కథ

నామకరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోనులో మాట్లాడి వచ్చి తన పక్క కుర్చీలో కూర్చున్న తాయారమ్మ వైపు ఆసక్తిగా చూస్తూ ‘‘ఏమిటంత ఆనందం.. కొడుకు ఏం చెప్పాడేం..? ప్రమోషన్ వచ్చిందటనా?’’ అనడిగారు రంగనాథం గారు.
ఆవిడ చిరునవ్వుతో చూసి ‘‘తండ్రిగా ప్రమోషన్ వచ్చి పూర్తిగా నెల అయినా కాలేదూ మళ్లీ ప్రమోషన్ ఏంటి?’’ ఛలోక్తిగా అంది.
‘‘నేనడిగింది, ఆఫీసులో సంగతి..’’
‘‘ఆఫీసు విషయాలు ముందుగా మీకే కదా చెబుతాడూ..’’ దీర్ఘం తీసింది.
‘‘మరి.. ఇంకేమిటో.. చెప్పరాదూ..’’
‘‘ఏం ఉందీ.. మనవడి నామకరణానికి ఆఫీసులో పని ఉందని మీరు రావడం లేదుగా, నేను ఒక్కదాన్ని వస్తున్నానని జాగ్రత్తలు చెప్పాడు. మనవడికి నాకు నచ్చిన పేరే పెడతారట. అందుకని మంచిపేరు ఆలోచించమన్నాడు..’’
‘‘అదీ విషయం అన్నమాట.. నీ ఆనందానికి కారణం ఇప్పుడర్థమైంది! అయితే ఇక ఆ పనిమీదే ఉంటాడన్నమాట!’’ అన్నారాయన నవ్వు మొహంతో..
‘‘అవును గానీ.. మీరు కూడా మీకు నచ్చిన పేర్లు రెండు మూడు చెప్పరాదూ..!’’
‘‘ఆ విషయంలో నీకున్నంత సరదా, ఆసక్తి నాకు లేదు. ఆపైన ఇప్పటిపాళ్ళు ఎలాంటి పేర్లు పెడుతున్నారో.. అదీ నాకు తెలియదు..!’’
‘‘నాకు నచ్చిన పేరు అన్నాడు కాబట్టి ఆలోచించాలిగానీ ఈ రోజుల్లో వాళ్ళు పిల్లలకు పెడుతున్న పేర్లు గురించి నాకు మాత్రం తెలుసునా..’’ అంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పక్కున నవ్వింది. మొన్నీమధ్య సుగుణమ్మగారి మనవరాలు మనింటికి వచ్చినప్పుడు ‘మీ మామయ్యకి కవలలు పుడితే, నామకరణానికి వెళ్ళొచ్చారుగా, ఏం పేర్లు పెట్టారే..?’ అని సరదాగా అడిగితే ఏదో చెప్పింది. నాకు ఆశ్చర్యమేసి ‘ఈమధ్య ఇలాంటి పేర్లు.. ఈర్ష, అసూయ.. అని కూడా పెడుతున్నారా?’’ అనడిగా.. పిల్ల నాకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోయినట్లు మొహంపెట్టి ‘మీరు చెప్పినది ఏ భాషలోనివి.. అర్థం ఏమిటీ’ అనడిగి మళ్ళీ మామయ్య పిల్లలకు పెట్టిన పేర్లు ‘ఈష, అనూష’ అని సరిదిద్ది చెప్పింది’’
రంగనాథం గారికీ నవ్వొచ్చింది.
‘‘ఏమిటో.. నాలుగో తరగతి చదువుతున్న పిల్లకు ఆ మాటలు తెలువనీ తెలియదు. అర్థమూ తెలియదు..! ఏం చేస్తాం.. రోజులు అలా ఉన్నాయి మరి! పెద్దవాళ్ళ దోరణీ అలాగే ఉంది.. పిల్లలకు పెట్టే పేర్లు అందంగా, పిలవడానికి అనువుగా ఉండాలనుకోవడం లేదు.. ఎవరికీ ఉండని, కొత్తగా ఉండాలనే కోరిక మాత్రమే ఉంటోంది! అక్షరాలని అటూ ఇటూ తిరగేసి మార్చినట్లు కొత్తపేర్లు పెడుతున్నారు. వీటికి జర్మనీ, జపాన్ వాళ్ళ భాషలో చాలా మంచి అర్థం అంటున్నారు..’’ అంటూ నిట్టూర్చింది.
