కథ
అనన్య సామాన్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలచక్రం గిరగిరలు, కడలి కెరటాలు మనిషి కోసం ఆగవు గదా! పండుగల సీజనొచ్చింది. వారం రోజుల్లో బతుకమ్మ పండుగ. ఆ తర్వాత రోజు విజయదశమి. ఏకాదశి నాడు రంజాన్, మరి కొద్ది రోజుల్లోనే దీపావళి. కుట్టాల్సిన బట్టలు గుట్టల్లాగున్నాయి. బ్లౌజులు, పంజాబీ డ్రెస్సులు అన్నీ... పండగలకు అందించి తీరాలి. నిన్నంతా కుట్టు మిషన్ ముట్టుకునే తీరికనే లేదు. ఈ రోజు గూడా అలాగే అయితే ‘నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్టు’ ‘‘గిదేం ఆలస్యం?’’ అని నిలదీస్తారు. నమ్మకం పోగొట్టుకున్న మనిషి బతుకు నరకప్రాయమే.
కోడి కూతతో పోటీపడుతూ నిద్ర లేచి తయారై కుట్టు మిషన్ ముందు కూచుంటుంది విజయ. మిషన్ చక్రానే్న బతుకు చక్రంగా భావించి పొద్దుపొడిచి భూమాతకు రంగులద్ది మూరెడెక్కే దాకా కుడుతూనే ఉంది. ఆయాసం ఆనవాళ్లు గరం చాయ్‌ను గుర్తు చేసినై. ఏమిటో! వయసుతో పాటు ఒంట్లో అలసట పెరిగిపోతుంది... ఆలోచనను తెంపేసి, లేచి చాయ్ తయారు చేసుకుని, గ్లాసులో పోసుకుని, గోడకొరిగి కూచుండి సేవిస్తూంది. గరం చాయ్ నరాలను తాకి నూతన శక్తినిచ్చింది. ఒక్కగానొక్క కొడుకు కళ్లల్లో కదిలాడు. తాను బతుకుతుంది వాని కోసమే. భర్త ప్రాణం వదులుతూ నాలుగేళ్ల కొడుకు విక్రమాదిత్యను తన చేతుల్లో ఉంచి ‘‘బాబును బాగా చదివించు విజయా?’’ అంటుండగానే కాన్సర్ మింగేసింది.
పాత ఇల్లు తప్ప పెద్దల నుండి సంక్రమించిన ఆస్తిపాస్తులేవీ లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అప్పుడు లోకం చీకటి గుహలా కనబడింది. అయినా... రెక్కలు ముక్కలైనా సరే భర్త ఆదేశం శిరసా వహించాలని నిర్ణయించుకుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మారు మనువుకు అంగీకరించలేదు. పుట్టింట్లో నేర్చుకున్న కుట్టుపనినే నమ్ముకుంది. అదే పనిలో కొత్త మెలకువలు నేర్చుకుంది. విక్రమాదిత్యను దొరబాబులు చదువుకునే ప్రైవేటు స్కూల్లో చేర్పించాలనుకుంది. చేతిలో అన్ని డబ్బుల్లేవు. ఫీజు, డ్రెస్సులు వగైరాలకు చాలా డబ్బు కావాలి. అప్పు చెయ్యాలంటే ఆ ధైర్యానికి అభిమానం తోడైంది. ఆశయం, ఆత్మాభిమానం మధ్య ఇసుర్రాయలో మక్కగింజలా నలిగిపోయింది మనసు.
ఇంటి ముందున్న సెలూన్ నర్సిములు తన కూతురుకు డ్రెస్సు కుట్టించాలని వచ్చాడు. అతడు వెంట్రుకల వ్యాపారి గూడా. ఏందక్కా! గట్ల విచారంగా ఉన్నావు?’’ ఆప్యాయంగా అడిగిండు. మంచుపూలైన కళ్లను కొంగుతో అద్దుకుంది. అతి పొడుగాటి జడను గుండెల మీంచి తీసి వెనకేసుకుంది. తన పరిస్థితినంతా చెప్పేసింది. జడ కొండమీదికి పాకుతున్న నల్లనాగులాగుంది. మిషన్ మీద చుట్టలుగా చుట్టేసింది.
