కథ

సైనికుడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేస్తం...
ఎలా ఉన్నారు? ఇది మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరెలా ఉన్నారో మాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఏదో అడగాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు, నీలాంటి వారి వల్లే ఇక్కడ మేము ప్రశాంతంగా ఉన్నాము. మీరు కూడా మీ జీవితం, మీ స్వార్థం చూసుకుని వుంటే ఈ దేశం ఏమయిపోయేది? నిత్యం భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరస్పర దాడులు, దాడుల్లో పిట్టల్లా రాలిపోతున్న మీ ప్రాంలు, ఆత్మాహుతి దాడుల్లో మీరు కోల్పోయిన బంగారు జీవితాలు ఒకటా రెండా? ఎన్నని తలుచుకోము? అన్నీ వీరోచితాలే! కుటుంబాన్ని వదిలి, ఎందరికో ఆసరా ఇస్తున్న మీకు ఏమిస్తే మా రుణం తీరుతుంది? ఏ నిముషం ఏమవుతుందో అనే భయంతో సరిహద్దుల్లో సైన్యం నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం తప్ప మీ కోసం మేమేమి చేయగలుగుతున్నాం? ఒక్కొక్కరు విగత జీవులై ఇంటికి చేరుతుంటే ఆ ఇల్లాలు, పిల్లల ఆవేదన ఎంతలా ఉంటుందో ఎవరు వర్ణించగలరు? దేశం కోసం ప్రాణాలర్పించారని జాతీయ జెండాని మీపై కప్పి పంపుతున్నారని మురిసిపోవాలా? లేక కంటి ముందు తమ జీవితాల్నే కోల్పోయామని పడుతున్న ఆవేదనలకు ఎలా స్పందించాలో తెలియటం లేదు. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్రలేక మీరు చూపుతున్న సాహసానికి అభినందించడం తప్ప మీకేం ఇవ్వగలము? మనిషి జన్మించేది జీవించి చనిపోవడానికి కాదు. చనిపోయినా జీవించడానికి అని నిత్యం మాకు తెలియజేసే మీకు జోహార్లు.
సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనల్ని చదువుతుంటే ఇక్కడ అందరి గుండెలు విపరీతంగా దిగులు పడతాయి. కానీ ఏమీ చేయలేము. సామాన్య ప్రజలం కదా? వీలయితే రోడ్లపై ఆత్మశాంతి జరగాలని కొవ్వొత్తి పట్టుకుని కాస్త దూరం నడుస్తాం. ఆ నడిచే ఫొటోలను మరురోజు పేపర్లో వచ్చేలాగా చూసుకుంటాం. సైనికుడైనా, ప్రేమికుడైనా భయపడకూడదు అనే సినిమాలోని వాక్యాలను వాడుకుంటూ తృప్తి పడుతుంటాం. నాకయితే అలాంటి వాక్యాలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వీరోచితంగా పోరాడే సైనికుడితో చేతినిండా పనిలేక ఒక శరీరాన్ని ప్రేమించే ప్రేమికుడితో పోల్చడమా? అని. ఎపుడైనా మీకు అనిపించవచ్చు.. ఈ సైన్యంలో ఎందుకు చేరానో? నేను కూడా ఇంట్లో అందరిలా ఉండి వుంటే బావుండేది అనిపించవచ్చు. కానీ అలాంటి ఆలోచనల్ని నీ దరిదాపుల్లోకి రానీయకండి.. ఎందుకంటే మీకో లక్ష్యం ఉంది. గమ్యం ఉంది. ఒక రకంగా మాకంటే ప్రశాంతమైన వాతావరణం నీకుంది. అదెలాగ? మీకేమి? మీరు హాయిగా ఉన్నారుగా అని మీరంతా అనుకోవచ్చు. మేమెంత హాయిగా ఉన్నామో చెబుతాను విను.
