కథ

ఊహకందని ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటిదాకా చండప్రచండమై జగతిని దడదడలాడించిన పగటి రేడు తనంతట తానే రేరాజుకి తలొంచి.. దూరానె్నక్కడో నిష్క్రమిస్తున్న దృశ్యం తాలూకు హరివిల్లు అక్కడంతా వ్యాపించి ఉంది. అప్పుడప్పుడే అల్లరి పిల్లగాలులు చల్లదనాన్ని మెల్లమెల్లగా వెదజల్లుతున్నాయి.. అక్కడంతా. ఆ అందంలో మేమూ భాగమేనన్నట్టు ఒక్కొక్కటిగా, గుంపులు గుంపులుగా గువ్వలు గూడు చేరుతున్నాయ్. ఆ రెక్కల చప్పుళ్ళల్లో ఏదో ఊహల కందని ఉత్సాహం.

వాకిలి తెరచుకుని పెనిమిటి, పిల్లల కోసం ఎదురుచూస్తున్న గృహిణిలా ఏళ్ల తరబడి జ్ఞాపకాలను పెరళ్లు పెరళ్లుగా ఒడలంతా పరచుకుని అక్కడే నిలిచున్న ఆ తురాయి చెట్టు ఈ పక్షుల కోసమే కొమ్మల చివర్లను సిద్ధం చేసిందేమో... అన్నట్టుగా వీటి రాకను పసిగట్టి.. కాబోలు ఆనందంతో ఊగిసలాడుతున్నాయి అవి.
ఆ సమయంలో ఆ కూడలి.. వచ్చేపోయే వాళ్లతో కళకళలాడుతూ క్షణక్షణానికి తన ముఖచిత్రాన్ని మార్చేసుకుంటూ కొత్త శోభను సంతరించుకుంటూంది.
మానుని ఆనుకునున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు రాజశేఖరం.
గంజి పెట్టి ఇస్ర్తి చేయగా పెళపెళలాడుతున్న పొందూరు ఖద్దరు చొక్కా పంచెలో... తనకెంతో ఇష్టమైన గుల్దస్తాన్ సెంటు వాసన తెరలు తెరలుగా ఆ చుట్టూ వ్యాపిస్తూండగా... రాజసం ఉట్టిపడేట్టు హుందాగా కనిపిస్తాడతను.
కాలం స్తంభించిందా అన్నట్టు అతన్లో కనపడని ఏడు పదుల ఛాయ అతన్నించి కళ్లు తిప్పుకోనివ్వదెవ్వర్నీ.
అదతను సాయంత్రాన్ని ఆస్వాదించే సమయం, స్థలం.
అతనక్కడ కూర్చున్నాడన్న మాటేగానీ మాటిమాటికీ అక్కడ్నించి ఏడెనిమిది గజాల దూరం నడిచాకా వచ్చే కుడివైపు మలుపుకేసి చూస్తున్నాడు.
ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్న ఆ చూపుల్లో ఘడియ ఘడియకీ జీవం పోసుకుంటున్న ఆశ. ఎవరెవరో వస్తారు. పలకరిస్తారు. బదులిస్తాడు. మరలిపోతుంటారు. అతనిదో లోకం. ఆ లోకంలో ఎన్ని ఆశలో. ఎన్ని ఎదురుచూపులో.
అతనలా చూస్తున్నంతలో...
అతన్ని దాటుకుని వేగంగా ఆ దారెంట ముందుకెళ్లిపోబోతున్న తెల్లని ఇన్నోవా... ఏదో గుర్తొచ్చినట్టు అంతలోనే సడన్ బ్రేక్‌తో వేగం తగ్గించుకుని కాస్తంత ముందుకెళ్లి మెల్లగా ఆగింది.
అదలా ఆగీ ఆగటంతోనే గబుక్కున కారు దిగిందో నాజూకైన అమ్మాయి.
ఎంత చురుగ్గా కారు దిగిందో.. అంతే చలాకీగా అతన్ని చేరి చనువుగా పక్కనే కూర్చుంటూ... ‘హాయ్ తాతయ్యా! ఎలా ఉన్నారు?’ అంది గలగలా నవ్వుతూ.
