కథ

సమాంతర బంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ ఆబ్దీకం. ఈసారి వంతు ఆఖరి తమ్ముడి ఇంట్లో. నేను, జానకి లోపలకి అడుగుపెడుతూనే మొహమొహాలు చూసుకున్నాం.
సుమారు పది మంది ఉన్నారు విశాలమైన ఆ హాల్లో. మమ్మల్ని చూస్తూనే తప్పదన్నట్టు మరదలు ‘‘రండి రండి.. బావగారు. రా అక్కా’’ అంటూ ఆహ్వానించింది ఆఖరి మరదలు క్షితిజ.
సోఫాల్లో, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీల్లో అందరూ ఎవరి సెల్‌ఫోన్‌తో వాళ్లు బిజీగా ఉన్నారు.
55 అంగుళాల టీవీ తన సామర్థ్యం కొద్దీ పనిచేస్తోంది. ఇష్టమైన వాళ్లు ‘‘హాయ్ బాగున్నారా!’’ అని పలకరించారు. తమ్ముడి కొడుకులు, ‘‘హాయ్! పెదనాన్నగారూ!’’ అంటూ పనున్నట్టు తమ గదుల్లోకి వెళ్లిపోయారు.
డైనింగ్ టేబిల్ దగ్గర రెండు చైర్స్ ఖాళీ అవడంతో నేను, జానకి కూర్చున్నాం.
తమ్ముడి బావమరిది, అతని స్నేహితులు మరో ఇద్దరు కాబోలు ఎవరెవరో నాకు అంతగా తెలీదు. తమ్ముడు వాళ్లతో మాట్లాడుతూ జోకులేసుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు.
మరదలి తల్లి వచ్చి మంచినీరు అందిస్తూ ‘‘బాగున్నావా!’’ అని పలకరించింది నన్ను.
‘‘బాగున్నానండి. మీకు తెలియనిదేముంది? మోకాళ్ల నొప్పులు, అరికాలి మంటలు. కింద కూర్చోలేను’’. కూర్చుంటే లేవలేను. ఇంటికి పెద్దకొడుకుగా పితృకర్మలు తప్పవు కదా! మీ ఆరోగ్యం బాగుంటోందా?’’ అని అడిగాను.
‘‘ఆఁ! ఏదో నడుస్తోంది. తింటే ఆయాసం. తినకపోతే నీరసం. ఏ కూతురుకు అవసరం ఉంటే వాళ్లింట్లో వాలాల్సిందే. ఇక మగపిల్లలంటావా పెద్దాడు బెంగుళూరు, చిన్నోడు వైజాగ్. ఇదిగో ఇక్కడేదో పెళ్లి ఉందని వాడు ఫ్రెండ్స్ వచ్చారు. కాఫీ తెస్తాను.’’ అంటూ కిచెన్‌లోకి వెళ్లిపోయింది ఆవిడ.
క్షితిజ, జానకి కబుర్లలో పడ్డారు.
నేనూ మెసేజ్ రావడంతో సెల్‌ఫోన్ తీసుకున్నాను చేతిలోకి. మనిషి జీవితంలోకి వైరస్‌లా ప్రవేశించి అవసరాన్ని మించి జీవితాన్ని నాశనం చేసిన, చేస్తున్న వస్తువు అది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న పెద్దలు నూటికి నూట యాభై శాతం వర్తించే వస్తువు ప్రస్తుతం ప్రపంచంలో ఇదే!
‘‘మీ అన్నయ్య, వదినా వచ్చారు. పలకరించారా!’’ మోచేత్తో మొగుడ్ని పొడుస్తూ గుసగుసగా అన్నమాటలు విని కాబోలు ‘‘హాయ్‌రా! అన్నయ్యా! ఎలా ఉన్నావ్? ఎలా ఉంది ఒంట్లో’’ అంటూ నా పక్కన జానకి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.
‘‘బాగానే ఉన్నా!’’ అన్నాను ముక్తసరిగా.
‘‘ఏమిటోరా వెధవది. అమ్మ తద్దినం మా ఇంట్లో పెట్టుకునే అదృష్టం వచ్చింది అనుకుంటే భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా దొరకడం లేదు. అలా తయరయ్యాయి ఉద్యోగాలు’’ అన్నాడు.
‘‘ఏమైంది?’’
‘‘ఏముంది. ఆడిట్ జరుగుతోంది. ఈవేళ ఆఖరి రోజు. సెక్షన్ ఆఫీసర్‌ని మా మదర్ ఇయర్లీ సెర్మనీ సర్, సెలవు కావాలీ అంటే ఇంకా ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏమిటయ్యా! అంటాడు. ఒక రెండు గంటలు కార్యక్రమంలో పాల్గొని వచ్చేసేయ్. అంతే తప్ప సెలవు కుదరదు. ఆడిట్ రోజుల్లో సెలవులు ఒప్పుకోరని నీకు తెలుసు కదా!’’ అన్నాడు.