‘‘అక్కా! అప్పు చెయ్యనంటవు. పైసల్లేవంటవు. దీని కొక్కొటి ఉపాయముంది. నీ పొడవు జడను నాకు అమ్మితే ఆ డబ్బు నేనిస్తా! వాగు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే చెట్టు వేరు ఆసరా దొరికినట్టనిపించింది విజయకు. వెంటనే సరేనంది. చిన్నప్పట్నుంచి తనను అంటిపెట్టుకుని ఉన్న జడ తనను వీడిపోయింది. అయితేనేం? విక్రమాదిత్యను అనుకున్న బడిలో చేర్పించింది.
ఆడవాళ్ల బట్టలు కొత్త కొత్త డిజైన్లలో కుట్టడంలో అరితేరింది. తన శ్రమశక్తే కొడుకు చదువుకు పెట్టుబడి అయింది. ఆత్మవిశ్వాసం అడ్డంకులనన్నింటినీ అధిగమించింది. విక్రమాదిత్య కష్టపడి చదువుల సారాన్ని గ్రహిస్తున్నాడు. తన చెమట బిందువులకు స్కాలర్‌షిప్ తోడై హైద్రాబాద్ చదువులను ముందుకు నడిపించింది. పాతికేళ్ల తపస్సు ఫలించింది. కొడుకు ఎం.సి.ఏ. ఫస్ట్‌క్లాసులో పాసయ్యాడు. పది రోజుల క్రితం ఇంటికొచ్చిండు. తన పాదాలకు నమస్కరించిండు. తండ్రి ఫోటో ముందు ఏదో కవరు ఉంచి భక్తిగా దండం బెట్టిండు. మొహం కార్తీకపున్నమి వెనె్నలలా వెలిగిపోతూంది. కారణమేమిటని ఆశ్చర్యంగా అడిగింది. అదే కవరుని తన చేతకిచ్చిండు. నాకు హైదరాబాద్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం దొరికిందమ్మా. వెంటనే జాయినవ్వాలి.’’
తిరుపతి లడ్డూ తిన్నంత సంతోషమైంది తనకు. గుండెల్లో అష్టసముద్రం పొంగులెత్తింది. కొడుకు నుదురు ముద్దాడి ఒడిలోకి తీసుకుంది. నోట్లో పంచదార పోస్తూ అంతా దేవుని దయ అంది. కొడుకు మొహం గంభీరమైంది. దేవుడెట్లుంటడో నాకు తెల్వదమ్మా. నాకు కనిపించే దేవత మా అమ్మనే’’ అంటూ తన చేతులందుకుని కళ్లకద్దుకున్నాడు.
అప్పుడే ఆ ఊరి దొర కూతురు, యువతి అనన్య లేడిపిల్లలా గంతులేస్తూ వచ్చింది.
‘‘కంగ్రాట్స్ విక్రమ్!’’ అంటూ విక్రమాదిత్య చేతులందుకుని అరచేతుల్ని చెంపల కద్దుకుంది.
పట్నంలో చదువుతూ పెళ్లీడుకొచ్చిన అందమైన పిల్ల అట్లా ప్రవర్తించడం బాగనపించలేదు. దొరగారికీ విషయం తెలిస్తే... అమ్మో! ఇద్దర మధ్యకెళ్లి నుంచుంది. అనన్య మొహం రంగు మారింది.
‘‘దొర - దొర్సాని బాగున్నరామ్మా?’’ భయం భయంగా అడిగింది. అనన్య బాగున్నారని తలూపింది. తల వంచుకుని వెళ్లిపోయింది.
‘‘విక్రమా! దొర పెద్ద జమీందారు. పట్నంలో బోలెడన్ని ఆస్తులున్నై. వాళ్ల పిల్ల మనింటికెందుకొచ్చిందిరా?’’ ఆందోళనగా అడిగింది.
‘‘దేవుడిలో పెరిగిన పిల్ల దేవత గుడికొచ్చిందమ్మా. ఆ రోజుల్లో దొరలంటే హడలట. అనన్య మర్యాద కోసం వచ్చిందంతే. సర్ది చెప్పాడు. సాయంత్రం హైదరాబాద్‌కెళ్లిపోయిండు.
