కథ

సీతమ్మ తాతగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుషార నిశ్వాసల్లో మన్యం మత్తుగా నిదురపోతుంది. శిశిరభానుని మన్యప్రవేశాన్ని నీరదాలు నిరాకరిస్తున్నాయి. నిరీక్షణా తాపంతో రగిలిన ఆ చలిదీపం తన మయూఖాస్త్రాలతో మబ్బుల్ని మంచుని చీల్చి మన్యాన్ని వెలిగించింది. మన్యం మత్తు వదిలింది. అస్తాల తాకిడకికి మత్తు వదిలిన కొన్ని జీవులు కూసాయి, కొన్ని లేచాయి. అలా లేచిన ఒక జీవి మారేడుమిల్లి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చేతిలోకర్ర, కర్రకి వేళ్ళాడగట్టిన వాటర్‌బాటిల్, తలకి మఫ్లర్ శరీరానికి స్వెట్టర్ తగిలించుకున్న ఓ పద్ధెనిమిదేళ్ళ కుర్రాడు అడవిలోని చిన్న గుట్టమీదకెళ్తున్నాడు. అతను రోజూ తిరిగే ప్రదేశమే. తెలిసిన అడవే. కాని ఆ కుర్రాడికి అప్పుడు తెలియదు మరో రెండు నిముషాల్లో తను ఎప్పుడూ చూడని దృశ్యం ఒకటి అడవిలో చూడబోతున్నాడని. అదే.. మనిషి
ప్రకృతి పచ్చని పైటమీద చిమ్మిన ఈ రుధిర వర్ణకథ.
సీతమ్మ, సీతమ్మ తాగారిని చూడ్డానికి రంపచోడవరం ఊరంతా కదిలొచ్చింది. మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణం మనుషులతో నిండిపోయింది. వచ్చిన జనాన్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. తమని లోపలికి పంపాలని ఎంత బ్రతిమిలాడినా, ముందు నిలబడిన ఓ పదిమందిని మాత్రమే లోపలకి పంపి మిగిలిన జనాన్ని ఆరోగ్య కేంద్రం బయటే నిలబెట్టేశారు పోలీసులు. లోపలకెళ్ళిన జనానికి ఒక గదిలో సీతమ్మ, సీతమ్మ తాతగారు పక్కపక్కనే కనిపించారు. బయట వున్న జనం సీతమ్మని చూడ్డానికి వదలాలని పోలీసులని అర్థిస్తున్నారు. సీతమ్మని ఇంతగా ప్రేమిస్తున్న వీళ్ళు ఆమెని దాదాపు పదిహేనేళ్ళ క్రితం రంపచోడవరంలో మొట్టమొదటిసారి చూశారు.
మందార మొక్కలకి నీళ్ళు పోస్తూ కనిపించింది ఓ ముగ్ద మందారం. పువ్వులు అభినందించే నవ్వు తనది. పచ్చ పట్టులంగా వేసుకుని తోటంతా ఎగురుతూ హాయిగా తిరుగుతుంది ఆ రెక్కలు తొడగని ఐదేళ్ళ సీతాకోక చిలుక.. పేరు సీత. తను తడిచిన ప్రతిసారీ భూదేవి మట్టితో సీత పాదాలకి పారాణి పెడుతోంది. సీత వంగుని కాళ్ళకంటిన మట్టిని చెరుపుకుంటుంటే అది కాస్త చుట్టూ ఇంకా పాకుతుందేగాని పోవట్లేదు.
‘‘అమ్మ’’ అని ఎవరో పిలవడంతో వంగునే తల పైకెత్తి చూసింది సీత. ఎవరో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు కనపడ్డారు. సీత నిలబడి వాళ్లందరిని ఓసారి చూసి దగ్గరకెళ్ళింది. వచ్చిన వాళ్ళలో ఒకాయన ‘అమ్మా..’ అని వాక్యం పూర్తిచేసేలోపే ‘నా పేరు అమ్మ కాదండి సీత. సీత నా పేరు’ అంది నవ్వుతూ.
ఆ మాటకక్కడికొచ్చిన వాళ్లందరూ కూడా నవ్వారు నాటి చిన్నారి సీతని చూసి. ‘సరే సీతమ్మా, అయ్యగారింట్లో ఉన్నారా?’ గుంపులో ఒక ఆడమనిషి అడిగింది.
‘‘లేరు. ఇంట్లో మా తాతగారు నేనే ఉన్నాం’’. తనకి తెలిసిన నిజం చెప్పింది సీత.
