కథ

రామాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘భవానీ! భవానీ! త్వరగా ఎక్కు. ఈ బస్సు పోతే మూడు గంటల దాకా బస్సు ఉండదు’ అన్నాడు రామం.
భవాని ‘ఎక్కుతున్నాంల్లేండి. మీ గాబరా కాని, కండక్టర్‌గారు మనం ఎక్కకుండానే బస్సు కదిలిస్తారా!’ అంటూ నానీని, చిన్నీని ఎక్కించి ఖాళీగా ఉన్న సీట్లో అందరూ కుటుంబం సర్దుకుని కూర్చున్నారు.
ఇంతలో కండక్టర్ పికిలీతో, బస్సు కదిలింది. రామం టిక్కెట్లు తీసుకుని, భార్య అందించిన మురుకులు నములుతూ, పిల్లలకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లను, చేలని చూపించి వివరిస్తున్నాడు. అంతలో బస్సు పసిడిపట్టు చేరింది.
రామం కుటుంబంతో క్రిందికి దిగి నిరంజన్ కొరకు దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో నిరంజన్ నలుగురు కుర్రాళ్లు, అటెండర్‌తో సహా వచ్చి ‘హలో! రామంగారూ నమస్కారం. అమ్మా! హాయ్ పిల్లలు’ అని అందరినీ ఒక ఉదుటున పలకరించి, ‘ప్రయాణం సుఖంగా జరిగిందా?’ అని అడిగాడు.
రామం ‘ప్రయాణం కాదు. ప్రయాణ ప్రసవం సుఖంగానే జరిగింది’ అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. తలా ఒక సంచి తీసుకొని బయలుదేరి, 300 గజాల దూరంలో ఉన్న ఇంటికి చేరారు. ‘ఇదే మీ గృహం. ప్రవేశించండి’ అన్నాడు నిరంజన్.
భవాని ‘మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడంలేదు. మిమ్మల్ని శ్రమ పెట్టాము’ అని మాట్లాడుతున్నంతలో నిరంజన్ అందుకుని ‘్భలేవారే! మా అన్నయ్య, వదిన పిల్లలతో కొత్తగా ఈ ఊరికి వస్తున్నారు. ఈ సందర్భంలో ఆనందం తప్ప, శ్రమకు తావు ఎక్కడుంటుంది? ఇది మహాభాగ్యం’ అంటూ ‘మీరు రెడీ అయితే భోజనాలకు వెళ్లచ్చు’ అన్నాడు. అందుకు భవాని ‘ఎందుకండీ! మీకు శ్రమ’ అంటుంటే నిరంజన్ అందుకుని ‘మన ఇల్లు ఒకటే. కాదంటే మన ఇళ్లకు గోడ మాత్రమే అడ్డము. మీరు మొహమాటపడొద్దు’ అన్నాడు.
* * *
సాయంత్రం 5 గంటలయ్యింది. అటెండర్ శంకరయ్య రావడంతో ఇద్దరూ బయలుదేరారు. మార్గమధ్యంలో మార్గం ‘శంకరయ్యా! మన స్కూలును దానం చేసిన వారి ఇల్లు చూపిస్తావా?’ అంటే, ‘అలాగే’ అన్నాడు శంకరయ్య.
రెండు వీధులు దాటి ఒక ఇంటి ముందుకు వచ్చి, శంకరయ్య ‘ఈ ఇల్లే వారిది. అందరూ ఆయనను పెద్దాయన అని అంటారు. అసలు పేరు సుబ్బారాయుడు. ఎవరూ పేరు పెట్టి పిలవరు’ అని అన్నాడు. రామం శంకరయ్యను అక్కడే ఉండమని గేటు దాటి లోపలికి వెళ్లాడు.
