కథ
నన్ను క్షమించు నాన్నా.. -అభిమన్యు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
----------------------------------------
ఆకాశంలో ఎటువంటి వర్ణాలు లేవు.. రంగులు వెలసిన కాన్వాస్‌లా నా మనసు ఉంది..
వాతావరణం ప్రశాంతంగా ఉన్నా నా మస్తిష్కంలో అర్థంకాని ఆలోచనలు.. అలజడి..
కారు నెమ్మదిగా వెళ్తోంది. మా డ్రైవర్ పేరు హనుమంతు. పేరుకి తగ్గట్టు దూకుడు ఎక్కువ. నాన్న అనారోగ్య రీత్యా నేనే నెమ్మదిగా పోనివ్వమన్నాను.
కారులో నేను, నాన్న. నాన్న వెనక్కి వాలి కనులు మూసుకున్నారు. ఆయనకి తెలీదు ఎక్కడికి వెళ్తున్నామో...
నాన్నకి మేం ముగ్గురం. నేను, తమ్ముడు, అక్కడ. అమ్మ చనిపోయిన 15 సంవత్సరాలైంది. నాన్నకి ఇప్పుడు 80 సంవత్సరాలు.
‘లెక్కలు మాస్టారు వెంకటరావు’ అంటే తెలియని వారు ఉండరు. ఆయన అంటే పిల్లలకి భయం, జడుపు. పెద్దలకి గౌరవం. మాస్టారు తలచుకుంటే ఏ లెక్క అయినా సునాయాసంగా సాల్వ్ కావలసిందే.. స్కూలులో లెక్కలే కాదు, ఇంగ్లీషు కూడా బాగానే చెప్పుతారు. అయినా నాన్నని ‘లెక్కల మాస్టారు’ అనే పిలుస్తారు.
బెత్తం పట్టుకుని స్కూలు ఆవరణలో తిరుగుతుంటే పిల్లలు బితుకుబితుకుమని ఉంటారు. సాటి ఉపాధ్యాయులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పాఠాలు చెప్పుతుంటారు. కొంతమంది ఆకతాయి పిల్లలైతే ‘సింహం వొచ్చిందిరా.. సింహం’ అని పారిపోయేవారు. మరి.. ఆ లెక్కల మాస్టారి నడక.. మాట తీరు అలాగే ఉండేది.
ఎన్ని ఉద్యోగాలు ఉన్నా ‘మాస్టారు’ ఉద్యోగం ఉత్తమం. పది మంది పిల్లలకి విద్య బోధించే అదృష్టం అందరికీ రాదు. ఆ సరస్వతీదేవి ఏ కొందరికో అటువంటి అవకాశం కల్పిస్తుంది. నాన్న తన వృత్తిని ఎంతగానో ప్రేమిస్తారు.. మరెంతగానో గౌరవిస్తారు. ఆయనకి అయిదుసార్లు ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అనే బిరుదు ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది.
‘ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పోలీస్, ఒక గుమాస్తా, ఒక మంత్రి తప్పు చేయవచ్చు.. సత్ప్రవర్తన కలిగి ఉండకపోవచ్చు. దాని వలన కొంతవరకు నష్టం కలుగుతుంది. కాని.. ఉపాధ్యాయుడు పొరపాటు చేస్తే దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. అందుకే నా వృత్తిలో నేను జాగ్రత్తగా ఉంటాను అని’ అంటారు నాన్న...
‘నాన్నా.. కాఫీ తాగుతావా’ అని అడిగాను. నాన్న మాట్లాడలేదు. నా వైపు చూసి తల వూపారు తాగుతానని...
అమ్మ చనిపోయాక నాన్న మనసు అతలాకుతలం అయిపోయింది. అమ్మ మరణం నాన్నను బాగా కుదిపేసింది. ‘కీ’లేని బొమ్మలా, సొల్యూషన్ తెలీని ‘లెక్క’లా మిగిలిపోయారు.
