కథ

అత్తగారు - ఆనందమఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉస్మానియా యూనివర్సిటీలో బి.టెక్ చేసిన తరువాత, ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనబడే బెంగుళూర్ వచ్చి, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి, రెండు ప్రమోషన్లు సంపాదించి, గ్రూప్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. జీవితంలోనూ రెండు ప్రమోషన్లు సంపాదించాను. బ్రహ్మచారి అనే స్టేజీలోంచి, వివాహితుడనై, ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయ్యాను.
మామగారు విజయవాడలో వున్నారు. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఆఫీసర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన జీతంలోనూ, లంచంలోనూ సంపాదించిన డబ్బుతో విజయవాడలో రెండు పెద్ద ఇళ్లు కట్టాడు. వాళ్ల ఒకే కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. కాలచక్రం ఎప్పుడూ సాఫీగా సాగదు కదా! మా మామగారు చనిపోయిన తరువాత, అత్తగార్ని మాతో వచ్చి ఉండమన్నాను. ఆమెకు మేం తప్ప ఎవ్వరూ బంధువులు లేనందువలన, మాతో వచ్చి, బెంగుళూర్‌లో వున్నది. ఇప్పటిదాకా అన్నీ సాఫీగానే జరిగాయి. కానీ, ఆ తరువాతే వచ్చాయి కొన్ని సమస్యలు. మా అత్తగారికి దైవ భక్తి ఎక్కువ. అంతకంటే కూడా ఆమెకు సాధువుల్ని, సన్యాసుల్ని దర్శనం చెయ్యడం చాలా ఇష్టం. నాకు వారంలో ఐదు రోజులు ఆఫీసు పని ఎక్కువగా ఉంటుంది. శని, ఆదివారాలు మట్టుకే నాకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. అయితే, ఆ రెండు రోజులు అత్తగారితో నేను ఏవైనా మఠాలకు వెళ్లడం, సాధువుల్ని, సన్యాసుల్ని దర్శనం చెయ్యడం, పూజల్లో కలుసుకోవడం, నాకు మా అత్తగారు, నా భార్య ఇచ్చిన పని. బెంగుళూరులో మఠాలకు కొరత లేదు. శంకరమఠం, ఉత్తరాది మఠం, పెజావర్ మఠం అని చాలా మఠాలు ఉన్నాయి. నాకు, మా అత్తగారిని పిల్చుకొని వెళ్లడం, ఆ మఠాల్లో రోజంతా గడపడం, నా భార్య పురమాయించిన పని. ‘ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. వాళ్లని గట్టెక్కించడానికి, వాళ్లకి మంచి చదువులు చదివించి, మంచి తాహతు గల అబ్బాయిల్ని చూసి వివాహం చెయ్యడానికి, మన జీతం మట్టుకు సరిపోదు. మా అమ్మగారి సహాయం కావల్సి ఉంటుంది. కనుక, ఆమెను అనసరించుకొని పోవడం మనకు మంచిది’ అని నా భార్య నాకు సలహా ఇచ్చింది.
ఆ సలహా ప్రకారం, నేనూ మా అత్తగారికి సహాయంగా మఠాలు, ఆశ్రమాలకు వెళ్తున్నాను. మా ఫ్లాట్ ప్రక్కనే, ఇంకో ఫ్లాట్‌లో నా కొలీగ్ ఉన్నాడు. అతని అత్తగారు కూడా వాళ్లతోనే ఉంటున్నది. అయితే, అతని అదృష్టం నాకు లభించలేదు. అతని అత్తగారికి, వాళ్ల ఫ్లాట్‌లో ఒక సెపరేట్ రూమ్ ఇచ్చారు. ఆమె ఎప్పుడూ ఆ రూములో కూర్చొని, టీవీ చూస్తూ ఉంటుంది. టీవీలో వచ్చే నాటకాలు, సినిమాలు, సంగీత ప్రోగ్రామ్‌లు చూస్తూ ఆమె కాలాన్ని గడుపుతుంది. కానీ, నా అత్తగారు ఆ విధంగా లేకుండా ఎల్లప్పుడూ, గుళ్లు, మఠాలు అంటూ తిరగడానికి ఇష్టపడుతుంది. ఇది నా దురదృష్టం. శనివారాలు, ఆదివారాలు నా కొలీగ్, తన భార్య, పిల్లలతో మాల్స్, వాటిల్లో వుండే సినిమాలు, రకరకాల ఫుడ్‌స్టాల్స్ అన్నీ విజిట్ చేస్తూ ఉంటే, నేను మా అత్తగారికి గుళ్లు, మఠాలు అన్నీ దర్శించుకొంటాను. ఈ శిక్షలోంచి, నాకు ఎప్పుడు విముక్తి అని ఆ దేవుళ్లనే ప్రార్థిస్తుంటాను.
