కథ

మానవత్వం పరిమళించెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హై దరాబాద్ మహానగరం డెబ్భైలక్షల జనాభాతో కిటకిటలాతుంది. వివిధ కులాలు, వివిధ మతాల, అనేక భాషా సమూహాల జనంతో భిన్నత్వంలో ఏకత్వానికి మరోపేరులా ఉంది. నగరంలో రద్దీగా వుండే స్థలాల్లో దిల్‌సుక్‌నగర్ ఒకటి. తీవ్రవాదుల బాంబు పేలుళ్ళకు గురైన దిల్‌సుక్‌నగర్ బస్టాండ్ ప్రాంతం జనం ఈనినట్టుగా ఉంది. ఆఫీసుకెళ్ళే సమయం కావడంవల్ల మరింత రద్దీగా ఉంది. సికిందరాబాద్‌కెళ్ళే ఒకటవ నెంబర్ సిటీ బస్సొచ్చి బస్టాపులో ఆగింది. ఒకర్ని తోసుకుంటూ ఒకరు బస్సెక్కుతున్నారు. వృద్ధులు, ఆడవాళ్ళెక్కే ముందు డోరు వద్ద కూడా తోపుకోవడాలున్నాయంటే వెనుకడోర్ సంగతి చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు నిమిషాల్లోనే బస్సు నిండా క్రిక్కిరిసిన జనం. పూర్ణ గర్భిణిలా వున్న మెట్రో ఎక్స్‌ప్రెస్ బయలుదేరానికి సిద్ధంగా ఉంది.
బస్సు బాడీపై రెండు దెబ్బలేసి ‘బస్సాపండి’ అన్నారొకాయన. స్టార్ట్ కాబోతున్న బస్సునాపాడు డ్రైవర్.
‘‘ఆఫీసుకు టైమవుతుంది.. ఇప్పటికే ఆలస్యమవుతుందంటే ఏంటి గోల.. డ్రైవర్ సాబ్ బస్సు పోనీయ్’’ అన్నాడు మరో ప్రయాణీకుడు.
‘‘ఆగవయ్య బాబు.. పెద్దమనిషి బస్సెక్కుతున్నాడు... ఎనభై ఏండ్ల వృద్ధుడు.. మెట్లమీదున్నాడు..’’ అని ఆ వృద్ధుని లోపలికి తీసుకొచ్చాడు రవీందర్.
‘‘ఏం పెద్దమనిషో ఏమో! ఇదే బస్ దొరికిందా? హైదరాబాద్‌లో బస్సులకేమన్నా కరువా?’’ విసుక్కున్నాడో ప్రయాణీకుడు.
‘‘అన్ని బస్సులసంగతీ ఇంతే కదయ్యా! ఈ సమయంలో ఒక్క బస్సు కూడా రద్దీ లేకుండా పోతుందా, కొంచెం జరుగుండ్రి..’’ అని వృద్ధుని పట్టుకుని లోపలికొస్తున్నాడు రవీందర్.
‘‘ఓ దిక్కు ఊపిరాడుతలేదంటే నువ్వేమో ముసలాయినెను పట్టుకొని లోపలికి రావడితివి, ఎక్కడికి పోతవయ్యా..’’ విసుక్కున్నాడొకాయన.
‘‘ఎక్కడి పోవుడేంది? వృద్ధులకు సీట్లున్నయి కదా! పెద్దమనుషుల సీట్లో కూసునే హక్కు ఈ తాతకుంది’’.
‘‘హక్కుల గురించి మాట్లాడ్తున్నవు నువ్వు, మరి నీకు ముందటి నుంచి బస్సెక్కే హక్కుందా? అది చెప్పు..’’
రైట్.. రైట్.. బస్సు కదిలింది.
‘‘ఎందుకు లేదు? నా వయసెంతో తెలుసా..’’అన్నాడు రవీందర్.
‘‘చెప్పంది మాకెట్ల తెలుస్తది?’’
‘‘అరవై ఏడు అపోయినయి.. అరవై ఎనిమిది నడుస్తున్నాయి..’’
రవీందర్ మాటలకందరూ గొల్లున నవ్వారు...
‘‘నీకరవైఎనిమిదంటే ఎవరు నమ్ముతరు సార్, ఒక్క తెల్ల వెంట్రుక లేదు, ఒక్క పన్నూడిపోలేదు. అట్టకట్ట మంచిగనే ఉన్నవుగదా..’’
