కథ

చిగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారావు వయసు పది వసంతాలు. వాడు చదువుతున్నది ఐదవ తరగతి. ఆ చదవడం ఒక అశ్వమేధ యాగం చేయడం లాంటిది. ఒకరోజు వాళ్ల సోషల్ స్టడీస్ మాస్టారు వాడిని భారతదేశపటం కొనమన్నారు. కొని, దానికి రంగులు పూసి తెమ్మన్నారు. ఆ దేశ పటం ఖరీదు 10 పైసలు. అడిగితే లేదు పొమ్మన్నాడు వాడి నాన్న, రిక్షా లాగే నాగన్న. అప్పుడిక చిన్నారావు అమ్మను వేధించగా, లచ్చమ్మ నాలుగు చీవాట్లు వేసి పది పైసలూ ఇచ్చింది. దేశపటమూ వచ్చింది. మరి రంగు పెన్సిళ్ళో? అవి చిన్నారావు వద్ద లేవు, రావు కూడాను. చిన్నారావు బళ్ళో ఎప్పుడూ తన జట్టుండే కృష్ణకుమార్ నడిగాడు. వాడో నీలం పెన్సిల్ ముక్కా, ఒక ఆకుపచ్చ పెన్సిల్‌ముక్కా ఇచ్చాడు. వాడైనా ఒక పట్టానా ఇచ్చాడా.. పదిసార్లు బతిమాలించుకుని మరీ ఇచ్చాడు. వాడికేం, దర్జాగా అట్టపెట్టనిండా రంగు పెన్సిళ్లున్నాయి. పుస్తకాలకీ, తెల్లని మిలమిలమెరిసే పెట్టె వుంది. బడికి రావడానికి రిక్షా వుంది. వాళ్లు వుండే ఇల్లు సినిమాల్లో బంగళాలా వుంటుంది. ఇదంతా తల్చుకున్నపుడల్లా చిన్నారావుకు ఏదో బాధగా వుంటుంది. తన అమ్మ, నాన్న ఇట్లా ఎందుకుండాలో, తను వాళ్లతో కలిసి ఈ మురిక్కాలవ పక్కన తాటాకుల గుడిసెలో ఎందుకుండాలో అర్థంకాదు. మేష్టారునోసారి అడిగితే ఆయన నవ్వారు. నీలం పెన్సిల్ చెక్కడం అయింది. ములికి, నీలంగా శ్రీకృష్ణుడి పింఛంలా మెరుస్తోంది. అయితే, కృష్ణకుమార్‌గాడికి డబ్బున్నా గర్వం లేదు. వాడు చాలా మంచివాడు. ఆటల్లో ఎప్పుడూ తన జట్టే. చిన్నారావు పరిగెత్తినంత వేగంగా కుమార్‌గాడు పరిగెత్తలేడు. అది తలచుకుంటే చిన్నారావుకు సంతోషంగా వుంటుంది. రన్నింగ్ రేస్‌లో తానెప్పుడూ ఫస్టే. నాలుగో తరగతిలో వుండగా రన్నింగ్ రేస్ గెలిచినందుకు తనకో వెండి పతకం ఇచ్చారు. అది తెచ్చి చూపెడితే మా నానే్న, మాబాబే అని అమ్మ తన్ని ముద్దుపెట్టుకుంది. మా చిన్నిగాడు పెద్ద పెద్దాపీసరైపోతాడు అని తెగ సంబరపడిపోయింది. ఆ క్షణాన తాను నిజంగానే పెద్దవాడైపోయి కాకీ నిక్కరు, చొక్కా వేసుకుని, టోపీ వేసుకుని, చేత్తో బెత్తం పట్టుకుని- ఒరేయ్ ఎవడ్రా అక్కడ- అంటే జనం అంతా అదిరిపోయి అటెన్షన్‌లో నిలబడి తనకు సెల్యూట్ కొట్టినట్లు అన్పించింది చిన్నారావుకు. ఆ పతకమే నాన్నకు చూపిస్తే, ‘సన్నాసెదవ! ఏంటొస్తుందిరా దీంతో, అరముంత కల్లొస్తుందా? ఓ బ్రాకెట్ సీటీ వస్తుందా? ఎందుకొచ్చిన సదువుల్రా ఎర్రెదవ? శుబ్రరంగా ఆ టీకొట్లో కప్పులు కడిగితే రోజుకో రూపాయి వస్తుంది’ అని అరిచాడు. అది వినగానే చిన్నారావుకు నాన్నను తందామనిపించింది. అయితే వెంటనే అనిపించింది. అమ్మో, నాన్నను తన్నడమే! గూడెం గూడెం అంతా నాన్న అంటే భయపడతారు. రిక్షాలాగే నాన్న సాయంత్రం చీకటవగానే ఇంటికొస్తే, ఇక అమ్మకారోజు పండగే. ఆ రోజు కుండ పొయ్యిమీదకెక్కుతుంది. తినడానికింత వేడి బువ్వ వుంటుంది. కానీ వారంలో నాలుగు రోజులు నాన్న ఇంటికి రాడు. వాళ్లింట్లో, వాళ్లింట్లో పాచి పని ముగించుకుని ఉసూరుమంటూ వచ్చిన అమ్మ, నాన్న ఏ సారా కొట్టు దగ్గర పడి వుంటాడోనని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. చిన్నారావోసారి లక్ష్మీ టాకీసులో రామాయణం సినిమా చూశాడు. అందులో సీతమ్మవారిని వెతుక్కుంటూ శ్రీరాముడు వెళతాడు. మరి ఇక్కడేమో అమ్మే నాన్నను వెతుక్కుంటూ బయల్దేరుతుంది. మరి సినిమాల్లో అట్లా చూపిస్తారెందుకో? అస్సలా సినిమాలో ఆ మంచి మంచి బట్టలు వేసుకునేవాళ్లు, కార్లెక్కేవాళ్లు, డాన్సు చేసేవాళ్లు- ఎంత అందంగా వుంటారో? వాళ్లందరూ ఎక్కడ వుంటారో! ఒకసారి వాళ్లను దగ్గరగా చూడగలిగితేనో.. అబ్బో! అయినా ఇక్కడ ఎవరూ అట్లా ఉండరు. ఎంచేత? మరీ తమ గూడెంలో అయితే మురికి మురికిగా వుంటారు. చిన్నారావు చేతినుంచి జారి పెన్సిల్ మట్టిలో పడింది. ములికి విరిగింది. దానిని జాగ్రత్తగా తీసుకుని విరిగిన బ్లేడు ముక్కతో చెక్కాడు. ములికి చక్కగా కొనదేరి నిలబడింది. దానికి పెద్ద కార్యం సాధించినట్లయింది చిన్నారావుకు.
భారతదేశ పటంకింద తెలుగు నోటుపుస్తకాన్ని ఒత్తుగా పెట్టాడు. కానీ ఆ పుస్తకం కింద మట్టినేల ఎగుడు దిగుడుగావుంది. ఎటు జరిపినా నునుపుగా రావడంలేదు. చివరకు విసుగెత్తి చిన్నారావు పుస్తకాన్ని ఒళ్లో పెట్టుకున్నాడు. దానిమీద మేప్‌ను పెట్టి ఎడమ చేత్తో నొక్కి పట్టుకున్నాడు. దేశ పటాన్ని చూశాడు. దేశం చుట్టూరా సముద్రాలుంటాయి అని మేష్టారు చెప్పారు. అంటే, తమ గూడెం చుట్టూ మురికి కాలువలున్నట్లుగా ఈ దేశం చుట్టూరా సముద్రాలుంటాయి కాబోలు. మేష్టరింకో విషయం కూడా చెప్పారు. మేప్‌మీద సముద్రాల నీళ్ల జాగాలో నీలం రంగు వేయమన్నారు. తమ గుడిసె వెనకాల కాలవ నీళ్లు ఎప్పుడు నల్లగా, బురదగా వుంటాయి కదా. మరి నీళ్లకు నీలం రంగు ఎందుకబ్బా?