నేస్తం! నీకు తెలుసా? అక్కడ జరుగుతున్న యుద్ధాలు దేశాన్ని కాపాడటానికి, ఇక్కడ యుద్ధాలు అదే దేశాన్ని కబ్జా చేయడానికి. మీరంతా దేశాన్ని కాపాడాలని అహర్నిశలూ పోరాడుతుంటే, ఇక్కడ కారణమే లేకుండా కొట్టుకుంటాము. కారణమే లేకుండా చంపుకుంటాం. చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటాం. ఏమీ తోచలేదని కూడా ఆత్మహత్య చేసుకుంటాం. తల్లిదండ్రులు చదువుకోమంటే చనిపోతాం. ర్యాంకు రాలేదని చనిపోతాం. ఎదుటి వారు ప్రేమించకపోతే చనిపోతాం. పెద్దలు పెళ్లికి అంగీకరించకుంటే చనిపోతాం. బతుకు అంటే చీమ, దోమకున్నంత విలువ కూడా ఇవ్వము. ఇంతేకాదు కులం కానివాడిని పెళ్లి చేసుకుందని ఒకడు కూతుర్ని చంపేస్తాడు. ఇక్కడ నీకో విషయం చెప్పాలి. ఇదివరకు ఆడపిల్లకు వయసొస్తే కాపాడాలి అనుకునేవారం. కానీ ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు కూడా చెరచి చంపేయడం జరుగుతోంది. బస్సులో అత్యాచారాలు, రైళ్లల్లో అత్యాచారాలు, బామ్మకు, అమ్మకు, అమ్మాయికి తేడా లేదు. ఎవరైతే ఆడదైతే చాలు వాడుకునే రాక్షసులున్నారు. ఆడపిల్లలకే గాదు మగపిల్లలకు కూడా రక్షణ లేదు. డబ్బు కోసం పిల్లల్ని అమ్మేస్తుంటారు. పనివాళ్లుగా వేరే దేశాలకు రవాణా చేస్తుంటారు. నాకనిపిస్తుంది. ఇలాంటి వారందరినీ సరిహద్దుల్లో సైనికుల్లా నిలబెడితే బతుకు అంటే ఏమిటో అర్థమవుతుంది కదాని. దేశం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉందో అని తెలుస్తుంది కదాని.
ఇన్ని జరగుతున్నప్పుడు కాపాడమని అధికారులను అడగొచ్చు కదా అనుకోవచ్చు. మీరే కాదు. ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ వ్యవస్థ డబ్బుకు లొంగిపోయింది. అధికారం పలుకుబడికి అమ్ముడుపోయింది. డబ్బులున్న వాళ్లను మోయడానికే ఇక్కడ ఏ అధికారాలైనా, ఏ పదవులైనా..
రాజకీయాల్లో ప్రజలకు సేవ మాట తప్పితే అన్నీ జరుగుతుంటాయి. తన పదవిని ఎలా నిలబెట్టుకోవాలా అనే క్రమంలో ఆ సదరు నాయకుడు ఆలోచిస్తాడు తప్ప ప్రజలెటుపోతే నాకెందుకు అనుకుంటారు. ఈ మధ్యే ఒక హోం పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రి మాట్లాడుతూ.. అరాచకం జరిగితే మేము వస్తాయి. కానీ ఎక్కడ అరాచకం జరుగుతుందో అని అందరి వెనకాల తిరగలేము కదా? అన్నారు. అంటే జరిగాక రావడానికి, చచ్చాక చూడటానికి వీరికి పదవులెందుకు అనిపించదా? చెప్పు? ఇంట్లో రక్షణ లేదు. బయట రక్షణ లేదు. అసలు ఏ నిమిషం ఎవరు మోసం చేస్తారో, ఏ నిముషం ఎవరు దాడి చేస్తారో అని నిత్యం భయపెడుతూ బతికేస్తున్నాం.