నిర్మలమైన ఆ నవ్వుకి, ప్రేమపూర్వకమైన ఆ పలకరింపునకు...
క్షణకాలం తెల్లబోయాడాయన. కాసేపు ఎగాదిగా ఆ అమ్మాయినే చూస్తూండిపోయాడు. ‘ఎవరా ఈ మనవరాలు?’ అనుకుంటూ. గుర్తుకు రాలేదు.
ఇంతలోనే ఆ అమ్మాయి మైక్ తీసి వైర్లు సరిచేసుకోవటం, అంతకు ముందే ఇన్నోవా నుండి దిగిన సన్నగా పొడుగ్గా ఉన్న కుర్రోడ్ని, అతని చేతుల్లోని చూసి... అతని మోములో చెప్పలేనంత ఆశ్చర్యం.
దానికి అడ్డుకట్ట వేస్తూ...
‘మేము... ‘యువర్ టీవీ’ నుండి వచ్చాం తాతయ్యా! మీ ఇంటర్వ్యూ కావాలి...’ అంది ప్రేమగా అతనే్న చూస్తూ.
ఎప్పుడైతే వెనె్నల నెలవంక వంటి ఆ అమ్మాయినీ, ఆమె చేతిలో మైక్‌నీ, కెమెరానీ చూశారో అప్పుడే ఉత్సుకత కొద్దీ ఒక్కొక్కరూ వాళ్లని చుట్టుముట్టెయ్యసాగారు.
ఆ అమ్మాయన్న మాటలకి ఉలిక్కిపడ్డాడు పెద్దాయన.
‘నా ఇంటర్యూ నా?’ అంటూ అసంకల్పితంగా పక్కకి తిరిగి మలుపు వైపు చూసి భళ్లున గట్టిగా నవ్వేశాడు.
ఎంత గట్టిగా అంటే... అప్పటిదాకా ఎగిరీ ఎగిరీ రెక్కలలవగా అక్కున చేర్చుకున్న గూట్లో ఒకింత ఒద్దికగా ఒదిగిన పిట్ట ఉలిక్కిపడి అరుస్తూ పైకెగిరి అంతలోనే నెమ్మళించినంత.
‘మీ ఇంటర్వ్యూనే తాతయ్యా...!’ కళ్లనిండా నింపుకున్న ప్రేమతో నవ్వుతూ అని...
‘పెళపెళలాడుతున్న కాటన్ పంచె, చక్కగా ఇస్ర్తి చేసిన పొడుగు చేతుల ఖద్దరు చొక్కా..’ అంటూ అతనే్న పరిశీలనగా చూస్తూ ఇంకా ఏదో అనబోతున్న అమెని నవ్వుతోనే ఆపేశాడతను... తలొంచి మురిపెంగా తన బట్టలకేసి చూసుకుంటూ....
‘జానకి ఊరుకోదమ్మా... ఇలా ఉండకపోతే! రోజూ ఇలాగే కనపడాలి తనకి. బయటకి వెళ్లేటప్పుడు మరీను. నీకింకో సంగతి తెలుసా?’ అన్నాడు సందు మలుపుకేసి చూసి ఇటు తిరుగుతూ...
లిప్తపాటు కాలం తనూ అటే చూసి... ‘తెలియదు చెప్పండి చెప్పండి’ అంది అతనే్న ఆసక్తిగా చూస్తూ.
‘అందరి బెడ్‌రూముల్లో ఏముంటాయ్? చెప్పు’ అకస్మాత్తుగా అడిగాడతను.
ఎందుకు అడిగాడో అర్థంకాని ఆ పిల్ల అయోమయంగా అతనే్న చూస్తున్నంతలో...
‘చెప్పు మనవరాలా ఏముంటాయో? తాతయ్యా అని పిలిచావుగా?’ అన్నాడు తనని తానే ఎగాదిగా చూసుకుంటూ... మళ్లీ అంతలోనే తలెత్తి ఆమెకేసి చూస్తూ.