‘‘ఎందుకు బాబూ అనవసరపు లొల్లి.. ఒకర్నొకరు ప్రేమించుకోవాలి కాని ద్వేషించుకునుడేంది? బస్సెక్కుతే ఎంతోమంది కలుస్తరు. ఆ ముత్తేమంతసేపైనా ప్రేమగా ఉండక వాదులెందుకు? కొట్లాటలెందుకు?’’
‘‘అబ్బో ముసలాయిన బాగానే నీతులు చెప్పుతుండు.. నిన్ను బస్సెక్కిచ్చినండనా గాయినెకు మద్దతుగ మాట్లాడుతున్నవు? ఆయనె నిన్ను బస్సెందుకెక్కించ్చిందో ఎరికేనా? నీతోని ముందునుంచి ఎక్కచ్చని. ఆడోళ్లని రాస్కుంట పోవచ్చని...’’
ఈ వాదులాటలో ఆడవాళ్ళున్నారు.. మగవాళ్లూ ఉన్నారు. అన్ని ప్రాంతాల తెలుగువారున్నారు.. సీనియర్ సిటిజన్లు కానివారూ ఉన్నారు. రవీందర్‌కు ఆ మాటలు బాధ కలిగించాయి..
‘‘ఇగో.. సూడుండ్రి నా వయసు. ఏదిబడితే అది ఎందుకు మాట్లాడుతారు? ఆడవాళ్ళంటే మీ దృష్టిలో ఏంటి? నేను తలకు రంగేసుకుంట.. అదీ తప్పేనా?’’ అని పాన్‌కార్డ్ చూపాడు రవీందర్.
‘‘అబ్బో వివేకానందువోలె మాట్లాడుతుండు. వయసు సరే.. ఆరోగ్యంగానే ఉన్నరు కదా! వెనుకనుంచి వస్తేంబోతుంది? ఈ సమయంలో వృద్ధులకున్న రెండు సీట్లు దొరుకతయా? ఎట్లయినా నిలబడటమే కదా?’’
ఆ మాటలు రవీందర్‌కు బాధాకరంగానే ఉన్నాయి.
‘‘రావచ్చు.. కాని నాది వెనుకున్న యువకులను, కాలేజీ విద్యార్థులను నెట్టుకుంటూ వచ్చే వయస్సు కాదు.. ఆ వయసున్న నీలాంటోడే ముందునుంచొస్తే నేను వెనుకనుంచెలా వస్తాను?’’
ఆ మాటలతో ఆ యువకునికి చివుక్కుమంది.
‘‘నేనిక్కడ ఏముండ, ముందునుంచెక్కి వెనక్కిపోదామని ఎక్కిన..!’’
‘‘వృద్ధులపట్ల కొంతైనా మానవత్వం చూపాలన్నది చదువుకున్న మీక్కూడా తెలవకుంటేట్ల? వృద్ధులు కొందరు పైకి బాగానే కనబడినా అనేక సమస్యలుంటాయి. మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు.. ఆ మందిలో వేలాడుతూ వెనుక వచ్చే కుదుపులను భరిస్తూ నిలబడలేరు. ముందయితే సీటు లభిస్తే సరే, దొరక్కుంటే నిల్చోవచ్చు. వెనుకలా కుదుపులుండయి కదా! ఊపులను, సడెన్ బ్రేక్‌లకు వెనుక వృద్ధులు భరించలేరు. అందుకే ఇలా..?’’
‘‘మరి ఈ వయస్సులో బస్సులెందుకెక్కుతరో? కార్లో పోవచ్చు కదా! ఏ కుదుపులూ ఉండవు’’ అందొకావిడ.
‘‘పోవచ్చు తల్లీ.. కాని కారుండాలి కదా! కారును, కారును నడిపే డ్రైవర్‌ను భరించే ఆర్థిక స్థోమత ఉండాలి కదా! ఈ వయస్సులో ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వస్తున్నందుకు ఆ వృద్ధులపై సానుభూతి, జాలి, దయ చూపాలి కాని కారెడ్డాలాడ్తారా తల్లీ’’
టికెట్.. టికెట్.. కండక్టర్ వచ్చాడు.