అయినా సరే, సముద్రం నీళ్లు నీలంగా వుంటాయని మేష్టారు చెప్పారు గనుక జాగ్రత్తగా దేశ పటం చుట్టూ నీలం రంగు వేయసాగాడు చిన్నారావు. ఈలోగా ఎదురుగావున్న ఆ గూడెపు ఒకే ఒక కుళాయి దగ్గర నారీ నారీ నడుమ పోరాటం మొదలైంది. పక్క గుడిసెలో నాంచరమ్మకు, టీకొట్టు సాయిబు భార్య హసీనాబీకి వచ్చింది తగాదా. నీ బిందె ముందా? నా కుండ ముందా అని బయలుదేరిన సదసత్ సంశయం అగ్ర రాజ్యాల అభిప్రాయ భేదాల స్థాయికి ఎదిగింది. అక్కడ అణ్వస్త్రాలైతే ఇక్కడ నఖాలు, శిఖాలూ ఉన్నాయి. అక్కడ ప్రకటనల వర్షాలైతే, ఇక్కడ బూతుల వరదలు. అక్కడ రాకెట్లు ఎగిరితే, ఇక్కడ జాకెట్లు చిరుగుతాయి. నాంచారమ్మ బానను హసీనబీ జరిపితే, ఆవిడ సత్తెప్పేలాను నాంచరమ్మ విసిరికొట్టింది. ఆ నీళ్లు కాస్తా చెదిరికొచ్చి చిన్నారావు ఒడిలోని మాప్‌మీద పడ్డాయి. అతడికి చాలా చిరాకేసింది. కానీ అప్పటికే మూడవ ప్రపంచ యుద్ధానికి పూర్వరంగంలా వున్న ఆ జలతరంగాల మంటల్లో చిన్నారావు చిన్న ఒడిలోని దేశం ఎవరిక్కావాలి?
చిన్నారావు నెమ్మదిగా తనచొక్కా మూలతో తడిని ఒత్తాడు. ఆ పటం కార్చిన కన్నీటిని నోటితో ఉఫ్‌మని ఊదాడు. బంగాళాఖాతాన్ని ముగించి హిందూ మహాసముద్రానికి నీలంరంగు పూయసాగాడు. అమ్మ నాయనోయ్.. చంపేశార్రోయ్ దేవుడో.. అక్క గావుకేకకు ఉలిక్కిపడ్డాడు చిన్నారావు. పొట్టమీదనుంచి నెత్తురు కారుతుండగా పేరయ్య తూలుతూ పరుగెత్తుతున్నాడు. గూడెం గూడెం అంతా అల్లకల్లోలం అయింది. ఉన్న 200 మంది ఓటర్లు, కన్నాల్లోంచి ఎలుకలు వచ్చినట్లుగా బిలబలమంటూ పోగయ్యారు. పేరయ్య ఆరు నెలలనుంచి బాకీ వున్న రెండ్రూపాయలూ ఇచ్చెయ్యమని వెంకఠ్రావు అడిగాడట. పేరయ్య వెంకట్రావు తల్లితో మొదలుపెట్టి వాడి వంశవృక్షమంతా పెకలించాడట. రెండ్రూపాయలివ్వను ఫో అన్నాడట. వెంకట్రావు కత్తితో జవాబు చెప్పేసి పోయాడట.
చిన్నారావు పుస్తకాన్ని అక్కడ పెట్టేసి గుంపుతోపాటు పరిగెత్తాడు.
రిక్షామీద పేరయ్యనాస్పత్రికి తీసుకెళ్లారు. లబోదిబోమంటూ వాడి పెళ్లామూ వెళ్లింది. అరగంటయ్యాక పోలీసులొచ్చారు. ఏవేవో అడిగారు. నలుగురినీ వేన్‌లోకి ఎక్కించుకొని వెళ్లారు. కానీ వారిలో వెంకట్రావు లేడు.
నీటి కుళాయిలో నీరు ఆగింది. నాయకురాళ్లు ఆ పూటకు నిర్యుద్ధ సంధి ప్రకటించారు. అలీన, మరియు లీన రాజ్యాలకుమల్లే గూడెం జనమంతా కత్తిపోటు ఉదంతాన్ని చర్చించసాగారు. ఆ పూటకు పైడయ్య తన బ్రాకెట్టు కొట్టు కూడా కట్టేశాడు.
సాయంకాలం ఆరయింది. చీకటింకా రాలేదు కానీ, దుర్జనుడిని దూరంగా చూడగానే పక్కకు తప్పుకునే సజ్జనుడికి మల్లే వెలుతురు వెనక్కు నడవడం ప్రారంభించింది. చిన్నారావు దేశ పటానికి రంగులు పూయడానికి వెలుతురు చాలలేదు. వీధి దీపాలెప్పుడు వెలుగుతాయాని వాడు కాచుకున్నాడు.
