కథ

ఎంత పచ్చనిది ఈ చిన్ని ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
అనంతరావుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది.
గుండెల్లో సన్నని సెగ మండుతున్నట్టుగా ఉంది. గుండె పట్టుకుని బాధతో విలవిల్లాడుతూ లేచి కూర్చున్నారు. ఒళ్లంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. గుండెపోటు వచ్చిందేమోనని అనుమానం కలిగింది. మరి ఆలస్యం చెయ్యలేదు.
పర్సూ, కారు తాళమూ తీసుకుని సెల్లార్‌లోని కారు దగ్గరికెళ్లాడు. తనే డ్రైవ్ చేసుకుంటూ దగ్గర్లోని ఆసుపత్రిలో చేరాడు.
అతడి పరిస్థితికీ, ధైర్యానికీ ఒకేసారి ఆశ్చర్యపడి గబగబా అత్యవసర విభాగంలోకి తీసుకుపోయారు.
మర్నాటి ఉదయం వచ్చిన పనిమనిషి చంద్రిక, ఫ్లాట్‌కి వేలాడుతున్న తాళం చూసి విస్తుబోయింది. ముందుగా చెప్పకుండా ఎక్కడికీ వెళ్లని అనంతరావు ఏమయ్యారో అర్థంకాలేదు. ఇరుగు పొరుగునీ వాచ్‌మేన్‌నీ అడిగింది. తెలీదన్నారంతా.
తన సెల్‌లో వెదికి, పూణెలో ఉంటున్న ఆయన పెద్దకూతురు రమకి ఫోన్ చేసి సంగతి చెప్పింది.
రమ కంగారుపడిపోయింది. ఆ చుట్టుపక్కల వెదకమని అర్థించింది. కారు ఉందో లేదో చూడమని కోరింది. కారు లేదని తెలిశాక కొంచెంగా స్థిమితపడింది.
‘ఎక్కడికో ఏ అర్జంటు పని మీదో వెళ్లుంటారు... ఒకవేళ ఆరోగ్యం బాగోక హాస్పిటల్‌కెళ్లారేమో, కాలనీలోని అన్ని ఆసుపత్రుల్లోనూ వెదుకుతావా? ఆటోలో వెళ్లి వెతుకు. ఎంత ఖర్చయినా ఇచ్చేస్తానే్ల. త్వరగా వెళ్లు’
తండ్రి గురించిన ఆందోళన అంతకంతకూ అధికమవుతోంటే ఆయన గురించే ఆలోచిస్తూ కూర్చుంది రమ.
అనంతమూర్తి అదో తరహా మనిషి. ఎవర్తోనూ కలవరు. ఎక్కువగా మాట్లాడరు. ఇంట్రావర్ట్. ఇప్పుడే కాదు మొదట్నుంచీ ఆయన తీరు అంతే. అయిన వాళ్లనీ పరాయి వాళ్లగానే చూస్తారు. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తారు. ఎప్పుడూ గంభీరంగా ముభావంగా తనకెవర్తోనూ సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. తమ చిన్నప్పుడు కూడా ఎన్నడూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నదీ లేదు. మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు అభినందించిందీ లేదు.
అమ్మ చెబితే విని ‘అలాగా’ అన్నట్టు తలపంకించి వూరుకునేవారు. తనూ రమణీ కూడా ‘నాన్నగారు’ అని సంబోధించేవారు. కాస్త ఎడంగానే మసిలేవారు. ఎందుకనో ఆయన్తో చనువు, సాన్నిహిత్యం పెరగలేదు. తమ పనులూ, ఇంటి పనులూ అమ్మే చూసేది. ఎవరికీ ఎలాంటి లోటూ రానిచ్చేది కాదు. ఒక శిలా విగ్రహంలా ఇంట్లో వుండే నాన్నగారితో అమ్మ అనే్నళ్లు ఎలా కాపురం చేసిందో ఆ దేవ దేవుడికే తెలియాలి!
ఏడాది క్రితం అమ్మ చనిపోయింది. ఆయన మరింత ఒంటరైపోయారు. ఒకటి రెండు మాటలు కూడా కరువయ్యాయి. తమతో వచ్చి ఉండమని తనూ, చెల్లీ అడిగినా ఒప్పుకోలేదు. ఇంటి పనీ, వంట పనీ చెయ్యడానికి చంద్రికని కుదిర్చి జాగ్రత్తలు చెప్పి వచ్చేశారు.