కారు రోడ్డు పక్కనున్న చిన్ని హోటల్ దగ్గర ఆగింది. నేను కాఫీ కోసం దిగాను. హనుమంతు కూడా దిగాడు. కాఫీ గ్లాసుతో నాన్న కోసం కారు దగ్గరకు వచ్చాను. నాన్న కారులో లేరు. నా గుండె గతుక్కుమంది. గాబరాగా అంతా వెతికాను. మాకు కొద్దిదూరంలో ఓ చెట్టు క్రింద మెకానిక్ ‘బుల్లెట్’ని రిపేర్ చేస్తున్నాడు. నాన్న ఆ మెకానిక్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. నేను అక్కడికి వెళ్లి నాన్నకి కాఫీ ఇచ్చాను.
‘మీ నాన్నగారాండీ.. మీకు బుల్లెట్ ఉందా.. మీ నాన్నగారికి రిపేరు చేయడం కూడా వొచ్చండీ.. నాకు ఎలా చేయాలో చెబుతున్నారు...’ అని ఆ మెకానిక్ నాన్నని మెచ్చుకుంటుంటే ప్రశంసగా చూశాను.
మాకు మ్యాచులెస్ కంపెనీ వారి మోటార్‌బైక్ ఉండేది. నాన్నకి అది అంటే చాలా ఇష్టం... ఎంతసేపూ దాని మీదే తిరిగేవారు. అప్పుడు.. ఆ రోజుల్లో... అంటే యాభై సంవత్సరాల క్రితం అన్నమాట. ఇప్పుడు ఆ కంపెనీ ఉందో.. లేదో తెలీదు. దానికి ఏమైనా రిపేరు వస్తే స్పేరు పార్టులు నాన్న కలకత్తా నుంచి తెప్పించేవారు. మరి ఇక్కడెక్కడా దొరికేవి కావు. ఇప్పటికీ ఆ మోటార్‌బైక్ నాన్న దగ్గర ఉంది. నాన్న గది కిటికీ దగ్గర గోడ వారగా గుడ్డ తప్పి ఉంటాది...
మా కారు బయలుదేరబోతుంటే సరుకులు రవాణా చేసే చిన్న వేన్ వచ్చి ఆగింది ఆ హోటల్ దగ్గర. ఆ వేన్‌లో రెండు ఎద్దులు, రెండు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. అవి పారిపోకుండా ఉండడం కోసమని తాళ్లతో కట్టేశారు. ఆ పశువులు ఏ మాత్రం కదలడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. అవి దీనంగా ఎటో చూస్తున్నాయ్.
‘అయ్యా! చూడండయ్యా! ఆ పశువుల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా కబేళాకి తోలుకు పోతున్నారో...! అవి వయస్సులో ఉన్నప్పుడు వాటితో పనులు చేయించుకున్నారు.. అవి పాలు ఇస్తే అమ్ముకొని జీవించేవారు. ఈ రోజు అవి ముసలివి అయిపోయాయని కసాయి వాడికి అమ్మేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందా..?! అవి ఏం తింటాయి.. నాలుగు గడ్డి రెమ్మలు.. అది కూడా పెట్టలేడా ఈ మనిషి..?!’ ఆవేశంతో మా హనుమంతు అంటూ నా గుండె చెరువు అయిపోయింది.
కొంతసేపటి వరకు నేను మనిషిని కాలేక పోయాను. నాన్న వైపు చూశాను. నాన్న ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ నాకు కనిపించలేదు.
ప్రతి మనిషి హృదయంలోనూ గాయాలు ఉంటాయి. దాన్ని వెలిబుచ్చే విధానాలే వేరువేరుగా ఉంటాయి. కొంతమంది దాన్ని కన్నీటి రూపంలో చూపిస్తే.. మరికొందరు వారి జీవం లేని నవ్వు ద్వారా వ్యక్తపరుస్తారు. ఇంకొందరు వౌనంగా ఉంటారు...