నేస్తం.. నిజం.. మాకంటే మీరే నయం. కంచెకు అవతల ఉన్న పాకిస్తాన్ వారు శతృవులైనా యుద్ధం సమయంలో తప్ప మిగిలిన సమయంలో స్నేహంగానే ఉంటారని విన్నాను. నవ్వుతూ మాట్లాడుకుంటారని విన్నాను. అంటే మీరు శతృత్వమంటే ఏమిటో, శతృవులెవరో తెలుసుకున్నారు. మాకు ఎవరు శతృవులో కూడా తెలియడం లేదు. కంటినిండా నిద్ర లేని ఉద్యోగాలు, పోనీ కడుపునిండా తినలేని కల్తీ ఆహారాలు, మనసు విప్పి మాట్లాడదామంటే కనిపించని స్వచ్ఛమైన హృదయాలు, అంతస్తులకు అమ్ముడుపోతున్న ఆత్మీయతలు, అనురాగాలు, బంధాలు ఇలా ఎన్నని చెప్పను? అంతా కల్లోలమే. సరిహద్దుల్లో కల్లోలం నిరంతరం ఉండదేమో కానీ ఇక్కడ నిరంతరం కల్లోలమే. అంతా అన్యాయమే. అంతటా ఆవేశమే.. మీరంతా కుటుంబానికి దూరమై ఆత్మీయుల్ని కోల్పోతున్నారు. మేము అందరి మధ్య ఉంటూనే మమ్మల్ని మేమే కోల్పోతున్నాము. కాకుంటే ఒకటే బాధ ఒకప్పుడు యుద్ధాలన్నీ స్వతంత్రం, స్వేచ్ఛ కోసం జరిగేవి. ఇప్పుడు యుద్ధాలన్నీ ఆర్థికం మరియు వాణిజ్యపరమైనవే కావడం ఒకింత బాధిస్తోంది. అయినా పోరాటం తప్పదు కదా? ఏదయినా దేశం కోసమే కదా..?
మరణం అనేది జననం మొదటి రోజు నుండి లెక్క వేస్తుంది. అంటే మరణం మనతోనే జీవిస్తుందన్న మాట. అది మీకైనా మాకైనా.. కాకుంటే మీలాంటి వీరులు మరణిస్తే దేశం దిగులు పడుతుంది. మాబోటి వారు మరణిస్తే సొంత వారు కూడా బాధపడరు. మీకూ మాకూ అంత తేడా వుంది. నాకూ మీతోపాటు ఉండి పోరాడాలని ఉంది. ఈ జన్మకు కుదరని పనిలే.. వచ్చే జన్మంటూ వుంటే దేశం కోసమే పుడతాను.. సరే.. ఇప్పటికే చాలా రాసాననుకుంటా. అక్కడ మీరెలాంటి స్థితిలో ఉన్నారో తెలియదు. ఏదో ఆవేదన. మిమ్మల్ని ఏదో ఓదార్చాలనే తపన నాది. అంతే.. శుభరాత్రి..
కల్పన.
* * *
మెయిల్‌ను చదివి ఒక్కసారిగా కంచెకు జారపడిన విగ్నేష్‌ను పలకరిస్తూ..
‘హాయ్ విగ్నేష్’ భుజంపై స్నేహపూర్వకంగా చరుస్తూ పలకరించాడు అబ్దుల్ ఖాన్.
ఏదో లోకంలో ఉన్న విగ్నేష్ ఉలిక్కిపడి పక్కకు చూశాడు. ఎదురుగా కనిపించిన అబ్దుల్‌ని చూస్తూ. ‘హాయ్ హాయ్..’ అంటూ షేక్‌హ్యాండ్ ఇస్తూ అన్నాడు.
‘కిస్ దునియామే భాయ్..! కోరుూ ఈమెయిల్ హై క్యా?’ అడిగాడు నవ్వుతూ.
‘ఆ! అంతేగా... అయినా ఈ మెయిల్ నా ఒక్కడి కోసమే కాదు. అంటే ఇండియన్స్ కోసమే కాదు మీ కోసం కూడా. ఒక విధంగా చెప్పాలంటే మన కోసం... ఒక రకంగా కంచె అవతల నువ్వు, ఇవతల నేను ఎవరైతేనేం? ఈమెయిల్స్ అన్నీ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరో ధైర్యం చెబుతున్నట్లు అనిపిస్తుంది’ అన్నాడు చిరునవ్వుతో.. విగ్నేష్.
‘ఓ మెయిల్ కిస్‌కే పాస్‌మే సే భాయ్.. మరద్.. యా.. ఔరత్..?’ అడిగాడు కొంటెగా నవ్వుతూ అబ్దుల్ ఖాన్.
‘నాకయితే ఒక మానవత్వం ఉన్న మనిషి నుంచి అని మాత్రం అనిపిస్తోంది’ అన్నాడు చురక అంటిస్తూ.. విగ్నేష్
ఆ మాటలకు చిన్నబోయిన అబ్దుల్ ‘టీక్ హై భాయ్.. యూ.. హీ.. మజాక్ కియా.. అపన్ బీ ఇన్‌సాన్ హై.. నా’ అన్నాడు ముఖం మాడుస్తూ.