రెమెడీ హాస్పిటల్లో ఉన్నారనీ, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందనీ చంద్రిక ఫోన్ చేసి చెప్పింది. వెంటనే ఆ ఆసుపత్రి డాక్టర్‌తో మాట్లాడింది రమ. డబ్బుకి వెనుకాడకుండా చక్కని వైద్యం అందించమని కోరింది.
న్యూజెర్సీలో ఉన్న చెల్లెలు రమణికి ఫోన్ చేసి చెప్పి, సాయంత్రానికల్లా ఫ్లయిట్‌లో సిటీకి వచ్చేసింది రమ.
మరి రెండ్రోజులకి అమెరికా నుంచి రమణి, ఆమె భర్త వచ్చారు. ఆ సరికి అనంతరావు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
కూతుళ్లిద్దరూ దగ్గరుండి అన్నీ శ్రద్ధగా అమర్చిపెట్టారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. యధాప్రకారం వౌనిలా ఉండిపోయారు అనంతరావు.
తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఇద్దరికీ మనస్కరించడంలేదు.
‘మాతో వచ్చేయండి నాన్నగారూ. మా ఇంటికి వచ్చినాసరే చెల్లి దగ్గరికి వెళ్లినా సరే. మీకు ఎక్కడ బావుంటుందంటే అక్కడ వుండండి’ రమ అంది.
‘వద్దులే’ అన్నట్లు సైగ చేశారు.
‘మీరిక్కడ ఒక్కరూ వుంటే మీకెలా వుందోనని అనుక్షణం మేం టెన్షన్ పడుతూంటాం. నా మాట విని మా ఇంటికి రండి. అమెరికా చూద్దురుగాని. మీకెలాంటి లోటూ రానివ్వం నాన్నగారూ7 రమణి నచ్చ చెప్పాలని చూసింది.
‘ఇక్కడ ఓకే. మీరెళ్లండి...’
‘మేం వెళ్లినా మా మనస్సంతా ఇక్కడే ఉంటుంది’
ఫరవాలేదన్నట్టు చూశారు.
పెద్ద అల్లుడు ఫోన్ చేసినా, చిన్న అల్లుడు అర్థించినా ఆయన పట్టు వదల్లేదు. ‘నాకేం కాదు’ అన్నారు.
‘అనుకోనిది మొన్న జరగలేదూ. అలాంటిదేదైనా జరిగితే...’ కళ్లనీళ్లు పెట్టుకుంది రమ.
నిర్వికారంగా చూశారు అనంతరావు ‘ఏమీ జరగలేదుగా!’
‘ఒకవేళ జరిగితే? అందరూ వుండి కూడా ఎవరూ లేనట్టు...!’ ఆపై మాటలు మింగేసింది రమణి.
ఎంత చెప్పినా వారితో వెళ్లడానికి అంగీకరించలేదాయన.
ఫోన్ చేస్తే ఆఁ వూఁ అంటారు తప్ప ఒక్క మాటా మాట్లాడరు. వాట్సాప్ మెస్సేజ్‌లు చూడరు. అందుకని అక్కాచెల్లెళ్లు కూడబలుక్కుని ఐప్యాడ్ కొనిచ్చారు. ‘రోజూ మాకు కనిపించండి. లేదా మీరు బాగున్నారని రోజూ ఒకే ఒక్క ముక్క మెయిల్ చేస్తూండండి’ అని కోరారు.
దాన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో చూపించారు. గూగుల్, యూట్యూబ్ వగైరాల గురించి చెప్పి ‘మంచి కాలక్షేపమవుతుంది’ అనీ చెప్పారు.
అన్నీ ఇట్టే పట్టేశారు అనంతరావు. రోజూ తన క్షేమ సమాచారాలు మెయిల్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాత్రానికే ఎంతో సంతోషిస్తూ కూతుళ్లిద్దరూ వెళ్లిపోయారు.
కొన్నిరోజుల పాటు ‘బాగున్నాను’ అని మెయిల్ చేశారు. ఆ స్పందనకే ఎంతో సంబరపడిపోయారు రమ, రమణి.
