కథ
దొంగ, దొంగ, దొంగ..దొంగ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
ఉదయం 11 గంటలు.
తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న జనం బయటకు వస్తున్నారు. గర్భాలయం బయట చుట్టూ తిరిగి విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఇంక బయటకు వెళ్లిపోవడానికి వాకిలి దగ్గర గుమికూడారు. ఎప్పుడూ ఉండే విధంగానే అప్పుడూ రద్దీ ఉంది. సెక్యూరిటీ గార్డులు ఇద్దరూ, వలంటీర్లు ఇద్దరూ ఆ ద్వారం గుండా లోపలికొస్తున్న వాళ్లను ఆపి బయటకు వెళ్లటానికి వీళ్లని అనుమతిస్తున్నారు.
లాల్చీ పైజమాలతో ఉన్న యాభై ఏళ్ల ఆసామీ ఒకతను బయటికి వెళ్లబోతూ తన కుడిచేతి వేళ్లు తడుముకున్నాడు.
హఠాత్తుగా గట్టిగా, ‘దొంగ.. దొంగ, దొంగ..’ అని అరిచాడు. తన చుట్టూ ఉన్న జనాన్ని చూశాడు. ఎక్కువ మంది నడివయస్సు ఆడా మగా జనమే. వాళ్లు ఇతని వైపు విచిత్రంగా చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నారు.
ఈ ఆసామి మళ్లీ, ‘దొంగండీ.. దొంగ! ఎవరో నా ఉంగరం దొంగిలించారు.. ఎవరు? ఎవరు?’ అన్నాడు.
ద్వారంలో ఎదురుగా నుంచునున్న వలంటీరు గబగబా ఇతని వైపు వచ్చాడు. ‘మీతోబాటు వచ్చిన వాళ్లు బయటికి వెళ్లిపోయారు. మీ వెనకాల వచ్చిన వాళ్లని మీరు తప్పు పట్టలేరు గదా. ఇట్లా ఇవతలికి రండి’
ఆ ఆసామి అన్నాడు. ‘అంటే నా ఉంగరం దొంగిలించిన వాడిని వదిలెయ్యాలంటారా?’
‘మీరు ఆవేదన పడకండి. సెక్యూరిటీని పిలుస్తాను. అతన్తో చెప్పండి’ అంటూ సెక్యూరిటీ గార్డు వైపు చెయ్యి ఊపాడు. సెక్యూరిటీ గార్డు రాగానే వలంటీర్ అతన్తో ‘ఈయన ఉంగరాన్ని ఎవరో దొంగిలించారట’ అన్నాడు.
సెక్యూరిటీ తికమకగా, ‘దొంగిలించారా? స్వామి సన్నిధిలో దొంగతనమా? ఎన్నడూ ఎరగమే.. ఇంతకీ ఏం పోయింది?’
ఆ ఆసామి అన్నాడు. ‘నా ఎడమచేతి ఉంగరాలు రెండూ ఉన్నాయి. నా కుడిచేతి వేలి ఉంగరమే పోయింది’
‘మీ పేరేమిటి? ఎక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తూంటారు? రండి, ఈ పక్క మంటపం మీద మాట్లాడుకుందాం’
ముగ్గురూ పక్కనే ఉన్న అన్నమాచార్య గ్రంథాలయం మెట్ల మీద కెళ్లారు.
సెక్యూరిటీ గార్డు అన్నాడు, ‘మీ పేరేమిటి?’
ఆ ఆసామి అన్నాడు ‘నా పేరు అంబాలాల్. మాది సూళ్లూరుపేట. నేను రాత్రి వచ్చాను. ఒక్కణ్ణే వచ్చాను. స్పెషల్ గెస్ట్‌హౌస్ తీసుకున్నాను. నాకు స్పెషల్ దర్శనం టిక్కెట్టు ఉంది. కనుక ఇందాక పది గంటలకి శ్రీవారి దర్శనార్థం మహాద్వారంలో ప్రవేశించి బంగారు వాకిలి దాటి ధ్వజస్తంభం దాటి, వెండి వాకిలి ద్వారా జయవిజయుల పక్కనించి లోపలికి వస్తూనే నా స్వామికి రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నా మూడు ఉంగరాలూ స్వామికి చూపించాను. ఆయన ముచ్చట పడ్డాడనుకోండి. స్వామి దర్శనం తర్వాత రద్దీలో బయటకొచ్చి ప్రదక్షిణంగ చుట్టూ తిరిగాను. ఇప్పుడింక వెళ్లిపోతూ చూసుకుంటే కుడిచేతి ఉంగరం లేదు.’
