రాష్ట్రీయం

నల్లా, విద్యుత్ బాకీలు మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్‌కు కెసిఆర్ 423 కోట్ల నజరానా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక అధికారిక ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకున్న గృహ విద్యుత్ బకాయిలు, నల్లా బకాయిలు మొత్తంగా కలిపి రూ. 423 కోట్లు మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని, కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు గ్రేటర్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. క్యాంపుకార్యాలయంలో గురువారం హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు తీగుళ్ళ పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నరసింహ్మారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. నగరంలో చాలా మంది యాబై, వంద లోపు యూనిట్ల విద్యుత్ వినియోగించుకుంటున్నప్పటికీ వారంతా పేదలు కావడంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నారని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవచ్చారు. అలాగే వంద యూనిట్లకు పైగా విద్యుత్ వాడుకుంటున్నవారు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా బిల్లులు చెల్లించలేకపోతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి విద్యుత్ అధికారులను పిలిపించి మాట్లాడారు. నగరంలో దాదాపు ఆరు లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు దాదాపు రూ. 128 కోట్ల మేర బకాయి పడినట్టు అధికారులు వివరించారు. ఆర్థిక కారణాల వల్ల విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల బకాయిలు పేరుకుపోయాయని అధికారులు వివరించారు. ఈ బకాయిలన్నింటినే మాఫీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. విద్యుత్ బకాయిలు మాత్రమే కాకుండా నగరంలో మూడు లక్షల కుటుంబాలు పేదరికం కారణంగా మంచినీటి (నల్లా) బిల్లులు చెల్లించలేకపోతున్నారని కూడా మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ వెంటనే జలమండలి అధికారుల నుంచి నల్లా బకాయిల వివరాలను ముఖ్యమంత్రి తెప్పించుకోగా, ఇప్పటి వరకు రూ. 295 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు వివరించారు. దీంతో వాటిని కూడా మాఫీ చేయాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించడం సాధ్యం కాదని, కోడ్ ముగిసిన వెంటనే విద్యుత్, నల్లా బకాయిల మాఫీ నిర్ణయాలను ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంచినీరు, విద్యుత్ సరఫరా వంటివి ప్రజలకు అత్యంత అవసరమైన వౌలిక సదుపాయాలని, వాటిని లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో ప్రభుత్వం ప్రజలకు అందించాల్సి ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇకపై మంచినీరు, విద్యుత్ సరఫరా, రవాణా తదితర వౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వానికి ఆర్థిక భారమైనప్పటికీ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పారు. ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.