‘‘అరెరే.. ఈ పెద్దమనిషికి సీటియ్యకపోయిండ్రా?’’ అన్నాడు.
‘‘తాతా నీ పేరేంది?’’ అన్నాడు మళ్లీ.
‘‘లక్ష్మయ్య..’’ అతన్ని పరీక్షగా చూశాడు కండక్టర్.
‘‘చాలాకాలం కింద మిమ్ములను చూసినట్టు జ్ఞాపకం.. అవును.. యాదికొచ్చింది. మీరు ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్‌గా వుండి రిటైరయ్యారు కదా!’’
‘‘అవును’’ అన్నాడు లక్ష్మయ్య.
‘‘అప్పుడు అంత పెద్ద పొజిషన్‌లో వుండి ఈ వయస్సులో బస్సులో...’’
‘‘అవును కండక్టర్‌గారూ! లక్ష్మయ్యగారు నాకు తెలుసు. నిజాయితీగల ఆఫీసర్. జీతం తప్ప ఇతరత్రా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బతికిన మనిషి. పిల్లలను ఉన్నతచదువులు చదివించిండ్రు. ఇప్పటికీ ఎవరిమీద ఆధారపడి బతకడంలేదు. పిల్లలనుంచి ఏం తీసుకోడు. నిజాయితీతో బతికితే కారెలా కొంటాడు?’’ అన్నాడు రవీందర్.
‘‘నాకు కార్లు, బార్లంటే ఇంటరెస్టు లేదు. మనం కార్లలో తిరగడం కాదు కావాల్సింది.. మన పిల్లలు తిరిగేట్టు చూడాలి. ఇద్దరు పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వాళ్ళకు కార్లున్నాయి. నాకొస్తున్న పెన్షన్‌కు నేను నా భార్య మామూలుగా బతకడానికి సరిపోతుంది’’ అన్నాడు లక్ష్మయ్య.
వయస్సు భారం అతన్ని నిల్చోవడానికి సహకరించడంలేదు.
‘‘ఎవరైనా సీటివ్వండి’’ అన్నాడు రవీందర్.
‘‘నీది నువ్వు చూసుకో... ఇక్కడెవరు లేరు సీటిచ్చుకోడానికి?’’ అందో ఆవిడ.
‘‘నిన్నుగాదు తల్లీ నేనడిగింది. వికలాంగులు, వృద్దుల సీట్లవాళ్ళని’’
‘‘ముందు సీట్లు రెండు వికలాంగులవి. వెనుక సీట్లు రెండు వృద్ధులవి. వికలాంగుల సీట్లలోను వృద్ధులే కూర్చున్నారు, లేవచ్చు కదా’’
‘‘వికలాంగులు లేరుగదా.. మేమెందుకు లేస్తం’’
‘‘మీకంటే వయస్సులో చాలా పెద్దవాడు. ఆయన నిలబడలేకపోతున్నాడు. లేవొచ్చు కదా!’’
‘‘నాకు మోకాళ్ళ నొప్పులు’’, ‘‘నాకు నడుం నొప్పులు..’’ ముందు సీట్లవారన్నారు.
‘‘తథాస్తు...’’ అన్నాడు
కండక్టర్.

‘‘ఏం కండక్టర్ సాబ్ మాకు శాపం బెడ్తున్నవా?’’’
‘‘మీరేకదా నొప్పులున్నాయని అన్నారు.. నేను తథాస్తు అన్నానంతే’’
వృద్ధుల సీట్లలో కూర్చున్నవారు తమకేం పట్టనట్టు కూర్చున్నారు. కండక్టర్ టిక్కెట్లివ్వడం పూర్తిచేసి ఫుట్‌బోర్డుపై నిల్చున్నాడు.
లక్ష్మయ్యగారికి మాత్రం సీటెవరూ ఇవ్వలేదు.
‘‘తల్లీ.. పెద్దమనిషి నిలబడలేకపోతున్నాడు.. సీటివ్వగలవా?’’ అన్నాడు రవీందర్.
‘‘అరవై ఏడేండ్ల ముసలోనివి నువ్వు. నేన్నీకు తల్లిలా కనబడుతున్నానా? నీ కంటే నా వయసెక్కువా’’ అంది ఆవిడ.
‘‘పోనీ చెల్లీ అని పిలువనా?’’