ఒక పెద్ద కాంపౌండ్. ముందర ఖాళీ స్థలం. తరువాత పెద్ద ఇల్లు. పంచలో మూడు వైపులా దిండ్లు వేసి వున్న మంచం మధ్యలో ఒక ఆజానుబాహువు కూర్చుని ఉన్నాడు. రామం దగ్గరకు వెళ్లి ‘నమస్కారం’ అని చెప్పి వంగి కాళ్లకు దణ్ణం పెట్టాడు. పెద్దాయన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. ‘్ఫర్వాలేదు’ అని నిలబడే ఉన్నాడు రామం. ఆయన మరలా కూర్చోమని చేయి చూపాడు.
రామం కుర్చీలో కూర్చుని ‘నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్‌మాస్టర్‌ను. మీ దాతృత్వం వందల మంది విద్యార్థులకు, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులకు ఆధారమైంది. మధ్యాహ్నమే కుటుంబంతో ఈ ఊరు వచ్చాను. మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. మీ పాఠశాలకు మంచి పేరు తెచ్చేందుకు నా వంతు కృషి నేను చేస్తాను’ అని ఒక నిమిషం ఆగి, ‘నేను ఇక సెలవు తీసుకుంటాను’ అని పైకి లేచాడు.
ఇంతలో పనిమనిషి మజ్జిగ గ్లాసు తెచ్చి ఇచ్చింది. రామం తటపటాయిస్తుంటే ‘తీసుకోండి’ అన్నాడు పెద్దాయన. రామం మజ్జిగ త్రాగాడు. పెద్దాయన ‘మంచిది. సంతోషం’ అన్నాడు. రామం మరొకసారి కాళ్లకు దణ్ణం పెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు.
* * *
రోజులు వారాలుగా, నెలలుగా మారుతున్నాయి. రామం పిల్లల, తల్లిదండ్రుల మనస్సుల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. రామం, నాలుగు రోజులకు ఒకసారి పెద్దాయన ఇంటికి వెళ్లి పలకరించడం, ముచ్చట్లాడటం ఆనవాయితీ అయ్యింది. ఒకవేళ ఒకటి రెండు రోజులు తాను రాకపోతే, ఎందుకు రాలేదని ఆరాదీయడం జరుగుతున్నది. అంటే పెద్దాయనకు రామం రాక సంతోషదాయకవౌతున్నది. నాలుగు మాటలు సందర్భోచితంగా ముచ్చటించటం వలన పది నిమిషాలతో ప్రారంభమైన వారిద్దరి సత్సంగం గంట దాటుతున్నది. పైపెచ్చు వాళ్ల కలయిక నాలుగు రోజుల నుంచి, రోజు మార్చి రోజుకు మారింది.
* * *
పెద్దాయన ఉన్న వీధిలోనే విజయచంద్ర అనే భూస్వామి ఉన్నాడు. ఆయన ఇల్లు కూడా చాలా పెద్దది. ఆయన కుమారుడు 7వ తరగతి, కుమార్తె 5వ తరగతి చదువుతున్నారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. అందుచేత పిల్లలను బాగా చదివించాలన్న కోరిక బలంగా ఉంది. ఆ కారణంగా విజయచంద్ర ఒకరోజు ‘మాస్టారూ! మీరు నా పిల్లలకు ట్యూషన్ చెప్తే, మీ తర్ఫీదులో వాళ్లు వృద్ధిలోకి వస్తారని నాకు గట్టి నమ్మకం. మీ అంగీకారానికి, ఎదురుచూస్తున్నాను’
కొంతకాలం తర్వాత రామం తన సమ్మతిని కొన్ని కండిషన్లతో ఒప్పుకున్నాడు. ‘ఒకటి, నేను ట్యూషన్ చెప్పి డబ్బు తీసుకోను. రెండవది, మీలాగా మరి కొంతమంది తల్లిదండ్రులు కూడా అడుగుతున్న కారణంగా, మీ మిద్దెపైన ట్యూషన్ చెప్పడానికి అంగీకారం తెలిపితే మొదలుపెడతాను’ అన్నాడు రామం.