‘నేను చెప్పనా? బట్టల బీరువాలూ, మందుల డబ్బాలూ, డ్రస్సింగ్ టేబులూ, తలగళ్లూ, దుప్పట్లూ... మంచినీళ్ల సీసా... అదే జానకికి అయితే ముడిలో పిన్నులూ, పౌడర్లూ, కుంకుమ భరణే.. ఇవేగా?’
‘అవును ఇవే?’ అంది తన బెడ్‌రూం గుర్తొచ్చిందేమో కొంటెగా నవ్వుతూ.
‘వీటితోపాటు అందర్లా కాకుండా మా పడగ్గదిలో మరో రెండు డబ్బాలు కూడా ఉంటాయ్... వాటిని ఎవరినా చూస్తే నవ్వుతారని... ఎవరికీ కనపడకుండా ఎక్కడో దాచేస్తుంది జానకి. అవేంటో తెలుసా? నవ్వుతావా చెబితే?’ అన్నాడు ఆమెనే చూస్తూ.

పకపకా నవ్వేసి.. ‘నవ్వను చెప్పండి’ అంది ఒకలా అటూ ఇటూ కదిలి సర్దుక్కూర్చుంటూ.
‘ఉప్పు డబ్బా, మిరపకాయల డబ్బా. ఎందుకో తెలుసా? నిద్రపోయే ముందు నాకు దిష్టి తీయటానికి.. జానకేమో పొట్టి. నేనేమో పొడుగు. అన్నాలు తినేసి పడుకోవటానికి లోపలికి వెళ్లిపోయాకా వంగమంటుంది దిష్టి తీయటానికి. ‘ముసలాణ్ని ననె్నవరు దిష్టికొడతారు?’ అన్నా వినదు, తియ్యాల్సిందే అంటుంది...’
‘ఆంటీ కరెక్టే..! మీరలానే ఉంటారు. అందుకేగా పోతూ పోతూ మిమ్మల్ని చూసి ఆగింది...’ అంటున్నా పట్టించుకోకుండా.. చెప్పుకుపోతూనే ఉన్నాడతను.
‘... వంగినట్లే వంగి గబుక్కున నిటారుగా అయిపోతాను. చెవి మెలేస్తుంది నా అల్లరికి. మరి నీకూ తీస్తారా? అంటాను. నేనెక్కడికి పోతాను. మీకు దిష్టి తగలకుండా ఉంటే అంతే చాలు నాకు అంటుంది. నాకు మాత్రం ఉండదా నీకూ తియ్యాలని అంటే ఎంతందంగా సిగ్గు పడుతుందో తెలుసా? అలా సిగ్గుపడ్డప్పుడు బుగ్గన సొట్ట పడుతుంది మా జానకి...’ అంటూ మలుపు వేపు తలతిప్పి... ఒక నిమిషం చూసి మళ్లీ ఇటు తిరిగి...
‘నన్నిక్కడ కూర్చోబెట్టి పళ్లు కొనుక్కొస్తానని ఇప్పుడే మార్కెట్‌కి వెళ్లింది... వస్తుందిగా.. నువ్వే చూద్దువుగానీ...’
‘వావ్... అవునా? భలేభలే’ అంటూ మరింత సంతోషంగా కెమెరామెన్ వైపు చూసి నవ్వి మళ్లీ రాజశేఖరం వైపు చూస్తూ... ‘్భలే లక్కీ అండి మేము. ఆంటీ వచ్చేలోపు మీరు మాట్లాడండి.. వచ్చాకా ఇద్దరితో కలిసి మాట్లాడతా. భలే మజా... మా ప్రేక్షకులకి...’ అంది ఆ అమ్మాయి.
‘ఉప్పూ, మిరపకాయల సంగతి మీ ఆంటీ దగ్గర ఎత్తకేం? మళ్లీ నా చెవి మెలేస్తుంది ఎందుకు చెప్పారని. ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు... నీకే చెప్పా...’ అన్నాడు ముఖాన్ని కాస్తంత ముందుకు ఆమె ముఖం దగ్గరికంటా తెచ్చి గుసగుసలుగా. ఆ ముఖంలో అదే నవ్వు, అదే స్వచ్ఛత.
