కథ

నీటి బుడగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో మన ప్రమేయం లేకుండా, మనకి ఇష్టం లేకున్నా కొన్ని సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. ఆ సంఘటనలకి ఎంత కుమిలిపోయినా చేజారిపోయిన జీవితం తిరిగి రాదు. పడిన మచ్చ తొలగిపోదు. అటువంటి జీవితాన్ని తలుచుకుంటే దుఃఖం వస్తుంది. మనస్సుకి కష్టం కలుగుతుంది. దానిని ఎదుర్కొని సిస్సాహతం ఎంత కన్నీరు కార్చినా తరగని వేదన. ఏ రకంగా తిరిగి పొందలేని నష్టం.

జీవితం అనేది ఒక తోటలాంటిది. ఆ తోటలో చెట్లనున్న ఆకులు రాలిపోతాయి. పువ్వులు వాడిపోతాయి. అలాగే జీవితంలో రాలిపోయిన ఆకుల్ని ఏరిపారేసినట్టే మనం మన గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని మనసులో నుంచి తొలగించుకోవాలి. అప్పుడే కొత్తగా చిగురించిన చిగుళ్లు పువ్వులను ఆస్వాదించగలం.
అంతేకాదు జీవితమంటే మరచిపోవల్సిన చేదు జ్ఞాపకాన్ని మరచిపోవాలి. అప్పుడే వికసించిన విరబూసిన పువ్వులా జీవితంలో ప్రతి క్షణాన్ని కొత్త ఆశతో అందుకోగలం.
నేటి సమాజంలో మనిషిలో మానవత్వం మంచితనం మటుమాయమవుతున్నాయి. దాని స్థానంలో హృదయం, మానవత్వం లేని మార్కెట్ వచ్చి చేరింది. జీవంలేని డబ్బు ప్రధానమై పోయింది. ఆ డబ్బును కష్టపడి సంపాదించినా, వంచన చేసి సంపాదించినా, శరీరాన్ని పణంగా పెట్టి సంపాదించినా ఆ డబ్బుకే ప్రాధాన్యత.
సాలెగూడు లాంటి సంస్కారం లేని పరిసరాలు, సంస్కారం లేని మనుషుల మధ్య ఇన్నాళ్లు మసలిన నేను ఇలా బండి దిగి సూట్‌కేసు పట్టుకుని నడుస్తూ భావోద్వేగంతో ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచనలు నాలో కలగడానికి గంభీర విషయాలు ఆలోచించడానికి కారకుడు లాయర్ బాబు.
తన పది సంవత్సరాల వయస్సులో తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనతో ఇలా ఎన్నాళ్లు ఎంత నరకయాతన అనుభవించిందో? ఎంత కృంగిపోయిందో? ఇన్నాళ్లకేనా ఆ లాయర్ బాబు దయ వల్ల విముక్తురాలయి తన వాళ్లను కలుసుకోవడానికి తను పుట్టి పెరిగిన పరిసరాలను పరికిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది.
లాయర్ బాబు తనని బండి ఎక్కించడానికి వచ్చినప్పుడు అన్న మాటలు ఒక్కసారి జ్ఞాపకం వచ్చాయి.
‘లాయర్ బాబూ! మీరు మనిషి కాదు. మనిషి రూపంలో ఉన్న దేవుడు. నా జీవితం హీనాతిహీనంగా మారకుండా కాపాడారు మీరు. ఆ సాలెగూడు నుంచి నాకు విముక్తి కలిగించారు. నా వాళ్లను కలుసుకోవడానికి అవకాశం కలిగించారు.’ కళ్లల్లో కన్నీరు చిప్పిల్లుతూండగా లాయర్ మధుతో అంది తను.
‘్ఛఛ... మోహినీ! అలా కన్నీరు పెట్టుకోకు. మ్రోడు లాంటి నా జీవితంలో ఆనందం, సుఖం పంచి ఇచ్చావు ఇన్నాళ్లూ... అలాంటి నీకు ఈపాటి ఉపకారం చేయకపోతే నిజంగా స్వార్థపరుడ్నే’ అతను అన్నాడు.