రోడ్డుకి మరోవైపు పంటకాలువ.. గోదావరి గట్లను ఒరుసుకుంటూ నడక నేర్చిన జింకపిల్లలా ప్రవహిస్తోంది. ఈ గోదావరిని ఎంతసేపు చూసినా తనివితీరదు. ఈ కోనసీమకి గోదావరి మాత అన్నదాత.. ప్రాణదాత.
ఆ రోజుల్లో అంటే 150 ఏళ్ల క్రితం ఇక్కడి వారికి ప్రధాన ఆహారం జొన్న సంకటి. వరి దొరకడం మహాగగనం. ఏదైనా శుభకార్యాలప్పుడే వరిఅన్నం. అదైనా కొంతమంది ఇళ్లల్లోనే.. ఇప్పుడు పుష్కలంగా వరి పండుతోంది. ఇతర ప్రాంతాలకి రవాణా అవుతోంది. ఇందుకు కారణం గోదావరి మాత.
కోనసీమ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన ఏకైక వ్యక్తి కాటన్‌దొర. కేవలం ఈ ప్రాంతానికి పన్ను వసూలు చేసే అధికారిగా వచ్చి.. ఇక్కడి ప్రజల స్థితిగతులు చూసి, చలించిపోయాడు. వృధాగా సముద్రంలో కలిసే గోదావరిని చూసి తెగ మదనపడ్డాడు. అప్పుడే.. ఒక నిర్ణయానికి వచ్చి తన పైఅధికారులతో మాట్లాడి.. వారిని ఒప్పించి దగ్గర దగ్గర 10 లక్షలు పైగా ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి.
ఆ వ్యక్తి మన దేశస్థుడు కాదు. అతనికి మన భాష రాదు.. అతను మన మనిషే కాదు.. అయినా మనకింత అన్నం పెట్టిన మహానుభావుడు.
నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. వంశపారంపర్యంగా వచ్చే రోగాల సంగతి ఎలా ఉన్నా వయసు రీత్యా ప్రతి ఒక్కరికీ వచ్చే రోగాలు షుగర్, బి.పి.. ఈ రెండు నాన్నకి ఉన్నా వాటి వలన పెద్దగా ఇబ్బంది లేదు.
‘మీ నాన్నగారికి మతిమరుపు.. ఈ రోగం ఉన్నట్టు మీ నాన్నగారికి తెలియదు. ఏమీ గుర్తు ఉండవు.. అయితే అన్నీ గుర్తు ఉంటాయి.. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. ఒక్కోసారి తన పనులు మనం చేసి పెట్టాలి. పసిపాపని చూసినట్లుగా చూసుకోవాలి. చూడ్డానికి సామాన్య మానవునిలాగే కనిపిస్తారు... మెదడులో వచ్చే మార్పుల వలన ఇలాగే ఉంటాది. వయసు పైబడ్డవారిలో ఇలాంటివి సహజం... జాగ్రత్తగా చూసుకోండి’ అని డాక్టర్‌గారు ఏవేవో మందులిచ్చారు.
నాన్న పుట్టి పెరిగిన ఊరుని, సొంత ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్లేవారు కాదు. తప్పనిసరి పరిస్థితులైతే ఏదో ఒకరోజు, రెండ్రోజులు అంతే... అయితే ఆయన అనారోగ్యం దృష్ట్యా అక్క, తమ్ముడు కొన్నాళ్లు వారి దగ్గర ఉంచుకున్నారు. తర్వాత నాన్నకి సేవలు చేయలేక చేతులెత్తేసారు. ప్రస్తుతం నాన్న పరిస్థితి తనకు తెలియకుండానే మల, మూత్రాలు విసర్జించేస్తున్నాడు.
నాన్న స్కూలులో పిల్లలకి ఎంత చక్కగా చదువు చెప్పేవారో, క్రమశిక్షణతో కూడుకున్న చదువు జీవితానికి వనె్న తెస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసం.
