కథ

మరి మీకేమివ్వాలి సారూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ

నేను సూర్యాపేటలో ఓ దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్న రోజులవి.
రాత్రి రెండు దాటింది. నా డ్యూటీ అయిపోయింది. సన్నగా మొదలైన వర్షం మెల్లగా జోరందుకుంది.
సాయంత్రం ఆరు తర్వాత ఆఫీసు మెయిన్ గేటు మూసేస్తారు.
నాలుగో అంతస్తు నుంచి మెట్ల మీదుగా మొదటి అంతస్తులో ఉన్న ప్రింటింగ్ సెక్షన్‌లోంచే బయటికెళ్లాలి.
ఆ సెక్షన్‌లోకి అడుగు పెడుతుండగానే కిషన్ నవ్వుతూ పలకరించాడు. అక్షరాలు అచ్చొత్తుతున్న భారీ యంత్రాల చప్పుడులో అతని మాటలు సరిగా వినపడలేదు.
చెవికి దగ్గరగా వచ్చి, ‘బయట వర్షం పడుతోంది. కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి’ అన్నాడు.

అలాగేనంటూ ఓ మెషీన్ దగ్గరకు వెళ్లి అప్పుడే అచ్చయి బయటికొస్తున్న నల్గొండ జిల్లా ఎడిషన్ చేతుల్లోకి తీసుకుని, చదవడంలో మునిగిపోయాను.
ఇరవై నిమిషాల తర్వాత వానజోరు తగ్గింది. అప్పటికే అవులింతలు వస్తున్నాయి. ఇక వెయిట్ చేసే ఓపిక లేక, మెట్ల వైపు నడుస్తూ ‘నువ్వూ వస్తావా?’ అడిగాను కిషన్‌ను.
‘ఇంకో పావుగంట పడుతుందన్నా. నాకు నా సుజుకీ సమురాయ్ ఉందిగా, నువు లాగించెయ్’ అన్నాడు, తన సైకిల్‌ను గొప్పగా వర్ణిస్తూ.
నవ్వుతూ అక్కణ్నించి బయల్దేరాను. స్కూటరు స్టార్ట్ చేసి, ఊరివైపు కదిలాను. వెంకటేశ్వర థియేటర్ దాటి, చిన్న సందులోకి మలుపు తిరిగాను. ఇంకా తుంపర పడుతూనే ఉంది. అప్పటికే తల తడిసిపోయింది. పైనుంచి పడుతున్న చినుకులు లైటు వెలుతురులో దూసుకొచ్చి, కళ్ల మీద చిట్లిపోతున్నాయి.
వీధి లైట్లు వెలగడంలేదు. ఎక్కడా మనిషి జాడ లేదు. సన్నటి ఆ సందులో కాస్త ముందుకు వెళ్లగానే ఓ మనిషి కనిపించాడు. దాదాపు అతన్ని దాటిపోతూండగా, అతను ఆదుర్దాగా చెయ్యి ఊపుతూ, బిగ్గరగా అరుస్తున్నాడు.
బండి స్లో చేశాను. ఒక్క క్షణం మనసులో భయం జరజరా పాకింది.
ఆపాలా, వద్దా అనే విషయాన్ని వెంటనే తేల్చుకోలేక పోయాను.
కొద్ది క్షణాల తర్వాత పూర్తిగా ఆపి, ఎడమకాలు నేలపై ఆనించి, వెనక్కి తిరిగి చూశాను.
అతను గబగబా పరుగెత్తుకొచ్చాడు. ముద్దగా తడిసిపోయి ఉన్నాడు. రొప్పుతున్నాడు. టెన్షన్ పడుతున్నాడు.
‘ఎవరదీ..!’ భయంగానే ప్రశ్నించాను.
‘సారూ, నిజంగా మీరు నా పాలిటి దేవుడిలాగా కనిపించారు. కాస్త ఆదుకోండి సారూ, దయ జూపండి సారూ..’ అతను ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాడు.
‘గంటన్నర నించి ఇక్కడ నిలబడి ఉన్నా. ఈ టైమ్‌లో జనం తిరిగేదే తక్కువ. పైగా వానొకటి. అడపాదడపా అయిదారుగురు వచ్చారు బళ్ల మీద. ఆపండి సారూ అని గొంతు చించుకున్నా ఒక్కరూ ఆపలేదు’
నాలో భయం పోయింది. స్కూటరు స్టాండ్ వేసి, రోడ్డు మీద నిలబడుతూ ‘ఇంతకీ నీకేం కావాలి?’ అన్నాను.
అతను చెప్పిన వివరాల ప్రకారం...
అతనో లారీ డ్రైవర్. విజయవాడ వెళ్లాల్సిన ఆ లారీ రాత్రి ఏడు గంటల సమయంలో హైదరాబాద్‌లో బయల్దేరింది. క్లీనర్ ఆరోగ్యం బాగోకపోవడం, లారీలో విలువైన సరుకు ఉండటంతో స్వయంగా ఆ లారీ యజమానే వెంట బయల్దేరాడు. రాత్రి పదకొండు కావస్తుండగా లారీ సూర్యాపేట సమీపానికి చేరుకుంది.