వచ్చినవాళ్ళకి సీతకి వాకిట్లో మాటలు జరుగుతుండగానే పంచె కట్టుకుని, తెలుపురంగు చొక్కాతో ఇంట్లోనుండి గంభీరంగా నడుచుకుంటూ బయటికి వచ్చారో అరవయ్యేళ్ళ మనిషి. ఆరడుగుల ఎత్తు, ప్రశాంత వదనం. ఆ మనిషిని చూడగానే సీతకి ఎదురుగా నిలుచున్న జనమంతా నమస్కారం చేశారు. సీత వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన వాళ్ళకి తాతగారు నమస్కారం చేస్తూ కనిపించారు. పరిగెత్తుకుంటూ తాతగారి దగ్గరకెళ్లింది సీత. ఆయన కిందకి వంగి, సీతని ఎత్తుకుని జనందగ్గరికి కదిలారు.
‘‘అయ్యా దండాలయ్యా.. నా పేరు రాములు. ఇది నా పెళ్ళాం లచ్మి. మేము, ఈళ్ళంతా ఇక్కడే ఉంటామయ్యా’’ అని తనతో వచ్చిన వాళ్ళందరినీ చేత్తో చూపిస్తూ పరిచయం చేశాడు రాములు.
‘‘తమరీడకి కొత్తగా వచ్చారని తెలిసినాది. మేవీడకి తమర్నో సాయమడుగుతాకి వచ్చామయ్యా. సెప్పేదా అయ్యా?’’- జనం మాట్లాడుతుంది అర్థంకాక తాతగారి వంకే చూస్తుంది సీత. తాతగారు చెప్పమని తలూపిన తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు రాములు.
‘‘ఏంలేదయ్యా.. మీరు సదుపు సెప్పే అయ్యోరని తెలిసింది. మా పిలకాయలు బడికిపోక పొద్దుగూకుల సెట్టెమ్మక సేలెమ్మట పడి తిరుగుతున్నారు. ఆళ్లకి కూసంత అ ఆలు సెప్తారని అడుగుతాకొచ్చామయ్యా’’ రాములు వున్న విషయం నేరుగా చెప్పాడు.
‘‘బడికి ఎందుకు వెళ్ళట్లేదు పిల్లలు?’’ తాతగారి మాటలకి తల తిప్పింది సీత.
‘‘బడా? ఆడెవరున్నారయ్య సెప్పేదానికి? ఉండే ఒక్క పంతులయ్య పోయినేడే ఊరొదిలిపోయే. అయినా ఎవురన్నా ఈడెందుకుంటారయ్యా? ఏవుందీడ? ఒక సుఖమా పాడా.. రోగాలు రొష్టులు తప్ప పిల్లకాయలన్నా సదూకుంటే ఈడ నుంచి బైటడతారని మా ఆశయ్యా’’ బాధ, కోపం కలగలిపిన మాటలు వచ్చాయి రాములు భార్య లచ్మి నోట్లోనుండి.
‘‘సరే.. పిల్లల్ని రేపటినుండి పంపించండి’’. ఆ మాటకి వచ్చిన జనం తెగ సంబరపడ్డారు. వాళ్ళు పండించిన కూరగాయలు, పండ్లు తీసుకెళ్ళి పెద్దాయన ముందు పెట్టి దండం పెట్టారు.
‘‘ఇవన్నీ దేనికీ? వద్దు.. తీసుకెళ్ళండి.. మీ పిల్లల్ని మాత్రం పంపించండి చాలు..’’
‘‘అలా అనకయ్యా. మా ఆనందం కోసం ఉంచండయ్య. కాదనకండి. మీకేం కావాలన్నా చెప్పండి దొరా సిటికలో సేసిపడేత్తామ్’’ సంబరంగా చెప్పాడు రాములు.
‘‘మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ నన్ను అయ్యా, దొరా అనిపిలవకండి. నాకు నచ్చదు. నా పేరు సత్యనారాయణ. నా పేరుకి గౌరవిమచ్చి పిలిస్తే చాలు..’’
‘‘సచ్చినారాయనగారు’’ రాములు పలికాడు. సీత ఘొల్లున నవ్వింది. రాములు కంగారు పడ్డాడు. వెనుక జనానికి ఏం జరిగిందో అర్థంకాలేదు.
‘‘సచ్చి కాదు.. సత్యనారాయణ’’ తాతగారు మళ్లీ పలికి చెప్పారు. సీత ఇంకా నవ్వుకుంది.
‘‘స..చ్చ్.. స..స సత్తినారాయన’’
‘‘అది సత్తినారాయన.. నత్తినారాయణ కాదు.. సత్యనారాయణ’’ సీత తాతగారి మెడ చుట్టూ చేతులు వేసి కుడిభుజంమీద తల వాల్చి వెక్కివెక్కి నవ్వింది.
వెనక గుంపుల జనమంతా పేరు పలుకుదామనుకుని నోట్లో అనుకుంటున్నారు కానీ ఒక్కరిక్కూడా చేతకావడంలేదు. ఒకరి మొహం ఒకళ్ళు చూసుకున్నారు.