‘మీ కండిషన్లు అన్నింటికీ మేము సిద్ధమే. మాకు కావలసింది మా పిల్లల భవిష్యత్తు’ అన్నాడు విజయచంద్ర.
ప్రతిరోజూ ట్యూషన్ అయిపోగానే, అవకాశాన్నిబట్టి, పెద్దాయన దగ్గరికి పోయి సత్సంగ కార్యక్రమం జరుపుతున్నాడు రామం.
ఒక సాయంత్రం ట్యూషన్ అయి వెళుతుంటే, వరండాలో కూర్చొని ఉన్న విజయచంద్ర కాఫీ తాగమని అభ్యర్థించాడు. ఇద్దరూ ముచ్చట్లాడుకుంటుంటే, రామం ‘మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. సంపన్నులతో, పాడిపంటలతో, సంస్కారం ఉన్న వ్యక్తులతో నిండి, ఊరి మధ్యలో ఉన్న రామాలయం ఎందుకు మూయబడి ఉంది? అది ఊరికి మంచిది కాదు కదా!’ అన్నాడు.
విజయచంద్ర ‘చాలా క్లిష్టమైన విషయాన్ని లేవనెత్తారు. ఆ విషయం చర్చించడం బాగుండదు. కాని మీలాంటి మంచి ఉపాధ్యాయులు, ఊరి బాగోగులను గురించి ఆలోచించే వ్యక్తి అడిగినప్పుడు చెప్పకపోవడం తప్పనిపిస్తున్నది.
‘మాస్టారూ! మీరు పని చేస్తున్న స్కూలు, రామాలయం, బావులు, ఊరి బయట సత్రం అన్నీ సుబ్బారాయుడు, వాళ్ల తండ్రిగారి దానధర్మాలే. నేను చిన్నవాడినైనప్పుడు రామాలయం మాకు ఆటస్థలం. పెద్దలకు సత్సంగానికి వేదిక. ఈ ఊరిలో తిరునాళ్లు జరిగితే శ్రీరామచంద్రునికి వేసే గజమాలలు, అలకారం రాష్ట్రంలో చాలా కొద్దిచోట్ల ఉంటాయి. మా ఊరి తిరునాళ్లకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలమంది వచ్చేవాళ్లు. దారుల కిరువైపుల అంగళ్లు, కీలుగుర్రాలు, నెమలి డ్యాన్సులు, బుట్టబొమ్మలు లాంటి అనేక కార్యక్రమాలతో చాలా పసందుగా ఉండేది. తిరునాళ్ల రోజుల్లో వాడే టన్నుల మల్లెపూల వాసన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రజల ముక్కుపుటాలను తాకుతుండేది. ఆ వైభవాన్ని వర్ణించడం నా వలన కాదు’
‘అంతేకాక, దేవాలయంలో వందల మందితో దశాహాలు, సప్తాహాలు, ఏకాహాలు అనగా ఒకరోజు నుండి పది రోజుల వరకు రాత్రింబవళ్లు శ్రీరామనామ సంకీర్తనం జరిగేది. ఆ కార్యక్రమానికి అనేక సంగీత విద్వాంసులు ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి పాలుపంచుకునేవారు. ఈ కార్యక్రమాలను ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి ఈ వూరిలో మురళీకృష్ణ అనే మంచి సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతనిలా హార్మోనియం వాయించగలిగిన వాళ్లు సినిమా రంగంలో కూడా బహు కొద్దిమంది ఉంటారని అనేవారు. పైగా అతని గొంతు ఘంటసాలలా మాధుర్యంగా ఉండేది’ అని ఆగాడు.
ఇంతలో రామం ‘అయితే అంత గొప్పగా జరుగుతున్న గుడిని ఎందుకు మూసినట్టు’ అన్నాడు.
