కథ
కన్నీరు కార్చిన విగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఒక ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ని చేసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను. ఇలా అడవిలో గడపాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మీకేం? మీ పనితో మీకు కాలం గడిచిపోతుంది. నా సంగతెప్పుడయినా ఆలోచించారా?’’ అంటూ దులిపేస్తున్న, అరవిందను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రదీప్. వాళ్లిద్దరికీ పెళ్లయి నెల రోజులు కూడా కాలేదు. పెళ్లయిన పది రోజులకే ఆమెను ‘పాడేరు’ తీసుకొచ్చి కాపురం పెట్టాడు ప్రదీప్. పాడేరు వచ్చిన వారం, పది రోజుల వరకూ బాగానే ఉన్న అరవింద గత పది రోజులుగా మూడీగా, డల్‌గా ఉండడం, ప్రదీప్ గమనించినా, దానికి కారణం ఏమిటో ఊహించలేకపోయాడు. ఈ రోజు మాటల సందర్భంలో తన అక్కసు ఇలా వెళ్లగక్కింది. ఆమె మాటలకు ప్రదీప్‌కి కోపం రాలేదు. జాలేసింది. ‘పాపం... ఇన్ని రోజులుగా క్షోభను అనుభవిస్తూ తనలో తానే కుమిలిపోయిందన్న మాట’ అనుకున్నాడు.
‘‘అయ్యో... అంత బాధను నీలోనే దాచుకున్నావా? ఈ ప్రశ్న ఎప్పుడో అడగాల్సింది’’ అన్నాడు ఆమెను సముదాయించే ధోరణిలో. అతని అనునయింపుకు ఆమె దిగి రాలేదు. ఆమెలో కోపపుజ్వాలలు ఇంకా చల్లారలేదు. ‘‘నిజమే నాతోటి ఆపీసర్లంతా పట్టణాలలోనే పనిచెయ్యడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను మాత్రం కావాలనే ఇక్కడికి వచ్చాను. దానికో ముఖ్య కారణం ఉంది. ఇదిగో... ఈ డైరీ చదువు. నీకే తెలుస్తుంది. ఇది చదివాక కూడా మనం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోదామంటే, నేను సిద్ధమే. ఇది నేను స్కూల్లో చదువుతున్నపుడు రాసిన డైరీ’’ అంటూ పాత డైరీనొకదాన్ని అందించి, బయటకు వెళ్లిపోయాడు. ఆసక్తిగా దాన్ని అందుకొని, శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది.
* * *
నాకెంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈసారి నా పుట్టినరోజుకు వికాస్ అన్నయ్య కూడా ఉంటున్నాడు. అన్నయ్యంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. నా సొంత అన్న కాకపోయినా అంతకన్నా ఎక్కువే. నేను సిరిపల్లెలో ఐదోతరగతి చదువుతున్నాను. మా ఊరు ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ఉంది. మా ఊరు దాటితే దట్టమైన అడువులే. అన్న సిటీలో ఇంటర్ చదువుతున్నాడు. చాలా తెలివైన వాడు. చదువే కాకుండా చాలా రంగాలలో అన్నకు పరిజ్ఞానం ఉంది. అతను చెప్పే విషయాలు కొన్ని మా నాన్నకు కూడా తెలియవు. మా నాన్న సిరిపల్లెలో ఎమ్మార్వోగా పనిచేస్తున్నారు. పెద్ద బంగళాను మాకు క్వార్టర్స్‌గా ఇచ్చారు. మా బంగళా అన్నా, మా ఊరన్నా, చుట్టూ ఉన్న అడవి అన్నా మా అన్నకు చాలా ఇష్టం. అందుకే వేసవి సెలవులకు తప్పకుండా ఇక్కడికొస్తూ ఉంటాడు. నా పుట్టినరోజుకు ఇక్కడుండేటట్లు ప్లాన్ చేసుకురమ్మని ముందే చెప్పడం వల్ల, నా కోరిక తీరింది.