పెద్దాయనకి కోపమొస్తుందని భయపడిన రాములు ‘‘అయ్యా, మీ పేరు సెప్పడం మా వల్లయేట్టు లేదు కానీ, నాకో ఆలోసన తట్టింది. తమరు ఈ బుజ్జి సీతమ్మ తాతగారు గందా, అయితే ఇకనుండి మేము తమర్ని ‘సీతమ్మ తాతగార’నే పిలుత్తాం. ఏమంటారయ్యా?’’ నవ్వుతున్న సీత కళ్ళు ఒక్కసారిగా విప్పారి ఆశ్చర్యంతో నిండిపోయాయి. సీత తాతగారి వంక చూసి నవ్వింది. తాతగారు కూడా తిరిగి నవ్వారు.
‘‘సరే అలానే పిలవండి’’ అని ఆనందంతో సీతని ముద్దాడుతూ చెప్పారు సీతమ్మ తాతగారు. ఆ రోజునుండి రంపచోడవరంలో పాతవాళ్ళకైనా, కొత్తవాళ్ళకైనా ఆయన పేరు సీతమ్మ తాతగారు.
వచ్చిన ఊరి జనం వెళ్లిపోయారు. సీత తాతగారి చెవిలో మెల్లిగా చెప్పింది ‘‘తాతగారు మీ బట్టలు మట్టయిపోయాయి’’. తాతగారు తల దించి చూసుకున్నారు. మొక్కలకి నీళ్ళు పోసినప్పుడు సీత పాదాలకంటుకున్న మట్టంతా చొక్కా పంచెకి అంటుకుంది. తాతగారు ఎడం చేత్తో సీత పాదాలకున్న మట్టిని తుడిచి అరికాల్లో చక్కిలిగింతలు పెట్టారు. అంతే.. ఆకాశానికి తలెత్తి నోరంతా తెరిచి గట్టిగా అరిచి నవ్వింది సీత. తాతగారు సీత వంక చూసి నవ్వి, ముద్దుపెట్టుకుని ‘్ఫర్వాలేదులే కడిగితే అదే పోతుంది’ అని సీతను ఎత్తుకునే లోపలికి వెళ్లారు.
సీతమ్మ, తాతగారు ఊళ్ళో జనంతో తొందరగా కలిసిపోయారు. కానీ జనానికి సీతమ్మ తాతగారి కుటుంబం గురించి ఏ విషయము తెలియలేదు. ఆయన్ని అడిగే ధైర్యమూ లేదు వాళ్ళకి. ఎక్కడికెళ్లినా ఇద్దరే. సీత, తాతగారు. ఒకరికొకరు తోడు. తాతగారు ముద్దు చేసేటప్పుడు సీతని ‘సీతాకోచిలుక’ అని పిలిచేవారు. తాతగారు చేతక్ బండి నడుపుతుంటే సీత ముందు నిలబడేది. సీతాకోకచిలుకలా స్పీడోమీర్‌కి అటూ ఇటూ చేతులుంచి, గాల్లో తేలిపొమ్మని జుట్టుని వదిలేసేది. సీతని అలా చూసినవాళ్ళెవరైనా తను ప్రపంచాన్ని గెలవడానికే వెళ్తుందని నమ్మేవారు. సీత కూడా అదే నమ్మింది. సీతమ్మ తాతగారు ఊళ్ళో పిల్లలతోపాటు సీతకి చదువు చెప్పేవారు. ఆయన ప్రయత్నం వల్ల ఊళ్ళోనున్న బడికి మాస్టార్ వచ్చాడు. పిల్లలు బడికి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళతోపాటే సీత కూడా వెళ్ళేది. అడిగినవారికి సహాయం చేస్తూనే ఉండేవారు సీతమ్మ తాతగారు. రోజురోజుకి అక్కడ జనానికి ఆయనమీద గౌరవం, భయం రెండూ పెరుగుతూనే వచ్చాయి.
ఋతువులు మారాయి. పదిసార్లు మారాయి. పదేళ్ళు గడిచిపోయాయి. సీతాకోకచిలుక రెక్కలు పూర్తిగా విచ్చుకున్నాయి. స్పీడోమీటర్ పక్కనుండి సీత చేతులు యాక్సిలేటర్, క్లచ్, బ్రేక్‌మీదకెళ్లాయి. ఎక్కడికెళ్లినా సీత చేతక్ మీదే వెళ్తుండేది. ఒకసారి తాతగారికి వొంట్లో బాగోపోతే ఆయన్ని హాస్పిటల్‌కి తనే బండిమీద తీసుకెళ్లింది. తాతగారిలానే సీత ఊళ్ళో ఎవరికి ఏం కావాలన్నా చేసిపెట్టేది. అందరితో ఆడుకునేది ఎంతవాళ్ళనైనా ఆటపట్టించేది. అందమైన సీత అల్లరి సీతగా ఎదిగింది. ఎంత అల్లరి చేసినా చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేది. ఆ పల్లెటూళ్లో ఉండి చదివే పదో తరగతి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది సీత. ఇంటర్‌లో బైపిసి తీసుకుంది. ఎంసెట్‌లో తనకొచ్చిన రాంక్‌కి కాకినాడ ఆర్‌ఎంసిలో మెడిసిన్ చదవాలనుకుంది. కానీ సీత కాకినాడ వెళ్లడానికి తాతగారు ఒప్పుకోలేదు. ఏం చదవాలనుకున్నా తన దగ్గరే ఉండి చదవమన్నారు. ఆయన రంపచోడవరం విడిచి రానని, సీతని కూడా పంపనని చెప్పేశారు. తాతగారు తనని కాకినాడ ఎందుకు పంపనంటున్నారో అర్థం కాలేదు సీతకి. తాతగారు సీతకి ఒకటి చెయ్యొద్దని చెప్పడం అదే మొదటిసారి.