‘లాయర్ బాబూ! తెలిసో తెలియకో, పరిస్థితుల ప్రభావం వల్లో ఆడ, మగ ఇద్దరూ తప్పు చేస్తారు. మగవాడి తప్పును క్షమించిన సమాజం ఆడదాని తప్పును క్షమించదు. విధిలేని పరిస్థితిలో ఆడది తను చేసిన తప్పునే బాటగా చేసుకుని జీవచ్ఛవంలా బ్రతికేస్తుంది’ తను ఆవేదనగా అంది.
‘అలా ఎందుకు బాధపడ్తావు మోహినీ! నీ ప్రమేయం లేకుండానే పరిస్థితుల ప్రభావంతో ఆ సాలెగూటిలో చిక్కుకున్నావు. నీ జీవితం తప్పుడు మార్గంలో వెళ్లకూడదనే, సక్రమ మార్గంలో వెళ్లాలనే నిన్ను అక్కడి నుంచి తప్పించాను’ అన్నాడు అతను. అతని వేపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది తను.
‘మోహినీ! మరో విషయం. మీ వాళ్లు ఒకవేళ నిన్ను సరిగా రిసీవ్ చేసుకోకపోతే నాకు ఫోన్ చెయ్యి. నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలో జాయిన్ చేస్తాను’ అన్నాడు. తలూపింది తను ఆ సమయంలో.
మనుష్యుల్లో కూడా రకరకాల వాళ్లు మనకి తారసపడ్తుంటారు. మనం అత్యంత ఆత్మీయులనుకునే రక్త సంబంధీకులు.. మన మీద బురద జల్లేవారు, ఛీత్కరించుకునేవారు, మన ప్రమేయం లేకుండానే జరిగిన తప్పులకి మనల్ని బాధ్యుల్ని చేస్తూ వేలెత్తి చూపించేవారు, మనల్ని కుమిలిపోయేట్టు చేసేవారు, మనకి ఏమీ కాకపోయినా మన మీద ఎంతో అభిమానం, సానుభూతి చూపేవారు. ఇలా రకరకాల మనుష్యులుంటారు. దానికి నిదర్శనమే లాయర్ బాబు. అతను తనకేం అవుతాడని, తమ మధ్య ఏ రక్త సంబంధం లేదే! అయినా తనంటే ఎంత అభిమానం, జాలి చూపిస్తాడు? కొన్నాళ్లు అతనికి శారీరక సుఖం ఇచ్చానన్న కృతజ్ఞత వలన అలా ఉండి ఉండవచ్చు. కృతజ్ఞత కావచ్చు. అభిమానం కావచ్చు. స్వార్థం కావచ్చు. జాలి కావచ్చు. ఏది ఏదయితేనేం? ఏమీ తోచని కష్ట సమయంలో తనని ఆదుకుని తనకి విముక్తి కలిగించిన మంచి మనిషి లాయర్ బాబు తన దృష్టిలో.
సాధికారత, స్ర్తి స్వాతంత్య్రం గురించి అందరూ ఎలుగెత్తి మాట్లాడుతారే కానీ నిజంగా నేటి సమాజంలో చాలామంది స్ర్తిలకి వ్యక్తి స్వాతంత్య్రం, భావ స్వాతంత్య్రం, ఆర్థిక స్వాతంత్య్రం ఉందా? లేదు. అది కేవలం చట్టాల వరకే పరిమితమయింది. బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర స్వాతంత్య్రం లేదు. వాళ్లు ఇచ్చిన బట్ట కట్టాలి, వాళ్లు పెట్టిన తిండి తినాలి. ఎన్ని ఇష్టాలున్నా కోరికలు, ఆశలు అభిలాషలున్నా వాటిని చంపుకుని వాళ్ల ఇష్ట ప్రకారమే నడచుకోవాలి. ఇక పెళ్లైన తరువాత భర్త దగ్గర, ముసలితనంలో పిల్లల దగ్గరా అంతే. స్ర్తికి స్వాతంత్య్రం ఉందా? లేదే. అది ఎండమావే.
