కృష్ణ
రోడ్డెక్కని ‘జనతా’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మచిలీపట్నం: కొరలు చాస్తున్న కరోనా మహమ్మారి స్వీయ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లా వాసులు జనతా కర్ఫ్యూని పాటించారు. దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించి ఇళ్లకు పరిమితం కావడం విశేషం. ప్రపంచానే్న గజగజవణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజలంతా స్వచ్ఛంద నిర్భంధంతో సంపూర్ణ సహకారం అందించడం విశేషం. బిజీ లైఫ్ స్టైల్‌లో కుటుంబ బాంధవ్యాలనే మరచిపోతున్న రోజుల్లో జనతా కర్ఫ్యూ ఒక్కసారిగా వాటి విలువేమిటో ప్రజలకు తెలియచెప్పిదనక తప్పదు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆదరాభిమానాన్ని, అనురాగాలను జనతా కర్ఫ్యూ ప్రస్ఫుటింప చేసింది. కరోనా పుణ్యమా అంటూ తమ తమ దైనందిన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుని తమ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపామన్న భావన సగటు మానవుడిలో వ్యక్తమైంది. మరో పక్క కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలను విధిగా పాటించారు. వైద్య ఆరోగ్య శాఖాధికాలు సూచించిన ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే రోడ్ల మీదకు వస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఇకపోతే జనతా కర్ఫ్యూ కారణంగా ఎటు చూసినా జన సంచారం లేక వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఏ వీధి చూసినా జనం లేక వెలవెలబోయాయి. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులతో పాటు నగర, గ్రామీణ వీధులు సైతం నిర్మానుష్యంగా దర్శనమివ్వడం విశేషం. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా ప్రైవేట్ వాహనాలు టాక్సీ స్టాండ్ దాటి బయటకు రాని పరిస్థితి కనిపించింది. ఈ నెలాఖరు వరకు రైళ్ల రాకపోకలన్నీ పూర్తిగా నిలిపి వేయటంతో రైల్వే స్టేషన్‌లు కూడా నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. అత్యవసర సేవలు మినహా ఇతర సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం మెడికల్ షాప్‌లు, ప్రభుత్వ వైద్యశాలలు మాత్రమే పని చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ తెరుచుకోలేదు. ఇప్పటికే జిల్లాలో పర్యాటక ప్రాంతాలతో పాటు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసి వేసిన సంగతి తెలిసిందే. పలు ప్రముఖ దేవాలయాలతో పాటు చిన్న పాటి ఆలయాల్లో సైతం స్వామివార్ల దర్శనాలను ప్రభుత్వం నిలిపి వేసింది. కర్ఫ్యూ కారణంగా ప్రజలెవ్వరూ ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఫలించాయి. కర్ఫ్యూపై విస్తృత ప్రచారం కల్పించటంతో ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రాకపోవటంతో విపత్కర పరిస్థితులేమీ ఎదురవ్వలేదు. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం రోడ్ల మీదే ఉండి కర్ఫ్యూను పర్యవేక్షించింది. వీరి సేవలకు ప్రజలు సైతం హర్షించారు. గడిచిన వారం పది రోజులుగా కరోనా నియంత్రణకు అధికారులు, పోలీసులు, మీడియా కృషిని హర్షిస్తూ ప్రజలంతా సాయంత్రం 5గంటల సమయంలో తమ తమ ఇళ్ల నుండే కృతజ్ఞతలు తెలియచేసి కర్ఫ్యూను కొనసాగించారు.