‘కచ్చితంగా మనుషులమే.. కనుకనే పోరాడుతున్నాం. కానీ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనసున్న ప్రతి ఒక్కరికీ ఆవేదన ఉంటుంది. ఆశ ఉంటుంది. కిందటి వారు నాకు పాపాయి గుర్తొచ్చి ఎంతో బెంగ కలిగింది. నేను బయలుదేరినప్పుడు సంధ్య కన్నీళ్లు, పిల్లల బేల ముఖాలు గుర్తుకొస్తుంటే చాలా కలతగా అనిపించింది. అది కచ్చితంగా గమనించినట్లుగా, ఆ రోజే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మా బెటాలియన్‌ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. మన బిఎస్‌ఎఫ్ లక్ష్యం ‘డ్యూటీ అన్‌టు డెత్’ అన్నారు. నిజంగా ఆ మాటలు నన్నింకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలా అనుకోకుండా మనకు వినిపించిన మాటలు, మనమెవరమో తెలియకున్నా మనల్ని ప్రోత్సహిస్తున్న ఇలాంటి మెయిల్స్‌కు నిజంగా హేట్సాఫ్..’ అన్నాడు విగ్నేష్.
‘నిజం భాయ్.. తేరీ బాతోంకో సునేతో తాజూబ్ లగ్ రహీఫై (నీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది) సిర్ఫ్ తూ.. హీ నై.. హర్ కిసీ ఆద్మీ యహా పహుంచేగా ఉన్ హేబీ వాకైమే ఐసీ మైసూస్ కర్తాహై (నీకు ఒక్కడికే అలా అనిపిస్తోంది అనుకోవద్దు. ఇక్కడకొచ్చిన ప్రతి ఒక్కరికీ అలానే అనిపిస్తుంది) యహా.. జోబీ ఫౌజ్ ఆతాహై ఉనే్హబీ లగేగాకీ వహ్ ఘర్ వాపస్ జాయేగా.. యా నహీ.. (వచ్చిన ప్రతిసారీ తిరిగి ఇంటికి వెళతామా లేదా అనిపిస్తూనే ఉంటుంది) అగర్ ఏ లడాయి నరుూతో ఆష్ హోతో హమే తోడాసా ఆరామ్ కర్ సక్తే హై (తిరిగి వెళ్లడానికి పోరాటమో, ఆరాటమో కాదు) మగర్ ఏ అస్లీమే జంగ్ హై (ఇది యుద్ధం) కిసీబీ తరహ్‌కీ డర్ అందర్ నహీ పౌంచ్‌నా (మనలోకి భయం లేకుండా చూసుకోవాలి) హమే ట్రయినింగ్ మే వహీ సిఖాయా గయా.. నా (మన ట్రైనింగ్‌లో ఇదే నేర్చుకున్నాము కదా?) మగర్ కిస్‌కో ఐసా లగాకీ తుమ్హే మెయిల్ బేచే.. ఓ.. జో.. కోరుూ బీ హో.. ఉనే్హ మేరీ సలామ్ (కానీ నీకెవరైతే మెయిల్ పంపించారో వారికి నా జోహార్లు) ముజేబీ బేచో యారో ఉసే (నాక్కూడా పంపించు భాయ్) తేరీ బాతోంమే సున్‌కర్ ముజే ఆరామ్ మిల్ రహీ హై (ఆ విషయాలు వింటుంటే ఎంతో ఊరటగా ఉంది) అన్నాడు ఆనందంగా అబ్దుల్ ఖాన్ వేడిగా చాయ్ విగ్నేష్‌కు అందిస్తూ.
అంతలో అల్లంత దూరంలో ఉన్న శేఖర్ కూడా దగ్గరకు వస్తూ.. విగ్నేష్ నువ్వు మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యావా? గుడ్.. గుడ్.. అయినా ఏంట్రా? మీలో మీరేనా మాట్లాడుకోవడం? నన్ను కూడా పిలవచ్చుగా..’ అన్నాడు చలోక్తిగా.
ఆ మాటలకు నవ్వుతూ ‘అరే భయ్యా! ఆవోనా? మేము మీకు వద్దు అన్నామా? చాయ్ లేలో భాయ్..’ అంటూ ఫ్లాస్క్‌లో ఉన్న టీని మరో కప్పులో పోస్తూ శేఖర్‌కి అందించాడు అబ్దుల్ ఖాన్.
