ఆయన ఎవరికీ పోటీ కాదు. నిజానికి -ఒక నటుడు ప్రేక్షకుల నాడి పట్టుకోగలిగితేనే, కెరీర్ నల్లేరుపై నడకలా సాగేది. సూపర్‌స్టార్‌గా అభిమానుల నుంచి ఆదరణ అందుకున్న నటశేఖర్ కృష్ణకు -అలా నాడి పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే స్టార్‌డమ్ దక్కింది. అందుక్కారణం -ఆయన సోలో స్టయిల్. మిగిలిన వాళ్లకు అనుకరింపవశంకాని నటన ఆయనది.
***
సూపర్‌స్టార్‌గా కృష్ణ అప్రతిహతంగా సినిమాలు చేసిన రోజుల్లోనే -ఆయన చిత్రాలు మిగిలిన వాళ్ల ఏ చిత్రానికీ పోటీగా రాలేదు. కానీ -ప్రతి సినిమా మిగిలిన సినిమాకు పోటీగానే నిలిచాయి. అందుకే -కృష్ణకు కృష్ణే పోటీ. అలానే -దాదాపు 350 చిత్రాలు పూర్తి చేసేశారు కృష్ణ. ఇంకా చేస్తూనే ఉన్నారు. జనరేషన్స్ మారుతున్న నేపథ్యంలో ఆయన సినిమాల సంఖ్య తగ్గి ఉండొచ్చేమోగానీ, పూర్తిగా స్క్రీన్‌కు దూరం కాలేదు. ఆయన తరువాతి జనరేషన్స్‌లో ఎందరో హీరోలుగా వచ్చి కనుమరుగైపోయినా -కృష్ణ మాత్రం ఎప్పటికీ హీరోనే. వయసురీత్యా సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గించినా -అప్పుడప్పుడు అభిమానులకు కనువిందు చేయడానికి పూర్తి నిడివి పాత్రలో, అతిథి పాత్రల్లోనో కృష్ణ కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీశ్రీ విడుదలకు సిద్ధమవుతోంది.
తెలుగులో తొలి అపరాధ పరిశోధక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ కెరీర్ సామాన్యమైనది కాదు. తొలి చిత్రంలో రాముడు మంచి బాలుడిగా నటించి, తర్వాత సాక్షిలో అమాయకుడిగా కనిపించిన కృష్ణే, తరువాత మాస్ చిత్రాల్లో హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఎగురవేశారు. 1943 మే 31న జన్మించిన బుర్రిపాలెం బుల్లోడి సినీ ప్రస్థానంలో పూల దారులేకాదు, ముళ్లబాటలూ దాటొచ్చారు. అన్నిటినీ సమానంగా స్వీకరిస్తూ ప్రేక్షకుల దీవెనలే పరమావధిగా సాగిన హీరోగా అన్ని రకాల భావోద్వేగాలున్న పాత్రల్లో నటించి మెప్పించారు.
ముఖ్యంగా జేమ్స్‌బాండ్ తరహా పాత్రల్లో ఇమిడిపోయారు. గూఢచారి 116 తర్వాత అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోయిజం పాత్రల్లో కృష్ణ ఒదిగిపోయిన విధానం ఆ తర్వాత అనేకమైన అటువంటి చిత్రాలకు నాందిగా మారింది. ఉపాయంలో అపాయం, అవేకళ్లు, సర్కార్ ఎక్స్‌ప్రెస్, నేనంటే నేనే, లవ్ ఇన్ ఆంధ్రా, శభాష్ సత్యం, టక్కరిదొంగ చక్కని చుక్క, జగత్ కిలాడీలు, పగసాధిస్తా, అందరికీ మొనగాడు, మాస్టర్ కిలాడీ, పట్టుకుంటే లక్ష, నమ్మకద్రోహులు, మోసగాళ్లకు మోసగాడు, చలాకీరాణి కిలాడీరాజా, జేమ్స్‌బాండ్ 777, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, రాజ్‌మహల్, పగసాధిస్తా, మావూరి మొనగాళ్లు, గూడుపుఠాణి, నిజం నిరూపిస్తా, కత్తులరత్తయ్య, మంచివాళ్లకు మంచివాడు లాంటి సిఐడి తరహా పాత్రలు, ఏజెంట్ గోపి లాంటి చిత్రాలలో చేసిన హీరోయిజమ్ ఉన్న మాస్ తరహా పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు. ఒక నటుడిని ఎలాంటి పాత్రలతో ఉత్తమ నటుడుగా నిర్ణయిస్తాం. ఎలాంటి పాత్రైనా సరే అందరికీ నచ్చేలా నటించగలిగినవాడే ఉత్తమ నటుడు. హీరోయిజమ్‌వల్ల మాస్ ఎలిమెంట్స్ చిత్రాలలో హీరో కృష్ణ ఉన్నాడంటే కాసుల వర్షం కురిసేది. ముఖ్యంగా కృష్ణ 1962లో సినీ జీవితాన్ని ప్రారంభించి, పదండి ముందుకు, కులగోత్రాలు, పరువుప్రతిష్ఠ లాంటి చిత్రాలలో అనామకమైన పాత్రల్లో నటించారు. 