వాళ్ల గుడిసె వెనకాల మన రాజకీయాలు ద్రవించి పారుతున్నట్లుగా మహోధృతంగా పారుతోంది కుళ్లు కాలువ. రాజకీయాల్లో ఆ రసజ్ఞులు తేలుతున్నట్లే, ఈ కాలువలో రకరకాల చేపలు తేలుతూ, మున్గుతున్నాయి. ఈ నీళ్లల్లో చేపలు జలకాలాడినట్లే అరకిలోమీటరు అవతల కల్లుల్లో, సారాయిల్లో తేలియాడుతున్నారు, సింగన్నలు, అప్పన్నలు, కొండయ్యలు, నూకరాజులు..
పట్టపగలే బ్రతుకుల్లో వెలుగులేని ఆ కలుగుల గూడెంలో చీకటి అలుముకుంది. ఎన్నికల వాగ్దానాలవలె ఎనిమిదింట ఒక దీపం వెలిగింది. ఆ దీపం కిందకు చేరాడు చిన్నారావు. అరేబియా సముద్రానికి నీలి అందాలు దిద్దసాగాడు. ఆ గుడిసెల వంకర టింకర సందుల్లోకి గంటలు గడగడలాడించుకుంటూ కొన్ని రిక్షాలు జోరుగా, హుషారుగా ఒంటెల్లా షికారుకు వచ్చాయి. దేశ దేశాలనుంచి ఓడలమీద వచ్చిన శరీరాల ఎడారులు ఆ గుడిసెలలోని బడుగు ఒయాసిస్సులను చేరాయి. చిన్నారావు నాన్న- నాగన్న ఆ పూటకు ఇంటికి రాలేదు. దాంతో ‘‘ఎదవసచ్చినోడు, ఎక్కడ తాగి పడుకున్నాడో’’ అని బయలుదేరింది లచ్చమ్మ.
‘‘ఓరబ్బీ, చిన్నిగా! గుడిసె జాగర్తరా నాయనా! కుక్కొచ్చి సల్దికుండ దొర్లించీగల్దు-’’ అని హెచ్చరించి మరీ బయలుదేరింది. కానీ అరేబియా సముద్రం అంచున నీలి పెన్సిలు కాస్త గీత దాటి దేశంలోకి వెళ్లిపోగా ఉత్పన్నమైన సరిహద్దు సమస్యతో సతమతమవుతున్న చిన్నారావు, యాంత్రికంగా ‘‘సరే’’ అన్నాడు వాళ్లమ్మతో. పావుగంటయ్యాక నాగన్నను లాక్కుంటూ మోసుగువచ్చింది లచ్చమ్మ. ఆమె వాడిని శాపనార్థాలు పెడుతూంటే, వాడామెను బండబూతులు తిడుతున్నాడు. గుడిసెలోకి రాగానే వాడు అన్నం కావాలన్నాడు. రొయ్యల వేపుడన్నాడు. దాంతో లచ్చమ్మకు తిక్కరేగింది. ‘‘ఏంట్రా- ఎర్రి ఏసాలు ఏస్తున్నావేంది? నువ్వొచ్చి రూపాయలిత్తావని నాను జూస్తుంటే నువ్వా కాల్లుపాక్కాడ పీకమొయ్య తాగిపడింటివి.. తాగడానికి కూల్డబ్బులు తగలెడితే కుండలోకి అన్నమెట్లా వత్తుందిరా? నాకాడ డబ్బులుంటే ఆ ఎదవ పాకకాడికి నానెందుకు వద్దునూ? పొద్దుననగా సల్ది తిన్న ఆ బిడ్డడికింత కూడుపెట్టాలన్న గ్యానం అయ్యగాడివైన నీకు నేకపోతే నానెట్టా సచ్చేది?’’ అని కుతకుత ఉడికిపోయింది లచ్చమ్మ.
చివరకు కథ మామూలు క్లైమాక్సుకే చేరింది. ఆమె జుట్టు వంచి చితకబాదాడు నాగన్న. లచ్చమ్మ కిందపడి బోరుమని ఏడవసాగింది.
చిన్నారావుకూ ఏడుపూ వచ్చింది, కోపమూ వచ్చింది. వెంటనే పెద్దవాడైపోయి రెండు చేతులలోనూ రెండు లాఠీకర్రలుంచుకుని నాన్ననతో సావబాదాలనిపించింది. అరేబియా సముద్రం రంగు పని గబగబా పూర్తిచేసి మేప్‌ని తెలుగు వాచకంలో దాచి పుస్తకాల సంచిని మూలపడేసి లేచి వెళ్లిపోయాడు. ఈ గొడవంతా విని ఎదుటి గుడిసె సూరక్క వచ్చింది. ఆమె నాగన్నను, లచ్చమ్మను సరిసమానంగా చీవాట్లు పెట్టి చిన్నారావును తన గుడిసెలోకి తీసుకెళ్లింది. వాడికింత మజ్జిగన్నం పెట్టింది. రెండు బిస్కెట్లు ఇచ్చింది.