ముచ్చటేసిందామెకి. ‘చూడటానికే నిలువెత్తు గంభీరమైన విగ్రహం. మనసు మాత్రం వెనే్న’ అని మనసులో అనుకుని.
‘లేదులెండి.. చెప్పను. మరి ఈ ఉంగరాలూ... అవీ! ఇవీ జానకి ఆంటీయే...?’
ఆమె వాక్యం పూర్తి చెయ్యకుండానే... చేతులు రెండూ తిరగేసి పక్కపక్కన చేర్చి ఒకటిగా చేసి ఉంగరాలనే చూస్తూ... ‘జానకే చేయించింది. ఒకటి నా ఆరోగ్యం బాగుండాలనంట... మరోటి.. ఆయుశ్శు పెరగాలనీ.. ఇంకొకటి కీడు జరకూఒ్కడదని...’
‘అబ్బో... ఎంత ప్రేమో.. భలేభలే ప్రేమ. అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట జానకి ఆంటీతో....’
‘ఎంజాయ్ చెయ్యటమేవిటి పిల్లా? వదిలిపెట్టి ఉండేవాళ్లమా ఒకళ్లనొకళ్లం? ఒకళ్లం ఎక్కడుంటే రెండోవాళ్లమూ అక్కడే’
‘అవునా? ఇంకొకటి చెప్పండి తాతయ్యా...! హుందాతనాన్నిచ్చే పంచె, చొక్కాలో, వేళ్లనిండా ఉంగరాల్తో.. మెడలో గొలుసుతో ఈ వయసులోనే ఇంతందంగా ఉన్నారు కదా... మీరు. యవ్వనంలో ఇంకెంత అందంగా ఉండేవారో. అంత అందంగా ఉండే మిమ్మల్ని

జానకిగారు ప్రేమించారా లేక జానకి గారిని మీరే ప్రేమించారా? తప్పకుండా ఎవరైనా ప్రేమించే ఉంటారు.. మిమ్మల్ని. చెప్పండి తాతయ్యా యువర్ టీవీ యువర్ లవ్‌స్టోరీ.. ప్లీజ్ తాతయ్యా...’
అంది ఒకపక్క కూడా వచ్చిన కుర్రాడు కెమెరా సరి చేసుకుంటుంటే మరోపక్క తను మైక్ రెడీ చేసి.. అతని నోటి దగ్గరకంటా పెట్టి అతనే్న చూస్తూ.
నవ్వుతున్నాడతను. పకపకా నవ్వుతున్నాడు. నవ్వుతూనే మద్యమధ్యలో మలుపు వైపు చూస్తూ దగ్గు వచ్చేంతవరకూ నవ్వుతూనే ఉన్నాడు. నవ్వు. ఒకటే నవ్వు. నవ్వు. దగ్గు. దగ్గు... నవ్వు.
కంగారు పడిపోయింది ఆ అమ్మాయి.
‘అయ్యో...! చాలా దగ్గుతున్నారే..’ ఆందోళనగా అని ఆ కుర్రాడి వైపు తిరిగి,
‘శేఖర్...! వాటర్ బాటిల్ ఉందా కార్లో? ఓపెన్ చెయ్యనిది ఉంటే తీస్కురా’ అంది. అప్పటికే కార్లో దూరిన ఆ కుర్రాడు కిన్‌లే బాటిల్ తెచ్చి మూత తెరిచి అతనికందించాడు.
రెండు గుక్కలు తాగి బాటిల్ తిరిగిస్తూ ‘విన్నావంటే ఆశ్చర్యపోతావ్ తెల్సా?’ అన్నాడు సన్నగా దగ్గుతూ...
‘అందరూ ఆశ్చర్యపోవాలనే అడుగుతున్నా...! చెప్పండి చెప్పండి...’
ఆమె ముఖంలో ప్రేక్షకులకి కొత్త ప్రేమ గురించి చెప్పబోతున్నాను అని గొప్ప ఆనందంగా ఉంది.