అన్న వచ్చాడంటే నాకూ, నా ఫ్రెండ్స్‌కి పండుగే. ఎనె్నన్నో వింతలు, విశేషాలు చెపుతూ ఉంటారు. ఈసారి ‘బిలివ్ ఇట్ ఆర్ నాట్’ అనే పుస్తకం తెచ్చి అనేక ఆశ్చర్యకరమైన విషయాలను గురించి చెప్పాడు. మేమంతా ఆశ్చర్యంతో తలమునకలైపోయాం. తను చూసిన ఇంగ్లీష్ సినిమాల గురించి, చదివిన పుస్తకాల గురించి... ఇలా ఎన్నో విషయాలు గురించి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చెప్పడం అన్నకే చెల్లింది. గత ఏడాది అన్న చేసిన సైన్సు ప్రాజెక్ట్‌కి అవార్డు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దగ్గర్నుంచి తీసుకున్న ఫోటో నా ఫ్రెండ్స్‌కి ఇప్పటికీ గర్వంగా చూపిస్తూ ఉంటాను.
* * *
అన్న వచ్చిన రెండు వారాలకు, మా ఊరికి మహేశ్వరస్వామి వచ్చారు. ప్రతీ ఏడాది ఆయన మా ఊరికి రావడం మామూలే అయినా, ఈసారి ఆయన రావడంతోనే పెద్ద దుమారం రేగింది. ‘‘ఎప్పుడూ ఆయనతో పాటు తెచ్చుకునే అమ్మవారి విగ్రహం, ఆ రోజు ఉదయం హారతి ఇస్తున్న సమయంలో కన్నీరు కార్చడం మొదలుపెట్టింది’ అన్న వార్త ఊరంతా క్షణాల్లో పాకిపోయింది. కని విని ఎరుగని ఆ వింతను చూడ్డానికి మేమంతా తరలి వెళ్లాము. ఊరి అవతలుంది స్వామీజీ ఆశ్రమం. దాని లోపలుండే పెద్దహాల్లోకి వెళ్లగానే, నాలుగు అడుగుల దిమ్మ మీద ఉంచిన మూడడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం కనిపించింది. అమ్మవారు కారుస్తున్న కన్నీరును చూసి జనం హాహాకారాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనమయ్యాక స్వామీజీ దర్శనం చేసుకొని, స్వామీజీ శిష్యుల సూచన మేరకు ఒక పక్కన నిలబడ్డారు వచ్చే జనం. వాలంటీర్లు జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు. జనమంతా దర్శనాలు కానిచ్చాక, స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
‘‘ప్రియమైన ప్రజలారా నేడు దుర్దినం. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈ రోజు ఉదయం అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు, ఈ వింతను మొదటిసారిగా ఇదిగో ఈ వీర్రాజు మాస్టారు గమనించారు. ఆ సమయానికి మాస్టారితో పాటు ఓ పదిమంది దాకా ఇక్కడికి వచ్చారు. వాళ్లు కూడా చూశారు. ఉదయం ఎనిమిది గంటల వరకు మామూలుగా ఉన్న నా తల్లి, ఇలా పూజ మొదలుపెట్టేసరికి కన్నీరు కార్చడం చూసిన నాకు దుఃఖం ఆగలేదు. ‘‘మీరెందుకు దుఃఖిస్తారు స్వామీ? ఈ ఊరి వల్ల, ఇక్కడున్న ప్రజల వల్ల ఏదో జరిగింది. ఈ ఊరులో పాపం పెరిగిపోయింది. అందుకే ఈ ఏడాది ఇక్కడ వర్షాలు సమంగా పడలేదు. ఎక్కడ చూసినా క్షామమే’ అని నా శిష్యులు అన్నప్పుడు ఆ మాట నిజమేనేమోనని నాకు అనిపించింది. అందుకే ఒక పరీక్ష పెట్టి, నిర్ధారణ చేసుకోదలిచాను’’ అన్నారు స్వామీజీ. అందరూ ఆయన వంక అయోమయంగా చూసి, ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
పది నిమిషాలలో ఏర్పాట్లు జరిగిపోయాయి. అమ్మవారి విగ్రహం ముందు మూడు మీటర్ల, పసుపు రాసిన గుడ్డను పరిచారు. దానికి ముందు కాళ్లు కడుక్కోడానికి, ఒక బిందెతో నీళ్లు, ఒక వెడల్పాటి ప్లేటు పెట్టారు. పరీక్ష ఏమిటో తెలియక అందరూ తికమకపడుతున్న సమయంలో స్వామీజీ గొంతు గంభీరంగా వినపడింది.