‘ఎక్కడన్నా పడిపోయిందేమో గమనించారా?’
‘అహహ పడిపోలేదు. అట్లా పడిపోతే అరవను గదా!’
‘దర్శనంలో ఉండగా ఎవరైనా మీ వేలు పట్టుకున్నారా?’
‘లేదు.. కానీ ఒక వాలంటీరు అమ్మాయి మాత్రం నా ఉంగరం చూస్తూ ముచ్చటగా ‘మీ వస్తువులు జాగర్తండి’ అంది. అప్పుడు నా ఉంగరం నాకు కనిపిస్తూనే ఉంది’
‘సరే ప్రదక్షిణం చేస్తూ మీరు ఎక్కడెక్కడ తిరిగారు?’
‘నేను బయటికొచ్చి ముందర వకుళాదేవిని దర్శించుకున్నాను. స్వామి వారికిచ్చే ప్రత్యేక నైవేద్యాల పోటు చూసాను. మండపంలో తీర్థం పుచ్చుకున్నాను. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పెళ్లి శిల్పాలు, మండపంపై చిత్రించి ఉన్నవి, చూసుకుంటూ నడిచాను. స్వామి వారి హుండీ లెక్కించే స్థలం పరకామణిని చూసాను. నేను అలా చూస్తూండగా నా పక్కన నుంచుని చూస్తూ ఉన్న ఇద్దరు కుర్రాళ్లల్లో ఒకడు ఎర్రగళ్ల చొక్కావాడు నా దగ్గరకొచ్చి నా వేలును పట్టుకుని ‘చాలా బాగుంది సార్ ఉంగరం’ అన్నాడు. నేను పరకామణిని, అక్కడున్న మీ సెక్యూరిటీ వాళ్లని చూస్తూ నుంచుండిపోయాను. ఆ కుర్రాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత గంధం తీసేచోట కొంచెంసేపు నుంచున్నాను. ఆ తరువాత విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నాను..’
‘మళ్లీ ఉంగరం చూసుకున్నారా?’
‘లేదు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది లేదు’
‘మీకు అనుమానం ఆ కుర్రాళ్ల మీదనా?’
‘అవునండి. ఆ ఎర్రగళ్ల చొక్కావాడి మీదనే- వాడే ఇప్పుడు నా ముందు నుంచి బయటకి వెళ్లిపోయాడు. ‘్భజనం చేసి వెడదాం రా’ అని రెండోవాడితో వాడు అనటం నేను విన్నాను.’
సెక్యూరిటీ వెంటనే వలంటీర్‌తో ‘బయటికెళ్లి చూడు. కనిపిస్తే పిలుచుకురా!’ అన్నాడు.
వలంటీర్ వేగంగా వెళ్లిపోయాడు.
సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ని అడిగాడు ‘మీరేం చేస్తుంటారు?’
‘ఏదో.. చిన్న బంగారం వ్యాపారం’
‘కుటుంబంతో వచ్చినట్లు లేదు కదూ!’
‘అవునండి. వాళ్లకి ఏర్పాట్లన్నీ చూడాలి. వెళ్లడం ఆలస్యమయితే నా వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని వాళ్లని తీసుకురాలేదు’
‘అది సరే. అసలు ఎందుకని అంతా మీ ఉంగరం వైపు పరిశీలించి చూశారు?’