నా ప్రార్థనలు ఫలించాయి!
భగవంతుడు నాపై కరుణ చూపించాడు!
బెంగుళూర్‌లో, బనశంకరి ఏరియాలో ఒక కొత్త బిల్డింగ్ వెలిసింది. దాంట్లో ఆనందమఠం బ్రాంచి ఓపెన్ చేశారు. ఆంధ్రదేశంలో, ముఖ్యమైన నగరాల్లో ఈ మఠం వున్నదని, ఇప్పుడు బెంగుళూర్‌లో కూడా ఈ మఠం బ్రాంచి ప్రారంభిస్తున్నారని వినబడ్డాయి. నాకన్నా ముందుగా, మా అత్తగారి చెవిలో ఈ సంగతి పడింది. మఠం ప్రారంభించిన మొదటి వారంలో, శని, ఆదివారాలు ఆ మఠాధిపతి, ఆంధ్రదేశం నించి, బెంగుళూర్ వస్తున్నారని, పూజలు పునస్కారాలు, లెక్చర్లు, హోమాలు అన్నీ ఉంటాయని న్యూస్ బాగా ప్రాబల్యమయింది. శనివారం ఉదయం నేనూ, మా అత్తగారు ఆనందమఠం వెళ్లాం. స్వామీజీని దర్శించడానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు. పెద్ద హాలు నిండిపోయింది. నేనూ, మా అత్తగారు అతి పెద్ద హాలులో, స్టేజీకి దగ్గరగానే కూర్చున్నాము.
సుమారు పనె్నండు గంటలకు స్వామీజీ స్టేజీ మీదకు వచ్చారు. ఆయన వెనక ఆయన ముఖ్య శిష్యులు నాలుగైదుగురు వచ్చారు. ఆయనని చూడగానే జనాలందరూ హర్షధ్వానాలు చేశారు. అందర్నీ కూర్చోమని స్వామీజీ సైగ చేశారు.
ఒక పది నిమిషాల్లో అందరూ స్థిరపడ్డారు.
అప్పుడే నేనూ మా అత్తగారు స్వామీజీని నిదానంగా చూశాం. మా ఇద్దరికీ ‘షాక్’ కొట్టినట్లు అయిపోయింది. నేను, మా అత్తగారి వైపు చూశాను. ఆమె నావైపు చూసింది. కారణం...
కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో మా అత్తగారి చెల్లెలు ఇంటిలో జరిగిన విషయాలు మా ఇద్దరి మనస్సులోనూ మెదిలాయి. ఆ రోజుల్లో మా అత్తగారి చెల్లెలు ఇంటికి ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ మా అత్తగారి చెల్లెలు ఇంట్లో ఒక నెల రోజులు వున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆ స్వామీజీ ఆధ్యాత్మిక విషయాలను గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో పూజలు, హోమాలు చేసేవారు. మా అత్తగారు, మామగారు వెళ్లి ఆ పూజల్లోనూ, సాయంత్రం పూట జరిగే చర్చల్లోనూ పాల్గొనేవారు. ఒక నెల రోజుల తరువాత, సడన్‌గా ఆ స్వామీజీ మాయమై పోయారు. ఎక్కడికి వెళ్లారు అన్నదీ తెలియలేదు. స్వామీజీతోపాటు, మా అత్తగారి చెల్లెలు కూతురు కూడా మాయమై పోయింది. ఎక్కడికి వెళ్లారు అన్న వివరం తెలియలేదు. మా చిన్న మామగారు ఎన్నో ప్రయత్నాలు చేసి, ఏమీ సాధించలేక పోయారు. కొన్ని రోజుల్లో కూతురు చేసిన కార్యం గురించి తలుస్తూనే, విచారంలో ఇద్దరూ చనిపోయారు. ఇపుడు, ఇన్ని రోజుల తరువాత, నేను, మా అత్తగారు బెంగుళూరులో చూస్తున్నది ఆ స్వామీజీనే. మా అత్తగారు కోపంతో అట్టుడికిపోయారు.