‘‘ఎమ్మార్వో గారూ, మీరు ముందుగా ప్రారంభించండి. ఇలా ముందుకొచ్చి, కాళ్లు కడుక్కుని, ఆ గుడ్డ మీదుగా నడిచి అమ్మవారిని దర్శించుకోండి’’ అనగానే, నాన్న భయభక్తులతో, మొదట అమ్మవారికి తర్వాత స్వామీజీ నమస్కరించి, ఆయన చెప్పినట్లే చేశారు. అప్పుడొక అద్భుతం జరిగింది. నాన్న అడుగు గుడ్డ మీద పడగానే ఆయన పాదపు ముద్ర రక్తంతో తడిచినట్లు ఎర్రగా కనిపించేసరికి, జనంలో హాహాకారాలు చెలరేగాయి. ఆ ముద్రని చూడగానే నాన్న కంగారుపడుతూ స్వామీజీ వైపు చూశారు. ముందుకు నడవమన్నట్లుగా ఆయన చేయి ఊపారు. నాన్న కలవరపడుతూనే, ముందుకు అడుగులు వేశారు. పసుపు రంగు గుడ్డ మీద ఎర్రటి ముద్రలు చూస్తుంటే ఆయనకు చెమటలు పట్టాయి. ఆ తర్వాత స్వామీజీ చెప్పిన మీదట పూజారిగారు, వీర్రాజు మాస్టారు నడిచారు. వాళ్ల విషయంలోనూ అలాగే జరిగింది. ఆ తర్వాత అన్నయ్య నన్ను వెళ్లమని రహస్యంగా చెప్పాడు. నేను ముందుకొచ్చి ‘‘నేను కూడా నడుస్తాను’’ అని ధైర్యంగా అన్నాను. స్వామీజీ నవ్వుతూ ఒప్పుకున్నారు. నా ముద్రలు కూడా ఎర్రగానే పడ్డాయి. అంతటితో ఆగకుండా అమ్మవారి కన్నీరుని తాగి, ‘ఉప్పుగా ఉన్నాయి’ అని చెప్పాను అన్నతో. నేను చేసిన ఆకతాయి పనికి నాన్న చివాట్లు పెట్టారు. శిష్యులు కోపంతో నన్ను పక్కకు లాగేశారు. ‘‘దీనిని బట్టి తేలిపోయింది. మీ ఊరిలో పాపం పెరిగిపోయిందని, ఇవ్వాళ నేను పిలిచిన ముగ్గురూ నిజాయితీపరులు, దైవచింతన గలవారు, పాపభీతి కలవారు. మీ ఊరి ప్రతినిధులుగా వాళ్లను పిలిచాను. ఊర్లో పాపులు పెరగడం వల్ల ఆ ప్రభావం అందరిమీదా పడడం వల్ల, వాళ్ల పాదాల ముద్రలు ఎర్రగా మారడం జరిగిందని, మీరు గ్రహించాలి. ఆఖరికి అనె్నంపునె్నం ఎరుగని ఆ పసివాడి విషయంలోను అలాగే జరిగిందంటే పరిస్థితి ఏ స్థితిలో ఉందో మీరు తెలుసుకోవాలి’’ అన్నారు. ఆ తర్వాత పరిష్కారం గురించి, చర్చ జరిగింది. మహా యాగం ఒక్కటే దీనికి పరిష్కారమని చెపుతూ, అది బాగా ఖర్చుతో కూడుకున్నదని స్వామీజీ సంశయిస్తుంటే, నాన్న, వీర్రాజు మాస్టారు, మరికొద్ది మంది పెద్దలు, అవసరమైన డబ్బు పోగుజేసే బాధ్యత నెత్తి మీద వేసుకొని స్వామీజీని ఒప్పించారు. ఇదంతా వింటున్న అన్న ముఖం చూస్తే, అప్రసన్నంగా ఉన్నట్లు, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు నాకనిపించింది. అదేమిటో అడిగి తెలుసుకొనే అవకాశం కుదరలేదు.