రోజులు గడుస్తున్నా తాతగారింకా ఆందోళనగానే ఉంటున్నారు. సీత కూడా కాకినాడ మెడిసిన్ సీట్ గురించి మళ్లీ మాట్లాడలేదు. సీత ఇక ఆ విషయం గురించి వదిలేసి ఎప్పట్లానే తాతగారితో ఉండాలనుకుని ఆయనతో మాట్లాడేది. కానీ, తాతగారు సీతతో ఇదివరకట్లా మాట్లాడలేకపోతున్నారు. ఏం అడ్డుపడుతుందో? తాతగారు డల్‌గా ఉండటం చూడలేక తను కాకినాడ వెళ్లనని ఆ ఊళ్ళోనే డిగ్రీ చదువుతానని చెప్పింది సీత. తాతగారు మాట్లాడలేదు. ఆనందపడలేదు. ఎప్పుడూ ఉషారుగా తిరిగే పిల్ల అసలు బయటికెళ్లడమే మానేసింది. చేతక్ దుమ్ము పట్టి ఇంట్లోనే పడుకునేది. సీత, తాతగారు బయట పెద్దగా కనిపించకపోవడంతో వాళ్ళని చూడ్డానికి జనం ఇంటికి వచ్చేవారు. వచ్చినవాళ్ళతో నవ్వుతూ మాట్లాడేవారిద్దరూ. వాళ్ళు వెళ్లిన తర్వాత మళ్లీ అంతా నిశ్శబ్దం. ఇళ్లు నిశ్శబ్దంగా, కాలం భారంగా గడుస్తున్న రోజులవి.
సీత గదిలో లైట్ వేశారు తాతగారు. సీత మంచంమీద దుప్పటి కప్పుకుని పడుకుంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి మంచం మీద సీత పక్కన కూర్చున్నారు తాతగారు. కాసేపు సీతనలాచూస్తూ బాధపడ్డారు. ఆయన కుడి చేత్తో సీత ఎడమ చెంపని ప్రేమగా తడిమి ‘సీతాకోకచిలుక’ అని పిలిచారు. సీతకి మెలకువొచ్చి కళ్ళు తెరిచి చూసింది. తన పక్కన తాతగారు కూర్చుని ఉన్నారు. సీతని చూసి మొహంలో బాధని తుడిచి కొంచెం నవ్వుని అద్దారు తాతగారు. అర్థరాత్రి వేళ తాతగార్ని పక్కన చూసేటప్పటికి వెంటనే లేచి కూర్చుని ‘ఏమైంది తాతగారు?’ అని కంగారుగా అడిగింది సీత. తాతగారు సీత కళ్ళలోకి చూస్తూ మాట్లాడారు.. ‘‘అదా.. కొన్ని రోజులనుండి మనింటి సీతాకోకచిలుక డల్‌గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడంలేదు. నవ్వడం కూడా మర్చిపోయింది. అదే ఎందుకా అనడుగుదామని వచ్చా.. ఏమైంది సీతాకోకచిలుకకి?’’. తాతగారి మాటలకి బిక్కమొహం పెట్టింది సీత. తాతగారు సీత కుడి చేతిని తీసుకుని గినె్నలో తెచ్చిన గోరింటాకు పెడుతూ మాట్లాడారు.
‘‘నువ్వు గోరింటాకు పెట్టుకోకపోయేసరికి చెట్టుకున్న ఆకులు కూడా వడలిపోయాయి, తెలుసా?’’ తాతగారి మాటలకి చాలాకాలంగా రాని నవ్వు సీతకి ఒక్కసారే లోపలనుండి పైకి తన్నుకొచ్చింది. గుండెలో పేరుకున్న బాధ శుభ్రమయ్యేంతవరకు నవ్వింది. అర్థరాత్రి లేపి గోరింటాకు పెడుతున్న తాతగారి ప్రేమకి మురిసిపోయింది సీత.
‘‘అయితే.. ఇప్పుడు సీతాకోకచిలుక ఇంకా పైకి ఎగరాలనుకుంటుంది. పైచదువులకి కాకినాడ వెళ్తానంటుంది. అంతేనా?’’ అరిచేతులో చందమామ పెడుతూ అడిగారు తాతగారు.