తర్వాత్తర్వాత మీరెలా ఉన్నారు, మనవలూ మనవరాళ్లూ ఏం చేస్తున్నారని అడగసాగారు. ఆయనలో మొగ్గ తొడిగిన కన్సర్న్‌కి మురిసిపోయారు అక్కా చెల్లెళ్లు. ఊహించని మలుపు అది. వెంటనే తమ పిల్లల విశేషాలు ఏకరువు పెడుతూ రకరకాల ఫొటోలు పంపసాగారు.
అనంతరావు కూడా ప్రతిస్పందించడం మొదలెట్టారు. బాల్యాన్ని నెమరువేసుకున్నారు. నాటి ఆటలూ పాటలూ ఉత్సాహంగా వర్ణించడం ప్రారంభించారు.
ఆ విశేషాలేవీ రమకీ, రమణకీ తెలీవు. అందుకని మరింత లోతుగా అడుగుతూ మెయిల్స్ పంపారు. ఆయన ఓపిగ్గా జవాబిచ్చారు. ఈ కొత్త పరిణామం వాళ్లని ఉద్వేగపరచింది. ఉత్సాహపరచింది. ఆ మార్పుని రెండు చేతుల్తో నిండు మనస్సుతో ఆహ్వానించారు.
‘మీరు బాల్యంలో అష్టకష్టాలు పడి కూడా ఓ స్థాయికి చేరుకున్నారంటే మీరు నిజంగా గ్రేట్. మేమీ స్థాయికి రావడానికి కారణం మీరు వేసిన పునాదులే’ అని పొగడుతూ మరింతగా ప్రోత్సహించారు.
ఇంకోసారి తన పెళ్లిచూపులూ పెళ్లి విశేషాలూ రాశారు అనంతరావు. పొంగిపోతూ వాటిని ఆస్వాదించారు.
ఇంతలో భార్య తద్దినం వచ్చింది. ఆమె ఎంత మంచిదో, అన్నీ చక్కగా ఎలా అమర్చి పెట్టేదో వివరించారు. ఆమె తనకు లభించిన అపురూప వరం. తన పాలిట దేవత - అని రాసేసరికి కన్నీళ్లు పెట్టుకున్నారు కూతుళ్లిద్దరూ.
ఈ ముక్క అమ్మ బతికుండగా బయటపెట్టి ఉంటే ఆవిడెంత పొంగిపోయేదో అనుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టారు. ఆ క్రమంలో చాలా చాలా విషయాలు మెయిల్లో రాసుకొచ్చారు అనంతరావు.
‘మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? ఉద్యోగం ఎలా వుండేది? పనిలో తృప్తి వుండేదా? ప్రమోషన్లు వచ్చాయా?’ అని ఆరా తీశారు.
అవన్నీ ఏకరువు పెట్టారు. పనినే దైవంగా భావించే వాడిననీ, పైపాటు మీద దృష్టి వుండేది కాదనీ, సిన్సియర్ అని పేరు తెచ్చుకున్నాననీ చెప్పుకొస్తూ చాలా సంఘటనలని పేర్కొన్నారు.
‘మీ ఇంగ్లీషు ఫ్లో చాలా బాగుంది. మాకన్నా బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు’ అని మెచ్చుకున్నారు. దాంతో ఆయన మరింతగా రెచ్చిపోయారు. తన జ్ఞాపకాలనే కాదు భావాలని కూడా మెయిల్లో పెట్టసాగారు.
‘మీ మనస్సులో ఇన్ని ఊసులు దాగున్నాయి కదా, మరి ఇదివరకు మాతో ఎందుకు అంటీ ముట్టనట్లుండేవారు?’ ప్రశ్నించిందో రోజున రమణి.
‘ఎందుకో అందరి ముందూ మిమ్మల్ని ముద్దు చేయలేక పోయేవాణ్ణి. మీరు ఆదమరచి నిద్ర పోతూంటే మీ ముఖాలు చూస్తూ గంటలు గంటలు కూర్చునేవాణ్ణి. ఆ సంగతి మీ అమ్మకీ తెలుసు. అయినా నన్ను డిస్టర్బ్ చేసేది కాదు. బహిరంగంగా మీతో మాట్లాడటానికి, చనువుగా ఉండటానికి ఎంచేతో సిగ్గుగా సంకోచంగా ఇబ్బందిగా ఉండేది. మీతోనే కాదు మీ అమ్మతో ఇరుగు పొరుగుతో కొలీగ్స్‌తో అందరితోనూ అంతే. అందుకే స్నేహితులనదగ్గ వాళ్లెవరూ నాకు లేరు. నా చుట్టూ గిరి గీసుకుని అందులో ఉండటం అలవాటైంది..’ అని జవాబిచ్చారు. ఆ మాటల్లో పశ్చాత్తాపం ధ్వనించింది.