‘ఎంతయినా మీ టీ చాలా బాగా ఉంటుంది భాయ్’ అన్నాడు నవ్వుతూ శేఖర్.
‘మీది కాఫీ కూడా బహుత్ ఆచ్ఛాహై భాయ్’ అంటూ ఆ నవ్వుతో శృతి కలిపాడు అబ్దుల్.
* * *
‘విగ్నేష్.. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? అయినా అదేంటిరా? జర్కిన్ వేసుకోకుండా కూర్చున్నావు మైనస్ డిగ్రీల చలిలో.. ఏదయినా దీర్ఘంగా ఆలోచిస్తున్నావా? ఇంటి దగ్గర విషయాలేంటి?’ అన్నాడు శేఖర్ పక్కనే కూర్చుంటూ.
‘అందరూ బాగానే ఉన్నారురా! బాబుకు ఏడేళ్లు.. పాపాయికి ఐదేళ్లు వచ్చాయి. సంధ్యకే ఒంట్లో బావుండటం లేదంటోంది. వచ్చేటప్పుడు పాపాయి ఒకటే ఏడుపు.. దాన్ని కనుమరుగు చేసి వచ్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చిందనుకో.. సరే.. అవెప్పుడూ ఉండేవేలే. మరో ముఖ్య విషయం ఈసారి గురు సేవక్ సింగ్ ఇంటికి వెళ్లానురా! అక్కడ వారి తల్లిదండ్రుల బాధను చూస్తుంటే హృదయం ఎన్నో టన్నుల బరువెక్కినట్లుగా అనిపించింది. అపుడే మన మధ్యనే ఉన్న సింగ్ చనిపోయి రెండేళ్లయిందంటే నమ్మలేకున్నాను’ అన్నాడు బాధగా విగ్నేష్.
‘2016 జనవరి 2 కదా?’
‘అవును.. జనవరి 1వ తేదీన రాత్రి వారి తల్లిదండ్రులతో మాట్లాడాడట. ఉదయం అయ్యేసరికి ఈ మరణవార్త వినిపించిందట’ ఎంత బాధాకరం..?’ వారిలో ఎంత బాధ వున్నా వారంటున్న మాటలు వింటుంటే నిజంగా గర్వంగా అనిపించిందిరా? ప్రతి ఇంట్లో చనిపోవడం మామూలే. కానీ నా కొడుకు మాతృభూమి కోసం మరణించాడు’ అనడం, తన మనవరాలు రేపు పెద్దయితే ఆర్మీలో చేరుతానంటే తప్పకుండా పంపుతామని స్థిరంగా మాట్లాడటం నిజంగా గర్వించ దగినది. ఆ తర్వాత తన కోడలు సుధాసింగ్, కుమారుడు ఆర్మీలో పని చేయడం జరిగింది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ‘ఉగ్రవాదులు ఎంతమందిని చంపుతున్నాము అనేదే చూశారు తప్ప, ఎవరిని చంపుతున్నాము అనే విషయాన్ని పట్టించుకోలేదు’ అనడం వింటుంటే కళ్లలో నీళ్లు వస్తాయి..’ అన్నాడు విగ్నేష్ ఆవేదనగా...
‘నాకు అందుకేరా కోపం. నువ్వు ఆ అబ్దుల్‌ఖాన్‌తో మాట్లాడుతుంటే, గుండెల్లో ప్రతీకారం నింపుకుని భాయ్ అని ఎలా మాట్లాడుతాడో చూడు’ అన్నాడు కోపంగా శేఖర్.
‘పాపం! అంత మాట అనకు శేఖర్. అతను కూడా మనలాంటి సైనికుడే. తీవ్రవాది కాడు. ఒక్క అబ్దులే కాదు, అషఫ్,్ర షరీఫ్, ఆ వెనకాల ఉన్న అఫ్సర్, మహమద్‌ఖాన్ వీరంతా కూడా మనలాంటి వారే. అయినా మన మధ్య ప్రత్యేకంగా కక్షలెందుకుంటాయి? ఈ యుద్ధాలన్నీ ఆ మెయిల్‌లో చెప్పినట్లు ఆర్థికపరమైనవి, రాజకీయ పరమైనవే తప్ప వ్యక్తిగతమైనవి కావు. ఆ దేశానికి వారు, ఈ దేశానికి మనం కాపలా దారులం అంతే.. సమయం వికటిస్తే శత్రువులం. వికసిస్తే స్నేహితులం’ అని నవ్వుతూ అంటూనే అబ్దుల్ సైగ అర్థమయిన వాడిలా చేతిలో ఉన్న సూప్‌ని, చేతిలోని స్నాక్స్‌ని తీసుకెళ్లి అందించాడు విగ్నేష్.