నేను విరక్తిగా నవ్వుకున్నాను.
ఫోన్లో డిస్‌ప్లే మీద చిన్నోడి, అంటే నా తరువాత తమ్ముడి మెసేజ్.
‘‘అన్నయ్యా! మీ మరదలికి చికెన్‌గున్యా! నిన్ననే హాస్పిటల్‌లో నుంచి ఇంటికి తీసుకువచ్చాను. నేను రాలేకపోతున్నాను. ఎలాగూ నీ మీద చెయ్యి వేసి ‘మమ’ అనుకునే వాళ్లమే. మనీ ఆఖరి వాడి అకౌంట్‌కి అన్‌లైన్‌లో పంపాను. అన్యదా భావించకు.’’
ఆ సందేశం అలాగే ఆఖరి వాడికి చూపించాను. డబ్బులు ఎకౌంట్లో పడ్డాయి అన్న మాటలకి కాబోలు వాడి కళ్లు మెరిశాయి. ‘‘అయితే చిన్నన్నయ్య రావడం లేదన్న మాట. ‘‘క్షితీ! మీ చినబావగారు రావడం లేదు’’ అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో హేళన నా గుండెలకి తాకింది.
‘‘సరుకులు తెచ్చేశారమ్మా?’’ అడిగాడు క్షితిజని.
‘‘అయ్యో! ఎక్కడ తెచ్చారు? ఎవరు తెచ్చారు బావగారూ? అవన్నీ నేను చూసుకోవలసిందే. పొద్దున్న పోతారు. రాత్రికొస్తారు. వస్తూనే ఫోన్‌లు పుచ్చుకుని టీవీ ముందు సెటిల్ అయిపోతారు. ఒక కన్ను టీవీ మీద, ఒక కన్ను ఫోను మీద. పిలిచినా పలకరు ఉలకరు. ఎవరికి కావల్సింది వాళ్లు తినేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్తారు. ఆదివారం, శనివారం సెలవులు అన్నమాటే గానీ ఫ్రెండ్స్ ఇళ్లకి, సైట్ సీయింగ్‌లకి సరిపోతుంది. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే గానీ, నేను, అక్క ఇప్పుడు వెళ్లి తెచ్చేస్తాం’’ అంది క్షితిజ.’’
‘‘ఆడవాళ్లు మీ చేత పని చేయించడమేమిటమ్మా పెద్దవాడిని నేను ఉండగా! ఆ లిస్ట్ ఇస్తే నేను వెళ్లి తెచ్చేస్తాను. బైక్ ఖాళీగా ఉందా ఎవరిదైనా?’’ అడిగాను.
వాళ్ల అమ్మ తద్దినానికి అన్నీ స్వయంగా చేసుకోవడం ఆయనకి ఇష్టం. క్షితీ! మన ఇళ్లల్లో సరుకులు తెచ్చుకోకపోతే ఈ మగాళ్లు తెస్తున్నారా ఏమన్నానా! ఆయన్ని వెళ్లనీ! అయినా బైక్ మీద అన్ని సరుకులు ఎలా తెస్తారు? అందరం డబ్బులు వేసుకుంటున్నాంగా! ఆటోలో వెళ్లి ఆటోలో రండి!’’ అంది జానకి. ఎంత వద్దనుకున్నా అత్తగారి మీద ఏదో మూల ఉన్న కసి నా మీద చూపిస్తూ.
క్షితిజ రెండు రిలయన్స్ సంచులు, ఒక వైర్ బుట్ట పట్టుకొచ్చి ఇచ్చింది. ‘‘సరే! నే వెళ్లొస్తా! సరుకులు నా వాటా డబ్బుల్తో తెచ్చేస్తా.’’ అని లేవబోయాను.
బుల్లోడు అంటే నా మూడో తమ్ముడు ఫోన్.
‘‘అన్నయ్యా! నువ్వు, వదినా క్షేమంగా చేరారా తమ్ముడి ఇంటికి?
ఈసారి రాలేకపోతున్నారా! ‘‘మీ మరదలు మేనమామ పోయాడు. మూడు రోజులు పక్షిణి. చూస్తూ చూస్తూ ఇంట్లో కలుపుకోలేంగా. ఆఫీసర్‌ని బ్రతిమిలాడితే రెండు రోజులు వర్క్ ఎట్ హోమ్ ఇచ్చాడు ఏడుస్తూ. మూడోరోజు సెలవు పెట్టేస్తాను. చేయాల్సిందంతా నువ్వే. మేమెలాగూ ‘మమ’ గాళ్లమేగా! డబ్బులు ఆఖరాడి అకౌంట్‌కు నిన్ననే ఆన్‌లైన్లో పంపేశాను. అందరినీ అడిగానని చెప్పు. ఉంటా బై.’’ అని కట్ చేసేశాడు.