రంగనాథంగారు అవునన్నట్లుగా తల ఊపి ఊరుకున్నారు.
తాయారమ్మ ముఖకవళికలు గమనిస్తుంటే.. ఆవిడ అప్పుడే మనవడి పేరు గురించిన ఆలోచనల్లో నిమగ్నమైపోయిందని అర్థమై ఆయన లోలోపలే నవ్వుకున్నారు. ఆవిడ మనస్తత్వం ఆయనకి కొంత వింతగానే అనిపిస్తుంది. ఆవిడెంతో ఆనందిస్తుందనుకున్న విషయానికి మామూలుగానే ఉండి చాలా చిన్న విషయమని ఆయన అనుకున్న దానికి అమితంగా ఆనందించేస్తుంది మరి!
ఎప్పటివో ఆలోచనలు ఆయన మనసుని చుట్టుముట్టాయి.
తమ పెళ్ళయిన రెండేళ్ళ తరువాతనే కాబోలు తను ఆఫీసు పనిమీద క్యాంపుకి వెళ్లి తిరిగి వస్తూ సొంత ఊరులో ఒక పూట ఉండి వచ్చాడు. అప్పుడు అమ్మ తనకి తనది పాత నగ ఒకటి ఇచ్చి దానితో కోడలిని కొత్త రకం ఏమైనా చేయించుకోమని చెప్పమంది. బరువును బట్టి ఆ నగ కనీసం ఆరేడు తులాలు ఉంటుందని అంచనా వేశాడు. ఎంత పొదుపుగా ఉన్నా అరతులం బంగారమైనా కొనగలిగే పరిస్థితి కాదు తనది. అందుకే అంత బంగారం ఇస్తే, భార్య ఎంత ఆనందిస్తుందోననుకుంటూ ఊహాగానాలు చేసిన తనకి ఆశాభంగమే ఎదురైంది! ఆ నగ చేతికిచ్చినప్పుడు ‘కొనే్నళ్ళు అత్తయ్యే వేసుకుంటూండొచ్చుగా, అప్పుడే ఎందుకూ నాకు ఇవ్వటం..’ బీరువాలో దాచింది.
తను ఊహించిన ఆనందం కనిపించకపోవడంతో ‘అమ్మో.. ఈవిడను సంతోషపెట్టడం తన వల్ల కాదు..’ అని మనసులోనే అనుకుని నిట్టూర్చాడు.
అయితే తన ఊహ తప్పని తేలిన సంఘటన కొద్దిరోజుల్లోనే జరిగింది.
ఆ రోజు.. తెల్లారేటప్పటికి ఆవిడకు బాగా జ్వరం వచ్చింది. వంట చేసే పరిస్థితిలో లేదు. దగ్గర్లోనే ఉన్న హోటల్‌కి వెళ్లి ఫ్లాస్కులో కాఫీ, బ్రెడ్డు వంటివి తెచ్చి పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఇన్‌స్పెక్షన్ జరుగుతున్నందువల్ల ఆఫీసుకు సెలవు పెట్టే వీలూ లేదు. తనైతే ఆఫీసు కాంటీన్‌లోనో, బయటనో తినేస్తాడు గానీ, ఆమెకేం కావాలో చూసుకోవటానికి కుదరట్లేదని విచారిస్తూనే ఆఫీసుకు వెళ్ళాడు.
మధ్యాహ్నం వేళ పక్కింటి వాళ్ళకి ఫోను చేసి తన పరిస్థితిని చెప్పి తాయారు మందు వేసుకుందో లేదో కనుక్కోమని, ఏం కావాలో చూడమని అర్థించాడు. అప్పటికి తమ ఇంట్లో ఫోను లేదు మరి. సాయంకాలం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి, ఆవిడకు జ్వరం పూర్తిగా తగ్గలేదు కానీ, మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది. తనకేమీ అర్థం కాలేదు. అంత సంతోషం కలిగించే సంఘటన ఏమైనా జరిగిందా అని ఆరా తీశాడు.
‘‘అంత ఆఫీసు పని హడావుడిలోనూ నాకు బాగా లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని నా గురించి పక్కింటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారుగా, అంతకన్నా ఆనందం ఇంకేముంటుందీ..?’’ అంది తనవైపు ఇష్టంగా చూస్తూ..
