కథ

థ్రిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటిలో కుర్చీ మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు ఆనందరావు ఆ సాయంసంధ్యలో.
‘ఇదుగోండి టీ..’ వచ్చి కప్పు అందించి ఎదురుగా కూర్చుంది తులసి.
ఆలోచనల్లో నిమగ్నమయిన శ్రీవారిని తట్టిందామె.
‘ఏవిటీఁ ఏదో ఆలోచనల్లో నిమగ్నమైనట్టున్నారు?’ సన్నటి చిరునవ్వు ఆమె వదనాన.
కొద్దిగా వికసించింది ఆమె ముఖారవిందం.

‘నాతో చెప్పగూడదా?’ కుర్చీ మరింత దగ్గరగా జరుపుకుని అతనిపై చేయి వేసి వేసి లాలనగా అడిగింది.
‘మన పెళ్లై ఎంతకాలమయింది తులసీ?’
‘అదేమిటి? మీకు గుర్తులేనట్టడుగుతున్నారు. ఇంకో నెలదాటితే కచ్చితంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు..’
‘అప్పటికీ ఇప్పటికీ ‘జనరేషన్’ ఎంత మారిందా అని ఆలోచిస్తున్నా..’
‘ఏవిటీఁ శ్రీరామ్ చేసిన ఫోన్ గురించే నా ఆలోచన!’
‘అవును’
‘ఏం చేస్తాం.. ఇప్పటి తరం ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పది.’
‘ఇప్పటి ప్రేమలు ఎంత స్పీడో గమనిస్తున్నావా..?’
‘గమనించేదేముంది? నేటి సినిమాలు, టీవీల ప్రభావం అనుకోవచ్చుగా..’
‘ఇదే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం, నిన్ను పొందడానికి నేనెంత ‘రిస్కు’ తీసుకున్నానో, ఎనె్నన్ని ఘనకార్యాలు చేసానో...’
‘అబ్బ.. ఇహ ఆపండి మహానుభావా.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లకండి’ సిగ్గుతో మొహం వాల్చింది.
‘నువ్వలా సిగ్గుపడుతోంటే ఇంకా మన మొదటి పరిచయంలో కన్పించిన అందమే కన్పిస్తుంది సుమా!’
కొద్ది సెకనులాగి..
‘నిజంగా నీ బుగ్గల్లో మెరుపు తగ్గలేదు. కొంచెం దగ్గరకు జరిగి, ఆమె చుబుకం పట్టుకుని, ఆమె కళ్లల్లోకి చూశాడు సూటిగా..
‘స్టాప్.. స్టాప్.. ఏదో ఉపద్రవం జరిగేలా వుంది..’ అంటూ లేచి లోపలికెళ్లిందామె.
ఆమెను అనుసరించాడు ఆనందరావు.
తలుపు గడియ వేస్తున్న అతడిని వారించిందామె.
‘ఒకవేళా లేదూ, పాడూలేదూ.. ఇప్పుడు టైం ఎంత?’
‘ఏకాంతంలో వున్న మనకు వేళతో పనేమిటి భార్యామణీ?’ అంటూ ఆమెను తనవేపు తిప్పుకుని గుండెల కదుముకున్నాడు.
‘ప్లీజ్.. ఇప్పుడు వద్దండీ..’ అంటూనే తమకంగా అతనికి మరింతగా అల్లుకుపోయిందామె.
కొద్దిసేపటి తర్వాత అడిగిందామె భర్తను...
‘మరి శ్రీరామ్ గురించి ఏం ఆలోచించారు?’
‘కన్నతల్లివి నీ సంగతి చెప్పు!’
‘మనదీ ప్రేమ వివాహమే కదా కాకపోతే, శాస్త్రోక్తంగా కాలేదంతే..’
‘కరెక్టే గానీ, మనలాగ ఈ కాలపు జనరేషన్ శాశ్వతంగా సుఖపడగలదా.. ఇదంతా యవ్వనపు వేడేమో నన్పిస్తోంది..’ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు ఆనందరావు.
* * *
‘ఆంటీ’ గుమ్మంలోంచి వినిపించిన పిలుపు విని చదువుతున్న పుస్తకంలోంచి తలఎత్తి చూశాడు ఆనందరావు.
‘ఆంటీ.. ఆం.. టీ.. లేరా..’ బెరుకుబెరుకుగా ఒక్కొక్క పదం విడదీసి పలుకుతోన్న ఆ ముగ్ధను అలాగే చూస్తూండిపోయాడు ఆనందరావు.
చిలకపచ్చ లంగా, అదే కలరు ఓణీతో ఎంతో ముచ్చటగా ఉందామె. ఆమె మాట్లాడేటప్పుడు విచ్చుకున్న లేలేత గులాబీరంగు పెదాలను, అల్లల్లాడుతోన్న నయనాలను చూసి ఒక విధమైన భావనకు లోనయ్యాడతను.
