Others

పొట్టిప్లీడరు ( ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
నృత్యం: పసుమర్తి, చిన్ని, సంపత్, తంగప్ప, కెఎస్ రెడ్డి
సంగీతం: కోదండపాణి
కళ: బిఎన్ కృష్ణ
ఎడిటింగ్: ఎంఎస్‌ఎన్ మూర్తి
కెమెరా: ఎంజి సింగ్
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
నిర్మాత: బి పురుషోత్తం
(పద్మనాభం తమ్ముడు)
దర్శకత్వం: కె హేమాంబరధరరావు.

ప్రముఖ రచయిత భమిడిపాటి కామేశ్వరరావు కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ, తండ్రిబాటలోనే హాస్య రచయితగా రాణించారు. పలు నాటకాలు రాశారు. ప్రముఖ నిర్మాత డూండీ ద్వారా ‘మరపురానికథ’ చిత్రంతో ఈయన సినీ రంగానికి పరిచయమయ్యారు. 60, 70కి పైగా చిత్రాలకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ‘ఇదేమిటి’ నాటిక రాశారు. దాని ఆధారంగా రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై పద్మనాభం నిర్మించిన చిత్రమే -పొట్టిప్లీడరు. ఇక ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ సోదరుడు కె హేమాంబరధరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రఘురామ్ ఫిలింస్ పతాకంపై నిర్మాతగా ‘తండ్రులు-కొడుకులు’, ‘కలవారి కోడలు’ చిత్రాలు ఆయన రూపొందించినవే. 20కి పైగా తెలుగు, కొన్ని ఒరియా చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవంతో ‘పొట్టిప్లీడరు’కూ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు హేమాంబరధర రావు.

అప్పట్లో ఈ చిత్రం టైటిల్సే ఓ వైవిధ్యం. స్కూలు పిల్లలకు బోర్డు చూపుతూ ఒక్కొక్కరినీ పరిచయం చేస్తానని పద్మనాభం చెప్పే డైలాగ్‌పై టైటిల్స్ మొదలవుతాయి. తొలుత రికార్డింగులపై శోభన్‌బాబు, గీతాంజలి, వాణిశ్రీ పేర్లు, ఫొటోలు చూపిస్తారు. తరువాత స్టార్ గుర్తులపై నటీనటులు పేర్లు వస్తాయి. సాంకేతిక నిపుణులను తమ శాఖల చిత్రంతోపాటు వ్యక్తులను చూపిస్తూ.. గీత రచయితలను, గాయకులను విడివిడిగా.. వాణి ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్స్‌ను పూలదండలతో అభినందించడం.. చివరిగా దర్శకులను, నిర్మాత సోదరుని పరిచయం, తరువాత పొట్టి ప్లీడరుగా తనను పద్మనాభం పరిచయం చేసుకోవడంలో ఓ కొత్తదనాన్ని చూపారు.
వకీలు మనుషుల మధ్య మంచిని పెంచాలి. ప్రాణం పోయినా నిజం కోసం నిలబడాలి -అనే ఉన్నత ఆశయాలుగల తండ్రి మాటలు ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడవాలనే నిశ్చయంతో ప్రసాద్ (పద్మనాభం) వైజాగ్‌లో బిఎ, ఎల్‌ఎల్‌బి చదువుతాడు. చదువు పూర్తయ్యాక పల్లెటూరులో తల్లి నిర్మల వద్దకు వస్తాడు. అతడు ఫస్ట్‌క్లాసులో ఎల్‌ఎల్‌బి ఉత్తీర్ణుడైనట్టు వార్త వచ్చిన వెంటనే తల్లి మరణిస్తుంది. తన చదువుకు సాయంచేసిన లక్ష్మయ్య (పెరుమాళ్ళు) బాకీని ఇల్లు, పొలం అమ్మి తీరుస్తాడు ప్రసాద్. అక్కడినుంచి పట్నంలోని మేనమామ ధనరాజ్ (రమణారెడ్డి) ఇంటికి వెళ్తాడు. మరదలు శాంత (గీతాంజలి)ని చిన్ననాటి నుంచి అభిమానించి ప్రేమిస్తాడు. ధన్‌రాజ్ ఇంటిలో