కథ

వీడుకోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ....
-----------------------------------------------

అసలు వాడికి బుద్ధి ఉందా? పంతానికి కాకపోతే, ఇరవై రెండో తారీఖుకి ఇంకా పదిరోజులు ఉంది. ఏం మాట్లాడుతున్నాడు వాడు?2
తమ్ముడి ఫోన్ వచ్చినప్పటి నుండి చిందులేస్తున్నాడు రమణమూర్తి.
పంతమే మరి! లేకపోతే ఏడు నెలల నుంచి బాగాలేని మనిషిని చూడటానికి ఆ మనవడికి తీరిక దొరకలేదు కాని... తీరా ఇప్పుడు ఈ స్థితికి వచ్చాక.. ప్రేమంతా కారిపోయినట్టు బయలుదేరి వస్తాడట! అదీ పదిరోజుల తర్వాత.. సిగ్గుండాలి!2 ఈసడించింది భార్య రాజ్యలక్ష్మి.
3ఆ వేళ డాక్టర్లు మా ఇద్దర్ని కూర్చోబెట్టి చిలక్కి చెప్పినట్లు చెప్పారు.. మనిషి బ్రెయిన్ డెడ్! గుండె, ఊపిరితిత్తులు మాత్రమే పనిచేస్తున్నాయి.. ఇక ఏ మాత్రం ఆశలు లేవు.. కేవలం వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నాడు.. ఆ సపోర్ట్ ఉన్నన్నాళ్ళు ఉంటాడు. అది తీసేస్తే ఇక లేనట్లే..2
అయితే అది ఇంకా ఉంచాలా.. తీయాలా.. ఎప్పుడు అన్నది మీ నిర్ణయం! మీ వాళ్ళెవరైనా వచ్చేదున్నా, మీరు అవయవదానం ఏదైనా చేయదలుచుకున్నా అది ఉంచుదాం. ఆలోచించుకుని చెప్పండి! అని కూడా అన్నారు! అంతా విని బయటకు వచ్చాక.. ఏరా! ఏం అంటావ్? అంటే.. నాకు ఆఫీస్‌లో అర్జెంట్ మీటింగ్ ఉంది! నేను సాయంత్రం ఫోన్ చేస్తా! అని హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆ పోత.. పోత మూడు రోజులయ్యాక ఇవ్వాళ ఫోన్ చేసి ఈ మాట! అసలు బుద్ధుందా వాడికి! మళ్ళీ మొదటికే వచ్చాడు రమణమూర్తి.
మీటింగ్ కాదు.. బూడిద కాదు! ఇప్పుడు ఆ డాక్టర్లు చెప్పింది అంతా పొల్లుపోకుండా, పూస గుచ్చినట్టు పెళ్ళానికి చెప్పద్దూ? ఆవిడగారు కాలుమీద కాలు వేసుకుని అదంతా విని ఆవిడ అమూల్యమైన తీర్పుని వెలువరించాక.. అప్పుడు ఈయనగారు మనకది చేరవేస్తాడు! మరిదిపై గల అక్కసంతా వెళ్ళగక్కింది రాజ్యలక్ష్మి.
ఇంతకీ ఈ సంభాషణకంతా కారణభూతుడైన ఆ 3బాగాలేని మనిషి2ఎనభై ఐదేళ్ళ శ్రీనివాసరావు! మూడేళ్లక్రితం భార్య పోయినప్పటి నుండి కొడుకులిద్దరి దగ్గర ఆర్నెల్లు చొప్పున కాలం వెళ్ళదీస్తున్న వృద్ధుడు! పెద్ద కొడుకు రమణమూర్తిది పెద్ద ఎగుమతుల వ్యాపారం కాగా, చిన్నకొడుకు భాస్కర్ ఒక బహుళ జాతి కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. డబ్బు పెద్ద సమస్య కాదు వాళ్ళిద్దరికి, సమయమే సమస్య!
ఏడెనిమిది నెలలుగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న ఆయన పరిస్థితి వారం క్రితం మరీ విషమించటంతో, ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాణి ఆఖరి శ్వాస విడువకుండా ఆ వెంటిలేటర్ అడ్డుపడుతోంది! ఆ అడ్డు ఎప్పుడు తొలగించుకోవాలో మీరే నిర్ణయించుకోండి అన్నారు డాక్టర్లు!