‘‘ఎట్ల పిల్చినా లాభం లేదు. వెనుకంత మొగోళ్లే. ముందట కూడా నాలుగు సీట్లు ముసలోల్ల పేరుమీద మగోళ్లకే. ఎనుకకు పొయ్యి మొగల్లనడుక్కుపో’’ అంది ఆ మధ్య వయసావిడ.
‘‘ముందు సీట్లు నాలుగు మగ వృద్ధులు, వికలాంగులకు మాత్రమే కాదమ్మా.. వికలాంగులు, అరవైదాటిన వృద్ధులు ఆడవారయినా, మగవారైనా ఈ సీట్లలో కూర్చోవచ్చు. వాళ్లు లేకుంటే ఏ వయస్సువారైనా సరే స్ర్తిలు. స్ర్తిల సీట్లు మాత్రం స్ర్తిలకే. స్ర్తిలు వెనుక కూడా కూర్చోవచ్చు. అవి మగవాళ్లకు మాత్రమే ప్రత్యేకం కావు. అందరూ కూర్చునేవి’’ అన్నాడు రవీందర్.
‘‘అంటే మమ్మల్ని మగోల్లనడుమ కూసుండుమంటవా? మంచోనివే ఉన్నవు’’ అంది మరో ఆవిడ.
‘‘కూర్చుండమనడలేదమ్మ.. విషయం చెప్పిన.. విదేశాల్లోనయితే ఆడవాళ్లకు ప్రత్యేకం అంటూ ఏ సీట్లు ఉండవు..’’
‘‘అయితే మాకు ప్రత్యేక సీట్లు వద్దంటవా? ముసలోనివైనా మగబుద్ధి పోనిచ్చుకోలేదు’’.
‘‘నేనెప్పుడు వద్దన్నానమ్మ? అక్కడ స్ర్తిలు పురుషులతో అన్ని రంగాల్లో సమానంగాన్నారు కాబట్టి ఆ అవసరం పళ్లేదు. ఇక్కడ అలా కాదు కాబట్టే స్ర్తిలకు బస్సుల్లోనే కాదు ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లోనూ రిజర్వేషన్లు ఉండాల్సిందే’’.
‘‘అంటే మేం అబలలమనా నీ ఉద్దేశ్యం?’’
‘‘కాలుకువెడితె మెడుకు, మెడుకు వెడితే కాలుకన్నట్టుంది తల్లీ మీ వాదన...’’
‘‘ఇప్పుడావాదనలెందుకు కాని సీటివ్వరు కదా సరే’’అన్నాడు రవీందర్.
‘‘అమెరికా అమెరికా అంటారు, అమెరికాల ఇంతవరకు ఒక్క స్ర్తి కూడా దేశాధ్యక్షులు కాలేదు. స్ర్తిలపై వివక్ష అంతటా ఉంది’’- స్ర్తిల సీట్లో కూర్చున్న ఓ అమ్మాయి లేచి నిలబడింది. కాలేజీ విద్యార్థినిలా ఉంది.
‘‘తాతా! ఈ సీట్లో కూర్చోండి..’’ అంది లక్ష్మయ్యనుద్దేశించి.
‘‘ఎందుకులే బేబీ.. కోఠీ దగ్గర చాలామంది దిగుతారు. నాకు సీటు దొరుకుతుంది’’ అన్నాడు లక్ష్మయ్య.
‘‘మీలో మా తాత కనబడ్తున్నాడు. నేను నిలబడగలను. మీరు కూర్చోండి తాతా..!’’ అని లక్ష్మయ్య చేయిపట్టి కూర్చోబెట్టిందా అమ్మాయి.
‘‘్థంక్స్ బేబీ..’’ అన్నాడు రవీందర్.
‘‘ముసలయినా ఆడోల్ల నడుమ మస్తుగ కూర్చున్నాడు.. ఎంజాయ్’’ అన్నాడు నిల్చోనున్న ఒకాయన.
ఆ మాటలు లక్ష్మయ్యకు బాధాకరంగానే ఉన్నాయి..
‘‘ఎందుకండీ! ఏది పడితే అది మాట్లాడుతారు..?’’ అన్నాడు రవీందర్.
‘‘ఆయనేం మాట్లాడాడు? ఉన్నదే మాట్లాడిండు. ఆడవాళ్ళు కనబడితే చాలు చొంగ కార్చే పురుషస్వామ్య సమాజమిది’’ అందో ఆవిడ.