నాన్న మమ్మల్ని బాగా చదివించారు. అమ్మ అయితే నాన్నని ఎంత బాగా చూసుకునేదో.. ‘మీ నాన్నగారు మాట పడరు.. ఆయనకి కోపం ఎక్కువ.. అయినా ఆయన కోపం ఎంతసేపో ఉండదు. చిరుకోపం.. ఆయన మాట కరుకుగా ఉన్నా మనసు వెన్నపూసరా.. నేను చనిపోతే ఆయన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా రాముడూ..’ అని అమ్మ మా అందరి దగ్గరా అనేది. నా పేరు శ్రీరామచంద్రుడు.
నాన్న కొలిచే దైవం ‘శ్రీరామచంద్రుడు’
కారు పక్కకి తీసి ఆపమని చెప్పి, నాన్నని కిందికి దించి పాస్ పోయించి, మరలా కారులో కూర్చోబెట్టాను.. ‘నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావురా రాముడూ..!’ అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొన్ని క్షణాలు వౌనం వహించాను. ‘డాక్టర్ గారి దగ్గరికి..’ అని అబద్ధం చెప్పాను.
‘ఆహా..’ అని నాన్న నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నాన్నకి తెలుసేమో నేను అబద్ధం చెప్పానని.. ఆయన 34 సంవత్సరాలు టీచర్‌గా చేసారు. కొన్ని వేల మంది పిల్లలకి చదువు నేర్పించారు.
కారు నెమ్మదిగా పరుగులు తీస్తోంది. ఎక్కడైనా భోజనానికి ఆపమని హనుమంతుకి చెప్పాను.
అక్క గాని, తమ్ముడు గాని నాన్నని ఎక్కువ రోజులు ఉంచుకోలేక పోయారు. నాన్న అంటే ప్రేమ, అభిమానం ఉంటాయి. అది సహజం. మాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన.. ఆయన్ని చూడవలసిన బాధ్యత మాకు ఉంది. అయితే మాతోపాటు జీవించే జీవిత భాగస్వామి, పిల్లలు ఎంతవరకు బాధ్యత కలిగి ఉంటారు..?
నాన్న పరిస్థితి చిన్నపిల్లాడికన్నా అధ్వాన్నంగా ఉంది. మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ విసర్జించేస్తున్నారు. చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాడు. కోపం వస్తే బూతులు తిడుతున్నారు.. ఎప్పుడు ఇంట్లో ఉంటాడో? ఎప్పుడు బయటికి వెళ్లిపోతాడో అర్థంకాదు.. ఆయనకి భయం లేదు. మాకు ఏం చేయాలో అర్థం కాదు.
‘గదిలో పెట్టి తాళం వేయమని కొందరు.. గొలుసులతో కట్టేయమని ఇంకొందరు.. ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేయమని..’ ఇలా రకరకాల సూచనలు, సలహాలు...
దేవుడు మనిషికి తెలివితేటలు, ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మవిశ్వాసంతోపాటు మతిమరుపును కూడా ఇచ్చాడు. అయితే ఈ మతిమరుపు కొందరికి వరం, మరి కొందరికి శాపం...
బాగా ఆలోచించిన పిదప నాన్నను ‘ఓల్డేజ్ హోమ్’లో చేర్పించాలనే నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ ప్రయాణం...
కారు రోడ్డు వారగా ఉన్న హోటల్ ముందు ఆగింది. నేను, నాన్న, హనుమంతు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని భోజనం ఆర్డర్ ఇచ్చాను. కొంతసేపటికి భోజనాలు వచ్చాయి. మేం చేస్తున్నాం. నాన్న నెమ్మదిగా తింటున్నారు.
మాకు రెండు టేబుళ్లు అవతల ఒక వ్యక్తి ఒకతణ్ని వీపు మీద మోసుకువచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టి, ఇంకో కుర్చీలో తను కూర్చొని భోజనం చెప్పాడు.