అందుకే.. కంగారుగా అడుగుతోంది.. ఇంతలో అతనన్నాడు.
‘నా జానకి ముందు యద్దనపూడి సులోచనా రాణిగారి జయంతి గానీ, రాఘవేంద్రుని రాధ గానీ ఎందుకూ సరిపోరు తెలుసా?’ అలా అంటున్నప్పుడు అతని ముఖమంతా ఒకలాంటి మెరుపు.
సంభ్రమంగా చూసింది ఆ అమ్మాయి అతని వైపు.
‘అమ్మో... అవునా? అయితే చెప్పాల్సిందే... జానకిగార్ని మొదటగా మీరెక్కడ కలుసుకున్నారో...?’
ఆ మాటలకి తలొంచుకున్నాడతను.
జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడనుకుందామె. ఆసక్తిగా అతనే్న గమనిస్తున్నారు అక్కడున్న వారంతా.
‘నన్ను వెదుక్కుంటూ వచ్చిందమ్మా... జానకి. నా కోసమే పుట్టిందనుకో. అప్పట్లో సెలవులు వచ్చినప్పుడల్లా మా మేనమామ ఇంటికి తీసుకెళ్లేది మా అమ్మ. మొదట్లో ఇష్టం ఉండేది కాదు నాకు ఆ ఊరు వెళ్లటం. మా మేనమామ పక్కిల్లే జానకి వాళ్లది. మా మేనమామ పిల్లల్తో కలిసి ఆడుకోవటానికి వచ్చేది. అలా చూశానామెని. జానకి తెలిసాకా... సెలవులు ఎప్పుడొస్తాయా అని చూసేవాణ్ని.... తర్వాత్తర్వాత మా అమ్మ రానన్నా నేనే వెళ్లిపోయేవాడ్ని. మా అమ్మా, నేనూ వెళ్లామని మా కోసం ఏవేవో చేసి జానకితో పంపేవారు వాళ్లమ్మగారు...’ అంటూ చెప్పటం ఆపి పకపకా నవ్వటం మొదలెట్టాడు.
నవీ నవీ కాసేపటికి నవ్వాపి...
‘ఒకసారి ఇలాగే... వాళ్లమ్మ ఇచ్చిందని పనస తొనలు తెచ్చింది. మా అమ్మమ్మ పట్నంలో ఉంటాడు... ఇలాంటి తొనలు వాడికి దొరకవు.. వాడికి పెట్టండి...’ అంటూ వాటిని గదిలో ఉంటే నాకు తెచ్చిచ్చింది. తినేసరికి నా నాలుక్కి ఏదో జిగురు లాంటిది అంటి చిరాగ్గా అయిపోయింది నోరంతా. గంతులేసాను. చిరాకు పడిపోయి అరిచేశాను. గోలగోల చేసేశాను. కంగారు పడిపోయారు అమ్మా, అమ్మమ్మా, తాతయ్యా. అక్కడే మంచానికి చేరబడి బుగ్గలకి చేయి ఆన్చుకుని ననే్న చూడసాగింది జానకి. అప్పుడింత పిల్ల. తెల్లగా ఉండేది రెండు పిలకలేసుకుని. కళ్లనిండా నల్లని కాటుక, రెండు కళ్లకి వారధిలా మధ్యలో పెద్ద చిలాయి బొట్టూనూ...’
‘అది గుర్తుంచుకున్నట్టుంది. తర్వాతెప్పుడో ఒకసారి పొలం తీసుకెళ్లింది. నన్ను వాళ్ల తోటంతా తిప్పింది. అలా తిప్పుతూ తిప్పుతూ పనస చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది.