జీవితంలో ఆమెకు చేదు అనుభవాలు కలిగినట్టున్నాయి.
‘‘ఎంతో బాధ కలిగితే కానీ ఆంటీ ఆ మాటలనదు. సమాజంలో అన్ని రకాల మనుషులుంటారు. నేనిప్పుడు యూనివర్సిటీలో పిజి చేస్తున్నాను. ఇంటర్ చదివేటప్పుడు ఆదివారం బయటకు పోవడం ఉండేది. ఓ ఆదివారం

నన్ను బయటకు తీసుకెళ్ళడానికి మా నాన్న రాలేదు. మా స్నేహితురాలి నాన్న వచ్చిండు. తనతో పోతానని నేనన్నాను. ఇంచార్జ్ సర్ వద్దన్నాడు. మా నానే్న కదా సార్ పంపితే ఏంటి? మా నాన్నతోని కూడా పంపరా అంది నా స్నేహితురాలు. సారు నవ్విండు.
ఏంది సార్ నవ్వుతున్నారు? అడిగింది నా స్నేహితురాలు. ఆయన నీకు నాన్న నిజమే.. నీ స్నేహితురాలికి కాదు గదా.. మా రూల్స్ ఒప్పుకోవు అన్నాడు.
ఆ మాటల్లో లోతైన అర్థముంది. స్వంత అన్న తండ్రులనే నమ్మలేని పరిస్థితుల్లో స్నేహితురాలి తండ్రిని, అన్నలను నమ్మి పంపే పరిస్థితులు లేవని నిరాకరించాడు’’ అంది లక్ష్మయ్యకు సీటిచ్చిన అమ్మాయి.
‘‘అప్పుడు నువేం ఫీలయ్యావు బేబీ’’ అన్నాడు రవీందర్.
‘‘అప్పుడా మాటలు చాదస్తపు మాటల్లా అనిపించాయి. ఆ తర్వాత ఆలోచిస్తే అందులో ఎంతో లోతైన అర్థముందనిపించింది. స్ర్తిలపట్ల జరుగుతున్న అత్యాచారాలు, ప్రేమల పేరుమీద హత్యలు, ఆత్మహత్యలు చూస్తుంటే ఈ సమాజం ఎటుపోతుందనిపిస్తుంది.
పిజి చేస్తూ ఇంకా జీవితంలోకి ప్రవేశించని ఓ అమ్మాయి అంత పరిపక్వతతో మాట్లాడడం లక్ష్మయ్యకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది.
‘‘చాలామంది మగవాళ్లకు స్ర్తి ఒక సెక్స్ సింబలే. కామం కమ్మిన కళ్ళతోనే చూస్తారు స్ర్తిని..’’ అందొకావిడ.
‘‘చాలామంది స్ర్తిలకు పురుషుడు మోసగాడుగానే కనిపిస్తాడు. వాడుకొని వదిలిపెట్టేవాడిగా, శత్రువుగానే కనిపిస్తాడు’’ అన్నాడొకాయన.
బస్సు కోఠీ దాటింది. ఖాళీ అయిన వృద్ధుల సీట్లోకి మారాడు లక్ష్మయ్య.
‘‘బేబీ నీ సీట్లో కూర్చో’’ అన్నాడు పిజి అమ్మాయితో రవీందర్..
‘‘మీరు కూడా సీనియర్ సిటిజన్ కదా కూర్చోండి సార్. వయసుతో వచ్చిన నిస్సహాయతతో పాటు, కుటుంబంలో జరిగే అనాదరణ ఎంత నరకమో నేను మా ఇంట్లోనే చూస్తున్నాను సార్, కూర్చోండి’’.
రవీందర్ ఆ సీట్లో కూర్చున్నాడు.
ఆమె మాటలకు లక్ష్మయ్య కనుకొలుకుల్లో నీళ్లు తిరిగాయి.
‘‘ఇంత చిన్న వయసులో మాలాంటి అభాగ్యులైన ముసలోల్ల పట్ల ఇంత దయ ఎలా కలిగింది తల్లీ’’ అన్నాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ లక్ష్మయ్య.