‘ఏరా నీ బాబుని ఎన్నాళ్లని అలా మోసుకు తిరుగుతావు. నీ పెళ్లాం నిన్ను విడిచి వెళ్లిపోయింది అయినా నీకు బుద్ధి రాదు.. నీ బాబుని వదలవు..’ కాస్త మందలింపుగా అన్నాడు సర్వర్.
‘బాబాయ్! పెళ్లాం పోతే ఇంకో పెళ్లాం వస్తాది. నాన్న పోతే ఇంకో నాన్న వస్తాడా... నాన్నకి నేను తప్ప ఎవరున్నారు. అమ్మ చనిపోయింది. నీకు తెలుసు కదా, దా బాబాయ్ కాస్త అన్న పెట్టు..’ అన్నాడతను.
కారులో హనుమంతు చెప్పాడు -‘అతని తండ్రి రెండు కాళ్లు రైలు ప్రమాదంలో పోయాయట.. అప్పటి నుండి కొడుకే చూస్తున్నాడట.. పాపం’
కొంతసేపు ప్రయాణం చేసాక మా కారు - శారదా ఓల్డేజ్ హోమ్ ముందు ఆగింది.
లోపలికి వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాను. ఇంతకు ముందు ఫోన్‌లో మాట్లాడాను గాబట్టి ఎక్కువ సమయం పట్టలేదు.
నాన్నకి గది ఇచ్చారు.. ఆ గదిలో అప్పటికే ముగ్గురు ఉన్నారు. ఆ హోమ్‌లో దగ్గరదగ్గర ఓ ఇరవై మంది వరకూ ఉన్నారు. వాళ్లంతా నిరాదరణకు గురైనవారే.
నాన్నకు ఆ వాతావరణం కొత్త. వింతగా చూస్తున్నాడు. నేను అక్కడి సిబ్బందితో మాట్లాడి.. ‘నాన్నా! మీరు ఇక్కడ ఉండండి.. మిమ్మల్ని వీరు బాగానే చూసుకుంటారు. నేను అప్పుడప్పుడు వస్తాను..’ అని వెనుదిరిగాను.
‘రాముడూ...! నేను చనిపోతే వాళ్లు నీకు - తెలియజేస్తారా?’
ముందుకు వేయబోయే నా పాదం ఆగిపోయింది. నాన్న వైపు చూశాను. ఆయన కళ్లు దీనంగా నన్ను ప్రశ్నిస్తున్నాయి.
చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిపించారు.. అమ్మ కలిపి ఇచ్చిన పప్పు అన్నం పెరుగన్నం తినిపించారు.. అక్షరాలు దిద్దించారు.. ఈ సమాజంలో నన్నొక మనిషిగా తీర్చిదిద్దారు... అందుకు ప్రతిఫలంగా నేను ఏం చేశాను...!?
‘ఒరేయ్!.. ఆ ఊరులో.. ఆ ఇంటిలో పుట్టాను.. ఆ ఇంట పెరిగాను.. ఆ ఇంటిలోనే చచ్చిపోతానురా.. రాముడూ...’ నాన్న గొంతు పూడుకుపోయింది. ఆయన కనుల వెంట కన్నీరు...
తండ్రి కోసం 14 సంవత్సరాలు అడవికి వెళ్లాడు శ్రీరాముడు. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు.. మరి నేను..!?
నన్ను ప్రశ్నించుకున్నాను.. నన్ను నేను చూసుకున్నాను... ‘నేనొక పశువుని’ ‘నా పేరు మనిషి..’
నోరు లేని పశువుల్ని ముసలివైపోయాయని నిర్దాక్షిణ్యంగా కబేళాకు తోలేస్తున్నాను.. మరి నోరున్న వయస్సు మళ్లిన తండ్రిని ఏం చేస్తున్నాను..?! నా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదా..?! ఉంది.. నేను పశువుని కాను.. మనిషిని.. నాన్న కాళ్ల మీద పడ్డాను.. ‘నన్ను క్షమించు నాన్నా.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను క్షమించు నాన్నా...’ కన్నీళ్లతో నాన్న పాదాలు కడుగుతున్నాను...
*