సూట్‌కేస్ పట్టుకుని ముందుకు అడుగులేస్తున్నాను. అసలే శ్రావణమాసం. ఆకాశంలో మేఘాలు దట్టంగా చిక్కబడ్తున్నాయి. చిన్న తుంపర్లు పడ్తున్నాయి. ఆటో కావాలా? అడుగుతున్నారు ఆటో వాళ్లు ‘వద్దు’ అన్నాను
వెనక నుండి వాళ్లు హేళనగా నవ్వుతున్నట్టు అనిపించింది. వాళ్లు ఎందుకు నవ్వుతున్నారు? తన వేషధారణ చూశా. పరీక్షించి చూసుకుంటే నా వేషధారణ మామూలుగానే ఉంది. పది సంవత్సరాల వయస్సులోనే చదువుకి దూరమయిన తనకి ఇలాంటి గంభీర విషయాలు తెలుసుకోడానికి కారకుడు ఆ లాయర్ బాబే. మంచిమంచి పుస్తకాలు చదివించారాయన. సాహిత్యపరంగా తనని తీర్చిదిద్దింది ఆయనే.
తన వేషధారణలో ఏ మార్పూ లేదు. మార్పు ఉందని అనుకోవడం తనలో ఉన్న భ్రమ. గిల్టీనెస్... అనుకుని ముందుకు అడుగులు వేస్తున్నాను. రకరకాల ఆలోచనలు. ఈ మధ్య యాదగిరిలో వేశ్యాగృహాల మీద పోలీసులు దాడి చేసి కొంతమంది ఆడపిల్లల్ని రక్షించారని తను వింది. ఆ పిల్లల్లో తమ పిల్లలు ఉన్నారేమో అని అనేక మంది తల్లిదండ్రులు ఆశగా - ఆర్తిగా, బాధగా ఎదురుచూస్తున్న దృశ్యాలు టీవీలో తను చూసింది. ఆనాడు తను కూడా ఇలాగే కిడ్నాప్‌నకు గురైతే తన తల్లిదండ్రులు కూడా వెతికించి ఉండొచ్చు. పట్టుదలగా వెతికిస్తే తన జీవితం ఇలా ఉండేది కాదు. ఈ కిడ్నాప్‌ల కేసుల్లో కూడా కొద్ది మాత్రమే సఫలమవుతాయి. విఫలమైన కేసులు ఎన్నో?
కిడ్నాప్‌కు గురయిన ఆడపిల్లలు వేశ్యాగృహాలకి చేరితే వీళ్లని అక్కడ యజమానులు నయానో భయానో లొంగదీసుకుని తమకి అనుకూలంగా మార్చుకుంటారు. ఆ సమయంలో ఆడపిల్లల్ని ఎన్ని చిత్రహింసలకి గురి చేస్తారో తను కళ్లారా చూసింది. అనుభవించింది కూడా.
ఆ రోజు తనకి బాగా గుర్తు. ఆ రోజు తన జీవితంలో చాలా భయంకరమైన రోజు. దురదృష్టకరమైన రోజు కూడా. ట్యూషన్ క్లాస్ నుండి వస్తున్న తనని బలవంతంగా ఎవరో కారులోకి ఎక్కించుకున్నారు. మసక చీకటి వేళ. మనుషుల్ని గుర్తించలేక పోయింది. అరిచింది. గోల పెట్టింది. గింజుకుంది. ఏడ్చింది. ఎవడో తన చెంప మీద కొట్టాడు. సొమ్మసిల్లి పడిపోయింది.
స్పృహ వచ్చి చూస్తే తను ఓ గదిలో బందీగా ఉంది. తనలాగే చాలామంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారు. గోల పెడ్తున్నారు. అలా ఏడస్తున్న వాళ్లని అక్కడి వాళ్లు కొడ్తున్నారు. తిడుతున్నారు. అలాంటి వాళ్లకి బూతు బొమ్మల్ని, దృశ్యాల్ని చూపించి వాళ్లని అక్కడి వాతావరణానికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
అక్కడి వాతావరణం జుగుప్స కలిగిస్తోంది. తను ఇలాంటి వేశ్యాగృహాల గురించి పక్కింటి పార్వతి ద్వారా వింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు ఎంత క్రూరంగా హింసిస్తారో? ఏడుస్తున్నాను. వాళ్ల మాట వినని వాళ్లకి తిండి పెట్టరు. కొడ్తారు. వాతలు పెడ్తారు. నెమ్మదిగా తమకి అనుకూలంగా మార్చుకుంటారు.