1965 నుండి తేనెమనసులు చిత్రం ద్వారా పూర్తిస్థాయి కథానాయకుడుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మరపురాని కథ, అత్తగారు కొత్తకోడలు, ఉండమ్మా బొట్టుపెడతా, స్ర్తి జన్మ, నిలువుదోపిడి, విచిత్ర కుటుంబం, అక్కాచెల్లెలు, మంచి కుటుంబం లాంటి ఉత్తమ చిత్రాలలో కూడా ఉత్తమమైన నటన ప్రదర్శించారు. మోసగాళ్లకు మోసగాడు చిత్రం విజయవంతమయ్యాక జేమ్స్‌బాండ్ తరహా క్రైమ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా కృష్ణ నిలిచారు. ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క విధంగా ప్రేక్షకుల్ని ఆయా చిత్రాలలో అపరాధ పరిశోధక కథానాయకుడుగా ఆయన నటించిన తీరు అనితర సాధ్యం. ముఖ్యంగా దొంగలకు దొంగ, భలేదొంగలు, దొంగలొస్తున్నారు జాగ్రత్త, దొంగలు బాబోయ్ దొంగలు, దొంగల దోపిడి, దొంగల వేట, దొంగలకు సవాల్ లాంటి చిత్రాలన్నిటికీ ఆయనే కథానాయకుడు. ఒక నటుడిలో మాస్ ఎలిమెంటేకాక డ్రామా, ఉదాత్తమైన, సున్నితమైన భావనలు పలికే పాత్రల్లో కూడా కృష్ణ అలవోకగా జీవించారు. అత్తగారు కొత్తకోడలు, లక్ష్మీనివాసం, అమ్మకోసం, ఇన్స్‌పెక్టర్ భార్య, అబ్బాయిగారు అమ్మాయిగారు, పుట్టినిల్లు మెట్టినిల్లు, అల్లూరి సీతారామరాజు, రాధమ్మ పెళ్లి, గౌరి, ఇంధ్రధనస్సు, దేవదాసు, శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్, కొల్లేటి కాపురం, దేవుడే గెలిచాడు, కురుక్షేత్రం, ఈనాటి బంధం ఏనాటిదో, మూడుపువ్వులు ఆరుకాయలు, హేమాహేమీలు, బండోడు గుండమ్మ, ఊరికి మొనగాడు, గురుశిష్యులు, ముగ్గురు ముగ్గురే, కృష్ణావతారం, ఈనాడు, అంతం కాదిది ఆరంభం, అగ్నిపర్వతం, జమదగ్ని, పల్నాటి సింహం, సింహాసనం, ముద్దాయి, ప్రజానాయకుడు, నంబర్ వన్ లాంటి చిత్రాల్లో ఆయన విశిష్టమైన నటనతో మాస్ చిత్రాల కథానాయకుడిని మరిపించారు. తన కత్తికి అటు క్లాసు, ఇటు మాసు పదును ఉన్నాయని నిరూపించారు. క్లాస్ చిత్రం చేసినా మాస్ చిత్రం చేసినా ప్రేక్షకులు ఆయన నటనను మెచ్చుకున్నారే కానీ ఎక్కడా విమర్శలు ఎదురుకాలేదు. అటు క్లాస్ అయినా మాస్ అయినా తన పంధాలో నటించే కృష్ణ అటు పురాణ పాత్రల్లో అర్జునుడుగా కురుక్షేత్రంలో నటించి మెప్పించారు. ఇద్దరు మొనగాళ్ళు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు, దొంగల దోపిడీ, సింహాసనం ఇలాంటి జానపద చిత్రాలలో నటించి జానపద కథానాయకుడు అనిపించుకున్నారు. ఒకానొక సమయంలో దానవీర శూరకర్ణ చిత్రానికి పోటీగా కురుక్షేత్రం, దేవదాసులో నాగేశ్వరరావు నటనకు దీటుగా మరో దేవదాసుగా తాను నటించి మెప్పించారు. ప్రేక్షకులకు జానపదాలపై ఉన్న మక్కువను అపరాధ పరిశోధక కథలపై మళ్లించి అటువంటి చిత్రాల విజయానికి దోహదం చేశారు. ఇన్ని చేసినా ఆయన కెరీర్ ఒడుదుడుకులు ఎదుర్కొన్నా అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి విజయం సాధించారు. అందుకే గట్స్‌వున్న ఘట్టమనేని అయ్యారు.

-తిలక్