‘నువ్వెన్నయినా చెప్పురా! పుల్వామా దాడిని తలుచుకుంటే పాకిస్తాన్‌పై మరింత పగ ప్రతీకారం ప్రజ్వరిల్లుతుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఒకరా ఇద్దరా నలభై మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది అమరవీరులయ్యారు. పుల్వామా జిల్లాలో జైష్ ఆత్మాహుతి దాడిలో ఎంతమంది గాయపడ్డారో తలుచుకుంటుంటే బాధగా ఉంది. సర్జికల్ స్ట్రైక్ జరిగేటప్పుడు అభినందన్ పట్టుబడ్డాక తాను మానసికంగా ఎంత కంగారు పడ్డాడో ఏమో కదా? ఇటీవల కలిసినప్పుడు అతను మాట్లాడుతున్నపుడు నాకు అర్థమయ్యింది. తాను ఇక తిరిగి వస్తానని అనుకోలేదట. అదీగాక ప్లాన్స్, మ్యాప్స్ అనీ ఎలా మింగగలిగాడో చెబుతుంటే హాట్సాఫ్ అనాలనిపిస్తుంది. నిజంగా అభినందనీయుడే అనిపిస్తుంది కదారా! అయినా పాకిస్తాన్ వారికి ఏమి కావాలిరా? శతృత్వాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశానికి అసలు కావలసినది ఏమిటో? అర్థం కావడంలేదు. పోనీలే కాశ్మీర్ అనుకున్నా, పొంచి వున్న చైనా సంగతేంటి? మన ఈశాన్య రాష్టమ్రైన అరుణాచల్ ప్రదేశ్ సంగతేంటి? ఈ విషయం అక్కడితో ఆగదు. ఇది కాక మనుషుల అత్యాశలే ఇంతమందికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇంత రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. అత్యాశతో వారు సృష్టిస్తున్న వినాశమే మనకు అశాంతిని మిగుల్చుతోంది. వారికి అర్థం కావడం లేదేమో వారికి కూడా అశాంతినే మిగుల్చుతోంది’ అన్నాడు ఆవేదనగా శేఖర్.
‘అవును.. నిజమే! అప్పుడే కార్గిల్ వార్ జరిగి ఇరవై ఏళ్లయింది. ఇంకా జరిగిన మారణహోమం కళ్ల ముందు కదులుతున్నట్లే ఉంది. దుర్భరమైన, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన సేనలు వాయుసేన సహకారంతో విజయం సాధించడమంటే మాటలు కావు. చాలామంది అసాధ్యమని భావించిన ఎతె్తైన ప్రదేశాలను మన దేశం తిరిగి సాధించగలిగింది. ఒకవైపు అగ్నికణాల వలె కాల్పులు జరుగుతున్నా, మరోవైపు కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నా ఏ మాత్రం వెరవక వీరోచితంగా పోరాడిన మన సైనికులు, జవాన్లు నిజమైన హీరోలు కాక మరేమిటి? ప్రతి ఏటా జులై 26న ‘విజయ్ దివస్’గా జరుపుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఒకరా ఇద్దరా ఏకంగా 527 మంది సైనికుల ఆత్మత్యాగం ఫలితమీ విజయం. అప్పుడే మనం ఇక్కడ కొత్తగా ఇక్కడ అపాయింట్ అయ్యామనుకుంటా. అంతా భయభయంగా ఉండేది కదా’ అన్నాడు విగ్నేష్ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ నవ్వుతూ.
‘అవునవును. నాకూ గుర్తుంది. కానీ ఎప్పటికప్పుడు మన దేశం బుద్ధి చెబుతున్నా పాకిస్తాన్‌కు మాత్రం బుద్ధి రావటం లేదు. రాదు కూడా. యుద్ధంలో గెలవడం ఇక చేతకాక దొంగచాటుగా తీవ్రవాదుల్ని రెచ్చగొడుతోంది. కానీ ఆ కవ్వింపు చర్యలే రేపు వారి వినాశనానికి నాంది పలుకుతుంది అని తెలుసుకోవాలి’ అన్నాడు శేఖర్ ఆవేశంగా.