తండ్రిలో వచ్చిన మార్పుకి ఆనందం పట్టలేకుండా ఉన్నారు రమ, రమణి. ఇనే్నళ్లకి ఈ రకంగా ఆయనకి దగ్గరవుతున్నారు. ఆయన మనస్సులోని ఊసులు తెలుసుకో గలుగుతున్నారు. ఆయనకీ పంచుకోవడంలోని ఆనందం తెలిసొస్తోంది. అంతకంతకూ మనస్సు తేలికవుతోంది. తేటబడుతోంది. అందుకే ఆత్మకథ రాస్తున్నట్లుగా పేజీలకు పేజీలు రాసేస్తున్నారు!
‘మీ పరిస్థితి అర్థమైంది నాన్నగారూ. మీ చిన్నప్పుడే తాతగారు పోయారు. నానమ్మ అష్టకష్టాలు పడి మిమ్మల్ని పెంచింది. అందరి దయా దాక్షిణ్యాలతో ఒక రకమైన న్యూనతతో, కృతజ్ఞతా భావంతో పెరిగారు. మీ బాల్యం గురించి చదవగానే మీ గురించంతా అర్థమై పోయింది. సరైన స్నేహితులు లేనందున మీరా షెల్‌లోంచి బయటికి రాలేకపోయారు. అమ్మకీ దగ్గర కాలేకపోయారు. మనిషి వికసించాలి తప్ప ముడుచుకుపోకూడదు నాన్నగారూ’ ఆయనతో ఛాటింగ్ చేస్తూ తండ్రి ప్రవర్తనని సమప్ చేస్తూ సలహా ఇచ్చింది రమ.
‘అదీ పాయింటేనేమో. గతాన్నంతా తలచుకొంటోంటే ఇప్పుడు అనిపిస్తోంది నేను చాలా చాలా పోగొట్టుకున్నానని. ఎన్నో తీయని అనుభూతుల్ని కమ్మని అనుభవాలని మిస్సయ్యానని. కాని చేజారినవి తిరిగిరావు కదా!’
‘జారిన వాటి గురించి కాదు, చేతిలో మిగిలి వున్న వాటి గురించి ఆలోచిద్దాం నాన్నగారూ..’ తమ మధ్య పెరిగిన సాన్నిహిత్యపు దన్నుతో అంది రమణి.
‘అదే ఆలోచిస్తున్నా. ఎడారిని అమాంతం వరద ముంచెత్తితే ఎలా ఉంటుందా అని..!’
‘ఎలా ఉంటుందంటారు?’
‘నా ఊహకి అందట్లేదు...’
ఆ జవాబు ఇచ్చిన పది రోజులకి రమ, ఆమె భర్త, పిల్లలు, రమణి, ఆమె భర్త, పిల్లలూ అంతా అనంతరావు దగ్గరికి వచ్చేశారు. అచ్చం వరదలానే ముంచెత్తారు.
కూతుళ్లిద్దరికీ ఇప్పుడు తండ్రి గురించి తెలీనిదంటూ ఏమీ లేదు. ఆయన ఇష్టాలు, కోరికలతో సహా సమస్తమూ తెలిసిపోయింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం బలపడింది. ఇప్పుడు ‘నాన్నగారూ’ అనటం లేదు. ‘నాన్నా - ఈ టీషర్ట్ వేసుకోండి’ ‘సినిమా కెళ్దాం పదండి నాన్నా’ ‘కోడి కెక్కిరించినట్టు తింటే కాదు, మీకెంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర నాన్నా’ - అంటూ చెరోప్రక్కనా చేరి ఆయన్ని ఊపిరాడనివ్వటంలేదు.