‘చెట్టున మగ్గిన పనస తొనల రుచి ఎంత బాగుంటుందోనట. జానకి నా కోసం చెట్టెక్కింది. రెండు పిలకలు. మోకాళ్లు దిగేలా గౌను. ఆ గౌనుకి గుండెల దగ్గర మళ్లీ కుచ్చులు. చూడ్డానికి అదోలా ఉండేది. వేళ్లతో, నోటితో చీల్చేసింది పనస కాయని. కొమ్మ మీద అటొక్కాలూ, ఇటొక్కాలూ వేసుకుని కోతిలా కూర్చుని మరీ వేళ్లతో చీల్చేస్తుంటే.. కింద నుండి చూస్తూండిపోయేను నోరు తెరచుకుని. పట్నంలో ఉండే వాడినేమో... అవన్నీ కొత్త నాకు.
‘ఏంటలా చూస్తున్నావ్? చొక్కా పట్టు తొనలేస్తానని’ పై నుంచి కిందకి విసిరింది. పాపం అంత కష్టపడి కోసింది కదాని.. ఆబగా తిన్నానేమో... నోరంతా ఒకటే జిగురు. అందుకోసమే చూస్తున్నట్టుంది.. పై నుంచి ఒకటే నవ్వులు.
ఒక్కటిద్దామంటే తనేమో పైనుంది.
‘లేకపోతే... కొంచెం జిగురుగా ఉందని ఆంటీ మీద అరుస్తావా? తెచ్చిందాన్ని నేను. పాపం వాళ్లేం చేశారు? అయినా కొంచెం తట్టుకోవచ్చుగా? కడుక్కుంటే పోదా...’ అంది. నాకింకా గుర్తే. కావాలంటే అడుగు వస్తుందిగా..’ అన్నాడు వెనక్కి తిరిగి వీధి మలుపుకేసి చూద్దామని అటు తిరుగుతూ.
కానీ ఆ మలుపు కనపడకుండా అప్పటికే అక్కడంతా మనుషులు. ఉన్నట్టుండి అరిచేశాడు వాళ్ల మీద. పక్కకి లెగండంటూ. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ అమ్మాయికి. కెమెరాను ఆపెయ్యమని. గబుక్కున లేచి నించుంది కంగారుగా.
ముఖమంతా ఎర్రబడిపోవటంతో అప్పటిదాకా ఉన్న ప్రశాంతత మాయమై పోయిందేమో... చేతికర్రని.. వాళ్లందరి మీదా గాల్లో విసురుతూ..
‘లేవండి! పక్కకి జరగండి.. మీరంతా ఇలా అడ్డంగా నిలబడితే జానకి వస్తుందో లేదో నాకెలా తెలుస్తుంది...’ అంటూ ఆగ్రహోదగ్రుడైపోయేడు.
క్షణాల్లో మారిపోయింది అక్కడి దృశ్యం. ఇంతలో ఊహించని విధంగా...
‘నాన్నా...! అమ్మ వచ్చేసింది నాన్నా... ఇంటికి. ఇక్కడంతా గుంపుగా నిలబడి ఉండేసరికి నువ్వు ఇంటికి వెళ్లిపోయి ఉంటావని ఆ పక్క దార్లో వచ్చేసింది. అయ్యో... మీ నాన్నింకా రాలేదా? అని అమ్మ నీ కోసం బయలుదేరుతుంటే... ఇంక చీకటి పడిపోతుంది గదా ఏమి వెళతావ్... ఉండు నాన్నకి నువ్వు వచ్చేశావని చెప్పి తీసుకొచ్చేస్తాను అని చెప్పి నేనిటు వచ్చాను. పద ఇంటికి వెళదాం... అమ్మ ఎదురుచూస్తుంది...’ అంటూ అప్పుడే అక్కడికొచ్చి తండ్రి చేయి అందుకున్నాడు సుదర్శన్.
స్థాణువై నిలబడిపోయాడతను ఎత్తిన కర్రను దించేస్తూ. ఆగ్రహం స్థానే క్షణంలో దిగులు మేఘాలు కమ్మేశాయి అతని మోముని.
‘అమ్మొచ్చేసిందా?... అయితే పద...’ అన్నాడు కొడుకు వెనకే నడుస్తూ.
‘అయ్యో...! మా ఇంటర్వ్యూ మధ్యలో ఉందండి.. ఒక్క ఐదు నిమిషాలు ఆగరా ప్లీజ్....’