‘అదీ అదీ.. వజ్రపు టుంగరం. వజ్రం అరంగుళం పొడుగు, పావు అంగుళం వెడల్పు. దానికి అన్నీ నగిషీలే. ఏ కొంచెం కాంతిలోనయినా అది అన్ని వైపులా చురుక్కు చురుక్కుమని అనేక రంగులు మెరుస్తూ ఉంటుంది. ఆ వజ్రం ఖరీదే ఏభై వేలు. బంగారమేమో కాసు. ఉంగరం మొత్తం లక్ష. కనక అందరినీ అది ఆకర్షిస్తూ ఉంటుంది’
బయటకెళ్లిన వలంటీర్ ఊడిపడ్డాడు. సెక్యూరిటీతో అన్నాడు ‘కుర్రాళ్లిద్దరూ కనిపించారు. ఎర్రగళ్ల చొక్కాతను ‘ఆ ఉంగరాన్ని నేను తియ్యలేదు. అసలు, ముట్టుకోలేద్సార్. ఎంత రోగ్ అయినా స్వామి వారి దగ్గర ఇలాంటి డర్టీ పని చేస్తాడా? అసలు నేను బ్యాంకు ఉద్యోగిని దాన్ని ఇచ్చినా పుచ్చుకోన్సార్?’ అన్నాడు. నేను డ్యూటీలో కెళతాను’ చెప్పి వలంటీర్ వెళ్లిపోయాడు.
సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ను గుచ్చిగుచ్చి చూసాడు.
‘తెలిసిందిగా. ఆ కుర్రాడు తియ్యలేదు. విమాన స్వామిని చూసాక మీరేం చేశారు?’ అని అడిగాడు.
‘ఆ ఏముందిలెండి. హుండీ దగ్గరికెళ్లి నా పాకెట్ పడేసాను. వెంటనే...’
‘ఆగండి.. ఆ పాకెట్‌లో ఏం వేశారు?’
‘డబ్బండి.. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. కిందట ఏడాది ఇక్కడికొచ్చి నన్ను గట్టెక్కించి కాపాడమని స్వామిని ప్రార్థించాను. ‘నాకు వచ్చే లాభంలో టెన్ పర్సెంట్ నీకిస్తానయ్యా’ అని మొక్కుకున్నాను. ఈ ఏడాదిలో నాకు కోటి లాభం వచ్చింది.
కనుక అందులో టెన్ పర్సెంట్ తెచ్చి హుండీలో పడేసాను అంతే. ఆ తరువాత బయటికొచ్చి జనంలో కలిసిపోయాను. ఇప్పుడు మళ్లీ చూసుకుంటే ఉంగరం లేదు.’
‘మీరు హుండీలో పేకెట్ వేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తోసారా?’
‘చిన్న తోపులాట జరిగిందండి’
ఒక్క నిమిషం ఆగి సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘సరే ఈ విషయం అంతా మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి చెబుతాను. ఆ తోపులాటలో హుండీలో పడిందేమో చూడమని కోరతాను’
‘హుండీలో ఇప్పుడు చూసేయొచ్చు గదా! నేను మళ్లీ ఈ సాయంత్రానికి మా ఊరు వెళ్లిపోవాలి’
‘అట్లా కుదరదండి. హుండీలన్నీ రాత్రి రెండు గంటలకి స్వామికి పవళింపు సేవ అయ్యాకే తీస్తారు. వాటిని పరకామణిలో పెట్టి పొద్దునే్న లెక్కిస్తారు. మీరు ఈ రాత్రికి ఆగిపొండి. రోజూ మేము యాత్రీకుల్లో పెద్ద మనుషులనుకున్న ముగ్గుర్ని సాక్షులుగా పరకామణి దగ్గరికి తీసుకెళ్లాలి. రేపు మిమ్మల్ని మూడోవారుగా తీసుకోమని విజిలెన్స్ ఆఫీసర్‌గారికి చెబుతాను. రేపు ఉదయం అయిదు గంటలకి వైకుంఠ ద్వారం దగ్గరికి మీరు రండి. నేను మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాను. పరకామణి లెక్కించడం మీరు చూద్దురుగాని.
‘అన్నట్టు మీ ఉంగరం విషయం ఇదిగో ఈ కాగితం మీద మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి రాసివ్వండి’ ఇట్లా అంటూ గార్డ్ కాగితం ఇచ్చాడు.
‘అంటే అసలు దొంగే లేడంటారా? నా లక్ష రూపాయల ఉంగరానికి ఇంతే సంగతులా!’
గార్డ్ కటువుగా అన్నాడు, ‘అది రాసిచ్చి రేపుదయం రండి. అంతే’
అంబాలాల్ రాసిచ్చాడు.