ఆ అడ్డు తొలగించాలన్న విషయంలో అన్నదమ్ములిద్దరిది ఏకాభిప్రాయమే కానీ ఎప్పుడన్న విషయంలోనే ఇప్పుడు ఈ రభస!
రమణమూర్తి, రాజ్యలక్ష్మిల మధ్య ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే అక్కడ భాస్కర్, అతని భార్య భవానీల మధ్య చర్చ జరుగుతోంది.
అరె! ఏం మనిషివాడు! డాక్టర్ ఇలా చెప్పాడో లేదో.. బయటికి వచ్చి ఏం చేద్దాంరా? అంటాడు. అదేమన్నా క్షణాల్లో తేలే విషయమా? ఎన్ని ఆలోచించుకోవాలి? ఎన్ని ఎంగేజ్‌మెంట్స్ ఉంటాయి.. ఆవేశంగా అంటున్నాడు భాస్కర్.
వాళ్ళకంత ఆలోచన కూడానా! ఎప్పుడెప్పుడు వదిలించేసుకుందామనే ఆతృత తప్ప! అసలు మామయ్యగారు వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడు అతి కష్టం మీద ఉంచుకునేవాళ్ళు. మనింటికొచ్చాకే ఆయన ప్రాణం కాస్త తెరిపిన పడేది. ఇప్పుడు కూడా చూశారా! మనింటి నుండి వెళ్ళినప్పుడు ఎంత బాగున్నారు. మందులు వాడుతున్నారనే కానీ ఎటువంటి సమస్యా లేదు. అక్కడికి వెళ్ళాకే.. వేళకి ఒక తిండి లేక.. మందు లేక.. ఇలా అయింది అంది భవాని.
సరే, పెద్దాయన.. వయసైపోయింది.. కానీ అవతల నిఖిల్ తాతయ్యని చూడాలి.. చూడాలి అంటున్నాడు కదా! వాడు అట్లాంటా నుండి, సెలవు దొరికి.. ఫ్లైట్ దొరికి.. రావాలంటే టైమ్ పట్టదా..? అది అర్థం చేసుకోకుండా అన్ని రోజులా.. అన్ని రోజులా అంటాడేంటి? చిరాగ్గా అన్నాడు భాస్కర్.
అవును. పైగా అయ్యో.. అన్ని రోజులు ఆయనకి ఎవరు చేస్తారు?2అన్న బాధ లేదు. ఉన్నది ఐసీయూలోనే.. 3మీరెవ్వరూ ఉండనక్కరలేదు. అంతా మేము చూసుకుంటాం2అని ఆసుపత్రి వాళ్లు చెప్పనే చెప్పారు. ఇంకా ఈ సగుణుడు ఏంటో? అంది భవాని.
అదే కదా నేననేది.. ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళం.. ఇంకొంత! పైగా ఈ ఇరవైన మా కంపెనీలో ఫారిన్ డెలిగేట్స్‌తో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. నిఖిల్ వచ్చేలోపు అది అయిపోతుంది. వాడు వచ్చి చూశాక తీయించేస్తే.. మిగతా కార్యక్రమాలకి కూడా వాడు ఉండచ్చు. అది నా ప్లాన్.. చెప్పాడు భాస్కర్. భాస్కర్ ఏది చేసినా పక్కా ప్రణాళికతోనే చేస్తాడు.
***
అక్కడ రాజ్యలక్ష్మి బుర్రలో ఒక కొత్త ఆలోచన పుట్టింది.
ఏం! ఆ నిఖిల్ గాడికేనా తాతయ్య మీద ప్రేమ! ఇరవై రెండు అంటే ఏముందీ! ఇంకో రెండు రోజులు ఆగితే మన అఖిల సెమిస్టర్ పరీక్షలు అయిపోతాయి. అదీ ఢిల్లీ నుండి వచ్చేస్తుంది. దానికి మాత్రం ఆఖరి చూపు దక్కకుండా ఎందుకు..? దాన్నీ రానివ్వండి. ఆ తర్వాతే కానిద్దాం! అంది.