ఈ సీజన్లో కష్టపడితే సరి. కష్టాలన్నీ తీరినట్టే. మంచి పిల్లం జూసి విక్రమ్‌కు పెండ్లి చెయ్యాలే. వాని పిల్లల్తో ఆడుకుంటూ తానూ హైదరాబాద్‌లోనే హాయిగా ఉండొచ్చు... తృప్తిగా ఊపిరిపీల్చుకుంది. ఆ తృప్తి చాలాసేపు నిల్వలేదు.
నిన్న దొరవారి పనిమనిషి వచ్చి ‘‘అమ్మా! దొరవారు నీతో మాట్లాడారట. ఎప్పుడు నీకు వీలవుతుందో అడిగి రమ్మన్నాడు.’’ అడిగిండు.
తనతో దొరకేం పని? నైజాం దిగిపోయినా దొరల పెద్దీర్కము అట్లనే ఉన్నది. తనను బెదిరిస్తాడేమో! ‘‘నేనే వస్తున్న పదా!’’ అని ఆగమాగాన దొరవారింటికెళ్లింది. భుజాల నిండా కొంగు కప్పుకుని బిక్కుబిక్కు మంటూ నుంచుంది. కూచొమ్మన్నారు. కూచున్నది. దోర-దొర్సాని తన కొడుకు గురించి అడిగారు. చెప్పింది. అయినా లోపలి పరేషాన్ కళ్లల్లో కొచ్చింది.
‘‘నీతో వియ్యమందుకోవాలనుంది విజయమ్మా!’’ అంది దొర్సాని. ఇది కలనా, నిజమా...కాదు...వెటకారం. తాబేలులా ముడుచుకుపోయింది. నాకంత ఆశ లేదు దొర్సానీ!’’ గొంతులో గురగుర.
‘‘కానీ మా అనన్యకుందమ్మా!’’ దొర గొంతు మామూలుగుంది.
‘‘కానీ... నా కొడుక్కుండాలే గదా!’’ అందామనుకుని ఊరుకుంది. సింహం ముందు చిట్టెలుకలాగుండిపోయింది. అప్పటి దాకా ముంగిలా కూచున్న అనన్య చకచకా సెల్‌ఫోన్ నెంబర్లు ఒత్తి ‘‘నీ కొడుకుతో మాట్లాడమ్మా’’ అంటూ తన చేతికిచ్చింది.
దొర దరహాసాన్ని లెక్క చేయకుండా కొడుకుతో మాట్లాడి విషయమంతా చెప్పేసింది.
విక్రమ్ ఏమాత్రం తొణక్కుండా ‘‘రేపు వస్తున్నా. నువ్వు బేఫికరీ గుండు. నేనే మాట్లాడ్తా’’ అన్నాడు. అయినా నవనాడులు కుంచించుకుపోయినై. మారు మాట్లాడకుండా ఇంటికి తిరిగొచ్చింది. అప్పట్నుంచి ఆలోచనల బొంగురాలు బుర్రలో ఆడుకుంటూనే ఉన్నాయి.
ప్రాణ సమానంగా చూసుకున్న కొడుకు మీద దొర కూతురు కన్ను పడింది. దొరకు కోపమొస్తే అగ్గి మీద గుగ్గిలమై మమ్ముల్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెర్ల నీళ్లు తాగిస్తడు. ఒకవేళ కూతురు బలవంతమీద ఒప్పుకున్నా వాడు పులి నోట్లో తలకాయ పెట్టినట్టే. దొరలింటి అనన్య వాణ్ని గంగిరెద్దులా అడిస్తుంది. వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీ కావాలన్నారు....
‘‘విజయమ్మా! ఓ విజయమ్మా!’’ పక్కింటి సుజాత భుజం పట్టి కుదిపింది. ఉలిక్కిపడింది విజయ.
‘‘గట్లున్న వేందీ? నా బిడ్డ డ్రెస్సు కుట్టినవా?’’
‘‘ఆ... మబ్బులనే కుట్టిన.’’ లేచి డ్రెస్సు ఇచ్చి డబ్బులు తీసుకుంది. తిరిగి కుట్టుమిషన్ ముందు కూచుంది.
‘‘అమ్మా!’’ అయ్యని గొంతు విక్రమాదిత్యదే.