ఉన్నట్టుండి అన్న ముందుకొచ్చి, స్వామీజీకి నమస్కరించి, ‘‘మీరు కూడా అక్కడ నడిస్తే చూడాలని ఉంది’’ అనగానే నాన్నకు కోపం వచ్చింది. స్వామీజీ శిష్యులు అన్న మీద విరుచుకుపడబోతే, ఆయనే వారించి, చిరునవ్వు నవ్వుతూ ఆసనం దిగి వచ్చారు. భక్తులంతా ఆయనకు మొక్కడం మొదలెట్టారు. అందరూ ఉత్కంఠతో చూస్తుండగా ఆయన కాళ్లు కడుక్కొని, గుడ్డ మీదుగా నడిచారు. ‘‘ఆశ్చర్యం!!’’ ఎరుపు ముద్రలు పడలేదు. జనమంతా స్వామీజీకి జైకొట్టారు. అన్న ముఖం నెత్తురుచుక్క లేనట్లుగా పాలిపోయింది. ‘‘నీ లిమిట్స్‌లో నువ్వుండు’’ అన్నట్లు నాన్న, అన్న వైపు కోపంగా చూసేసరికి నాకు వణుకు పుట్టింది. అయినా అన్న తొణకలేదు, బెణకలేదు. కానీ నాన్నగారిని చూస్తూ గౌరవంగా తలూపాడు.
మూడు రోజుల తర్వాత నా పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం, నాన్న గ్రాండ్ పార్టీ ఇచ్చారు. చాలామంది గెస్ట్‌లొచ్చారు. పార్టీ ముగుస్తుండగా, అన్న ఒక మేజిక్ షో చేస్తానని ప్రకటించాడు. అందరం ఆశ్చర్యపోతూ దాని కోసం ఎదురు చూశాం. అన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు. ఇద్దరు నౌకర్లు గబగబా రెండు పెట్టెలు, ఒక టేబుల్, బిందెతో నీళ్లు సిద్ధం చేశారు. మేమంతా కుతూహలంతో చూస్తున్నాము. అన్న, పెట్టిలోంచి మట్టితో చేసిన అమ్మవారి విగ్రహం ఒకటి తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి నమస్కరించి, హారతి ఇచ్చాడు. కాస్సేపట్లో గగ్గోలు ప్రారంభమైంది. అమ్మవారి కళ్లమ్మట నీళ్లొస్తున్నాయి. జనంలో కలవరం మొదలైంది. నాన్న నోరు వెళ్లబెట్టి అటే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత అన్న సూచన ప్రకారం, నౌకర్లు పసుపు రంగు గుడ్డనొకదాన్ని నేల మీద పరిచారు. అన్న, అక్కడున్న నీళ్లతో కాళ్లు కడుక్కొని, గుడ్డ మీద అడుగు వేయగానే అతని పాదపు ముద్ర ఎర్రగా రక్తంలా కనిపించగానే, జనంలో గొప్ప అలజడి చెలరేగింది. ‘‘ఇదెలా చేశావు? స్వామీజీలా నీకు మహత్యాలున్నాయా?’’ అంటూ జనం చుట్టూ మూగి, ప్రశ్నలు వేస్తుంటే, అన్న నవ్వుతూ’’ మాయా లేదు మర్మమూ లేదు. ముందే చెప్పానుగా మేజిక్, అంతే’’ అన్నాడు. ‘‘ఎలా చేశావు? దీని రహస్యం చెప్పవా?’’ అంటూ అమ్మతో సహా అందరూ బతిమాలారు. ‘‘చెప్పాను. ముందు అందరూ కూర్చోండి’’ అంటూ మొదలుపెట్టాడు.