‘ఆ విషయానికే వస్తున్నాను. వారి కుటుంబంలో ఒక జరగరాని సంఘటన జరిగింది. పెద్దాయనకు ఒకే కూతురు. తల్లి చిన్నతనంలోనే చనిపోయినందున కూతురిని చాలా గారాబంగా పెంచాడు. యుక్తవయస్సు వచ్చినా, తనను వదలి వెళ్లిపోతుందన్న బాధతో తనింటికి ఇల్లరికం వచ్చి ఉండే వ్యక్తి కొరకు వెతుకుతుండడం వలన వివాహం ఆలస్యం అయ్యింది.
సుబ్బారాయుడుగారి కుమార్తె సౌజన్యకు సంగీతమంటే చాలా మక్కువ. ఆ కారణంగా భజన కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జరిపిస్తుండేది. సౌజన్య మురళీకృష్ణ సంగీతానికి ముగ్ధురాలైతే, మురళీకృష్ణ సౌజన్య అందానికి వశుడైనాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా అంకురించిందో, సఖ్యత ఎలా కుదిరిందో తెలియదు. వాళ్ల ప్రేమను పండించుకునేందుకు వీలు కాదని, సుబ్బారాయుడు కీర్తిప్రతిష్టలు ముందు ఇద్దరూ అశక్తులే అని ఇద్దరికీ తెలిసినదే. అంతే, ఎవరికీ తెలియకుండా ఇద్దరూ ఎక్కడికో దూరంగా వెళ్లిపోయారు. అంతటితో రాముడి గుడికి, సంగీతానికి, లలిత కళలకు స్వస్తి పలుకబడింది. ఈ విధంగా ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు.’
* * *
యధావిధిగా రామం 7 గంటలకు పెద్దాయన దగ్గరకు వచ్చి కొద్దిసేపు ఉండి ‘నేను సెలవు తీసుకుంటాను’ అని లేచి నిలబడ్డాడు.
పెద్దాయనకు రోజూ చాలాసేపు కూర్చుని ముచ్చటలాడే రామం త్వరగా వెళ్లడం నచ్చలేదు. ‘ఏమైంది? అర్జంటు పని ఏమైనా ఉందా? ఇంకొంచెం సేపు కూర్చొని మాట్లాడవచ్చు కదా! ఇంత త్వరగా వెళితే మీ తాత మనస్సు బాధపడదా?’ అన్నాడు.
రామం మరల కూర్చున్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. ‘తాతగారూ! నా మనసు ఏం బాగోలేదు. ఒక ప్రశ్న నన్ను వేధిస్తున్నది. అయినా మిమ్మల్ని అడగలేను’ అని అన్నాడు. ఏమిటన్నట్టు పెద్దాయన తల పైకెత్తాడు.
‘మీరు ఏమనుకోనంటే, కోప్పడనంటే, అడగమంటే అడుగుతాను. తర్వాత నన్ను తిట్టినా, కొట్టినా ఫరవాలేదు గాని, నన్ను మీ దగ్గరికి రావద్దని చెబితే సహించలేను’ అని అన్నాడు రామం.
పెద్దాయన ‘అడుగు’ అన్నాడు.
రామం ‘మీ ఆగ్రహాన్ని భరించే శక్తి లేదు. అయినా అడుగుతున్నాను. ఈ ఊరిలోని రామాలయం మీదేనా?’
‘అవును’ ముక్తసరిగా జవాబిచ్చాడు పెద్దాయన.
రామం ‘ఎందుకు మూతబడింది?’
పెద్ద గొంతుతో పెద్దాయన ‘నీకు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకోవడం, మనిద్దరికి మంచిది కాదు. ఇది అధిక ప్రసంగం. నీకు అనవసరం. ఈ విషయాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ లేవదీయవద్దు. ఇంక నీవు వెళ్లవచ్చు’ అన్నాడు.