మరో పదినిమిషాలు ప్రయాణిస్తే పేటకు చేరుతారనగా, చిన్న యాక్సిడెంట్ జరిగింది. అతనికి ఏమీ కాలేదు గాని, ఓనర్ రంగబాబు కుడిచేతికి బాగా దెబ్బలు తగిలాయి. లారీని రోడ్డుపక్కనే ఆపి, ఆటోలో రంగబాబును సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చాడు అతను.
ప్రథమ చికిత్స తర్వాత గమనిస్తే, రంగబాబు కుడిచేతి మధ్య మూడు వేళ్లకూ పెట్టుకున్న బంగారు ఉంగరాలు బాగా అణిగిపోయి, వంకర్లు పోయి, వేళ్లను గట్టిగా పట్టేశాయి. వాటిని కత్తిరించడం వైద్యుల వల్ల కాలేదు. కంసాలి ఎక్కడున్నా, వెతికి పట్టుకురమ్మని డాక్టర్ ఆజ్ఞ వేశాడు. అలా బయల్దేరిన అతను అక్కడక్కడా వాకబు చేసుకుంటూ, ఈ సందులో ఉన్న కంసాలి ఇంటి పరిసరాలకు చేరుకున్నాడు.
కానీ అక్కడ కంసాలి ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు. ఏ తలుపు తట్టాలో అర్థంకాని పరిస్థితి.
నాకు జాలి వేసింది. కానీ, నాక్కూడా బంగారపు పనిచేసే కంసాలి ఇల్లేదో తెలియదు. చిమ్మచీకటి.
ఏ ఒక్కరూ అటుగా రావడంలేదు.
‘చూద్దాం, ఎవరో ఒకరు రాకపోతారా?’ అంటుండగా నాకు కిషన్ గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేశాను.
‘అన్నా, చెప్పు’ అన్నాడు.
‘ఎక్కడిదాకా వచ్చావు? అసలు బయల్దేరావా?’
‘బయల్దేరా నన్నా, వెంకటేశ్వర థియేటర్ దాకా వచ్చాను’
‘నేను మీ ఇంటి దగ్గర్లోనే ఉన్నాను. వచ్చెయ్, నీతో చిన్న పనుంది’ అంటూ ఫోన్ పెట్టేశాను.
కిషన్ సూర్యాపేట నివాసి. ఆ సందు చివర్లోనే అతని నివాసం.
అయిదు నిమిషాల్లో సైకిల్ బెల్ మోగించుకుంటూ వచ్చాడు కిషన్.
రోడ్డు మీదే నిలబడ్డ మా ఇద్దరినీ చిత్రంగా చూస్తూ సైకిల్ దిగాడు.
‘ఏందన్నా, ఏదైనా సమస్యా?’ అడిగాడు.
జరిగిందంతా వివరించాను.
‘ఓ! బ్రహ్మచారి గురించేలే మీరు వెతికేది. అతనిల్లు... అదిగో ఆ కరెంటు స్తంభం పక్కదే’ అన్నాడు కిషన్.
‘పదన్నా, నీ గొంతు గుర్తు పడతాడు కాబట్టి, నువ్వే పిలువు’ అన్నాను.
ముగ్గురం ఆ వైపు నడిచాం. వర్షం మళ్లీ పెరుగుతోంది. హోరున గాలి వీస్తోంది.
తలుపు మీద చేత్తో కొడుతూ ‘చారిగారూ’ అని పిలిచాడు కిషన్.
గాలిహోరులో ఆ పిలుపు మాకే సరిగా వినపడలేదు.
తలుపు మీద గట్టిగా కొడుతూ, మరింత పెద్దగా పిలిచాడు.
మరో మూడునాలుగుసార్లు పిలిచాక, రోడ్డు పక్కనే ఉన్న బెడ్‌రూము కిటికీ తెరుచుకుంది. ముగ్గురం అటుగా నడిచాం. లోపల లైటు వేసి, కిటికీకి దగ్గరగా వచ్చి ‘ఎవరదీ, ఈ టైములో’ అని ప్రశ్నించాడు చిరాకుగా.
కిషన్ కిటికీకి దగ్గరగా వెళ్లి ‘నేనండీ చారిగారూ... కిషన్‌ని’ అని, ‘అతని అవసరం’ గురించి వివరించాడు.
‘పోవయ్యా, ఈ టైమ్ల ఎవుడొస్తడు’ అన్నాడు విసుగ్గా.
‘చారిగారూ, పాపం చాలా అవసరతలో వచ్చారు. కాదనకండి. ఇడుగో, మా సారు కూడా ఈడనే ఉన్నడు. మిమ్మల్ని ఆయన బండి మీద తోల్కెళ్లి, మళ్లీ తీస్కొచ్చి వదిలిపెడ్తరు. కాదనకండి. ప్లీజ్’ కిషన్ అభ్యర్థించాడు.