‘‘మనమిద్దరం వెళదాం తాతగారు. మీరు లేకుండా నేనక్కడ ఒక్కదానే్న ఎలా ఉండగలను?’’
‘‘ఉండాలిగా మరి.. ఈ రోజు కాకపోయినా రేపైనా, నేను పోయిన తర్వాతయినా ఒక్కదానివే ఉండాలిగా’’ కఠినమైన తాతగారి మాటలకి ఏడ్చేసింది సీత. మొట్టమొదటిసారి సీతకి అనిపించింది ఈ లోకంలో

తాతగారు తప్ప తనకెవ్వరూ లేరని. భయపడిపోయింది సీత.
‘‘మీ అమ్మా నాన్నని ఆక్సిడెంట్‌లో పొగొట్టుకున్నా. మీ నానమ్మని కాన్సర్‌కి అప్పజెప్పా. నాకు మిగిలింది నువ్వొక్కదానివే తల్లి. అందుకే ఏ కీడు నీడ కూడా నీమీద పడకూడదని ఐదేళ్ళ వయసప్పుడు నిన్ను ఎత్తుకొని ఇంతదూరం తీసుకొచ్చా. అప్పుడు అనిపించలేదు కానీ, ఇప్పుడనిపిస్తుంది నాకేమైనా జరిగితే నీ పరిస్థితి ఏంటని? ఎక్కువ ప్రేమించడం కూడా తప్పేనమ్మా. అది ఈ తాతకి ఈమధ్యే తెలిసింది’’.
సీత తన తల్లిదండ్రుల గురించి మొదటిసారి విన్నది. అలాగే తాతగారు కళ్ళల్లో నీళ్ళు కూడా మొదటిసారి చూసింది. సీతకి మాటలు రాలేదు.
‘‘ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుని ఇప్పుడు దిద్దుకుంటా. కాకినాడ వెళ్లి చదువుకో. ఇవాల్టి నుండి నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. అక్కడ ఈ తాత ఉండడు. తాత ఉంటేనే కాదు, ఈ తాత లేకపోయినా నువ్వు బ్రతకాలి. వందేళ్ళు హాయిగా బ్రతకాలి. యు ఆర్ ఆన్ యువర్ ఓన్ నౌ సీత అని సీత నుదుటిమీద ముద్దుపెట్టారు తాతగారు. తాతగార్ని గట్టిగా హత్తుకుని చాలాసేపటివరకూ వెక్కి వెక్కి ఏడ్చింది సీత.
సీతని మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో జాయిన్ చేసి సాయంత్రానికి తిరిగి రంపచోడవరం వచ్చేశారు సీతమ్మ తాతగారు. ప్రతిరోజూ తాతగారు సీతకి ఫోన్ చేసేవారు. ప్రతి శనివారం కాలేజ్ అయిపోయాక సీత తాతగారిని చూడ్డానికి ఊరు బయల్దేరేది. ఊళ్ళో వాళ్ళందరూ సీతని చూసి తెగ మురిసిపోయేవారు. ఎవరైనా ‘డాక్టరమ్మ’ అని పిలిస్తే వాళ్ళని తిట్టి తన పేరు అది కాదని నవ్వుతూ చెప్పేది సీత. చదువు రెండు సంవత్సరాలు పూర్తిచేసి మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది సీత. ఆ యేడు కాలేజీ స్టూడెంట్స్ అందరూ పిక్నిక్‌కి మారేడుమిల్లికి వెళ్ళారు. అది సీత వాళ్ళ ఊరికి ఇంచుమించు పాతిక కిలోమీటర్లు. ప్రయాణం జరుగుతున్నంతసేపు బస్సులోనుండి కనిపించే ప్రదేశాలని తన స్నేహితులకి వివరించింది సీత. స్టూడెంట్స్ బస్‌లో రోజంతా మారేడుమిల్లి చుట్టుప్రక్కలున్న జలపాతాలని, వ్యూపాయింట్స్‌ని చూసి సాయంత్రం చీకటిపడే సమయానికి రిసార్ట్స్‌కి బయలుదేరారు. బస్ రిసార్డ్స్ దగ్గర ఆగింది. అందరూ ప్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సీత తాతగారిని చూడ్డానికి రంపచోడవరం వెళ్తున్నాని ఫ్రెండ్స్‌కి చెప్పి బయలుదేరింది. ఆర్‌టిసి బస్ కోసం వెయిట్ చేస్తున్న సీత ముందుకి ఒక బైక్ వచ్చి ఆగింది. బైక్‌మీద వచ్చింది తనక్లాస్‌మేట్ రాకేష్.
‘‘హాయ్ అమిగో.. వాట్ ఆర్ యు డూయింగ్ హయిర్’’ రాకేష్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘హాయ్ వెయిటింగ్ ఫర్ ఎ బస్ అమిగో’’ నవ్వుతూ సమాధానం చెప్పింది సీత.