ఆ సమాధానికి తనకి నిజంగానే మతి పోయినంత ఆశ్చర్యం కలిగింది. అప్పుడే.. ఆవిడ మనస్తత్వం గురించి కొంచెం అవగాహన కలిగింది. అయినా.. ఉద్దేశ్యపూర్వకరంగా కాకుండానే ఆవిడకు తన ప్రవర్తనతో బాధ కలిగించాడోసారి. అది తనకి చాలా చిన్న విషయమే గానీ, ఆవిడ మాత్రం ఎక్కువగానే బాధపడింది. తననీ సాధించింది!
కొడుకు పుట్టినప్పుడు నామకరణానికి తను ఉద్యోగం చేస్తున్న ఊరు నుండి అత్తగారి ఊరుకు బయలుదేరి వెళ్ళాడు. తమ ఊరు నుండి తల్లీతండ్రీ అటే వచ్చారు. వెళ్ళేసరికి బాగా పొద్దుపోవడంతో భోజనాలు కానిచ్చిన వెంటనే నిద్రపోయారు. తెల్లారగానే ఇంట్లో హడావుడి ప్రారంభమైపోయింది.
బియ్యంలో పేరు రాసేటప్పుడు పూజారిగారు తనవేపు చూస్తే, సాభిప్రాయంగా తను అమ్మవేపు చూపాడు. సంబరంగా అమ్మ చెప్పిన ఆ పేరే ఖరారైంది. ఆ వేళంతా భార్య ముభావంగా ఉందని అనుకున్నాడే తప్ప ఆ హడావుడిలో ఆరా తీయలేదు. తమ ఇంటికి వచ్చాక ఒక సందర్భంలో తన మనసును బయటపెట్టింది.
‘నా చిన్నప్పుడు మా నాన్నను నా పేరు విషయంలో నిలదీశాను’. పిల్లలకు తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోకపోతే, వాళ్ళమీద ప్రేమాభిమానాలు లేనట్లనుకోవడం సరియైనదేనా? పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రుల్ని గౌరవించినట్లా? అనడిగాను. ‘అదేం కాదే’ అన్నారు.

‘అందరూ అలా అనుకుంటే ఒకే రకమైన పేర్లే ఉంటుంటాయి గానీ మార్పు ఉండదుగా, మరి నాకూ నాయనమ్మ పేరే పెట్టారు.. ఏదైనా చక్కగా ఉండే పేర్లు.. తార, తరళ అని పెట్టొచ్చుగా.. తాయారు పేరు నాకు నచ్చలేదు నాన్నా..’ అని నిష్కర్షగా చేప్పేశాను.
మా నాన్న కోప్ప తెచ్చుకోకుండా నన్ను దగ్గిర కూర్చోబెట్టుకుని అనునయంగా వివరించారు.
‘ఇప్పట్లో ఇష్టదైవాలవో, తల్లిదండ్రులవో, కాకపోతే కొందరు నచ్చిన నాయకుల పేర్లు పిల్లలకు పెట్టుకోవడం రివాజుగా ఉంటోందా.. మా పెదనాన్న, చిన్నాన్నల పిల్లలు తమ పిల్లలకు వాళ్ళ అమ్మానాన్నల పేర్లే పెట్టుకున్నారు. నేనలా కాకుండా ఏదో కొత్తపేరును నీకు పెట్టొచ్చు. మా అమ్మ తన పేరు పెట్టమనీ పట్టుబట్టదు. కాకపోతే.. నా కూతురుకి అందమైన పేరు పెట్టుకోవాలనే కోరిక కంటే, కొడుకు తన పేరు పెట్టలేదని బంధువుల మధ్య మా అమ్మ చిన్నతనంగా భావిస్తుందేమోననే ఆలోచనకే ఎక్కువ విలువిచ్చానన్నమాట! అర్థమైందా?’ అనడిగారు. మా నాన్న మాటలకి సంతృప్తి పడ్డాను. ఆ తరువాత ఎప్పుడూ ఆ విషయం నా మనసులోకి రాలేదు.