‘అమ్మాయ్! ఆ ఏడుపు ఆపు. నీ పేరేంటి?’ ఓ ఆవిడ నన్ను గద్దించింది. ఏడుపు ఆపి ‘శారద’ అంది. ఈ రోజు నుండి నీ పేరు ‘మోహిని’ మేం చెప్పినట్టు వింటే ఫర్వాలేదు. లేకపోతే వాళ్లకి పట్టిన గతే!’ అంటూ హూంకరిస్తూ గట్టిగా అంది.
నా జీవితంలో కొత్త మలుపు. మన్మథరావు నాలాంటి పిల్లలంటే పడి చస్తాడు. చాలా డబ్బున్న పెద్ద మనిషి. ఎనిమిది పదులు వయసు దరిదాపులో ఉన్నవాడు. భార్య చనిపోయింది. సంతానం విదేశాల్లో ఉన్నారు. ‘ఆ మన్మథరావుకి నువ్వు నచ్చావుట. చాలా అదృష్టవంతురాలివి’ ఆ వ్యభిచార గృహ యజమానురాలు నాంచారమ్మ అంది ఓ రోజు. నాలాంటి చిన్న వాళ్లు పెద్దవాళ్లు ఆడపిల్లలు ఈ వ్యభిచార గృహంలో సమిధిలయి పోతున్నారు అనుకున్నాను.
‘చాలా బాగున్నావే పిల్లా!’ అంటూ మన్మథరావు నన్ను తన కౌగిట్లో బిగించి ఇష్టం వచ్చినట్లు నలిపేస్తున్నాడు. వాడికి నాలాంటి చిన్నపిల్లలంటే చాలా ఇష్టంట. ఊపిరి ఆడక గింజుకుంది తను. తన తాతయ్య వయస్సు ఉన్న వాడికి ఇదేం రోగం? అనుకుంది తను. రాత్రి అవుతోందంటే భయం.
‘మోహినీ! ఏ ఆడపిల్లా! ఇలాంటి వ్యభిచార గృహంలో చిక్కుకోవాలని అనుకోదు. అయితే ఒక్క విషయానికి నీ అదృష్టవంతురాలివి. మేము రోజుకొకడితో బట్టలు మార్చినట్టు మారుస్తూ వాళ్లు పెట్టిన చిత్రహింసలు భరిస్తూ గడపాలి. నీకు అలా కాదు. నువ్వు చిన్నపిల్లవి. ఆ మన్మథరావులో ఓ బలహీనత. అతనికి ప్రతిరోజూ పడక సమయంలో ఆడది ఉండాలి. నీలాంటి చిన్నపిల్లలంటే మరీ మోజు. ఒక్క విషయం అతను ఎవరిని తనది అనుకుంటాడో ఆ ఆడది తనని తప్ప ఎవ్వరినీ తలవకూడదు. ఎవ్వరి దగ్గరకూ వెళ్లకూడదు. ఆ ఆడది తన సొంతం. ఈ విషయమే నాంచారమ్మకు చెప్పాడు. చాలా డబ్బు ఆమెకి ముట్టజెప్తాడు. అందుకే నువ్వు సేఫ్. ఇక్కడ. మాలాంటి జీవితం కాదు నీది’ అక్కడ తనని అభిమానిస్తున్న సరోజ అంది.
కాలం గిర్రున తిరుగుతోంది. తను ఓ మరబొమ్మగా మారింది. కాలంతోపాటే తన వయసులోని శరీరాకృతిలో మార్పు. దాన్ని తనకి ఇష్టమైన రీతిలో వినియోగించుకుంటున్నాడు మన్మథరావు. అతని మరణంతో కొత్త కష్టాలు ఆరంభమయ్యాయి.
‘మోహినీ! ఈ రోజు మినిస్టర్‌గారి అబ్బాయి వస్తున్నాడు. అతనికి సహకరించి సంతోషపరచు’ నాంచారమ్మ ఆజ్ఞ. నా నోట మాట రాలేదు. శరీరం చెమటలు పడ్తున్నాయి. పెద్దపెద్ద వాళ్లందరూ పగలల్లా పరువు ప్రతిష్ఠా అనే పరదా చాటున దాక్కుని రాత్రి సమయంలో ఆ పరదా తొలగించుకుని ఇక్కడికి వస్తారు.