‘‘ఈ మట్టి విగ్రహం లోపల అంతా గుల్లగా ఉంటుంది. అమ్మవారి కళ్ల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి, మైనంతో కప్పేశాను. ఆ తర్వాత విగ్రహాన్ని తలక్రిందులుగా చేసి, కిరీటం నుండి మెడ వరకు కొద్దిగా తడి చేసిన సముద్రపు ఉప్పును నింపి, సిమెంట్‌తో సీల్ చేసేసి రెడీ చేశాను. హారతి ఇచ్చే సమయానికి ఉప్పు చాలా వరకు నీళ్లయిపోయి, బయటపడ్డానికి రెడీగా ఉన్నప్పుడు హారతి ఇస్తూ అమ్మవారి కళ్ల దగ్గర వేడి తగిలేలా జాగ్రత్త పడ్డాను. ఆ వేడికి మైనం కరిగిపోయి నీళ్లు బయటకొచ్చాయి’’ అంటూ ముగించగానే అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. నాకెంతో గర్వమనిపించింది. ఆ తర్వాత రక్తపు ముద్రల గురించి చెప్పాడు. ‘‘పారాణి తయారుచేసే టెక్నిక్ ఇది. ఈ నీళ్లలో ముందే సున్నం కలిపాను. సున్నం, పసుపు కలిస్తే ఎర్రటి రంగు వస్తుందిగా? అదే టెక్నిక్’’ అనగానే అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ‘‘పదహారేళ్ల కుర్రాడికి ఎన్ని తెలివితేటలో!!’’ అని మెచ్చుకున్నారు. అయితే అన్న గొప్పతనాన్ని మెచ్చుకోని వాళ్లు కూడా చాలామంది ఉన్నారని అప్పుడే తెలిసింది. వాళ్లలో మొదటివారు వీర్రాజు మాస్టారు. ‘‘ఈ మేజిక్కులకేం? స్వామీజీ నడిచినప్పుడు ఎర్రటి ముద్రలు పడలేదుగా? అలా చేసి చూపించు. అప్పుడు చూద్దాం’’ అంటూ హేళనగా మాట్లాడారు. అన్న ముఖం పాలిపోయింది.’’ అది ఇప్పుడు నేను చేయలేను. దానికి...’’ అంటుండగానే మాస్టారు గట్టిగా నవ్వి,’’ అనుకున్నాను. నీ వల్ల కాదని. స్వామీజీ అంటే మాటలనుకున్నావా? నీలాంటి వాళ్లు ఆయన కాలి గోటికి కూడా సరిపోరు’’ అని వెటకారంగా అంటున్నా, అన్న మాత్రం బెదరలేదు.
‘‘అది ఎలా జరిగిందో చెప్తాను వినండి. ఇలాంటి చాలెంజ్ వస్తుందని ముందే ఊహించిన ఆయన, ముందుగానే పాదాలకు వాటర్ ప్రూఫ్ జెల్ రాసుకొని ఉంటారు.
దానివల్ల సున్నపు నీళ్లు సహజంగా పాదాలకు అంటుకోవు. అందుకే ఆ ముద్రలు పడలేదు’’ అంటూ వివరణ ఇచ్చేసరికి, నాన్నతో సహా అందరూ చప్పుట్లు కొట్టారు.
‘‘ఇంత తెలిసినవాడివి, నువ్వలా చేసి చూపించొచ్చు కదా?’’ అంటూ సవాల్ చేశారు వీర్రాజుగారు. ‘‘కానీ అలాంటి జెల్ ఈ ప్రాంతంలో దొరకదు...’’ అంటుంటే మళ్లీ అడ్డు తగిలి’’ ఓస్.. ఈ కబుర్లకు నీ బుట్టలో పడిపోయి, స్వామీజీ మహిమలు ఇక్కడ ఉన్న వాళ్లందరికీ తెలుసు. నీలాంటి బచ్చాల వల్ల ఆయన పేరేమీ తగ్గిపోదు. తప్పు చేశావు. తప్పు ఒప్పుకొని ఆయన కాళ్లమీద పడు. లేదా నాశనం అయిపోతావు’’ అని శాపనార్థాలు పెట్టారు వీర్రాజుగారు. అప్పుడు అనే్నమీ అనలేదు గానీ, నాన్నతో సహా సగానికి పైగా జనం అన్నను సపోర్ట్ చేశారు. అలా చీలిపోయిన రెండు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఎవరి మానానా వారు వెళ్లిపోయారు. తుఫాన్ వచ్చి వెలిసినట్లయింది. మొత్తానికి నా పుట్టినరోజు ఎన్నటికీ మర్చిపోలేనట్లు చేశాడు అన్న.