‘ఓ! తులసీ.. రామ్మా.. మా అబ్బాయే..’ పిలిచింది అప్పుడే వంటింట్లోంచి ఇవతలకు వచ్చిన ఆనందరావు తల్లి అనసూయమ్మ.
చెంగుచెంగున గెంతులేస్తూ అనసూయమ్మను అనుసరిస్తూ లోపలకు వెళ్లింది తులసీ అనబడే ఆ పడతి.
‘ఈ శాల్తీ ఎవరు చెప్మా!’ ఆలోచనలో పడ్డాడు ఆనందరావు.
* * *
ఆ రాత్రి డిన్నర్ సమయంలో అడిగాడు తల్లిని ఆనందరావు...
‘ఎవరమ్మా మధ్యాహ్నం వచ్చిన ఆ అమ్మాయి..’ అని..
‘ఆ అమ్మాయా.. పక్కింటి ఏకాంబరంగారి మనవరాలురా.. వాళ్లమ్మాయి ఏలూరులో ఉంటోంది. వారిది అంతగా సాగే సంసారం కాదు. అందుకని మనవరాలి వెళ్లి బాధ్యత నెత్తిన వేసుకుని ఆ పెద్దాయనే తనింటికి రప్పించుకున్నాడు. సంబంధాలు చూడటం మొదలుపెట్టాడిక! టెన్త్ వరకు చదివించి చదువు మాన్పించారు. ఆడపిల్లలు అంతకంటే ఎక్కువ చదవటం అనవసరమనే ఛాదస్తపు భావనలున్నవారు, అంతకంటే ఏం ఆలోచిస్తారు చెప్పు. అయినా, వారికి చదివించే స్తోమత లేదనుకో..’ చెప్పసాగిందామె.
‘అయ్యో! పాపం..’ జాలిగా అంటూ మధ్యలోనే ‘కట్’ చేశాడు ఆనందరావు.
* * *
ఆనందరావు ‘డిగ్రీ’ ఫైనలియర్ చదూతున్నాడు. తాడేపల్లిగూడెం దగ్గర పల్లెటూరు వారిది. వ్యవసాయ కుటుంబం. ప్రతిరోజూ ఆర్డినరీ బస్సు కెళ్లి సాయంత్రం తన ఇంటికి చేరుకుంటాడు.
ఒకరోజు కాలేజీ నుంచి ఇంటికొచ్చిన ఆనందరావుకు తల్లితో కబుర్లు చెప్తోన్న తులసి కన్పించింది.
అతన్ని చూసి ‘తుర్రున’ జారుకోబోయిందామె.
‘్ఫర్వాలేదు.. మాట్లాడుకోండి..’ చిరునవ్వుతో తులసితో చెప్పి లోపలకు వెళ్లబోయాడు ఆనందరావు. అతన్ని ఆపి..
‘ఆనందూ.. మీ కాలేజీ లైబ్రరీలో ఏవేని నవలలు గట్రా వుంటే తెచ్చివ్వరా! పాపం.. తులసి బోరు ఫీలవుతోంది. నిన్ను అడగటానికేమో మొహమాట పడుతోంది..’ చెప్పింది అనుసూయమ్మ.
‘సరేలేమ్మా.. రేపటి నుంచి తెస్తా..’ అని తులసి వేపు తిరిగి.. ‘నన్ను అడగటానికి ఇబ్బందెందుకు..’ నవ్వుతూ చెప్పి లోపలకు వెళ్లాడు ఆనందరావు.
* * *
అలాఅలా పరిచయాలు పెంచుకున్నారు ఆనందరావు, తులసిలు.
ఒకరోజు అనసూయమ్మ వంట ఇంట్లో ఏదో పనిలో వుండగా వచ్చింది తులసి.
‘రా.. నీ కోసం ఒక కొత్త నవల తెచ్చాను..’ అంటూ పక్కనే వున్న నవల చేతిలోకి తీసుకున్నాడు.
అతని చేతి నుంచి, ఆ నవలను అందుకోబోయేటప్పుడు ఆమె చేతివేళ్లు, అతని చేతిని వీణ మీటినట్లు మీటాయి.
‘షాక్’ తగిలినట్లు కంపించిపోయాడు ఆనందరావు.
‘ఓఁ సారీ!’ సిగ్గుతో తలవంచుకుందామె.
‘్థంక్స్...’
‘ఎందుకు?’
‘నీ సున్నిత స్పర్శతో ఈ చేతులను పులకింపచేసినందులకు..’ కొంచెం ధైర్యం చేశాడు.
సిగ్గుల మొగ్గయింది తులసి.