అప్పటిదాకా జరిగినదంతా మర్చిపోయి మంత్రించినట్టు ఆ వచ్చినాయన వెంటపడి వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ సన్నగా అరిచిందామె... అతని వెనకే వెళ్లటానికి కంగారుగా లేస్తూ.
‘నేను చెప్తాలేమ్మా... ఆయన్ని వెళ్లనియ్...’ అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన మరో పెద్దాయన. రాజశేఖరం కంటే కొంచెం పొట్టిగా, లావుగా ఉన్నాడాయన.
‘మీరెవరు? మీకు తెలుసా ఆయన ప్రేమ కథ...?’ తెల్లబోతూ అడిగింది.
‘ముందా.. కెమెరా, మైక్ లోపల పెట్టెయ్యమని చెప్పు.. అప్పుడు గానీ మనిద్దర్నీ వదిలి వెళ్లరు వీళ్లంతా...’ అన్నాడాయన ఆమెకే వినపడేట్టు. రాజశేఖరం తాలూకు గుల్దస్తాన్ సువాసనలు ఇంకా మిగిలే ఉన్నాయక్కడ...
‘ఒక్క ఐదు నిమిషాలున్నా అయిపోయేదే..! ఇంతలో వచ్చేశాడాయన...’
అవన్నీ సర్దుతూ గొణుక్కున్నట్టుగా అని...
‘నిజంగానే మీకాయన తెలుసా అండి.. ఇందాకట్నుంచీ ఎక్కడున్నారు?’ అప్పుడే గుర్తొచ్చినట్టుంది.
‘జానకి తమ్ముణ్ణి...’ నిదానంగా అన్నాడతను.
ఆశ్చర్యంగా చూసిందాయన్ని. ఒకళ్లిద్దరు తప్ప ఎవ్వరూ లేరక్కడ.
‘జానకిగారి తమ్ముడా? అయ్యో... మీరైనా ఇంటికెళ్లిపోయిన జానకిగార్ని తీసుకురావచ్చు కదా? ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఎంత రసరమ్య కావ్యం గానం చేసేవాళ్లో గదా వాళ్లు వాళ్ల ప్రేమ గురించి. ఒకరి కోసం ఒకరు వాళ్లు బ్రతికిన బ్రతుకును గురించి...?’ అని అప్పుడే గుర్తొచ్చినట్టు గబుక్కున లేచి నిలబడి...
‘పదండి.. ఇంటికి వెళదాం ప్లీజ్. ఇంత చక్కటి ప్రేమ కథ నేనెప్పుడూ వినలేదు. ఈ వయసులో క్షణక్షణం గుర్తుపెట్టుకుని ఆయనలా చెబుతూ ఉంటే జానకిగారి పట్ల ఆయన ప్రేమ ఆకాశమంత ఉన్నతమైనదని అనిపిస్తూంది.. నేను తప్పక మా ప్రేక్షకులకు ఈ ప్రేమకథ వినిపించాల్సిందే... ఇల్లు మీకు తెలుసు కదా పదండి ప్లీజ్’
‘... అనిపించటం కాదు. ఉన్నతమైనదే...! ఎంత ఉన్నతమైనది కాకపోతే...’ అని ఒక్క క్షణం ఆగి...
‘...చిన్నప్పుడు తోటకి తీసుకెళ్లి... ఆడపిల్లని రోజూ నేనే చెట్టెక్కి పళ్లు కోస్తున్నాను. అబ్బాయివి చెట్లెక్కటం నువ్వెప్పుడు నేర్చుకుంటావ్? అని చిలిపి పట్టుదల కొద్దీ కింద నుండి పైకి తోసి మరీ చెట్టెక్కించి.. కాస్తంత పైకెక్కాక అలవాటు లేకపోవటం వల్ల వీడు.. అంటే ఈ రాజశేఖరం పట్టుతప్పి చెట్టు మీద నుంచి జారి కింద పడబోతుంటే.. వీడికెక్కడ నడుం విరిగిపోతుందోనని వాడి మీదున్న ప్రేమకొద్దీ వాడు కిందపడకుండా తన మీద పడేలా వెళ్లి చెట్టు కింద నిలబడి వెన్నుపూస విరగ్గొట్టుకుని ఏళ్లకి ఏళ్లు మంచాన పడింది. చూడు... అలాంటి జానకి ప్రేమ ఉన్నతమైనదా.. ఉత్తమమైందా..?’