‘ఆఫీసులో ఫలానా అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించారు మామగారూ’ అంటూ అల్లుళ్లు ఆయన ఆఫీసు విషయాలు తవ్వుతూ మాటల్లోకి దించుతున్నారు.
‘తాతయ్యా! మీరు ఆడుకున్న గూటీబిళ్ల నుంచే మా క్రికెట్ పుట్టింది’ అంటూ మనవలు చుట్టేస్తున్నారు.
‘తాతమ్మకే కాదు మాకూ పాటలు పాడటం వచ్చు తాతయ్యా’ అంటూ ‘జో అచ్యుతానంద’ పాడుతున్నారు మనవరాళ్లు.
అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంటోంది. గోడలు కూలుతున్న అనుభూతి మనసు లోతుల్లో ఆక్రమించింది.
మెల్లగా మంచు కరిగిపోయింది. పర్వతం బయటపడింది. అనంతరావు ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఉత్తేజంగా ఉంటున్నారు. గలగలా ప్రవహిస్తున్నారు. అంతా కొత్తగా వింతగా ఉంది. పచ్చగా ఆశావహంగా కనిపిస్తోందాయనకి!
ఆయన్లో వచ్చిన మార్పుకి ఇంటిల్లపాదీ పరమానంద పడిపోయారు. ప్రతిరోజూ ఓ పండగలా గడిచిపోతోంది. అభిమాన ఆప్యాయతల నదిలో మునిగి తేలారంతా.
అనంతరావు పుట్టిన రోజున హోటల్లో గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు రమ, రమణి. సిటీలోని బంధుమిత్రులందర్నీ ఆహ్వానించారు.
అందరి సమక్షంలో ‘మై లైఫ్’ అనే పుస్తకాన్ని చిన్ని మనవరాలి చేత ఆవిష్కరింపజేసి అనంతరావు చేతిలో పెట్టారు.
‘మెయిల్లో మీరు పేర్కొన్న మీ జీవితాన్ని ఇలా క్రోడీకరించాం!’ రమ చెప్పింది.
ఆయనకి నోట మాట రాలేదు. సంభ్రమాశ్చర్యాలతో పుస్తకాన్ని తిరగేసి, కూతుళ్ల వంక ప్రేమాభిమానంగా చూశారు.
కూతుళ్లూ, అల్లుళ్లూ, బంధువులూ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంటే వౌనంగా ఉండిపోయారు. తనని అందర్తో కలపడానికి బిడ్డలు పడ్డ, పడుతున్న తపన, తాపత్రయం అర్థమయ్యాయి. కళ్లే కాదు గుండె కూడా చెమ్మగిల్లింది.
‘వీళ్లంతా నా వాళ్లే. నేను వీళ్ల వాడిని!’ గొణుక్కున్నారు. మరుక్షణం గుండెల్లో ఆనందపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
రమ, రమణి తిరిగి ప్రయాణమయ్యే రోజు దగ్గర పడింది. ఆయన్ని వదిలి వెళ్లటం ఎలాగో కూతుళ్లకి అర్థం కాలేదు. వాళ్లలో వాళ్లు సతమతమవుతోంటే అనంతరావు కల్పించుకుంటూ అన్నారు.
‘నేనిక్కడ ఒంటరిగా నిస్తేజంగా పడి ఉండి గుడ్డివాడిలా చీకట్లో ఎందుకు దేవుళ్లాడతానమ్మా. నా కూతుళ్లు నా రెండు కళ్లు. నా అల్లుళ్లు నా రెండు కాళ్లు. నా మనవలూ మనవరాళ్లూ నా రెండు చేతులు. ఇక మీ అందరితోనూ కలిసి ఉంటాను. ఆర్నెల్లు రమ ఇంట్లో, ఆర్నెల్లు రమణి ఇంట్లో.’
అంతా బ్రహ్మానందపడిపోయారు.
వెంటనే గడుగ్గాయి మనవరాలు అడిగింది. ‘మరి తాతయ్యా, నీ గుండెకాయ ఎవరూ?’
‘ఇంకెవరూ ఈ బంధాలకీ, అనుబంధాలకీ, ఆనందానికీ, అనుభూతుల మాధుర్యానికీ మూలమైన మూలపుటమ్మ మీ అమ్మమ్మే!’

-సింహప్రసాద్ 9849061668