‘సారూ సారూ... మీరెంత అడిగితే అంత డబ్బులిస్త. ప్లీజ్ రండి..’ డ్రైవర్ కూడా బతిమాలాడు.
చారి కొన్ని సెకన్లపాటు ఆలోచించి, ‘వస్తానుండుండ్రి’ అన్నాడు.
మేం ముగ్గురం ఊపిరి పీల్చుకుంటూ రోడ్డు మీద నిలబడ్డాం. రెండు నిమిషాల్లో తయారై వచ్చాడు చారి.
‘అన్నా, మరి నేనింటికెళ్లనా’ అడిగాడు కిషన్.
‘ఓకే అన్నా. థాంక్యూ వెరీమచ్’ చెప్పాను.
నా స్కూటరు మీద చారినీ, డ్రైవరునూ ఎక్కించుకుని, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాను. లోపలికి వెళ్లగానే డ్రైవర్ గబగబా నన్నూ, చారినీ తన యజమాని ఉన్న రూములోకి తీసుకెళ్లాడు.
కుడిచేతిని విదిలిస్తూ, ఆ బాధను పంటిబిగువున భరిస్తున్న రంగబాబు మమ్మల్ని చూడగానే బావురుమన్నాడు. డ్రైవర్ నర్సును పిలుచుకొచ్చాడు. రంగబాబు చేతిని జాగ్రత్తగా పరిశీలించాడు చారి.
మధ్య వేళ్లకున్న రెండు బంగారు ఉంగరాలు సొట్టబోయి, ఒకదానికొకటి అతుక్కుపోయాయి. వాటి మధ్యలో వేళ్లు నలిగిపోతుండటంతో, రక్తప్రసరణ లేక అల్లాడిపోతున్నాడు.
నర్సు సలహాకి తోడు, ఎలా చేయాలో ఒక నిశ్చయానికొచ్చాక, తన వెంట తెచ్చుకున్న కట్టర్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు చారి.
దాదాపు అయిదు నిమిషాలు శ్రమించి, కట్టర్‌ను రంగబాబు చేతి ఉంగరాల మధ్యలోకి చేర్చగలిగాడు.
ఆ తర్వాత రెండు చేతులూ బిగించి, ఒక్కసారిగా ఉంగరాలను కత్తిరించాడు.
ఉంగరాలు వేళ్ల నుంచి విడిపోయిన మరుక్షణం, రంగబాబు వేళ్ల నుంచి జివ్వున రక్తం అంతెత్తున, మా మొహాల మీదికి చిమ్మింది.
రంగబాబు బాధంతా చేత్తో తీసేసినట్లయి, పెద్దగా నిట్టూర్చాడు.
‘హమ్మయ్య, ఇక మా పని సులువవుతుంది’ అంటూ డ్రెస్సింగ్ ప్రారంభించింది నర్సు.
* * *
ఆస్పత్రి బయట నుంచున్నాం.
డ్రైవర్ వచ్చి, ‘సారూ, ఆయనకెంతివ్వాలి?’ అని నన్నడిగాడు.
‘ఓ రెండొందలివ్వండి’ అన్నాను.
‘రెండొందలు కాకపోతే, అయిదొందలిస్తాను’ అంటూ అయిదొందల నోటు చారిగారి చేతుల్లో ఉంచి, రెండు చేతులూ జోడించాడు.
‘అయ్యో, ఇంతక్కర్లేదు. రెండొందలు చాలు’ తిరస్కరించబోయాడు చారి.
‘సారూ, మా రంగబాబుగారికి ఇరవై లారీలున్నాయి. మమ్మల్ని శానా బాగా సూసుకుంటాడు. ఇప్పుడాయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. యాల కాని యాలలో వచ్చి, మా అయ్యగారిని ఆదుకున్నందుకు అయిదొందలు లెక్క కాదు. వద్దనకండి’ ప్రాధేయపడ్డాడు డ్రైవర్.
చారి మారు మాటాడకుండా నోటు జేబులో పెట్టుకుని, స్కూటరు వైపు నడిచాడు.
నేను వాచీ వంక చూశాను. తెల్లవారుజామున నాలుగు దాటుతోంది.
డ్రైవరు వైపు చూస్తూ ‘వెళ్లొస్తానమ్మా’ అన్నాను.
అతను రెండు చేతులూ జోడించి ‘ఆయన గారికైతే డబ్బులిచ్చాను. మరి మీకేమివ్వాలి సారూ..’ అన్నాడు.
నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
నవ్వేసి, ‘నాకేమీ వద్దు. మీ సార్‌ను జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పి, స్కూటరు స్టార్ట్ చేశాను, చారిని వెనక ఎక్కించుకుని!
*

-ఎవీ రామిరెడ్డి.. 9866777870