‘అయ్యో! జానకిగారు నడవలేరా? పళ్లు తేవటానికి వెళ్లారుగా మరి...?’ కెమెరా కుర్రాడన్నాడు ఆ అమ్మాయినే చూస్తూ.. అన్నీ అయోమయాలే ఆ ఇద్దరికీ....
‘తర్వాతి తగ్గిందిలే గానీ.. తనని కాపాడ్డానికే ఆమె అక్కడ నిలబడిందని.. తన వల్లే ఆమె బ్రతుకలా అయ్యిందనీ అయినా ప్రేమించుకునే వారికి సమక్షమే చాలనీ, అందర్నీ ఎదిరించి పిల్లలు పుట్టరని తెలిసీ ఆమెనే చేసుకుని, ఆమె తోడిదే లోకమన్నట్టుగా నేటికీ ఆమెని ప్రేమిస్తూనే ఉన్నాడు చూడు... వాడిది ఉత్తమమైన ప్రేమ ఎందుక్కాదమ్మా...’ ఆఖరి మాటలంటూంటే గొంతు గద్గదికమై పోయిందతనికి.
‘అయ్యో...! అవునా? పిల్లలు పుట్టరన్నారా? మరి ఆ వచ్చినాయన నాన్నా.. అని పిలిచాడుగా ఆ పెద్దాయన్నా...’
‘బంధుత్వాలకి కొదవేముందమ్మా.. ప్రేమించే మనసున్నోళ్లకి...’
‘అయ్యబాబోయ్.. నేను తట్టుకోలేక పోతున్నానండి. ఆయన్ని మళ్లీ మళ్లీ చూడాలనుంది. మరింత అందంగా అనిపిస్తున్నారు ఇప్పుడాయన. ప్లీజ్ వాళ్ల ఇల్లెక్కడో చూపించరా? ముఖ్యంగా జానకమ్మను చూడాలి. కాదనొద్దు ప్లీజ్’
‘ఎక్కడి జానకమ్మ?’
‘మా బావ చెప్పాడుగా... పళ్లు తేవటానికి వెళ్లిందని. అవును. రోజూ వెళ్లేది పళ్లు తేవటానికి. వీడి కోసం. ఎవ్వరూ తేకూడదు. ఆవిడే తేవాలి. అందుకే రోజూ ఇక్కడిదాకా ఇద్దరూ కలిసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్లిపోయే ముందు... మీరు ఇక్కడే ఉండండని చెప్పి తనొక్కతే వెళ్లి పళ్లు తెచ్చేది.. అలాగే వెళ్లింది ఆ రోజు కూడా. అట్నించటే...’
ఆ మనిషే కాదు.. వీడి మనసూ... మాయమయ్యింది.
‘వాడి ప్రేమ నిజం. రోజూ ఇలా వచ్చి కూర్చుని ఆ మలుపుకేసి ఎదురుచూడటం. నేనూ మా వాడూ... అన్నీ అన్నీ... నిజం’
‘మరి ఇంటికెళ్లాకా అడగరా జానకి ఎక్కడని?’
‘పడుకుందని చెబుతారు... ‘ఓహో లేపకు.. నిద్ర పట్టదు మళ్లీ తనకి’ అని అన్నం తిని నిద్రపోతాడు. అంతే..
‘ఈ ప్రేమని ఏ పదాల్లో చెప్పగలవ్ నువ్వు నీ వాళ్లకి?’ ప్రశ్నించాడతను. తలూపిందామె చెప్పలేనన్నట్టు.
ఆమె కళ్లల్లో నీళ్లు. వారి ప్రేమకి నివాళేమో!
------------------------------------------------------------------------------------------------------------------
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి

కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-కన్నేగంటి అనసూయ 9246541249