రామం ‘నాకు అనవసరమే కాని, నిజానికి మీకు అవసరం. మీరు తిట్టినా నాకు అవి దీవెనలు అవుతాయి. ఎందుకు మూతబడిందని తెలుసుకోవడం కొరకు నేను అడగడం లేదు. కాని, తెరిస్తే శ్రీరామునితో సహా మిమ్మల్ని కూడా ఊరి వాళ్లు కొలుస్తారు. ఆ ఆనందాన్ని నాకు కలిగించమని నా వేడుకోలు. ఈ ఊరిలో మీతో చనువు, ప్రేమ ఉండే వ్యక్తి నేను తప్ప ఎవ్వరూ లేరు. నేను చెప్పాలనుకొన్నది చెప్పాను. ఇక మీ ఇష్టం’ అని అంటూ లేచి కాళ్లకు దణ్ణం పెట్టి వెళ్లిపోయాడు.
* * *
ఐదు రోజులు అయ్యింది. రామం పెద్దాయన వైపునకు రాలేదు. పెద్దాయన మనసులో గుబులు ఏర్పడింది. సంతోషంగా సత్సంగంతో గడుస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనతో పెద్దాయన మనస్సు పరిపరి విధాల ఆలోచించసాగింది. ఒకరోజు పాలేరు రంగడిని పిలిచి ‘ఏమిరా! రామం రావడంలేదు. నేనేం తప్పు చేశాను. గుడితో తనకు ఏం సంబంధం?’
పాలేరు కల్పించుకొని ‘ఆయన ఎందుకన్నాడో తెలీదు కాని, తాను చెప్పినదాంట్లో చెడ్డేమి లేదు కదయ్యా! అయినా మీకు చెప్పగలిగిన వాణ్ణి కాదు’ అన్నాడు.
మర్నాడు ఉదయం 10 గంటల ప్రాంతం. రామం స్ట్ఫా రూమ్‌లో కూర్చొని ఉన్నాడు. పాలేరు రంగయ్య బయట నిలబడి రమ్మని సైగ చేశాడు. రామం వచ్చి ‘ఏమి?’ అన్నాడు. ‘పెద్దయ్యగారు మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మన్నారు’ అన్నాడు.
రామం తన బాధ్యతలను నిరంజన్‌కు అప్పజెప్పి రంగయ్యతో బయలుదేరి పెద్దాయన దగ్గరికి వచ్చాడు. రామం నమస్కారం పెట్టి నిలబడ్డాడు. ‘కూర్చో! నీతో మాట్లాడాలి’ అన్నాడు పెద్దాయన. రామం కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
‘నీవు చెప్పిన దాంట్లో న్యాయం కనబడుతున్నది. నా కారణంగా ఈ ఊరి వాళ్లకు దక్కాల్సిన సదవకాశం, నా వలన పొందలేక పోవడం మంచిది కాదేమో అన్పిస్తున్నది! జరిగింది మర్చిపోదాం. నీ పేరు కూడా రామం కాబట్టి నీ ఆధ్వర్యంలో గుడిని బాగు చేయించి ఉత్సవాలు జరిపిద్దాం. ఎంత డబ్బు అవసరమైనా నేనే ఇస్తాను’ అన్నాడు పెద్దాయన.
‘మీరు ‘ఊ’ అంటే డబ్బు ఊరిలో వారందరూ కూడా ఇస్తారని నా నమ్మకం. అయినా ఆ అవకాశం వేరేవాళ్లకు ఇయ్యడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రారంభిస్తే ఏ ఆటంకం ఉండదని నా విశ్వాసం’ అన్నాడు.
పెద్దాయనకు పాత జ్ఞాపకాల కారణంగా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. రామం ‘ఇది నా అదృష్టం! ఈ సందర్భంలో మీ కళ్లలో ఆనందభాష్పాలు రావడం శుభసూచకం’ కొంచెం ఆగి ‘నిజానికి రాముడి కంటే కష్టాలు పడ్డ వాళ్లు ఇంకెవరైనా ఉన్నారా?’ అని అన్నాడు.