‘‘ఇవెంతో బాగున్నాయి. నీకెవరిచ్చారక్కా?’’ అని చిన్నారావు అడిగితే, సూరక్క నవ్వింది.
‘‘అవా? అవి జపాన్ నుంచి ఎవరో తెచ్చిచ్చార్రా!’’ అంది. ఆకలి తోడలు తన్ను తొలిచివేసిన తొలి దినాలను నెమరువేసుకుంటూ హఠాత్తుగా ఏదో ఆవేశం వచ్చినదానిలా సూరక్క వాడిని గట్టిగా హత్తుకుని ‘‘ఒరే తమ్ముడూ! నువ్వెప్పుడూ ఆకలితో బాధపడమాక.. నాన్నీకు కావల్సింది పెడతాను. తిని సక్కంగా సదువుకో.. యిన్నావా? సక్కగా చదువుకో. సదువుకొని మాంచి రాజాలాటి ఉజ్జోగం సంపాదించు. సంపాదించి ఇక్కడనుంచి ఎల్లిపో.. నాలాగా, మీ అమ్మ, మీ అయ్యలాగా ఈ మురికి కాలవ నీళ్లలాగా బతకమాక.. దర్జాగా గోదారితల్లిలా జోరుగా బతుకు’’ అని వాడిని ముద్దుపెట్టుకుంటుంటే ఆమె కళ్లవెంబడి నీటిబొట్లు రాలాయి.
చిన్నారావుకు లోలోపల ఏదో చల్లగా తడిసి ముద్దయిపోయినట్లు, హాయిగా వున్నట్లు అనిపించింది. ఆ క్షణాన కృష్ణకుమార్ కన్నా తానే గొప్పవాడన్పించింది. తప్పకుండా చదివి, పెరిగి పెద్దయి ఉద్యోగంలో చేరి, డబ్బులు సంపాదించి, సూరక్కనూ, అమ్మనూ తీసుకెళ్లి పెద్ద బంగళలా ఉంచాలి అన్పించింది. నాన్నను, వెంకట్రావును, కల్లుపాక రత్తయ్యనూ వాళ్లెవరినీ ఆ బంగళా వైపు రానివ్వకూడదన్పించింది.
ఆస్పత్రికి వెళ్లినవాళ్లు తిరిగివచ్చారు. పేరయ్యకు కుట్లు వేశారంట. కుళాయి నిద్రపోతోంది. హసీనాబి తల్లో పేలను నాంచరమ్మ కుక్కుతూ వుంది. చిన్నారావు మగతనిద్రలోకి జారిపోతుండగా, లచ్చమ్మ వచ్చి వాడిని పిలిచింది.
సూరక్క చెబుతున్న కథ వింటున్న చిన్నారావు రానన్నాడు. ‘‘ఈ పూటకు ఇక్కడే పడుకుంటాడులేవమ్మా-’’ అంది సూరక్క.
లచ్చమ్మ సరేనని వెళ్లిపోయింది.
ఇంకాసేపటికి చిన్నారావు నిద్రపోయాడు. పదకొండయ్యేసరికి గుడిసె బయట రిక్షా ఆగిన సప్పుడయింది. సూరక్క లేచి వెళ్లి రిక్షావాడితో ‘‘ఇవాళ ఎవరూ రావద్దయ్యా.. లోపల అబ్బాయి నిద్రపోతున్నాడు’’ అని చెప్పి పంపించేసింది. లోపలికి వచ్చి చిన్నారావు పక్కన పడుకుంది. శరీరమూ, మనసూ పుండయి బీటలువారిన ఆమెకు ఆ పూట చల్లగా వుంది.
కాసేపటికి ఆమెక్కూడా నిద్రపట్టింది.
గూడెం అంతా నిశ్శబ్దంగా వుంది. కుక్కలూ, ఒకరిద్దరు మనుషులు తప్పా మరేం సంచారం లేదు. అన్ని బాధలకూ మందువంటిదైన నిద్ర గూడెం అంతటా ఆవరించింది. ఆ చల్లని నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో కేకవేశారు. చాలామంది ఉలిక్కిపడి లేచారు.