అదే రోజు రాత్రి వ్యభిచార గృహం మీద రైడింగ్ జరిగింది. మర్నాడు కోర్టులో దోషిగా నిలబడవలసి వచ్చింది. జరిమానా కట్టి లాయర్ మధు సహాయంతో అందర్నీ విడిపించింది నాంచారమ్మ.
ఇది తనకి కొత్త అనుభవం. దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది. మెట్ల మీద కూర్చుని వస్తున్న కన్నీరు తుడుచుకుంటోంది.
‘మోహినీ!’ లాయర్ పిలిచాడు. ‘నువ్వు చాలా సాఫ్ట్. సెన్సిటివ్. నీకిదంతా కొత్త. ఇక్కడ అందరికీ ఇది మామూలు వ్యవహారం. కూల్... కూల్..’ అంటూ తనని ఓదార్చాడు.
‘మోహినీ! నీవు చాలా అదృష్టవంతురాలివి. లాయర్ బాబు నీ మీద అభిమానం చూపిస్తున్నాడు. ఇక్కడ అతడు ఎవ్వరినీ ఇష్టపడడు. కేవలం నాంచారమ్మకి సలహాలిస్తూ ఇలాంటి కేసుల్లో అండగా ఉంటాడు. అతని భార్య కూడా ఈ మధ్యనే చనిపోయింది. అలా అని లైంగికానందం తీర్చుకోవడానికి ఇక్కడికి రాడు. చాలా మంచివాడు’ అంది. వింటున్నాను నేను.
‘మోహినీ! నీ అమాయకత్వం, నీ స్వభావం నాకు బాగా నచ్చాయి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నా జీవితం తెరచిన పుస్తకం. నా గురించి నీవు అంతా వినే ఉంటావు. ఇక్కడ చిక్కుకున్న ప్రతీ ఆడదాని కష్టనష్టాలు నాకు తెలుసు. నేను నీకు ఇష్టమయితే చెప్పు. నాంచారమ్మను నిన్ను నాకే పరిమితం చేయమని చెప్తాను’ అన్నాడు.
‘సరోజ చెప్పినట్టు తన జీవితం కుక్కలు చింపిన విస్తరిలా తయారవకుండా మంచివాడయిన లాయర్ బాబుతో సరిపెట్టుకుంటే బాగుంటుంది’ అనుకుంటున్నాను.
‘ఏంటి ఆలోచిస్తున్నావు?’ అతను అడిగాడు.
‘మీరంటే నాకూ ఇష్టమే’ నోరు పెగల్చుకుని అన్నాను.
అతను మంచిమంచి పుస్తకాలు తీసుకు వచ్చి తనకి ఇచ్చేవాడు. ఆ పుస్తకాల వల్ల తను ఎన్నో విషయాలు తెలుసుకుంది. వేశ్యల జీవితాల గురించి తెనే్నటి లతగారు వ్రాసిన ‘గాలిపగడలు నీటి బుడగలు’ అనే నవలిక తను చదివింది. నిజంగా వేశ్యల జీవితాలు నీటి బుడగలే! నీటి బుడగ క్షణకాలంలో విచ్ఛిన్నమయి పోయినట్టే వేశ్యల జీవితాలు కూడా అర్థాంతరంగా ముగిసిపోతాయి. వీళ్ల దగ్గరికి వచ్చే విటులు నిజంగా గాలి పగడ తనకిష్టమైన స్థలంలో ఎగిరి ఎగిరి పడినట్టే, తుమ్మెద పుప్పొడి కోసం ఒక పువ్వు నుండి మరో పువ్వు కోసం ఎగురుకుంటూ వెళ్లినట్టు ఈ విటులు కూడా చంచలంగా చాలామంది ఆడవాళ్ల దగ్గరికి పరుగులు తీస్తారు.’
‘మోహినీ! ఒక్క విషయం’ ఓ రోజు లాయర్ బాబు అన్నాడు.