అలా అన్న పెద్ద సాహసమే చేశాడు. అందువల్ల స్వామీజీ శిష్యులు, అభిమానులు అన్నకు ఏదైనా కీడు చేస్తారని, అన్నకు రక్షణ ఏర్పాటు చేసి, తగిన జాగ్రత్తలు చెప్పారు నాన్న. నాలుగు రోజుల తర్వాత, అన్న బయలుదేరే రోజు వచ్చింది. అన్నకు ఏ హాని జరగనందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అమ్మా, నాన్నా.
కానీ ఆ రోజు ఉదయమే అన్నకు హఠాత్తుగా ఆరోగ్యం పాడయింది. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, విపరీతమైన చలితో బాధపడిపోతుంటే, నాకు ఏడుపొచ్చింది. వెంటనే డాక్టర్‌ని పిలిపించారు. లక్షణాలు చూసి మలేరియా కావచ్చు అన్నారు. కానీ, టెస్ట్ రిజల్ట్స్ దానికి అనుకూంలగా లేవన్నారు. వ్యాధి ఫలానా అని నిర్థారణ చేయలేని లోకల్ డాక్టర్, అన్నను వెంటనే సిటీకి తీసుకెళ్లిపోమని సలహా ఇచ్చారు. అన్న ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిపోయింది. వీర్రాజు గారితో సహా చాలామంది చూడ్డానికి వచ్చారు. అన్న చేసిన పనికి ఇలా అనుభవిస్తున్నాడని, ఆయనతో సహా చాలామంది అనడం అన్న చెవుల్లో పడింది.’’ ఈ జనం మారరు’’ అని నిరాశగా అన్నాడు.
అన్నను సిటీ హాస్పిటల్లో చేర్చాక, కొంత మెరుగు కనిపించింది. అన్నకొచ్చిన వ్యాధి ‘్ఫల్సిఫారం’ అనే ప్రాణాంతకమైన మలేరియా అని తెలియగానే, అందరికీ వణుకు పుట్టుకొచ్చింది. ట్రీట్‌మెంట్ చేస్తుండగానే అది సెరిబ్రెల్ మలేరియాగా మార్పు చెందింది. పరిస్థితి విషమించింది. డాక్టర్లు చేతులెత్తేశారు. అన్న బతకడని, అతడికి కూడా తెలిసిపోయింది.
‘‘తమ్ముడూ నాకో ప్రామిస్ చేయరా. నువ్వు పెద్దయ్యాక ఈ మూర్ఖపు జనాన్ని మార్చే పయత్నం చేయరా. నేనిప్పుడు చచ్చిపోతున్నందుకు బాధ పడటం లేదు. ఒక దోమ వల్ల కాక, వాళ్లు దేవుడిలా కొలిచే స్వామీజీ వల్ల నేను చనిపోయాననుకుంటారనే నా బాధంతా.’’ అవే అన్న చివరి మాటలు.
* * *
అరవింద డైరీ చదవడం పూర్తి చేసింది. ఆమెలో మునుపటి కోపం లేదు. పెళ్లయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రదీప్ కోణంలో ఆలోచించడం ప్రారంభించింది. తిరిగి వచ్చిన ప్రదీప్ ఆమెలో మార్పు గమనించాడు. ‘‘చిన్నప్పుడు నేను పెరిగిన ‘సిరిపల్లె’ ఈ ప్రాంతంలోనే ఉంది. అక్కడి జనం ఇంకా మారలేదు. అలాగే ఉన్నారు. ఈ ప్రాంతమంతా అలాగే ఉంది. అందుకే శక్తివంచన లేకుండా ప్రయత్నించి, వాళ్లలో మార్పు తేవాలని, అన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాను. మరి నీ అభిప్రాయం ఏమిటి?’’ అని అడిగాడు ఎంతో ఆశగా. అరవింద అతనికి దగ్గరగా జరిగి, ప్రేమగా అతని చేతిని, తన చేతిలోకి తీసుకొని, ‘‘అంతా తెలుసుకున్నాను కదా? మీరు తలపెట్టిన యజ్ఞంలో పాల్పంచుకోవడానికి, నేను ఏం చెయ్యాలా? అని ఆలోచిస్తున్నాను’’ అనగానే ప్రదీప్ తలపై పూలజల్లు కురిసినట్లయింది.