అంతకు ముందైతే మా అమ్మ దగ్గర అప్పుడప్పుడూ ఈ విషయం మీద సణుగుతూండేదాన్ని. అప్పుడు మా అమ్మ ‘నీకు పేరు పెట్టడంలో నా ప్రమేయం ఏమీ లేదు.. నన్ను సంప్రదించనూ లేదు.. మీ నాన్న ఇష్టప్రకారమే పెట్టారు.. అంతే..’ అని చెప్పేది. ఆ విషయంగా అమ్మకి పట్టింపు, కోపం ఏమీ లేవు. పద్ధతి ప్రకారం జరిగిందనుకునేదనుకుంటా..
ఒక తరం మారేటప్పటికి తల్లిదండ్రులే తమ పిల్లలకు తమకిష్టమైన పేర్లే పెట్టుకోవడం రివాజుగా మారింది. నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటానని మా బంధువుల్లో కొందరు తమ పిల్లలకి మంచి పేర్లు చెప్పమని అడుగుతూండటం కూడా జరిగేది. నేను చదివిన నవలల్లోవో, మరేవైనా కొన్ని చెప్పేదాన్ని. వీళ్లు వీటిలోవి పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా పట్టించుకునేదాన్ని కాదుగానీ, నన్నలా అడగటమే ఆ రోజుల్లో, ఆ వయసులో నాకు సంబరంగా మాత్రం ఉండేది!
ఇక పెళ్ళయ్యాక.. అబ్బాయి పుట్టినప్పుడు నామకరణానికి ముందు మీతో మాట్లాడే సమయానికి దొరకలేదు. అత్తయ్య పేరు చెప్పాక నచ్చినట్లేనా అని నన్ను అడుగుతారనుకున్నా.. మంచిపేరే కావచ్చు.. ఆ విషయంలో అభ్యంతరం లేకపోవడం, ఉండటం సమస్య కాదు, కన్నతల్లిని కూడా సంప్రదించాలనే ఆలోచన మీకు లేకపోవడమే నాకు కోపం తెప్పించిందీ, బాధ పెట్టింది. మీరడిగితే, ఒకవేళ నచ్చకపోయినా, అంతమంది మధ్య కాదనేదాన్ని కాదు. అయితే.. మీరు సరే కదా అన్నట్లుగా నా వైపు చూసినా నాకు సంతృప్తిగానే ఉండేది!’
ఆ మాటల్లో.. తన మనసు తెలిసాక తను తప్పు చేశాడనిపించి, రెండోసారి అటువంటి పొరపాటు చేయనంటూ అనునయించేసరికి కోపం, బాధ కరిగిపోయినట్లుగా కనిపించింది. అయితే, తన అనారోగ్యరీత్యా ఇంకో బిడ్డకు జన్మనిచ్చే ఆస్కారమే లేకుండా పోవడంతో నామకరణం ప్రసక్తే రాలేదు!
మళ్ళీ ఇనే్నళ్ళకు తన మనవడికి పేరు పెట్టే బాధ్యతను కొడుకు అప్పగించటంతో ఆవిడ అంతగా సంబరపడటంలో ఆశ్చర్యమేమీ లేదనుకున్నారు రంగనాథంగారు.
ఆ రెండు మూడు రోజుల్లో తాయారమ్మ తను ఆలోచించిన పేర్ల జాబితాను ఏకరవు పెడుతున్నప్పుడు ఆయన సరిగా పట్టించుకోకుండా ‘సరే.. సరే.. బావున్నాయి అన్ని పేర్లూ.. అంతా నీ ఇష్టమే.. ఏదో ఒకటి నిర్ణయించుకో..’ అని జవాబు చెప్పటమూ చాలాసార్లే జరిగింది.
మనవడికి ఇద్దామనుకున్నవన్నీ తీసుకుని నామకరణ శుభకార్యానికి తాయారమ్మ బయలుదేరి వెళ్ళింది.
శుభకార్యం పూర్తయ్యాక తల్లిని ట్రైను ఎక్కించి కొడుకు ఆ విషయం ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు. చంటి పిల్లాడికి పెట్టిన పేరూ చెప్పి బాగుందా? అనీ అడిగాడు. బావుందని చెబుతూనే రంగనాథంగారు ఇంకో మాట అన్నారు నవ్వుతూ.. ‘‘పెద్దయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకోవటమే గానీ, పుట్టినప్పుడు గుర్తింపుగా పిలవటానికి ఏదయితేనేం లే అనుకునే రకం నేను. ఈ విషయంలో మీ అమ్మకి ఉన్నంత శ్రద్ధ, సరదా నాకు లేవు..!’’