అతని ముఖంలో ఉద్వేగం. ఏదో బాధ. తెలియని ఆవేదన.
‘ఏంటి లాయరు బాబూ!’ అడిగాను ఆత్రుతగా.
‘మనం సమాజంలో ఉంటున్నాము. ఈ సమాజం హర్షించే పని చేయాలని నేను అనుకుంటాను. అందుకే నీతో నాకున్న సంబంధం అక్రమ సంబంధం. దీన్ని సక్రమం చేసుకోవాలంటే అనేక అవరోధాలు. పరువు ప్రతిష్ఠల సమస్య. నా కుటుంబ సభ్యులు పరువు- ప్రతిష్ఠల మధ్య జీవనం గడిపే మనుష్యులు. అందుకే మన సంబంధం సక్రమం చేసుకోడానికి వాళ్లు అంగీకరించరు. పెద్ద వాళ్లని కాదని వాళ్లని నేను నొప్పించలేను. అది నా బలహీనత అనుకో లేక పిరికితనం అనుకో. సమాజంలో నా స్థానం ఇలాగే ఉండాలంటే నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. అంతేకాదు మా వాళ్లు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారు’
అతని మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. ఇక తన జీవితం కుక్కలు చింపిన విస్తరాకే. నాంచారమ్మ ఊరుకోదు. ఇప్పటివరకూ ప్రశాంతంగా తన జీవితం గడిచిపోతోంది.
‘మోహినీ! నీ ఆలోచన నాకు తెలుసు. నా మానసిక సంఘర్షణ నాకు తెలుసు. అయితే నేను ఓ పని చేయదల్చుకున్నాను. నిన్ను ఈ వ్యభిచార గృహం నుండి తప్పిస్తాను. నాంచారమ్మకి డబ్బు ఇచ్చి తగిన ఏర్పాటు చేస్తాను’ అన్నాడు.
‘మీ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లు. వాళ్లు నీకు ఆశ్రయం ఇవ్వకపోతే నాకు తెలియజెయ్యి. తగిన ఏర్పాటు చేస్తాను’ తిరిగి అన్నాడు.
ఆ సాలె గూడు నుండి విముక్తి పొందిన తను ఇలా తన వాళ్లను వెతుక్కుంటూ బయలుదేరింది. శరీరంపై తుంపర్లు పడగానే ఆలోచనా ప్రపంచం నుండి బయటపడింది. ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి. శనివారం అవడం వల్ల చాలామంది భక్తులు వస్తున్నారు. ఆకలిగా ఉంది. తన వాళ్లను కలుసుకోవాలన్న తపన ఆ ఆకల్ని అణచివేస్తోంది.
తన జీవితం ఏమిటో తనకే తెలియటంలేదు. ఇప్పుడు తను వెళ్లినా తన వాళ్లు ఆదరిస్తారా? కాలం, విధి తెచ్చిన మార్పులతో తన జీవితంలో ఎన్నో మార్పులు, సమస్యలు. వాటి నుండి బయటపడడానికే తన ఈ ప్రయాణం.
కాలం ఓ ఇంద్రధనస్సులాంటిది. రంగురంగులుగా దర్శనం ఇస్తుంది. అంతేకాదు ఇంద్రజాలం కూడా. అది ఎవరి మాటా వినదు. సరికదా వౌనంగా చిత్రవిచిత్రంగా జీవితాన్ని తనకిష్టమైన రీతిలో మార్చేస్తుంది. ఒకసారి వివిధ వర్ణాలతో అందంగా రూపుదిద్దుకుంటే మరోసారి అర్థంకాని పిచ్చిగీతలా అన్పిస్తుంది. ఇలా వేదాంత ధోరణిలో ఆలోచించడం తనకి లాయరు బాబు వల్లనే అలవడింది.
తడబడ్తున్న అడుగుల్తో, అదురుతున్న గుండె చప్పుడుతో ఇల్లు వెదుక్కుంటూ వెళ్లిన నేను కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాను. మొదట వాళ్లు నన్ను పోల్చుకోలేదు. పోల్చుకున్న తరువాత వారి వదనంలో ప్రసన్నత లేదు. సంతృప్తి, సంతోషం లేదు.