సుబ్బరాయుడు రెండు లక్షలు రామం చేతికిచ్చి ‘పని త్వరగా ప్రారంభించాలి. పట్టుమని పదిహేను రోజులు కూడా లేవు’ అని గద్గద స్వరంతో అన్నాడు.

రామం పెద్దాయన వద్ద సెలవు తీసుకొని స్కూలుకు వచ్చి పదిహేను రోజులు సెలవు పెట్టి, ముఖ్యమైన వాళ్ల ఇళ్లకు వెళ్లి సంతోష వార్తను చెప్పి, సాయంత్రం అందర్నీ గుడి దగ్గర సమావేశపరచి ఒక్కొక్క పనికి, ఒక్కొక్క కమిటీని వేసే విధంగా ప్రణాళికను తయారుచేశాడు. చివరకు అందరూ కలిసి పెద్దాయన ఇంటికి వెళ్లి ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.
మంచిరోజు చూసి గుడి తెరచి, దేవాలయాన్ని రంగులతో, అలంకరణలతో సుందరంగా తయారుచేసి సీతారాములకు కల్యాణ కళను తెప్పించారు. పెద్దాయన నడవలేని కారణంగా చక్రాల కుర్చీలో కూర్చొనబెట్టి ప్రతిరోజు జరుగుతున్న అభివృద్ధి తన పర్యవేక్షణలోనే జరిపిస్తున్నాడన్న అనుభవాన్ని, ఆనందాన్ని తనకు కలిగేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు రామం.
శ్రీరామ నవమి వచ్చింది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి జనం తండోపతండాలుగా వచ్చి కళ్యాణాన్ని, పట్ట్భాషేకాన్ని తిలకించి, విందులు ఆరగించి పులకించిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఆలయాన్ని మరలా శోభాయమానంగా తయారుచేయడానికి కర్త కర్మ క్రియ ఎవరన్నది చాలామందికి తెలియదు.
* * *
సాయంత్రం 6 గంటలు అయ్యింది. రామం, భార్య, ఇద్దరు బిడ్డలు పెద్దాయన ఇంటికి వచ్చారు. గతంలో ఒకసారి చూచి వున్నప్పటికి మరలా పరిచయం చేసి ఆయన పక్కనే మంచంపై కూర్చొని పెద్దాయనను కౌగిలించుకొని ‘నన్ను మీరు క్షమించాలి తాతయ్యా. నేను మీకొక అబద్ధం చెప్పాను. నేను మీకు మనవడిని. నా పూర్తి పేరు రామ సుబ్బారాయుడు. మా అమ్మ మీపేరు నాకుండాలని అలా పెట్టింది. సౌజన్య మురళీకృష్ణ దంపతులు మా అమ్మానాన్నలు. మా నాన్న యాక్సిడెంట్‌లో చనిపోయిన కొద్దిరోజులకే అమ్మ కూడా చనిపోయింది. నాకు ఈ ఊరు, మీ విషయం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. నాకు పెద్ద ఉద్యోగానికి అర్హత ఉన్నా నేను స్కూలు టీచరుగా అతి ప్రయత్నం మీద మీ కోసం ఈ ఊరు వచ్చాను. మా అమ్మ తన రుణాన్ని నా ద్వారా తీర్చుకోమని కోరింది. వీళ్లు మీ ముదిమనుమడు, మనుమరాలు’ అని అంటుంటే పెద్దాయన రామంను గట్టిగా ఒక చేత్తో కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, రెండో చేయి పిల్లలను తాకాలని ప్రయత్నం చేస్తూ, తన్మయత్వంతో ‘నా కోసం ఇంత చేశావా? నా సౌజన్య ఇక లేదా!’ అని బొంగురు గొంతుతో అంటుంటే, కళ్ల నుండి కారే నీళ్లు రామం మీద పడుతున్నాయి. రామం తాతయ్య కళ్లలోని బాధను, వెలుగును చూస్తూ ఉండిపోయాడు.

ఆచార్య శేషయ్య కందమూరు, పిహెచ్.డి. 98481 10196