‘‘యు వాంట్ మి టు డ్రాప్?’’
‘‘యు డోంట్ వర్రీ మాన్. ఐ గాట్ దిస్’’
‘‘హో.. కమాన్ సీత. ఐకన్ డ్రాప్ యు ఎనీవేర్.. జస్ట్ సే ఇట్ గర్ల్’’
‘‘ఓకె.. ఇఫ్ యు ఇన్సిస్ట్’’ అనిచెప్పి సీత రాకేష్ బైక్ ఎక్కింది.
‘‘యా.. దట్స్ మై బేమీ గర్ల్. లెట్స్ రాక్ ఇట్’’ రాకేష్ బైక్ స్టార్ట్ చేశాడు.
సీత వెనుకనుండి రాకేష్‌కి తన తాతగారి గురించి చెబుతుంది. రాకేష్ బైక్‌ని స్పీడ్‌గా నడుపుతున్నాడు. దారిలో చిన్న నదీ పాయ కనిపించడంతో బైక్‌ని ఆపాడు రాకేష్. సనె్సట్ అవుతుంది అప్పుడే. చూడ్డానికి వ్యూ అద్భుతంగా అనిపించింది సీతకి. ‘‘ఇట్స్ రియల్లీ అమేజింగ్’’ అంది సీత. ఆ మాట విన్న రాకేష్ వెంటనే బైక్‌ని పక్కనేవున్న అడవి దారిలోకి పోనిచ్చి చిన్న గట్టుమీద ఎక్కించాడు. అసలు ఏం జరిగిందో సీతకి అర్థమయ్యేలోపే సీత అడవిలోని గుట్టమీదుంది. రాకేష్ బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి సీతతో ‘కమాన్ మేట్.. లెట్ క్లిక్ సం ఫొటోస్.. మేక్ సం మెమరీస్’’ అన్నాడు. రాకేష్ చేసిన పనికి సీతకి కోపం వచ్చి తిట్టింది. రాకేష్ సన్ బ్యాగ్రౌండ్‌లో వచ్చేట్లు సెల్ఫీ తీసుకున్నాడు. సీతని పిలిచినా రాలేదు కోపంతో.
చీకటి పడిపోయేవరకు ఫొటోస్ తీసుకున్నాడు రాకేష్. ఇక సహనం కోల్పోయిన సీత రాకేష్ మీద అరిచింది.
‘‘ఇట్స్ గెటింగ్ లేట్ రాకేష్.. లెట్స్ గో.. జస్ట్ డ్రా హోమ్’’.
‘‘ఓ.. ఓ.. వి విల్ గో మై లేడీ, బట్ బిఫోర్ దట్ వి హావ్ టు మేక్ సం మెమొరీస్’’ ఫొటోస్ తీసుకుంటున్న రాకేష్ టోన్ నచ్చలేదు సీతకి.
‘‘్ఫర్ మెమరీస్ వి హావ్ టు మేక్ సం లవ్.. రైట్ సీత?’’ సీతకి వొళ్ళు మండిపోయింది ఆ మాటకి.
‘‘ఏం పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా రాకేష్. మర్యాదగా నన్నింటి దగ్గర దింపు, లేకపోతే నా దారిన నన్ను వదిలెయ్. నేనే వెళ్తా’’ కోపంతో ఊగిపోతూ చెప్పింది సీత.
‘‘ఇంత దూరం వచ్చాక కష్టం సీత. నువొప్పకుంటే .. వి విల్ ఎంజాయ్ టుగెదర్, అదర్‌వైజ్ ఐ విల్ స్టాబ్ యు ఇన్ ద హార్ట్ అండ్ హావ్ యువర్ బాడీ లేటర్’’ చాలా ప్రశాంతంగా చెప్పాడు రాకేష్. ‘‘ఐ హావ్ టు కనె్ఫస్ యు.. ఐ నెవెర్ ట్రైడ్ నెక్రోఫిలియా’’- ఈ మాటలకి సీత కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. పారిపోవడానికి ప్రయత్నించిన సీత జుట్టు పట్టుకు లాగాడు రాకేష్. గింజుకుంటున్న సీత రెండు చేతుల్ని వెనక్కి విరిచాడు. నొప్పితో విలవిలలాడిపోయింది సీత. రాకేష్ ఎడమ చేత్తో సీత మెడని నొక్కి పెట్టి తన దగ్గరికి లాక్కున్నాడు. సీతకి ఊపిరి అందలేదు.