‘‘నిప్పు.. నిప్పు.. బాబోయ్ మంటలు! ఆర్పండి.. లాగండి.. పిల్లలు జాగ్రత్త.. ఒరే అప్పన్నా.. సామాన్లు తీయండి.. ఓరయ్యో.. నాయనో.. తల్లీ.. ఎక్కడున్నావమ్మా..’’
కేకలు, కూకలు, ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఎవరో పారేసిన సిగరెట్టు పీకతో తాటాకు రాజుకుంది.
తాటాకుతో గుడిసె అంటుంది.
గుడిసె మండి గూడెమంతా మంటలలుముకున్నాయి.
ఆ గూడెంలోని బాధంతా చిచ్చుగా పెరిగి, ఎర్రగా వెలిగి వేయి నాల్కలతో ఆకాశంలోని చంద్రుడిని అందుకోజూచింది.
ఇసుక వచ్చింది. నీళ్ల బక్కెట్లు వచ్చాయి, ఫైరింజన్లూ వచ్చాయి.
మంటలారాయి. నిప్పు చల్లారింది. పొగ అణిగింది. కాలిన గుడిసెల నల్లటి నుసి నీటిలో కలిసి యమునలా పారింది.
హడావుడి అంతా ముగిసేసరికి తెల్లవారుఝామయింది.
సూరక్కతోపాటు ఉలిక్కిపడి నిద్రలేచిన చిన్నారావు ఈ కోలాహలం అంతటినీ భయంగా, వింతగా చూశాడు. సగం నిద్రలో లేచినవాడికి పూర్తిగా మెళకువ రాలేదు.
అంతా ముగిసేసరికి చిన్నారావుకు హఠాత్తుగా గుర్తొచ్చింది. పరిగెత్తుకొని వెళ్లాడు తమ గుడిసెకు. అక్కడ గుడిసె లేదిప్పుడు. గుడిసెలో పదవ భాగమంతా బూడిద వుంది. వాడి గుండె కలుక్కుమంది. కళ్లల్లో నీళ్లుకమ్మాయి.
‘‘ఏంట్రా! యెదవ? ఏటికావాలిక? అందరి వస్తువులూ అవుగో ఆడున్నాయి. సూడుపో! మీ అమ్మ, నాన్న నీ కోసం వెతుకుతున్నారా’’ అని మందలించారెవరో.
పరుగెత్తుకు వెళ్లాడు చిన్నారావు.
అక్కడ నులక మంచాలు, బట్టల మూటలు, గోనెసంచీలు, గినె్నలు, బాల్చీలు, వాసాలు, విరిగిన కుర్చీలు గుట్టలు గుట్టలుగా పడి వున్నాయి. ఎవరి వస్తువులకోసం వారు వెతుకుతున్నారు.
ఆబగా
కసిగా
కోపంగా
దుఃఖంగా
గాలించాడా గుట్టను చిన్నారి చిన్నారావు.
అశోకవనమంతా జానకమ్మ కోసం గాలించిన ఆంజనేయుడిలా అనే్వషించాడు చిన్నారావు.
ఉంది.
హమ్మయ్యా!
వాడి పుస్తకాల సంచి ఉంది!
సంచిలో తెలుగు వాచకం ఉంది!
తెలుగు వాచకపు పుటలమధ్య కాస్త నలిగినట్లున్నా, భద్రంగా వుంది వాడి భారతదేశ పటం! రెండు రంగు పెన్సిళ్లూ వున్నాయి.
ఎవరెస్టెక్కిన టెన్సింగ్‌లా ఎగిరిరెగిరిపడింది వాడి ఎద!
‘‘అమ్మయ్యా- ఇవాళ మేష్టారికి తీసుకెళ్లి చూపించవచ్చులే’’ అని వాడి మనసు కుదుటపడింది.
వాడక్కడే- ఆ కాలవ కంపుల గుడిసెల మంటల బూడిదల పొగల దుమ్ము నేలపైనే కూచుని- భారతదేశాన్ని అతి శుభ్రంగా తన ఒడిలో ఉంచుకొని లోపలివైపు రంగు పెన్సిల్‌తో ఆకుపచ్చరంగును వేయసాగాడు.
తూరుపు ఆకాశ పటంమీద బాలసూరీడు బంగారు పెన్సిళ్లతో రంగులు పూయసాగాడు. *

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి
కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు
మెయల్‌లో పంపాలి.

-వాకాటి పాండురంగారావ్