అదే అవకాశంగా తీసుకుని, లేచి దగ్గరకు వచ్చి.. ఆమె చుబుకం పట్టుకుని వంచిన తల ఎత్తాడు.
ఝల్లుమందామె తనువు.
‘ఇంత అందం పెట్టుకుని, నాతో కొద్దిగా చనువుగా మసలవచ్చుగా..’ అడిగాడామెను.
‘అంటే..’ అర్థంకానట్టు చూసింది.
‘ఫ్రాంక్‌గా అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?’
‘హమ్మో!’ అంటూ గుండె మీద చేతులుంచుకుని.. ‘మీ అంతస్తు, కులం..’ ఆగిందామె.
‘అవ్వన్నీ నీకెందుకు.. నేనంటే ఇష్టమేనా.. చెప్పు..’ డైరెక్టుగా అడిగాడామెను.
అతడి నుంచి తప్పుకుని ఒక్కంగలో గడపదాటిందామె వెనుతిరిగి.
* * *
అలా అలా మొదలయిన వారి పరిచయం క్రమేపీ మొగ్గ తొడిగింది.
ఒకరోజు..
తులసి, అమ్మమ్మ, తాతయ్యలు చేతిలో సంచి పుచ్చుకుని బయటకు వెళుతూ..
‘అమ్మా.. తులసీ జాగ్రత్త.. మేము సాయంత్రం వరకు తిరిగొస్తాం..’ అంటూ కేకవేయటం ఆనందరావు చెవిన పడింది.
కొద్దిసేపటికి తులసి వచ్చింది. తను చదివిన నవల తిరిగి ఇవ్వడానికి.
ఇదే మంచి సమయమని భావించిన ఆనందరావు-
‘తులసీ! నువ్వు మీ ఇంటి వెనక వేపు వుంటావా? నీతో కొద్దిగా మాట్లాడాలి..’ చెప్పాడు.
‘ఇక్కడ మాట్లాడు..’ కొంటెగా జవాబిచ్చింది.
‘ప్లీజ్.. నా మాట వినవా?’
‘నువ్వు మా ఇంటికి రావటం ఎవరన్నా చూస్తే ఏమన్నా వుందా..’ భయంగా అందామె.
‘అందుకే కదా వెనక వేపు ఉండమన్నాను..’
‘ఎలా వస్తావ్?’
‘చూడరాదూ..’ కన్నుగీటుతూ అన్నాడు.
అతని భాష అర్థం చేసుకున్నదయి..
‘నువ్వేదో అతి చనువు తీసుకుందా మనుకుంటున్నావేమో నాకు నచ్చదు బాబూ..’
‘అదేం లేదు.. నా మాట మీద అభిమానం వుంటేనే చెప్పినట్లు విను..’ నిష్ఠూరంగా అన్నాడు.
ఆమెకు అక్కడ వుండ బుద్ధికాలేదిక..
* * *
రెండు ఇళ్లకు వెనక మధ్యన ఒక ‘పిట్టగోడ’ మాత్రమే అడ్డు..
ఒక అరగంట తర్వాత, తమ ఇంటి వెనుక వేపు వచ్చాడు ఆనందరావు.
యాంత్రికంగానే, కొద్దిగా మునివేళ్లు మీద పైకి లేచి చూశాడు పక్కింటివేపు.
అప్పుడే తులసి వెనక తలుపు వేస్తూ దొడ్లోకి వచ్చింది.
‘యాహూఁ’ తనలో తనే చిన్నగా కేక వేసుకున్నాడు.
ఒక స్టూలు వేసి దాని మీద నుంచి గోడకు ఎగబాకి, అవతలి వేపునకు ఒక జంప్ చేశాడు ఆనందరావు.
దబ్బున శబ్దం వచ్చిన వేపు గిర్రున వెనక్కు తిరిగిందామె.
‘ఏవిటి నీ ధైర్యం..’ కీచుగొంతకతో అరిచిందామె.
ఆమె దగ్గరకు వచ్చి
‘నిన్ను పొందాలంటే ఈ మాత్రం ధైర్యం చేయాలి కదా!’ భుజం మీద చేతులు వేస్తూ చెప్పాడు.
‘నాకు.. నాకు.. భయంగా ఉంది’ తత్తరపడుతూ అందామె.
‘ఏం భయం లేదు.. నువ్వు నాకు నచ్చావ్... నిన్ను నేను పెళ్లి చేసుకుంటానను. దానికి నా కాళ్ల మీద నేను నిలబడటం అవసరం. మరో ఆరు నెలల్లో నా చదువు పూర్తి అయిపోతుంది. వెంటనే ఏదేని ఉద్యోగం సంపాదించి నిన్ను చేపడతాను.. సరేనా..?’ పొన్నాగ పూలచెట్టు వేపు నడిపిస్తూ చెప్పాడు.