అక్కడితో ఆగక వెంటనే అఖిలకి ఫోన్ చేసింది కూడా. అబ్బ మమీ! ట్వెంటి సిక్త్స్ నేను రాలేను. ఫేర్వెల్ పార్టీ ఉంది ఇక్కడ. అది మిస్ చేయలేను.. గునిసింది అఖిల. కావాలంటే.. ట్వెంటీ ఎయిత్ పొద్దున ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తా! అంది.
రమణమూర్తికి అదే చెప్పి ఒప్పించింది రాజ్యలక్ష్మి.
***
అలా మూడు వారాలు గడిచాయి. ఆసుపత్రిలో చేర్చిన మొదటివారం వంతులు వేసుకుని రోజుకి ఒకళ్ళు చొప్పున వెళ్ళి కాసేపుండి వచ్చారు. రెండోవారంలో ఒక రెండు రోజులు మాత్రమే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళుంటారని వీళ్ళు, వీళ్ళు వెళ్ళుంటారని వాళ్ళు ఊరుకున్నారు.
పైగా అది పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి కాబట్టి పేషెంట్ పరిస్థితి.. రోజు మేము ఈమెయిల్ పెడతామని చెప్పారు. ఏ రోజుకి ఆ రోజు.. పేషెంట్ యొక్క క్రిటికల్ రీడింగ్స్.. ఆయనకిచ్చిన డైట్.. మందులు ఇలా అన్నీ ఒక పట్టికలా పెట్టేవారు.
3చాలా మంచి పద్ధతి ఇది. ఎప్పటికప్పుడు మనకి విషయం తెలుస్తూ ఉంటుంది.. అన్నాడు రమణమూర్తి. 3నిజమే! ఈ మహానగరంలో.. ఈ ట్రాఫిక్‌లో మనం వెళ్ళి కనుక్కునే కన్నా.. దిస్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్2 అన్నాడు భాస్కర్. ఇద్దరన్నదమ్ములకి మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. పెద్దాయన పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. వాళ్ళు ఆశించలేదు కూడా!
***
అమెరికాలో హఠాత్తుగా మొదలైన మంచు తుఫాను కారణంగా నిఖిల్ ఫ్లైట్ ఇంకా ఆలశ్యం అయింది. అఖిల వచ్చిన మర్నాడు చేరాడు. ఈ లోపు రమణమూర్తి కాన్సిల్ చేసుకోవాలేమో అని భయపడ్డ సింగపూర్ బిజినెస్ ట్రిప్ పూర్తి చేసుకున్నాడు. అవుతుందో కాదో అనుకున్న రాజ్యలక్ష్మి వైభవలక్ష్మి వ్రతం ఆఖరి వారం కూడా పూర్తి అయి ఉద్యాపన కూడా చేసుకుంది. నిఖిల్‌కి అమెరికాలో ఉద్యోగం వస్తే కొండమీద ఉన్న అమ్మవారి గుడిలో నిద్ర చేస్తామని మొక్కుకుంది భవాని. అందరూ కలిసి వెళ్ళి ఆ మొక్కు కూడా తీర్చుకున్నారు.
మర్నాడు కొండ దిగి అందరూ నేరుగా ఆసుపత్రికే వెళ్ళారు. 3మనం ఇవాళ వెంటిలేటర్ తీయించేస్తే మళ్ళీ రెండు వారాలు.. ఏ ఎంగేజ్‌మెంట్స్ కుదరవు కదా.. అలా చూసుకునే నేను ఈ రోజు ఫిక్స్ చేశాను2 ఒకింత అతిశయంతో అన్నాడు భాస్కర్. 3అవును.. ఇవాళ ఇరవై ఎనిమిది కాబట్టి.. వచ్చే నెల పనె్నండు లోపు అన్ని కార్యక మాలు అయిపోతాయి. పదిహేను నిఖిల్ తిరుగు ప్రయాణం!2 అంది భవాని.
3ఆ.. ఈయన ఫారెన్ ట్రిప్ కూడా పదహారు కాబట్టి.. దానికి సమస్య లేదు..2 అంది రాజ్యలక్ష్మి. పర్‌ఫెక్ట్ ప్లానింగ్ అనుకున్నారు.