సీత చెవిలో రాకేష్ ఆఖరిసారి మాట్లాడాడు. ‘యు లైక్ వయలెన్స్.. హా? యు మేకింగ్ మి వెరీ యాంగ్రీ సీత. లెట్స్ ఫినిష్ ఇట్ ఇన్ త్రీ’’
సీత విదిలించి కొడుతుంది. ఇంతలో సీత గుండెల్లోకి బలంగా చాకుతో పొడిచాడు రాకేష్. రక్తం వెదజిమ్మింది. సీతకి నొప్పి ఎక్కువయ్యేలోపే గుండెలో వరుసగా ఆరుసార్లు పొడిచాడు రాకేష్. సీత రక్తంతో తడిచిపోయింది. కింద నేలలో రక్తపుమడుగు కట్టింది. సీతలో చలనం పోయింది. రాకేష్ సీత శరీరాన్ని పక్కనే వున్న ఒక ఎండిన చెట్టుకి ఆన్చి, పడిపోకుండా చేతుల్ని చెట్టుకొమ్మకి సీత చున్నీతో కట్టాడు. చుట్టూ చీకటి. ఎదుట ఎప్పటినుండో కోరుకున్న అమ్మాయి శరీరం. చలిగాలికి సిగరెట్ వెలిగించి చెట్టుకి కట్టిన సీత వంకే చూశాడు రాకేష్. సిగరెట్ అయిపోయింది. గుట్టమీద నుండి విసిరేద్దామని పక్కకి ఒక అడుగు వేశాడు. అంతే.. అడుగు సీతమ్మ రక్తంతో పుట్టిన మడుగులో పడింది. కాలు జారింది. రాకేష్ ఆ గ్టుమీదనుండి ఘాట్ రోడ్డుమీద పడ్డాడు. అసలే వెహికల్స్ తక్కువ తిరిగే ఆ రూట్‌లో రాత్రంతా రాకేష్ శరీరం మీదనుండి ఎన్ని లారీలు వెళ్ళాయో తెలియదు. కానీ తెల్లవారిన తర్వాత చూసివాళ్ళకి నడుము ప్రాంతంనుండి కిందవరకు నుజ్జునుజ్జయిపోయిన ఒక శరీరం కనిపించింది.
***
సీతని చూడ్డానికి తమని కూడా లోపలికి పంపాలని జనం మారేడుమిల్లి ఆరోగ్య కేంద్రం బయటింకా గొడవ చేస్తున్నారు. ఆకాశమంతా మబ్బులు పట్టాయి. వీచే గాలి వేగం పెరిగి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చల్లబడింది. పోలీసులు లోపలికి వదిలిన పదిమందిలో రాములు కూడా ఉన్నాడు. రాములు మిగతా ఊరి వాళ్ళని తీసుకుని సీతమ్మనుంచిన గది దగ్గరికి వెళ్ళాడు. గది చీకటిగా వుంది. లైట్ లేదు. గదికున్న కిటికీలోనుండే మసక వెలుతురు పడుతుంది. చల్లటిగాలి వస్తుంది. తలుపు వెనక్కి తసి లోపలికెళ్లిన రాములు కంటికి స్టూల్‌మీద కూర్చున్న సీతమ్మ తాతగారు కనిపించారు. ఆ పక్కన స్ట్రెచర్ పైన పూర్తిగా తెల్ల దుప్పటితో కప్పున్న ఒక బాడీ ఉంది. రాములు తాతగారి దగ్గరికి నడిచాడు. రాములు అడుగుల చప్పుడే ప్రతిధ్వనిస్తుంది అ గదిలో. డెబ్బై అయిదేళ్ళ తాతగారు నరాలు ఉబ్బి, ముడతలు పడిన తన కుడి చేత్తో నెత్తురు, మన్ను అంటిన సీతమ్మ అరికాలును గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. నుదుటిని పాదంపై ఆన్చి కళ్ళు మూసుకున్నారు. ఎంతసేటినుండి ఉన్నారో అలా! రాములు వచ్చి తాతగారి భుజంమీద చేయి వేసాక ఆయన తల ఎత్తి పైకి చూశారు. తాతగార్ని చూడగానే రాములు ఏడ్చేశాడు. తాతగారి చేయి మాత్రం సీతమ్మ పాదాన్ని ఊతంగా అలా గట్టిగా పట్టుకునే వుంది. తాతగారికి ధైర్యం చెప్పడానికి ఆ గదిలో నిలబడిన ఒక్కరిక్కూడా ధైర్యం సరిపోలేదు. తాతగారు ఏడవలేదు. సీతని చూసినప్పటినుండి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇంతలో ఒక పోలీసు వచ్చి సీత బాడీని పోస్టుమార్టంకి రాజమండ్రి తీసుకెళ్ళాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాట విన్న వెంటనే స్టూల్‌మీదనుండి నెమ్మదిగా లేచారు తాతగారు. చేత్తో పట్టుకున్న సీత పాదాన్ని మెల్లగా విడిచిపెట్టారు. తాతగారికి చేతికి సీతమ్మ రక్తం, కాలికున్న మట్టి అంటుకున్నాయి. చేయి మళ్లీ వణకడం మొదలుపెటిటంది. చనిపోయిన సీతని చూసినప్పటినుండి తాతారి చేయి వణుకుతోంది. వణుకుతున్న చేతితోనే తాతగారి గదిలోనుండి బయటికి వెళ్ళారు. రాములు తాతగారి వెనకే వెళ్ళాడు.