‘‘అరవై ఏళ్ళకుపైగా కుటుంబం కోసం, సమాజం కోసం అన్నీ అర్పించి బతుకుతారు ఎవరైనా సరే. ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్నదంతా తీసుకొని వాళ్ళ మానాన వాళ్లను వదిలిపెట్టడం ఎంత అమానుషం? అరవై ఏళ్ళు దాటినంక సంపాదించలేనంత మాత్రాన, చేతగానంత మాత్రాన వాళ్లకు బతికే హక్కు లేదా సార్. ఈ దేశంలో వృద్ధులకు రక్షం లేదు. మా తాతను, నానమ్మను చూసింతర్వాత నాకు వృద్ధుల సమస్యలపై పిహెచ్‌డి చేయాలనిపించింది. భవిష్యత్తులో ఆ పని చేస్తాను.’’
ఆమె మాటలు విన్న రవీందర్‌కు ఈమధ్య ఫేస్‌బుక్‌లో చదివిన ఓ పోస్టర్‌లోని మాటలు జ్ఞాపకం వచ్చాయి.
‘‘తల్లిదండ్రులు కూతురు రక్షణలో వుంటే వృద్ధులకు ఇలాంటి సమస్యలు వచ్చుండేవి కావు’’ ఒకామె పోస్టర్ పెట్టింది.
దానికి సమాధానంగా మరో పోస్టర్-
‘‘ప్రతి కోడలూ అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి బాగా చూసుకుంటే సరిపోతుంది కదాని’’
ఇవే మాటలన్నాడు రవీందర్.
‘‘నా అనుభవంతో నేనొక మాట చెబుతాను వింటారా?’’ అన్నాడు లక్ష్మయ్య.
‘‘చెప్పండి సార్..’’ ‘‘చెప్పండి తాతా’’
‘‘స్ర్తి పురుషులు ఒకరినొకరు ఎలా చూసుకోవాలన్న విషయంలోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నపుడు కాని ఇతరత్రా కాని స్ర్తిని పురుషుడు, పురుషున్ని స్ర్తి చూడాల్సిన విధానంలో ఇవి పాటిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మానవత్వ పరిమళం వెల్లివిరుస్తుంది’’.
‘‘ఎలానో చెప్పండి సార్..’’
‘‘ప్రతి పురుషుడు స్ర్తిలో ఆయా వయసులను బట్టి అమ్మమ్మ, నానమ్మలను, అమ్మను, సోదరిని, కూతురును చూసుకోవాలి.
ప్రతి స్ర్తి పురుషుడిలో తన తాతయ్యను, తండ్రిని, సోదరున్ని కన్నకొడుకును చూసుకోవాలి.
కాని పురుషుడు స్ర్తిలో ఆడతనాన్ని మాత్రమే చూస్తున్నాడు.
స్ర్తి పురుషుడిని మృగాడుగానే భావిస్తోంది.
లక్ష్మయ్యగారి మాటలకందరి హృదయాలూ ద్రవించాయి.
‘‘బాగా చెప్పారు తాతయ్య! అందరూ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండేది. మానవ సంబంధాల్లో మానవత్వం పరిమళించేది’’ అందా అమ్మాయి.
బస్సు చిక్కడపల్లి చేరుకుంది.
***
ఓ వృద్ధురాలు ఆయాసపడుతూ బస్సెక్కింది.
లేచి నిల్చున్నాడు లక్ష్మయ్య.
‘‘సార్.. మీరు..’’ రవీందర్ అంటున్నా వినిపించుకోలేదు.
‘‘రాండమ్మా..! కూర్చోండి..!’’ అని తన సీట్లో కూర్చోబెట్టాడు.
అమ్మాయి ముఖంలో ప్రశ్నార్థకాన్ని గమనించాడు లక్ష్మయ్య.
‘‘ఈమె వృద్ధురాలు. నాకంటే బలహీనమైన స్థితిలో ఉంది. పోగా మహిళ. ఈ సీట్లో ఆమె కూర్చోవడమే మంచిది’’ అన్నాడు.
‘‘మానవత్వం పరిమళించెను మంచి మనిషీ మేలుకో’’ ఎఫ్‌ఎమ్ రేడియో నుండి పాట వీనులవిందుగా వినబడుతోంది.
బస్సు ఆయాసపడుతూ సికిందరాబాద్ రెతిఫైల్ బస్టాండ్‌లో ఆగింది.

-డా కాలువ మల్లయ్య 91829 18567