ఆ మాటలకూ కొడుకూ నవ్వి ఊరుకున్నాడు.
రంగనాథంగారు టైముకి రైల్వేస్టేషనుకి వెళ్ళి తాయారమ్మను వెంటబెట్టుకుని ఒంటికి వచ్చారు. మామూలుగా ఆయన ఆఫీసు నుండి సాయంకాలం ఇంటికి రాగానే ఆ రోజు కబుర్లన్నీ ఏకరువు పెట్టడం ఆవిడ అలవాటు. అలాంటిది ఆవిడ ఊరెళ్ళి వచ్చి.. అక్కడి విశేషాలన్నీ వివరించకుండా ముభావంగా ఉండిపోవడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. వియ్యాలవారిట్లో సరిగా మర్యాదలు జరగలేదా? అని ఆయనకు అనుమానం వచ్చి ఆమెను అదే అడిగారు.
‘‘్ఛ.. ఛ.. అలాంటిదేమీ లేదు. నిజానికి మన వియ్యాల
వారు ఆప్యాయంగా పలకరించటంలోనూ, మర్యాదల విషయంలోనూ మనకంటే ఎక్కువగానీ తక్కువగా ఉండరు. మీరు రాలేదన్నదే లోటుగా కనిపించింది గానీ శుభకార్యం బాగా జరిగింది!’’ అని ఆవిడ జవాబు చెప్పింది.
‘‘అయితే మరింకేమిటి? ఏమీ ఏదని నువ్వంటున్నా నాకు నమ్మకం కుదరడం లేదు. నువ్వు మామూలుగా లేవని తెలుస్తూనే ఉంది. దేనికి మధనపడుతున్నావో చెప్పాల్సిందే..!’’ అంటూ ఆయన రెట్టించేసరికి తాయారమ్మకి చెప్పక తప్పలేదు. మనసులోని బాధను బయటపెట్టింది.
‘‘నే వెళ్ళేసరికి మనబ్బాయి అక్కడే ఉన్నాడుగా, నేను ఆలోచించి ఉంచిన నాలుగు పేర్లూ చెప్పి ఏదో ఒకటి మీకు నచ్చిందే పెట్టండన్నాను. అలాగే అంటూనే వాడు ఇంకో రెండు, మూడు పేర్లు చెప్పి, ఒక పేరును బావుందిగా అంటూ అడిగాడు. అలా రెండు, మూడు సార్లు అడిగేసరికి నాకూ ఏదో విషయం ఉందనిపించింది. కోడలితో మాటల మధ్య నేనూ పేరు ప్రస్తావన తేగానే, తనకిష్టమైన పేరంటూ చెప్పి, అదే పెట్టాలనుకుంటున్నామనీ అంది. అప్పటికి నాకూ అర్థమైంది. అబ్బాయి ఆ పేరునే బావుంది కదా అంటూ ఎందుకడిగాడో? మరోసారి మళ్ళీ అలాగే అడిగేసరికి అవునని నేనూ చెప్పాను. ఆ మర్నాడు అదే పెట్టడమూ జరిగింది..’’
రంగనాథంగారు మధ్యలోనే అందుకుంటూ ‘‘నువ్వు చెప్పిన పేరు పిల్లాడికి పెట్టలేదనా.. అంతలా బాధపడుతున్నావ్? అయినా నీ ఉద్దేశ్యం కూడా కన్నవాళ్ళ ఇష్టమూ ముఖ్యమని కదా.. మరి.. ఇప్పుడేమిటి? మనవడికి కోడలికి నచ్చిన పేరు పెడితే.. నువ్వు సంతోషించాలి కానీ.. ఇలా.. ఇదేమిటి?’’ అనడిగారు.
‘‘మీకు అర్థమైంది ఇదా..?’’ అంటూ ఆవిడ ఆయన వైపు చురుగ్గా చూసింది. ‘‘కోడలికి ఇష్టమైన పేరు పెట్టడం నాకూ ఆనందమేనని తెలియనట్లుగా మన అబ్బాయి నన్ను మభ్యపెట్టి నిర్ణయమైపోయిన పేరును నాతోనే చెప్పించాలనుకోవడం.. నాకు కష్టంగా అనిపించింది!’’ ఆవిడ కంఠం రుద్ధమైంది.