‘నువ్వా మాట అంటే నాకొకటి గుర్తుకు వస్తోంది. మా అబ్బాయి కిందటి సారి నేను ఇంటికి వెళ్లినప్పుడు ఒక డౌట్‌ను నా ముందు ఉంచాడు. అదేమిటంటే ‘నాన్నా! యుద్ధంలో చనిపోయినా, తీవ్రవాదుల దాడిలో చనిపోయినా వీరులే అవుతారా? అంటే తీవ్రవాదులతో యుద్ధం చేయరు కదా..?
ఆ డౌట్‌కి ఫక్కున నవ్వాడు శేఖర్.. బావుందిరా వాడి సందేహం. ఇంతకీ నువ్వేమన్నావు?
‘ఏమంటాను? సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించడం, ప్రాణాలు తీయడం రెండూ యుద్ధాలే అవుతాయి. ఒక రకంగా మనకు కనిపించే శత్రువుల కంటే కనిపించని శత్రువులే ఎక్కువ వుంటారు. ద్వేషాన్ని, అసూయని సర్వ సాధారణంగా ఎవరూ బయటపెట్టలేరు కదా..! కానీ సమయం చూసి దెబ్బ తీస్తారు. వారే తీవ్రవాదులు. ఒక వ్యక్తి నుదుటిపై వాడెలాంటి వాడో రాసి వుండదు కనుక వాడు ఆయుధాన్ని మనకు గురిపెట్టాడని మనం అంచనా వేయలేం. అయినా మన యుద్ధం దేశం కోసమే అయినప్పుడు అక్కడ ఎలా ప్రాణాలు కోల్పోయినా వీరులమే అవుతాము. రోజూ జరిగే క్రాస్ ఫైరింగ్‌లో మరణించినా వారు వీరులే అవుతారు. యుద్ధం అనేది అరిచి గెలిచేదో లేక గన్స్‌తో పేల్చి చంపేదో కాదు. పోరాడి గెలిచేది. ఒక రకంగా సామరస్యతను కోరుకునేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటి వారి కోసం చేసేదే పోరాటం, అత్యాశతో అంతా ఆక్రమించాలని చేసేది కేవలం ఆరాటం మాత్రమే’ అన్నాను. అవి ఎప్పటికీ సక్సెస్ కావు అన్నాను’ అన్నాడు నవ్వుతూ విగ్నేష్.
‘గుడ్.. బాగా చెప్పావురా! అంటే మన మధ్యకు మరో వీరుడు రాబోతున్నాడన్న మాట’ అన్నాడు శేఖర్ నవ్వుతూ.
‘అందుకు అదృష్టముండాలిరా. ఈ తరం కాలం పిల్లలు, వారి ఆలోచనలు సరికావేమో.. మన జనరేషన్‌లోనే చాలామంది సంపాదన వేటలో పడి విదేశాలలో ఉన్నారు. అంతా మనీ ప్రింటింగ్ మెషీన్స్‌లా తయారయ్యారు. ముఖ్యంగా గుండెలో తడి కరువైంది. పక్క వ్యక్తిని గురించి ఆలోచించడం పోయింది. నేను, నా ఇల్లు, నా సంపాదన తప్ప వేరే ప్రపంచమే వారిలో కనిపించడం లేదు. అవసరానికి తప్ప ఎదుటి మనిషితో మాట్లాడటంలేదు. కాస్తంత చదువు అబ్బితే చాలు దేశం వదిలి పోవాలనే అందరి ఆరాటం. ఇక రాబోయే తరం.. సంగతి ఆలోచించాలా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. తలుచుకుంటే బాధేస్తుంది. మన తరం పోతే ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడతారని..?’ ఆవేదనతో అన్నాడు విగ్నేష్.