‘ఎందుకొచ్చావ్? నిన్ను చూస్తూ ఉంటే కంపరంగా ఉంది. వొంటి మీద గొంగళి పురుగు ప్రాకినట్టుంది. నీవు తప్పిపోయిన తరువాత ఏడ్చాం. బాధపడ్డాం. వెతికించాం. ఆ తరువాత నిరాశ చేసుకున్నాం. మరిచిపోయాం. ఇప్పుడు నీ వాటం చూస్తుంటే నైతికంగా ఎంత పతనమయ్యావో తెలుస్తోంది. మా దృష్టిలో నీవు ఏనాడో తొలగిపోయావు’ అన్నయ్య అన్నాడు.
‘మాది పరువూ, మర్యాదా గల కుటుంబం. ఇలాంటి చోటుకి నీలాంటి పరువుతక్కువ గల వాళ్లు వస్తే మా పరువు ప్రతిష్ఠలు మంటగల్సి పోతాయి. ఇక్కడి నుండి తొందరగా ఎవ్వరికీ తెలియక ముందే వెళ్లిపో’ నాన్నగారు అన్నారు.
వాళ్ల మాటలకి బాధతో తల్లడిల్లిపోతున్నాను. దుఃఖం ఆగడంలేదు. తన చిన్నప్పుడు ఎంతో అభిమానించిన తన కుటుంబ సభ్యులేనా ఇలా మాట్లాడుతున్నారు’ అని అనుకుని మనస్తాపానికి గురయ్యాను.
అమ్మ వేపు చూశాను. ఆమె ముఖంలో అదే కాఠిన్యం. ఛీత్కారం. అసహ్యం. అది చూసి నన్ను చిన్నప్పుడు అభిమానించిన అమ్మేనా అని అనిపించింది. నాన్నమ్మ ఉంటే నన్ను తప్పకుండా ఆదరించేది అనుకున్నాను.
మన సంస్కృతీ సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో సామాజిక జీవనంలో స్నేహ రక్త సంబంధాల్లో భావోద్వేగాలు ప్రముఖంగా చోటు చేసుకుంటాయి. తన వాళ్లని ఇన్నాళ్లకి చూశాను అన్న భావోద్వేగం, ఆనందం, నిరాదరణ, తిరస్కారం వల్ల బాధ అనే భావోద్వేగం నాలో చోటు చేసుకుంది.
ఈ భావోద్వేగాల వలన ఒకసారి జీవితం నుండి పారిపోవడమేనా లేక సమాజానికి ఎదురు తిరిగి పోరాటం చేయడమేనా జరుగుతుంది. ఇప్పుడు తనలో అలా పోరాటం చేసే పటిమ ఓర్పు లేవు. నిస్సత్తువ మాత్రమే.
ఇప్పుడు తన వాళ్లు పరువు మర్యాదా అనే తెరచాటున ఉండిపోతూ రక్త సంబంధాన్ని కాదనుకుంటున్నారు. ఈ పరువు దగ్గర మమతానురాగాలు మృగ్యమయ్యాయి. కన్నీరు తుడుచుకుంటూ ఇంటి నుండి బయటకు నడిచాను.
తనకి ఇప్పుడు కావల్సింది కాస్తంత ఓదార్పు. నీకు మేం ఉన్నాం అన్న భరోసా. స్వాంతన. బయట వర్షం పడుతోంది. వర్షంలోనే ముందుకు అడుగులేస్తున్నాను. తనెందుకు బ్రతకాలి? తన సమస్యకి చావే పరిష్కారం. లాయర్ బాబుకి కూడా తను ఫోన్ చేయదల్చుకోలేదు.
వర్షం జోరు తగ్గింది. వర్షపు నీటిలో చినుకులు పడుతున్నాయి. నీటి మీద బుడగలు తేలుతున్నాయి. కనురెప్ప కాలంలో ఆ బుడగలు పేలిపోతున్నాయి. తనలాంటి వాళ్ల జీవితాలు క్షణకాలంలో విచ్ఛిన్నమయ్యే నీటి బుడగలు’ అనుకుంటూ ముందుకు అడుగు వేస్తున్నాను.

====================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-గూడూరు గోపాలకృష్ణమూర్తి..7382445284