చెట్టుకింద చెప్టా (అరుగు) మీద కూర్చున్నారు ఇద్దరూను. ఆమె సిగ్గు పోగొట్టడానికి ఆమె నునులేత పెదవులపై తన అధరాలను అద్దాడు. చేయి పెట్టి ఆపబోయిందామె.. కానీ ఆపలేకపోయింది.
‘ఇక చాలు.. ఇంకా ముందుకు వెళ్లొద్దు.. ప్లీజ్..’ అడ్డు చెప్పింది సిగ్గు పడుతూనే..
* * *
అలా అలా మొదలయిన వారి ప్రణయం మరింతగా రాటుదేలింది. ఒకరిని విడిచి, మరొకరు వుండలేని స్థితికి వచ్చారిద్దరూ.

డిగ్రీ రిజల్ట్ రాగానే, సర్వీస్ కమీషన్ ఎగ్జామ్స్ రాశాడు ఆనందరావు. స్వతహాగా బ్రిలియంట్ స్టూడెంటయిన అతను అంత కష్టపడకుండానే ఉద్యోగం సంపాయించాడు.
ఒక నెల రోజుల తర్వాత తన మనస్సులోని మాటను బయటపెట్టాడు ఆనందరావు తల్లిదండ్రుల ముందు. ఎందుకంటే, అమాయకత్వంతో తన మీద ఎన్నో, ఎనె్నన్నో ఆశలు పెట్టుకున్న తులసికి అన్యాయం చేయలేడు కనుక..
అతను తన భావం వెలిబుచ్చగానే అదిరిపడ్డారు తల్లిదండ్రులు. తమ కులం కాదు, పైగా తులసి కుటుంబం తమ స్తోమతకు తగినదీ కాదు. ఆ ఊరి మోతుబరి అయిన ఆనందరావుకు అభిజాత్యం ఎక్కువ.
ఆనందరావు ఇక ఎక్కువ ఆలోచించలేదు. ఆనందరావు ఉద్యోగం హైదరాబాద్ కనుక, నెల తిరిగేసరికి తమ ఊరిలోని తన మిత్రుని సహాయంతో తులసిని హైదరాబాద్ రప్పించుకుని తన ఆఫీస్ స్ట్ఫా సాక్షులుగా రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడు.
రెండు సంవత్సరాల తర్వాత శ్రీరామ్ పుట్టాకగానీ, తమ తల్లిదండ్రులు శాంతించారు.
* * *
గతం నుంచి బయటపడ్డ ఆనందరావు తనలో తనే నవ్వుకోడం చూసి..
‘ఏవిటీ, మీలో మీరే ముసిముసిగా నవ్వుకుంటున్నారు. నాకు చెప్పకూడదా?’ అడిగింది తులసి.
‘ఏమీ లేదు, ఆ రోజుల్లో నిన్ను పొందటానికి నేనెన్ని కష్టాలు పడ్డాను. మోచ్చిప్పలు పగిలినా లెఖ్క చేయకుండా గోడ దూకి.. ఎంత చాటుమాటుగా ప్రణయభాష్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు తలచుకుంటుంటే ఎంత ‘థ్రిల్’ ఇప్పుడెక్కడుంది? ఒకే కాలేజీలో చదూతోనో, తోటి కొలీగ్స్‌తోనో ఒక్క మాటలోనే ప్రేమను ‘ఓకే’ అన్పించుకుంటోంది నేటి తరం. ఆ తర్వాత ఇద్దరూ జాబ్స్ చేయటం, డ్యూటీ నుంచి వచ్చీరాగానే ఉస్సూరుమనటం, ఏం తృప్తి ఉంటుంది చెప్పు’ ఆగి శ్వాస తీసుకుని.
‘కొద్ది కాలంలోనే ప్రేమ వేడి దిగిపోతుంది. అలాగని, శ్రీరామ్ అభిప్రాయానికి అడ్డువచ్చే అధికారం నాకు లేదు. నాటి ప్రేమలకు, నేటి ప్రేమలకు తేడా చాలా వుంది. అన్నట్టు ఒకసారి ‘గోడ’ దూకినప్పుడు నా మోకాళ్లు గీరుకుపోయాయి. కనీసం, అమృతాంజనమైనా రాయలేదు నువ్వు..’ చిరునవ్వుతో ఆమె చేతిలో తన చేతిని వేసి ‘టికిల్’ చేయసాగాడు.
‘్ఛ.. మామగారి పదవి ప్రాప్తిస్తున్నా.. ఇంకా మీలో చిలిపితనం పోలేదు..’ సిగ్గుపడుతూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది తులసి ఎంతో లాలనగా.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

- పంతంగి శ్రీనివాసరావు.. 9885112517