రామారావు (శోభన్‌బాబు) కాలేజీలో బిఏ చదువుతూ అద్దెకు ఉంటుంటాడు. శాంత, రామారావు ప్రేమించుకుంటారు. డబ్బు ఆశగల ధన్‌రాజ్ ప్రసాద్‌ను ఇంటినుంచి వెళ్ళగొడతాడు. బయటకు వచ్చిన ప్రసాద్ ఒక యాక్సిడెంట్ కారణంగా లాయర్ అబద్ధాలరావ్ (రావికొండలరావు)ను కలుసుకొని అతని వద్దే అప్రెంటీస్‌గా చేరతాడు. వారి అమ్మాయి విజయ (వాణిశ్రీ) ప్రసాద్‌ను ప్రేమిస్తుంది. ప్రసాద్ కొన్న లాటరీ టిక్కెట్టుకు 2 లక్షల రూపాయల ప్రైజ్ రావటతో, ధన్‌రాజ్ మేనల్లుడిని బతిమాలి శాంతతో పెళ్లి జరిపిస్తానని తన ఇంటికి తీసుకెళ్తాడు. శాంత, రామారావును ప్రేమించిందని తెలిసిన ప్రసాద్, వారి పెళ్లి జరగటం కోసం 2 లక్షలు శాంత పేరిట డిపాజిట్ చేస్తాడు. శాంత, రామారావుల పెళ్లి జరిగాక, ప్రసాద్ నిజాయితీతో ప్రముఖ ప్లీడర్‌గా ఎదుగుతాడు. శాంతకు ఒక బాబు పుట్టాక, ఒకనాడు రామారావు తన స్నేహితుడు, జమీందారు నారాయణరావు (ప్రభాకర్‌రెడ్డి)ను హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేస్తారు. శాంత, ప్రసాద్‌ను ఆశ్రయిస్తుంది. ప్రసాద్ తన వాదనాపటిమ, ప్రియురాలు విజయ సాయంతో కేసు శోధించి, రామారావు పోలికలున్న మరో వ్యక్తి ఈ హత్య చేశాడని నిరూపించి, రామారావును ఉరిశిక్ష నుంచి తప్పిస్తాడు. విజయ, ప్రసాద్‌ల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో అతిథి నటులుగా జగ్గయ్య, డి రామానాయుడు కోర్టు సీనుల్లో జడ్జీలుగా అభినయించారు. లాటరీ ఏజెంటు భజగోవిందంగా పేకేటి శివరామ్, ధన్‌రాజ్ నౌకరు చలమయ్యగా బాలకృష్ణ, ప్రాసిక్యూటర్ ఐరావతంగా ముక్కామల, ఇంకా రామచంద్రరావు, మల్లాది, జగ్గారావు, వంగర సీతారాం, జూనియర్ భానుమతి ఇతర పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో నీతి, నిజాయితీ, మంచితనం కలిగిన హీరో ప్రసాద్ పాత్రను పద్మనాభం పోషించాడు. అనాథలపట్ల జాలి, అన్యాయాన్ని ఎదిరించటంలో సాహసం, తను ప్రేమించిన యువతి సౌఖ్యం కోసం డబ్బును తృణప్రాయంగా చూసే సంస్కారం, తండ్రి బాటలో మంచి ప్లీడరుగా ఎదగాలనే ఆశయం, తన వివాహం, సుఖాలను ఆశించని నిస్వార్థం- ఇలా పలు పరిణితిగల సన్నివేశాల్లో పరిధికి మించని సున్నితమైన నటనతో పద్మనాభం మెప్పించారు. హాస్యనటుడిగా రాణించినా, పద్మనాభంలోని మరోకోణాన్ని వెలికితెచ్చిన పాత్ర పొట్టిప్లీడర్. శోభన్‌బాబు, గీతాంజలి, వాణిశ్రీ తమ పాత్ర పరిధుల మేరకు ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. దుడుకుతనం, చిలిపితనంతో వాణిశ్రీ ఆకట్టుకుంటుంది. ఇక దర్శకులు ప్రతి సన్నివేశాన్నీ పట్టుతో చిత్రీకరించారు. చిన్న చిన్న సంఘటనలను సైతం ఆకట్టుకునేలా చిత్రీకరించి ఆయా సన్నివేశాలకు ప్రాణం పోశారు. అనాథలకు ప్రసాద్ ఫలహారాలు పెట్టించటం, మేనమామ కోపం, లాటరీ టిక్కెట్లు కొంటున్న మేనమామను ప్రసాద్ తన పేర ఒక టిక్కెట్టు తీసుకోమని కోరినపుడు అతను తిరస్కరించటం, ఒక రూపాయి తెచ్చి ప్రసాద్ తనకు టిక్కెట్టు శాంత చేత కొనిపించుకోవటం, శాంతతో పెళ్లి చేయిస్తానంటే మేనమామ వద్దకు