ఆసుపత్రికి వెళ్ళి నేరుగా అందరూ లిఫ్ట్‌లో ఏడో ఫ్లోర్‌కి వెళ్ళారు. ఐసీయూ ఉన్నది అక్కడే. పేషెంట్ దగ్గరికి ఒక్కరినే వెళ్ళనిస్తారు కనుక ముందుగా నిఖిల్ వెళ్ళాడు లోపలికి. నిమిషంలోనే బయటికి వచ్చి.. అదేంటీ? మనం వచ్చింది కరెక్ట్ ఫ్లోర్‌కేనా? ఇక్కడ తాతయ్య లేడు అన్నాడు.
తాతయ్య లేడా? అందరూ ఒక్కసారి నోరు తెరిచారు. అదేంట్రా ఉండక ఎక్కడికి పోతాడు. నువ్వు సరిగా చూశావా? అన్నాడు భాస్కర్.
వేరెక్కడికైనా షిఫ్ట్ చేశారా? మనకేం చెప్పలేదే.. అన్నాడు రమణమూర్తి. అసలు విషయం ఏంటో రిసెప్షన్‌లో అడుగుదాం పదండి అంది రాజ్యలక్ష్మి.
భాస్కర్, నిఖిల్ హడావుడిగా రిసెప్షన్‌కి వెళ్ళారు. అక్కడి వాళ్ళు ఇచ్చిన సమాచారం విని వీళ్ళ ముఖాల్లో రంగులు మారాయి.
భాస్కర్ నిశే్చష్టుడై ఉండిపోయాడు.
ఏమైందిరా? ఏంటి.. నిఖిల్‌ను అడిగింది భవాని.
తాతయ్యకి మొన్ననే గొంతులో.. లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్ వచ్చిందట.. అది బాగా సీరియస్ అయి వెంటిలేటర్ తీసేయాల్సి వచ్చిందట మమీ.. బాంబు పేల్చాడు నిఖిల్.
ఏంటీ? నిర్ఘాంతపోయారు అందరూ! అంటే తాతయ్య.. కళ్ళు పెద్దవి చేసి అడిగింది అఖిల.
మొన్న అర్ధరాత్రి పోయారండీ.. బాడీని మార్చురీలో పెట్టాం.. అని చెప్పారు వాళ్ళు.
అదేంటి మరి.. మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? అడిగింది రాజ్యలక్ష్మి.
ఇన్‌ఫెక్షన్ మొదలైనప్పుడే మీకు మెయిల్ పెట్టాం. సీరియస్ అయ్యాక ఫోన్స్ కూడా చేశాం. మీరు దేనికీ రెస్పాండ్ అవ్వలేదు.. అని చెప్పారు వాళ్ళు.
మెయిలా? భాస్కర్, రమణమూర్తి.. ముఖముఖాలు చూసుకున్నారు. పెద్దాయన పరిస్థితిలో మార్పేమీ లేదని.. ఒక మూడు రోజుల తర్వాత మెయిల్స్ ఓపెన్ చేయడం మానేశారు వాళ్ళు. ఆసుపతి నుండి వచ్చిన ఫోన్లు కూడా ఒకళ్ళు అటెండ్ అవుతారులే అని ఇంకొకళ్ళు.. అలా ఇద్దరూ ఊరుకున్నారు. పైగా మొన్న కొండ మీద సిగ్నల్స్ కూడా లేవు. అప్పుడు చేశారేమో.. అన్నదమ్ముల ముఖాల్లో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ఎవరూ ఎవరి ముఖంలోకి చూడలేక వౌనంగా మార్చురీ వైపు నడిచారు.
అక్కడ పడుకుని ఉన్న పెద్దాయన ముఖంలో మాత్రం అంతులేని ప్రశాంతత! నా సమయం వచ్చేసిందరా.. అన్ని బంధనాల నుండి విముక్తుడినై పయనం అవుతున్నా.. ఇక మీకోసం మీ తీరిక కోసం నేను ఆగలేనురా.. సారీ! అని చిరునవ్వుతో అంటున్నట్టుంది ఆ ముఖం! తాతయ్యా.. అఖిల, నిఖిల్ ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టారు. ఆడవాళ్లు ఇద్దరూ కూడా సన్నగా ఏడవసాగారు. రమణమూర్తి తల పట్టుకు కూర్చుండిపోయాడు. భాస్కర్ చేతిలోని స్మార్ట్ఫోన్‌లో ఎంగేజ్‌మెంట్స్ వంక వెర్రిగా చూస్తుండిపోయాడు.

--సింగరాజు రమాదేవి