అది విన్న శేఖర్‌కి నిజమే అనిపించినా ‘విగ్నేష్.. అలా అనుకోకు. భూమి గుండ్రంగా ఉందని సంగతి మరచిపోకు. ప్రపంచాన్ని ఎంత తిరిగినా మాతృభూమిని మించిన దేవాలయం లేదని తెలిసే రోజు వస్తుంది. బిడ్డను మనం ఎలా పెంచితే అలా పెరుగుతాడు. ఏ వాతావరణంలో పెంచితే ఆ వాతావరణానికే అలవాటు పడతాడు. ఉదాహరణకు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఘోరా’ నవల చదువు. సద్బ్రాహ్మణుని విదేశాలలో, విదేశీయుడిని సద్బ్రాహ్మణుడి ఇంటిలో పెంచితే ఏమయింది? విదేశీయుడు వేద మంత్రాలను పఠించి పండితుడయ్యాడు. అదే ఆ బ్రాహ్మణుడు అక్కడి సంప్రదాయాలకు అలవాటు పడ్డాడు. అది నవలలో ఎంతో వాస్తవముంది. ఈ ప్రపంచంలో ఇంటిని మించిన అందమైన ప్రదేశం లేదు. అమ్మని మించిన అనురాగం లేదు. ఉన్న ఊరిని, సొంత ఇంటిని కాదని ఎంత దూరం వెళ్లినా డబ్బు చేరుతుందేమో కానీ మనశ్శాంతి మాత్రం కాదు అని తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. థింక్ పాజిటివ్ డ్యూడ్’ అంటూ చలి కాచుకుంటూ భుజం తట్టి ధైర్యం చెప్పాడు.. శేఖర్.. ఆశ్చర్యం! అంత మాట్లాడుకుంటున్నా, ఇంత నవ్వుకుంటున్నా చేతుల్లో ఆయుధాలున్నాయి. ఏ నిముషంలో సరిహద్దు అవతల నుంచి ఎప్పుడు బులెట్ తన గుండెను తాకుతుందో అనే భీతి కళ్లల్లో మెదులుతూనే ఉంది.
* * *
ఉన్నట్లుండి అక్కడి వాతావరణం మారిపోయింది. కారణం లేకుండా సరిహద్దు అవతల నుండి ఎమ్ 16 రైఫిల్ శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే వీరు కూడా ఎకె 47 రైఫిళ్లతో సిద్ధమయ్యారు. సరిహద్దులో ఉన్న సైనికులు సరిహద్దు కవతల ఉన్న సైనికులు అలర్ట్ అయ్యారు. క్రాస్ ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది. కలిసి టీ తాగిన వారు, కలిసి మాట్లాడుకున్న వారు శత్రువులయ్యారు. కొందరినైనా చంపాలనే ఆరాటంతో బుల్లెట్స్ సరిహద్దులు దాటుతున్నాయి. వీరిలో ఎవరుంటారో? ఎందరుంటారో కానీ సైనికుడు ఎపుడూ సైనికుడే అనిపించేలా పోరాటం దాదాపు ఒక గంటసేపు కొనసాగింది. వాతావరణం సద్దుమణిగింది. బుల్లెట్ల శబ్దం వినిపించడం లేదు. సహ సైనికులు ఆకాశ్, ధనరాజ్ అసువులు కోల్పోయారని సమాచారం అందింది. సరిహద్దు కవతల కూడా ఇద్దరో ముగ్గురో మరణించినట్లు సమాచారం వస్తోంది. పొదల మాటున దాగున్న విగ్నేష్ కళ్లు అబ్దుల్ కోసం, అబ్దుల్ కళ్లు విగ్నేష్ కోసం వెతుకుతున్నాయి. కాస్సేపటికి చీకట్లో లీలగా అబ్దుల్.. అబ్దుల్‌కి విగ్నేష్ కనిపించారు. ఇరువురి కళ్లు ఆనందంతో మెరిసాయి. అబ్దుల్ చేయి ఊపాడు. విగ్నేష్ నవ్వుతూ ప్రతిగా చేయి ఊపుతూ అక్కడే ఉన్న చెట్టుకు అనుకుని కూర్చుండిపోయాడు ఆనందంగా.
* * *
ఇటీవల కాలంలో ఆర్మీలో చేరడానికి వస్తున్న వారిలో ఆత్మస్థైర్యం తగ్గుతోందని గమనించిన డైరెక్టర్ జనరల్ సరిహద్దుల్లో ఆ ఇద్దర్నీ చూసి చిరునవ్వుతో సైన్యం కోసం మరో మెయిల్ తయారుచేయాలని వెనుదిరిగాడు.

శైలజామిత్ర 92909 00879