‘‘జీవితంలో చెడు కాలం అనేది రాకపోతే పరాయి వారిలో మనవారెవరో తెలుసుకోలేము. మనవారిలో పరాయి వారెవరో తెలుసుకోలేము’’ అని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది.
సంచులు పుచ్చుకుని వెళ్లు. కావల్సిన సరుకులన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా చెక్ చేసుకుని తెచ్చాను.
‘‘బ్రహ్మగారు ఏ టైంకి వస్తామన్నారు?’’ అడిగాను ఇంటికి వచ్చిన క్షితిజని.
‘‘పదంటారు గానీ! పదకొండున్నరకు వస్తే గొప్పే బావగారూ. బ్రహ్మగారికి మూడు వేలు, భోజనం చేసే బ్రాహ్మలకి పంచె, కండువాతో పాటు వెయ్యి ఒక్కొక్కరికి, వంటావిడకు రెండవేల అయిదు వందలు, మిగతావి సరుకుల ఖర్చులు. సాయంత్రం మిగిలినవన్నీ పనిమనిషికి, వాచ్‌మెన్‌కి పంచుకోవడం. ఏమిటో.,.. ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో అర్థం కాదు. చాకిరీలు చేసి చేసి మరలు అరిగిపోతున్నాయి అనుకోండి. ఏడాదికి ఒకరోజే అయినా అందరికీ శ్రమే!’’ అంది.
సమాజం ముందుకు నడవాలం టే పెద్దలు అనుసరించిన సాంప్రదాయాలు అనుసరించాలి.
ధర్మాలు పాటించాలి.
అవి ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే గంగా ప్రవాహమంత పవిత్రమైనవి. ధర్మోరక్షతి రక్షిత అన్న పెద్దల వాక్యంలో భగవదారాధన దాగి ఉంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనను రక్షిస్తుంది. అలా మన ధర్మం మనం ఆచరించడమే భగవదారాధన. ఆ విషయం తెలిసి కూడా అనుసరించని పరాన్నజీవుల వంటి చదువుకున్న మూర్ఖులతో ఎటు పోతోందో తెలియనంత ఘోరసభ్య సమాజంలో బ్రతికేస్తున్నాం. ప్రబలుతున్న అధర్మ నీతితో రాక్షసత్వం ప్రబలి సంఘటితంగా ఉండవలసిన ప్రజలు ఒకరినొకరు చంపుకుని సమాజం, పతన దిశగా ప్రమాదస్థాయికి చేరుకునే రోజు ఎంతో దూరం లేదు అనిపించింది నాకు.
దానికి కారణం సమాజంలో చెప్పేవాడే తప్ప ఆచరించేవాడు లేకపోవడం. తాను చెప్పిందే వేదం.. చేసేదే విధానం. అనుకుని నియంతృత్వంతో ప్రవర్తించడమే తప్ప సవ్యంగా సమాజానికి పనికి వచ్చే దిశగా ఆలోచించలేకపోవడం. అలా ఎవరు చెప్పినా అసలు వినేవాడే లేకపోవడం. ఇదే ఈనాటి సమాజ దుస్థితికి కారణాలు.
ఎవరి ఆలోచన వారిది. ఎవరు ప్రయాణించే తోవ వారిది అయినప్పుడు మరి నా దారి కూడా నాదే కదా!
నా పెదవుల మీద జీవం లేని నవ్వు చూసింది కాబోలు అడిగింది జానకి! ‘‘ఏమిటి? వేదాంతం ఆలోచించుకుంటున్నారా! సరే టిఫిన్ చేసిపెడుతోంది. మళ్లీ నిద్ర చాల్లేదంటారు. రేపు మూడు గంటలు శాస్త్రోక్తంగా చెయ్యాల్సింది మీరే! అపుడు గానీ మీ అమ్మగారి ఆత్మ సంతోషించదు.’’ అంటూ టిఫిన్ నా ముందు ఉంచింది.
తిని, హాల్లోనే దివాన్ కాట్ మీద నిద్రకు ఉపక్రమించాను నేను.
* * *
నిద్ర పడితేగా! అమ్మ పోయాక పదమూడు రోజులు ‘తప్పక’ ఉన్నారు. పదమూడవ రాత్రి ఎవరి వాటా వస్తువులు, డబ్బు అన్నీ పూచికపుల్ల వదలకుండా పట్టుకెళ్లారు.