‘కొంచెం శాంతంగా ఉండమ’ని చెప్పాను. లెక్చర్ అయిన తరువాత, మధ్యాహ్నం రెండు గంటలకు స్వామీజీ లోపలికి వెళ్లిపోయారు. ఆ తరువాత అక్కడ అన్నదానం జరిగింది. అందరూ భోజనాలు చేశారు. భోజనాలు అయినాక అందరూ బయలుదేరారు. మళ్లీ ఆదివారం ఉదయం కూడా లెక్చర్ ఉన్నదని, అందరూ రావలసిందని, మైకులో చెప్పారు. జనం పల్చబడగానే నేనూ, మా అత్తగారు వెళ్లి ఆ స్వామీజీతో వచ్చిన శిష్యుల్ని కలిశాము. స్వామీజీని వేరుగా దర్శించాలని అడిగాం. మఠానికి లక్ష రూపాయలు డొనేట్ చేద్దామనుకొంటున్నట్టు చెప్పాం. సాయంత్రం వరకూ వేచి ఉండమని, సాయంత్రం ఐదు గంటలకు స్వామీజీని నేరుగా దర్శనం చెయ్యవచ్చునని పర్మిషన్ ఇచ్చారు. నేనూ, మా అత్తగారూ ఆ హాలులోనే ఒకవైపు కూర్చుని, సాయంత్రం వరకూ వెయిట్ చేశాం. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మమ్మల్ని లోపలికి రమ్మని స్వామీజీని నేరుగా దర్శనం చెయ్యమని చెప్పారు. నేనూ, మా అత్తగారు లోపలికి దూరాము.
మమ్మల్ని చూడగానే స్వామీజీ ‘షాక్’ కొట్టినట్లు అయిపోయారు. ఐనా, మేము ఏ విషయమూ బయట చూపించకుండా, నమస్కరించాం. అత్తగారు లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వాలన్న ఆమె ఆశని వెలిబుచ్చారు. స్వామీజీ ఏమీ చెప్పలేదు. డొనేషన్ అంగీకరిస్తున్నట్లు తెలియపరిచారు. ఆ మరునాటి ఉదయం, చెక్‌తో వస్తామని, చెక్ ఎవరి పేరుతో ఉండాలని అన్న వివరాలు తెల్సుకున్నాము.
ఆ తరువాత, స్వామీజీ చేతులారా ఇచ్చిన ప్రసాదం తీసుకొని, ఇంటికి తిరిగి వచ్చాము.
జరిగిన సంగతులన్నీ నా భార్యకు చెప్పాము. మరునాడు, ఆదివారం ఉదయం, నేనూ నా భార్య, మా అత్తగారు ఆనందమఠం వచ్చాము. అక్కడ ఒకటే గందరగోళంగా ఉన్నది. ఏమిటి? అని విచారించాము. అక్కడ స్వామీజీ లేరు. తన ప్రోగ్రాం మార్చుకొని, స్వామీజీ ఉదయం ఫ్లైట్‌లో ముంబై వెళ్లిపోయారని, ప్రస్తుతానికి బెంగుళూర్ విజిట్ ఇప్పట్లో లేదని చెప్పారు.
అక్కడికి వచ్చిన జనాలు, అందరూ ఏవో మాట్లాడుతూ, ఏమీ అర్థంకాక నిలుచున్నారు. అసలు సంగతి తెలిసిన నేనూ, నా భార్య, మా అత్తగారు, అక్కడ్నించి ఇంటికి తిరిగి వచ్చాము. రోజులు గడిచాయి.
మా అత్తగారు బాగా మారిపోయారు. గుళ్లు గోపురాలు, మఠాలు దర్శించడం మానేశారు. మా ఫ్లాట్‌లో ఒక రూము తనకు తీసుకొని, దానిలో టీవీ పెట్టించుకొని, నా ఫ్రెండ్ అత్తగారిలాగే, ఇరవై నాలుగ్గంటలూ, టీవీ చూడడం, పేపర్లు చదవడం, పుస్తకాలు చదవడం చేస్తున్నారు. బెంగుళూర్ నగరానికి ఆనందమఠ స్వామీజీ వచ్చిన శుభవేళ, నా జీవితంలో ఆనందం పెల్లుబికింది.
శని, ఆదివారాలు నేనూ, నా భార్య, నా ఇద్దరు ఆడపిల్లలతో మాల్స్‌కి వెళ్లడం, షాపింగ్ చెయ్యడం, సినిమాలు చూడటం చేస్తున్నాను.
స్వామీజీని మళ్లీ చూడాలనీ, ఆయనకు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలని, నేను ప్రయత్నాలు చేశాను. కానీ, నా ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. స్వామీజీ దర్శనం మళ్లీ దొరకలేదు.

=======================================================

కథలకు ఆహ్వానం ‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-చండూరు కృష్ణకుమార్ 99725 87079