ఇద్దరూ చెదిరిపోయారు.
* * *
మర్నాడు ఉదయం అంబాలాల్ వైకుంఠ ద్వారం దగ్గరికి రాగానే అదే సెక్యూరిటీ గార్డు అక్కడున్నాడు. అంబాలాల్‌ను తీసుకుని లోపలికి చుట్టూ తీగ జల్లెడ కట్టి ఉన్న పరకామణి దగ్గరకొచ్చాడు. లోపల స్వామివారి హుండీలన్నీ కుమ్మరించబడ్డాయి. లెక్కించడం మొదలైంది. చుట్టూ ఉన్న తితిదే సిబ్బందీ, సాక్షులూ నిశితంగా గమనిస్తున్నారు.
హఠాత్తుగా ఎర్ర కాగితంతో చుట్టబడిన తొమ్మిది వెయ్యి రూపాయల కట్టలు బయటపడ్డాయి. అంబాలాల్ వెంటనే ‘అదిగో అదిగో నా కట్ట. తొమ్మిది లక్షల కట్ట’ అన్నాడు. మళ్లీ వెంటనే, ‘అదిగో ఆ దారానికి వేలాడుతున్నదే నా వజ్రపు ఉంగరం. నాదే, నాదే’
సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘మీ కోటి లాభంలో పది పర్సెంట్ అంటే, పది లక్షలు స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు గదా. తొమ్మిది లక్షలే ఇచ్చారేం?’
‘ఆ ఏముంది, ఆ పదిలోంచే ఒక లక్ష నేను తీసుకుని ఉంగరం చేయించుకున్నానండి. మిగిలిన తొమ్మిదీ స్వామికిచ్చాను. ఇందులో పెద్ద పాయింటేముంది?’
‘అదే అసలు పాయింటు. స్వామికి ఇస్తానన్నది ఇవ్వకుండా మీరు తీసుకున్నారు. ఆయన ఊరుకుంటాడా! దారంతో గేలం వేసి మీ వేలు మీంచి ఊడ లాక్కున్నాడు. తనది తాను తీసుకున్నాడు. ఇస్తానన్నది ఇవ్వకపోవడం దొంగతనమా, తనది తాను తీసుకోవడం దొంగతనమా?.. అంటే దొంగ ఎవరో తెలుస్తోంది కదా! మీరు ఇంకెవర్నో దొంగ అంటారేమిటి?’
అంబాలాల్ మొహం మాడిపోయింది. ఉండుండి అన్నాడు, ‘పొరబాటయింది’
‘నిన్న మీరు హడావిడి చేశారు. కానీ ఇక్కడ స్ట్ఫా అందరికీ తెలుసు. స్వామి వార అనుగ్రహమేమిటో..
‘దొంగనోట్ల కట్టలు గోడల్లో దాచుకోవడం, తిరువనంతపురంలో రంగనాథుడి మీద కేసు వెయ్యడం - ఇవన్నీ స్వామి చేయించినవా? చేసుకున్న వాళ్లు అనుభవించారు. అనుభవించి తీరుతారు. ఎందుకంటే స్వామి తన త్రాసుతో కచ్చితంగా తూస్తాడు కనక!... ఒక ముస్లిం కుటుంబంలో మూడు తరాల వారు తిండి మానేసి స్వర్ణ కమలాలు చేయించి తెచ్చి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి త్రాసు ఏమిటో తెలుసా, అవి ఇప్పుడు భాండాగారంలో లేవు. ఆర్జిత సేవలో ప్రతి మంగళవారం ఉపయోగించబడుతున్నాయి. ఆ ఆర్జితసేవ కిప్పుడు విపరీతమైన డిమాండ్..! కనుక స్వామి విషయంలో మేం మాట జారం. పొల్లుపోనివ్వం.. అన్నట్టు, దొంగ దొరికాడని మీరు ఒక రిపోర్టు రాసివ్వండి.’
అంబాలాల్ చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ‘నన్ను వదిలెయ్యండి. వెళ్లిపోవాలి. ప్లీజ్?’ అంటూ విసవిసా బయటకు దారితీసాడు.