‘ఇంత చిన్న విషయానికా అలా బాధపడుతున్నావ్..?’ అని అడగబోయిన ప్రశ్నని ఆవిడ మనస్తత్వం తెలుసు కనుక ఆయన బయటకు రానివ్వలేదు.
కొన్ని క్షణాలు వౌనంగా ఉండిపోయిన ఆయన ‘‘ఈ సందర్భంగా నాకొకటి గుర్తుకొచ్చింది. చెబుతా.. విను..’’ అంటూ మొదలుపెట్టారు. ‘‘మొన్నా మధ్య ఎవరిదో ఒక పెళ్ళిలో, పాతిక సంవత్సరాల క్రితం నాకు పరిచయమున్న రంగారావు, రాఘవరావులను కలుసుకోవడం జరిగింది. అప్పట్లో వాళ్ళిద్దరికీ ఎందుకోగానీ ఒకరంటే ఒకరికి గిట్టేది కాదు. ఈ మధ్య కలుసుకున్నప్పుడు రాఘవ, రంగారావుతో ‘పాతికేళ్ళ క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావ్.. మార్పేం లేదు’ అన్నాడు. ఎవరైనా అలా అంటే.. వయసు పెరిగిన విషయం తెలియనట్లుగా కనిపిస్తున్నందుకు ఆనందిస్తారా.. కనీ రాఘవ పట్ల సదభిప్రాయం లేనందువల్లే కాబోలు రంగరావుకి ఆ మాట ఇంకోలా అర్థమైంది. రాఘవ వెళ్ళిపోయాక రంగారావు నాతో ‘చూడు.. వాడెలా వంకరగా మాట్లాడుతున్నాడో.. పాతికేళ్ళ క్రితమే నేను యాభై ఏళ్ళ వాడిలా ఉండేవాడినని ఉద్దేశ్యం కాబోలు!’’ అన్నాడు.
తాయారమ్మ అర్థం కాలేదన్నట్లుగా చూసింది.
‘‘ఎదుటివాళ్ళ మాటలు, చర్యలూ మనకు అర్థం కావటంలో వాళ్ళ పట్ల మనకున్న అభిప్రాయమూ కొంత తోడవుతుంది! అవునా? మనబ్బాయి మునుపటిలా నీ ఇష్టానికి కాకుండా కోడలి వైపు మొగ్గు చూపాడని నీకు కొంచెం కష్టంగా అనిపించి ఉంటుంది. అది సహజమనీ, వాడు భార్య ఇష్టానికీ ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అనుకుంటే’ సమస్య ఉండదు. మునుము నువ్వూ అదే అనేదానివి కదా..! ఇంకోమాట. పేరు నిర్ణయమైపోయాక బాధ్యత నీకప్పగించినట్లుగా వాడు నిన్ను భ్రమ పెట్టాడని అనుకుంటున్నావు. అలా కాకుండా ఇంకోవిధంగా ఆలోచించు.. కోడలికి నచ్చిన పేరు పెట్టాల్సి వచ్చినా, నీకిష్టమైనదే పెడుతున్నట్లుగా ఆ పేరును నీతోనే అంగీకరింపచేయాలని చూడటం అంటే.. నీకూ సంతోషం, సంతృప్తి కలిగించాలనే అభిప్రాయం ఉన్నట్లే కదా..! నీ మీద ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలతోనే నిన్నూ ఆనందింప చేయాలని ఆరాటపడటమే గానీ మభ్యపెట్టటం కాదని నాకు అనిపిస్తోంది. మన ఆలోచనా విధానం కొంచెం మార్చుకుంటే.. కొన్ని సమస్యలు ఇట్టే సమసిపోతాయి.. ఏమంటావ్?’’
ఆయన మాటలకు ఆవిడ ఆలోచనలో పడినట్లుగా రెండు క్షణాలు వౌనంగా ఉండిపోయింది. నిజమే సుమా అన్నట్లుగా ఆవిడ పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. దాంతో ఆవిడ మనసూ తేలిక పడిందని గ్రహించిన రంగనాథంగారూ సంతృప్తిగా నిట్టూర్చారు.

- గోగినేని మణి.. 94907 53335