గదిలోనుండి ఒకటే ఏడుపులు. బంధువులు, మిత్రులు అందరూ జరిగిన ఘోరానికి ఎగ ఏడుస్తున్నారు. రాకేష్ తల్లినైతే ఆపడం ఎవరివల్లా కావడంలేదు. కొడుకు చేసిన తప్పుకి ఓ మూల గోడకానుకుని లోలోపలే ఏడుస్తున్నాడు రాకేష్ తండ్రి. ఏడుస్తున్న వాళ్ళంతా గుమ్మం దగ్గర నిలబడున్న సీతమ్మ తాతగార్ని చూసి ఏడవడం తగ్గించారు కొంచెం. తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకున్న తాతగారు లోపలికి నడుచుకుంటూ స్ట్రెచర్‌మీదున్న రాకేష్ దగ్గరికొచ్చి ఆగారు. ఏడుస్తున్న రాకేష్ వాళ్ళ అమ్మ కూడా తాతగార్ని చూసి ఏడుపు ఆపింది. ఇద్దరు ఆడవాళ్ళు రాకేష్ తల్లిని పక్కకి తీసుకెళ్ళారు. గదంతా నిశ్శబ్దం. నీరసంవల్ల సరిగ్గా నిలబడలేకపోతున్నారు తాతగారు. రాకేష్ తండ్రి వచ్చిన సీతమ్మ తాతగారిని చూడలేక తలదించుకున్నారు. తాతగారు రాకేష్‌ని పది నిముషాలపాటు దీర్ఘంగా చూశారు. కింద సగం బాడీ లేదు. తలంతా కట్లు కట్టారు. మొహం రూపు మాత్రం తెలుస్తుంది. గదిలో వున్నవాళ్ళకి ఆయన ఏం చూస్తున్నారో అర్థం కాలేదు. తన సీతని చంపిన దుర్మార్గుడు ఎదురుగా శవంలా పడున్నాడు. చచ్చినవాడ్ని మళ్లీ బ్రతికించి చంపాలన్న కోపం వచ్చింది తాతగారికి. పది నిముషాలనుండి ఏమి మాట్లాడకుండా బొమ్మలా నుంచున్న తాతగారు అందరూ చూస్తుండగానే చెయ్యెత్తి రాకేష్ చెంప పగలకొట్టారు. ఆ దెబ్బకి గదిలో నిశ్శబ్దం బద్దలైంది. రాకేష్ తల్లి, బంధువులు, మిత్రులు అందరూ షాక్ అయిపోయారు. శవాన్ని చెంపదెబ్బకొట్టడం వాళ్ళెప్పుడూ వినలేదు, చూడలేదు. వాళ్ళు షాక్‌లోనుండి బయటపడేలోపలే శవం రెండో చెంప కూడా పగిలింది. మూల నుంచున్న రాకేష్ తండ్రికి లోపల్నుంచి ఏడుపు తన్నుకొచ్చింది. సిగ్గుతో మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చేశారు. శవాన్ని కొడుతుంటే తాతగార్ని ఆపడానికి ఆ గదిలో వున్నవాళ్ళెవరికీ ధైర్యం సరిపోలేదు. రాకేష్ మొహానికి తాతగారి చేతికున్న రక్తం, మట్టి అంటుకున్నాయి. అందరూ షాక్‌లో వుండగానే ఆ గదిలోనుండి మెల్లగా కాళ్లీడ్చుకుంటూ బయటికి వెళ్లిపోయారు తాతగారు. తాతగారి చేతి వణుకు ఆగింది.
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న తాతగార్ని రాములు ఎంత పిలిచినా వెనక్కి తిరగలేదు. పిలుస్తూ ఆయన వెనుక పరిగెత్తాడు. తాతగారు ఆగలేదు. రాములు తాతగారికి దగ్గరగా వెళ్ళినపుడు మాత్రం చిన్న ఏడుపు మూలుగు వినిపించింది. అది విన్న రాములు ఇక కదల్లేక ఏడుస్తూ అక్కడే నిలబడిపోయాడు. సీతమ్మ తాతగారు అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.
సీతమ్మ తాతగారి బ్రతుకులో వసంతం వెళ్లిపోయింది. చివరకు ఆయన మాత్రం వసంతాన్ని ఎన్నటికీ తాకలేని ఓ శిశిరంలా మిగిలిపోయారు.
సీతమ్మ తాతగారి కోసమైనా శిథిల జ్ఞాపకాలని కాల్చే చోటు ఎక్కుడుంటుందో వెళ్లి వెతకాలనిపిస్తుంది నాకు.

=================================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-కె.ఎన్.మనోజ్‌కుమార్