అమ్మ అస్థికలు కాశీలో కలపాలన్న ఒక నిర్ణయంతో శ్మశానవాటికలోనే ఉంచడం జరిగింది. కానీ నెలలోపే గ్రహణం రావడంతో మూడు రోజులు సెలవులు పెట్టుకోండర్రా అని తాను ఎంత పోరినా ‘‘మాకు కుదరలేదంటే మాకు సెలవు దొరకలేదని’’ ముగ్గురు తమ్ముళ్లూ రాలేదు.
చివరకి పెదమామయ్య సలహాతో నేను, జానకి కాశీ ట్రిప్ వేసుకుని కాశీ, గయ, ప్రయాగ బ్రహ్మ కపాలంలో పిండప్రదానం అన్నిచోట్లా శాస్త్రోకంగా నిర్వహించి వచ్చాము. నాకు అర్థమైనదేమిటంటే ఈ ‘సమాంతర బంధాల’లో ఎవరికెవరూ తోడు రారని.
నా తరువాత చిన్న తమ్ముడు, పెళ్లాం చాలా తెలివైంది. మొదటి సంవత్సరంలో పదిహేను మాసికాలు పెద్ద కొడుకుగా, అమ్మ నా దగ్గర ఉండగానే హాస్పిటల్‌లో మరణించడం వల్ల మా ఇంట్లోనే చేస్తానని అందరికీ చెప్పాను.
మొత్తం ఖర్చు నాలుగు వాటాలు వేయాల్సిందే. ఒక్కొక్క నెల వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో చేయాల్సిందే. ప్రతీ ఒక్కరు మూడేసి వేలు వేసే పని ఎవరి ఇంట్లో ‘వంతు’గా ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ శాస్త్ర ప్రకారం జరిపించాక తగులో మిగులో ఎవరూ లెక్క చెప్పనవసరం లేదని తీర్మానించడంతో పెద్దవాడిగా మనసులో బాధపడినా అందుకు అంగీకరించాను.
నాకూ ఆ ఆలోచన మరో కోణంలో నచ్చింది. ఈ వంకతో తమ్ముళ్లందరినీ కనీసం ఒకసారి చూడవచ్చు అనుకున్నాను. అమ్మ, నాన్నల తరువాత వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం నా ప్రాథమిక బాధ్యత అనిపించింది. ఆ కార్యక్రమం అమ్మ పోయి నాలుగేళ్లయినా కొనసాగుతోంది. ఈసారి ఆఖరి తమ్ముడి ఇంటికి ఆవిధంగా రావాల్సి వచ్చింది.
* * *
కార్యక్రమం అంతా సజావుగా జరిగింది. అవసరమైనపుడు పైకి లేస్తూ, లేవలేనప్పుడు మోకాళ్ల మీద ఆడుకుంటూ, నొప్పులు భరిస్తూ జన్మనిచ్చిన అమ్మ పట్ల పరిపూర్ణ భక్తిప్రపత్తులతో కార్యక్రమం పూర్తి చేశాను.
దాదాపు బ్రాహ్మల భోజనానంతరం చేస్తున్న పిండప్రదాన సమయంలో తమ్ముడు హడావుడిగా వచ్చి తన వంతు కార్యక్రమం నిర్వహించాడు.
భోజనాలు పూర్తయ్యేసరికి నాలుగు గంటలయింది.
అప్పటికి విపరీతమైన నీరసం వచ్చేసింది. మనసులో కన్నీళ్లు సుడులు తిరుగుతుండగా అనుకున్నాను.
‘‘అమ్మా! జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడిని చేశావు. ఈ జీవితం నువు పెట్టిన భిక్ష. ఎనె్నన్నో కష్టాలకోర్చి మమ్మల్ని అందరినీ పెంచి నాన్నగారి సహకారంతో ప్రయోజకుల్ని చేశావు. తల్లా? పెళ్లామా? అని చాలా మంది ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈ జన్మ ప్రసాదించిన తల్లే ముందు అంటాను నేను. భార్య మనతో జీవితాన్ని పంచుకుంటుంది. ‘‘సహజంగా తల్లిదండ్రులే ముందుగా పిల్లల కంటే పై లోకాలకు వెళ్లిపోతారు. ఆ స్థాయిని నేను చేరుకున్నానని అనిపిస్తోంది. ఇక మీదట ఇంత శాస్త్రోక్తంగా నీ ‘పూజ’ చేయలేకపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి దీవించమని వేడుకుంటున్నానమ్మా! మళ్లీ ఆబ్దికానికి బ్రతికి ఉంటానో లేదో. అలాంటి సమాంతర బంధాల మధ్య బతుకుతున్న నీ బిడ్డలైన మమ్మల్ని చల్లగా కాపాడు.’’
మరో రెండు గంటల్లో మేమెక్కిన రైలు వూరి వైపు బయల్దేరింది.

-కొత్తపల్లి ఉదయబాబు 9441860161 9533756075