‘‘హమ్మయ్య! వచ్చినవా కొడుకా!’’ గుండెల మీద చెయ్యేసుకుంది. ఆత్రంగా ఎదురెళ్లి కొడుకు ఛాతీమీద తలానించింది. నిన్నటి అనుభవాన్నంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ‘‘విక్రమా! గా అనన్య గట్లెందుకు చేయించిందిరా?’’ గుండెలు బిగపట్టుకుని అడిగింది.
విక్రమ్ తేలిగ్గా నవ్విండు... అదా! నువ్వే అడుగమ్మా!’’ అని ‘‘అనన్యా! ఇటురా!’’ పిలిచిండు. ఆశ్చర్యం! అనన్య లోపలికొచ్చి విజయకు పాదాభివందనం చేసింది. భుజాలు పట్టి లేపి చెంపలు పుణికింది. ‘‘ఇదంత ఏమిటమ్మా దొర్సానీ?’’ అయోమయంగా అడిగింది.
అనన్య బుగ్గల నిండా సిగ్గులు పూచినై. మొహం నిర్మలంగా ఉంది. ‘‘ఏం లేదత్తయ్యా! నేను హైదరాబాద్‌లో డిగ్రీ చదివేప్పుడు పక్కపక్క ఇండ్లల్లవున్నం. ప్రేమించుకున్నాం. మీ ఆశీర్వాదం కావాలి గదా!’’ అంది విక్రమ్‌ను ఓరగా చూస్తూ విజయ ఊపిరి పీల్చుకుంది.
‘‘ఆం.. టే... దొరవారి అమ్మాయి కావాలనే నా కొడుకును కోరుకుందన్న మాట!’’ కనుబొమ్మలు అర్థచంద్రాకారాలైనయి. కొడుకును కొత్త కోణంలో చూస్తూ ‘‘అసలు సంగతేమిటో దాపిరకం లేకుండా చెప్పురా!’’ విక్రమాదిత్య తల్లి చేతులందుకుని నెత్తిమీదుంచుకున్నడు. ‘‘అమ్మా! మేము మనసులిచ్చి పుచ్చుకున్నం. మాకు పెళ్లి చేస్తే ధన్యులమవుతాం.’’ పసిపిల్లవాని చాక్లెట్ ఆరాటంలా అడిగిండు.
విజయ నోరెళ్లబెట్టి ముక్కుమీద వేలేసుకుంది. కొడుకును, అనన్యను పరిశీలనగా చూస్తూ ‘‘వామ్మో! దొరలతోని సంబంధం పిల్లలాట కాదు కొడుకా. దొరలు ఆ రోజుల్లో ఊరివారందర్ని హడలగొట్టిండ్రు. అది నీకు తెల్వదిరా!’’
అనన్య తండ్రి విజయ ముందుకొచ్చి చేతులు జోడించి నమస్కరించిండు. ఆనాటి దొర నేటి ఆడపిల్ల తండ్రి.
‘‘అంత భయమెందుకు విజయమ్మా? నన్ను నీ అన్నయ్యలా భావించుకో. ఈ పెళ్లి మాకిష్టములే. నువు సరేనంటే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తా.’’ మాటల్లో నిజాయితీ ఉంది.
అనన్య తల్లి విజయ చేతులందుకుని ‘‘వదినా! ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కావు. ఆత్మీయతనే శాశ్వతం. దొరల పెత్తనం కాలం చెల్లిపోయింది. మేము మీ లెక్కనే సామాన్యులం.’’ చిరునవ్వులు చిందిస్తూ అప్యాయంగా గుండెలకు హత్తుకుంది.
ఎవరెస్టు శిఖరమెక్కి త్రివర్ణ పతాక మెగరేస్తున్న బచేంద్రిపాల్‌లా విజయ అంతరాళాలలో ఆనందోత్సాహాలు మోసులెత్తినై. అంతా నిజమేనని అర్థమైంది.
కొడుకు నెత్తమీదో మొట్టికాయిస్తూ ‘‘విక్రమా! నువు అసాధ్యుడివిరా!’’ నుదురు ముద్దాడింది. అనన్యను అక్కున చేర్చుకుని నా కోడలు లక్ష్మీదేవిలాగుంది... అంటూ ఆశీర్వదించింది.