ప్రసాద్ ఆశతో వెళ్ళటం లాంటి సన్నివేశాలను రక్తికట్టించారు. విజయ ఆత్మహత్య చేసుకుంటుందంటే కాపాడిన ప్రసాద్ ‘నాకోసం నీవు బ్రతకాలి విజయా’ అనగానే ఆమెలో ఆనందం పెల్లుబుకుతుంది. తరువాత తాను బ్రహ్మచారిగా వుంటానని, ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రసాద్ చెప్పటంతో విజయలో కోపం, శపథం చేయటం, వెంటనే మరునాడు మాట్నీకి సిద్ధంగా ఉండమని ప్రసాద్‌తో విజయ చెప్పటం- ఇలా చిన్న చిన్న సన్నివేశాల్లో కూడా ఎంతో ఆర్ద్రత, అభిమానం, శాంతాన్ని మేళవించి పలు అంశాలతో ఆకట్టుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు కె హేమాంబరధరరావు. గీతాంజలి, పద్మనాభం, రమణారెడ్డి, బాలకృష్ణపై చిత్రీకరించిన గీతం -పేకాట బొమ్మలు జోరు/ ఆటీన్ రాణి జాకీయంలో, చక్కనిచోట ఆకసంలో నవ్వుతున్న చంద్రుని బొమ్మ, డబ్బు చెట్టు, గాడిదలపై బాలకృష్ణ డబ్బు తేవటం ఎంతో తమాషాగా అర్థవంతంగా చిత్రించారు. -అందమన్నది నీలో చూడాలి/ ఆశలన్నీ నీతో తీరాలి (నిటలాక్షుడు పద్యం పేరడీ, గానం ఎస్ జానకి, పిఠాపురం, మాధవపెద్ది, రచన-ఆరుద్ర) అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే వౌత్ ఆర్గాన్ వాయిస్తూ పద్మనాభం పట్నం వెళ్తుంటే.. పిల్లలు, రైలు కూత, పిల్లనగ్రోవి వాయిస్తూ మాస్టర్ మురళి (పద్మనాభం కుమారుడు), పంట పొలాలు, రోడ్డువెంట సాగే సందేశ గీతంలో వేదాంతధోరణి కొంత కన్పిస్తుంది. -చీకటి విచ్చునులే వెనె్నల వచ్చునులే ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు ఆలపించిన ఏకైక గీతమిది. కొసరాజు రచించారు. సముద్రపు ఒడ్డున సరుగుడు తోటల్లో శోభన్‌బాబు, గీతాంజలిపై చిత్రీకరించిన యుగళగీతం -ఊగెను మనసు/ పొంగెను వయసు ఎందుకనో (పి సుశీల, పిబి శ్రీనివాస్, రచన-దాశరథి). వారిరువురి వివాహం అయ్యాక చక్కని తోట, నీటి ఫౌంటెన్, శ్రీకృష్ణుని విగ్రహం ముందు సాగే మరో యుగళగీతం -జల్లుమని నను సోకెను గాలి/ గుండెలలో వింత చలి (గానం- టిఆర్ జయదేవ్, సుమిత్ర, రచన -వీటూరి) పద్మనాభాన్ని ఆటపట్టిస్తూ వాణిశ్రీ పాడే గీతం -పోపోపో పొట్టి ప్లీడర్‌గారు/ లవ్‌లో జాలీ ఏల చూడరు మీరు (ఎల్‌ఆర్ ఈశ్వరి, పద్మనాభం, రచన- కె అప్పలాచార్య). మరో గీతం -ఇదిగో ఇదిగో తమాషా బ్రతుకంతా సరదాగా’ (ఎస్ జానకి బృందం, రచన -రాజశ్రీ). ఈ చిత్రంలో గీతాంజలి తన బాబును ఊయలలో ఊపుతూ పాడే విషాద గీతం, జైలులో శోభన్‌బాబు, తన ఇంటిలో సోలోగా వౌత్ ఆర్గాన్ వాయిస్తూ పద్మనాభం, రమణారెడ్డిలపై చిత్రీకరణ -లాలీజో లాలీజో నీకెందుకో, నీకెందుకో మురిపాలు కురిపించు చిరునవ్వులు కనరాని నీ తండ్రి కనిపించునా (పి సుశీల - రచన -శ్రీశ్రీ). ‘పొట్టిప్లీడరు’ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.
నటునిగా, నిర్మాతగా పద్మనాభానికి మంచి పేరు సంపాదించి పెట్టింది. శోభన్‌బాబు, వాణిశ్రీలకు ఆ తరువాత మరింతగా రాణించే అవకాశాలు, పాత్రలు దొరకటానికి ఈ చిత్రం దోహదపడింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి